ఉనికి పాట

ఇంద్రధనుస్సుకు ఆవలగా!

జ్యూడీ గార్లాండ్

– చంద్రలత 

     “వద్దు! వద్దే వద్దు! వద్దంటే వద్దు! ”

     ముచ్చటగా మూడుసార్లు సినిమారికార్డుల్లోంచి ఆ పాట తొలగించబడింది.

     ‘గడ్డివాముల్లో దోబూచులాడుకొనే చిన్నపిల్ల గొంతులో ఇమడని ముది నాపసాని ఏడుపుగొట్టురాగంలా ఉంది,’

      ‘ఆ మందగొండి పాట సినిమాని సాగదీస్తోంది’ అంటూ.   

      వద్దన్నకొద్దీ కావాలని మొండిపిల్లల్లా పట్టుబట్టిన పెద్దల దార్షనికత వలన,మూడు తొలగింపుల తరువాత కూడా, ఆ పాట సినిమాలో చోటుచేసుకొంది.ఆ పాట స్వరంతోనే ఆ సినిమా మొదలవుతుంది.

     మాటల్లో మొదలయ్యి, నెమ్మదిగా సాగుతూ, సుతిమెత్తంగా, మొత్తంగా, హృదయాన్ని తాకుతుంది ఆ స్వరం.లలితంగా సాగే ఆ స్వరంలో పదాలవిరుపుల్లో పలికే ఉచ్ఛస్వరాలు,గమకాలు, సంగతులు,మెలొడీల్లో ఆక్టేవ్ లీప్ లాంటి సంక్లిష్ట స్వరప్రయోగాలు అంత సులువుగా పాడగలిగేవి కావు.ఎంతో అనుభవం,సాధన ఉన్న గాయకులకే కష్టసాధ్యం.అలాంటిది, ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి పాడాలి. అదెలా సాధ్యం?

      ఆ స్వరకర్త, ఆ అమ్మాయికి స్వరబోధకుడు,ఆ చిత్ర సహనిర్మాత పట్టిన మొండిపట్టు వలన,ఆ చిన్నారి పాటతోనే ఎట్టకేలకు సినిమా  విడుదలయ్యింది. 

      ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ చిన్నఅమ్మాయి ఆ స్వరం మొదటిసారి వినీ వినగానే, ఆ సంగీత దర్షకుడు ఎంతో అద్భుతమైన స్వరమేధావి అని గ్రహించింది. ఆ చిన్నారి గాయని మారుమాట మాట్లాడకుండా, ఆ గానసాధనకు పూనుకొంది.

       అయితే,ఆ స్వరరచన చేసీ చేయగానే,ఎంతో సంబరంగా ఆ స్వరరచయిత ఆ స్వరం వినిపించినప్పుడు, ఆ స్వరాలకు పదాలు దిద్దాల్సిన గేయరచయిత మాత్రం, ఎలాంటి స్పందన లేకుండా,నిర్లిప్తంగా విని వూరుకొన్నాడు. ఆ నిర్లిప్తతకు నిరాశ పడిన  స్వరకర్త పట్టుదల వదలకుండా, ఇరువురికి మిత్రుడైన ఒక సంగీతజ్ఞుడి సమక్షంలో మళ్ళీ గేయరచయితకు ఆ స్వరాన్ని వినిపించి, అతనిని వప్పించే ప్రయత్నం  చేసాడు.రెండవమారు ఆ స్వరాన్ని విన్న వెనువెంటనే, ఆ పాట రచయిత దానికి నామకరణం చేశాడు. 

           ఆ ఏడాది ఉత్తమ స్వరకర్తగా, గేయరచయిత గా, వారిరువురు  ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కృతులయ్యారు. 

           ఆ పాట ఈ సహస్రాబ్ది చివరి శతాబ్దపుపాటల్లో అత్యత్తమ గీతంగా ఎంపిక కాబడింది.

              ఆ పాట “సాంస్కృతికంగా, చారిత్రకంగా, కళాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పాట” గా నేషనల్ రికార్డింగ్ రిజిస్ట్రీ , లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో నమోదు చేయబడింది.

              ఆ పాట ది రికార్డింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్,నేషనల్ ఎండోమెంట్ ఫర్ ఆర్ట్  వారిచేత,”శతాబ్దపు నం.1 పాట” అని, అత్యున్నత స్థానం పొందింది.

              ఆ పాట అమెరికన్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్  వారి ‘వందేళ్ళు వందపాటలు’ జాబితాలోనూ మొదటివరసలో గౌరవంగా వ్రాయబడింది. 

             ఆ పాటకు నామకరణ వాక్యంతో ఈ గేయ రచయిత పేరిట అమెరికన్ తపాలాశాఖ ఒక స్టాంప్ విడుదల చేసింది.

             జ్యూడీ గార్లాండ్ ‘సంతకపు పాట’ గా పేరొందిన ఆ పాట, ఆమె జీవితంలో భాగమైపోయింది.ఆమె అంటే ఆ పాటే అన్నంతగా.

              1938 నాటి పద్నాలుగేళ్ళ చిన్నారి గాయని తన జీవితాంతం ఆ పాటను పాడుతూనే ఉంది. పాడినప్పుడల్లా, సవినయంగా ‘ఈ పాట తనది కాదని ఆ స్వరమేధావి, హెరాల్డ్ ఆర్లెన్ దీ, గేయ రచయిత, యిప్ హార్బర్గ్ ది’ అంటూ జోతలర్పిస్తూనే ఉండేది.

               అనేకమంది ప్రేక్షకులకు మాత్రం అది తెర మీది కాల్పనిక పాత్ర ,చిన్నారి  డొరోతీ గేల్ పాట.

            అన్ని అవాంతరాలను దాటి వచ్చి, అందరి ఆదరాభిమానాలను మూటకట్టుకొని, ఎందరి హృదయాంతరాలలోకి చొచ్చుకొని పోయిన  ఆ పాటే, జ్యూడీ గార్లాండ్ పాటగా ప్రసిద్ధమైన ‘ది విజార్డ్ ఆఫ్ ది ఆజ్ ‘(1939) సినిమాలోని పాట,

             “ఇంద్రధనుస్సుకు ఆవలగా! ”  (Over the Rainbow)

        “కాన్సాస్ లో ఏముంది? దుమ్ముధూళి సెగలు.సుడిగాలి దుమారాలు.నాలా తలలో గడ్డి ఉన్నవారు అందమైన ప్రదేశాల్లో ఉంటారు.మీలా బుర్రలో బుద్ది ఉంటే, కాన్సాస్ లాంటి అందంచందంలేని ప్రదేశాల్లో ఉంటారు. ఎందరో బుర్రలో బుద్ధి ఉన్న మనుషులు ఉండడం కాన్సాస్ చేసుకొన్న అదృష్టం!” అంటూ దిష్టిబొమ్మ ఆటపట్టిస్తే,

       “కాన్సాస్ లో మా ఇల్లుంది. ఇంటిని మించిన ప్రదేశం మరెక్కడా లేదు!”  డొరోతీ గట్టిగా స్పందిస్తుంది.

          అమ్మానాన్నలు లేని పన్నెండేళ్ళ డొరోతీ గేల్, తన అంకుల్ హెన్రీ ,ఆంటీ ఎమ్మ్,బుజ్జికుక్కపిల్ల టోటోలతో కలిసి కాన్సాస్ లో నివసిస్తుంది.తరుచు పెను సుడిగాలులైన టోర్నెడోల బారినపడే మిస్సౌరీ రాష్ట్రంలో ఉంది కాన్సాస్.ఒక రోజు షికారుకి వెళ్ళినప్పుడు, టోటో ఆ వూరిలోని ఆల్మిరా గల్చ్ ని కరుస్తుంది. 

       ఏదో చిన్న కుక్కపిల్ల లెమ్మని వదిలిపెట్టకుండా, గల్చ్ కాన్సాస్ మేయర్ దగ్గరికి వెళ్ళి, టోటో ను చంపడానికి అనుమతి పత్రం తీసుకొని, పొలాలమధ్యలో ఉన్న డోరోతీ వాళ్ళ ఇంటికి వస్తుంది. టోటో అల్లరి కుక్కపిల్లే కానీ ఎవరికీ హాని చేయదని, డొరోతీ ఎంత బతిమిలాడుతున్నా వినిపించుకోకుండా,టోటోను పట్టుకొని, తన వెదురుబుట్టలో పెట్టుకొని, తన సైకిల్ మీద కట్టుకొని తీసికెళ్ళి పోతుంది.టోటో ఎలాగో తప్పించుకొని, డొరొతీ దగ్గరికి పారిపోయి వస్తుంది.

     ప్రాణాలతో టోటో క్షేమంగా తిరిగి వచ్చిందన్న సంతోషం ఒక పక్క న ఉన్నా,అంతకు మించి, తెల్లారితే టోటో ను పట్టుకెళ్ళేందుకు గల్చ్ వస్తుందన్న భయంతో, ఆందోళనతో తల్లడిల్లుతున్న డొరోతీతో ఆంటీ ఎమ్మ్ అంటుంది,

“నీకు ఎలాంటి కష్టాలు ఎదురవ్వని ఓ ప్రదేశాన్ని నువ్వే  వెతుక్కోమ్మా!” 

             నిజమే, పిల్లలకు మాత్రం కష్టాలు ఉండావా? ఉంటాయి. వాటిని ఆర్చేవారు తీర్చేవారు ఎవరు?పెద్దవాళ్ళున్నార్లే అనుకొంటే, పెద్దదయిన గల్చ్ తోనే డొరొతికి సమస్య వచ్చి పడింది.పైనుంచి, సమస్యకు డొరొతినే పరిష్కారం వెతుక్కోమంది ఆంట్ ఎమ్మ్.

               డోరోతి దిగులుగా చావిడి దగ్గర గడ్డివాము పక్కన నిల్చుని, టోటోతో వాపోతుంది.

 “కష్టాలు ఎదురవ్వని ప్రదేశమా? టోటో, ఎక్కడైనా అలాంటి ప్రదేశం ఉంటుందంటావా?ఉండే ఉంటుంది. అక్కడికి పడవలోనో రైలులోనో వెళ్ళలేము.అది చాలా చాలా దూరంగా ఉంటుంది. జాబిల్లి కన్నా దూరంగా.వర్షం కన్నా దూరంగా…” అని మాట్లాడుతూనే పాడడం మొదలెడుతుంది,” ఇంద్రధనుస్సుకు ఆవలగా!” 

             డొరోతీ నిరాశానిస్పృహలలో మొదలయిన పాట , తనకి తాను ధైర్యం చెప్పుకోవడం తో ముగుస్తుంది.

పాట పూర్తయ్యాక, ఆ ఊరిని చుట్టేసిన పెను సుడిగాలి దుమారం డొరొతీని టోటో ని తీసుకెళ్ళి ,అద్భుత విచిత్ర లోకం మంచ్ కిన్ ల్యాండ్ లో పడేస్తుంది. అది మంచ్ కిన్లు అనే విచిత్రజీవుల వింతలోకం. 

            ఆ సుడిగాలిలో వారితో పాటు వారి ఇల్లు కూడా వచ్చి మంచ్ కిన్ ల్యాండ్ లో పడుతుంది.ఆ ఇంటి కింద పడి, జిత్తులమారి ‘తూర్పు మంత్రగత్తె’ మరణిస్తుంది.తమనెంతో ఇబ్బంది పెట్టిన ‘తూర్పు మంత్రగత్తె’ను చంపిన వీరనాయిక గా డోరోతీని మంచ్ కిన్లు ఆహ్వానిస్తారు.

             డొరొతీకి, టోటో కీ  ఆతిధ్యంతో పాటు అనేక బహుమతులు ఇస్తారు. ‘మంచి ఉత్తరాది మంత్రగత్తె’, డొరొతి కి కెంపు పాదరక్షలు  (రూబీ స్లిప్పర్స్ ) ఇచ్చి, పసుపురంగు ఇటుకల దారంట వెళితే, పచ్చల నగరం లో ఓజ్ మహా మాంత్రికుడిని ,( విజార్డ్ ఆఫ్  ఆజ్) కలవచ్చని, కాన్సాన్ తిరిగి వెళ్ళే మార్గం తెలుసుకోవచ్చని చెపుతుంది.

             కాన్సాస్ లోని సైకిల్ ఎక్కి తిరిగే ఆల్మిరా గల్చ్, ఇక్కడ చీపురెక్కి తిరిగే జిత్తులమారి ‘పడమర మంతగత్తె’ గా మారి, డొరొతీ కెంపు పాదరక్షల కోసం వీళ్ళ వెంట పడుతుంది.అనేక అవాంతరాలు కలిగిస్తుంది. వాటన్నిటినీ ఎదుర్కొంటూ, డొరొతీ,టోటో ఆ పసుప్పచ్చ ఇటుకల దారంట  అద్భుత సాహసయాత్ర మొదలుపెడతారు.

        ఇంటికి తిరిగి వెళ్ళాలని కోరుకొంటోన్న డొరొతి, తమ ప్రయాణంలో మెదడు కోరుకొనే దిష్టిబొమ్మనీ, హృదయం కోరుకొనే తగరం మనిషిని, ధైర్యాన్ని కోరే  పిరికి సింహాన్ని కలుస్తుంది.

        అందరూ కలిసి,తమ తమ కోరికలను తీర్చే పచ్చలనగరంలోని ‘ఆజ్ మహామాంత్రికుడి’ని కలవడానికి చేసిన సాహసయాత్ర  

ఎల్. ఫ్రాంక్ బాం రచించిన సుప్రసిద్దమైన అద్భుత సాహసాల పిల్లల నవల,”ది విజార్డ్ ఆఫ్  ఆజ్”. (1900)

*మధ్యయుగాల్లోని ఫ్రెంచ్ వారు  పాడుకొంటూ, నాట్యం చేస్తూ, చెప్పుకొన్న కథాకథనాల్లో మొలకెత్తిన స్వరరూపం, బాల్లాడ్.   యక్షగానాన్ని పోలిన, బాల్లాడ్, రసవంతంగా కథ చెప్పే పాటో కవితో.ఇది ద్విపదల్లో లయబద్దంగా స్వరపర్చబడిన కథాగానం.మధ్యయుగాల నాటి వీరోచిత గాథల నుంచి, ఇంగ్లండ్, జర్మనీ సామాజిక కథనాలతో పాటుగా అమెరికా ప్రయాణించి, పంతొమ్మిదో శతాబ్దంలో సామాన్యుల డ్రాయింగ్ రూముల్లోని పాట అయ్యింది.సినిమాలు  బాల్లాడ్ ను మరింత రసవంతం చేసి, కళారూపంగా మలిచాయి.ఆ చలనచిత్ర కథాకథనాల్లో భాగమవుతూ.

 హెరాల్డ్ ఆర్లెన్ ఇంద్రధనుస్సుకు ఆవలగా!” పాటను బాల్లాడ్ లా స్వర పరిచాడు.

          హెరాల్డ్ ఆర్లెన్ 

     హెరాల్డ్ ఆర్లెన్ (1905-1986) న్యూయార్క్ కు చెందిన యూదు కుటుంబానికి చెందినవాడు.అతని తండ్రి శామ్యూల్ ఆర్లాక్ యూదు దేవాలయం, సినగాగ్, లో ప్రార్థనాగాయకుడు(కాంటోర్), అక్కడి సంగీత బృందానికి దర్షకుడిగా వ్యవహరించేవాడు.

        ‘హైమాన్ ఆర్లాక్’ గా నామకరణం చేయబడిన హెరాల్డ్,తన తండ్రితో పాటే సినగాగ్ ప్రార్థనాసంగీతం పట్ల ఆసక్తిని పెంచుకొన్నాడు.అయితే, చిన్నప్పటి హెరాల్డ్ కు పదిమంది లో గొంతు విప్పి పాడాలంటే, సిగ్గుతో గొంతుపెగిలేది కాదు.వాళ్ళమ్మ, సిలియా, ‘ఈ సిగ్గరి పిల్లాడు పెద్దయ్యాక  సంగీతంపాఠాలు చెప్పుకొనైనా బతుకుతాడని ’ఒక పియానో కొని తెచ్చి, ఇంట్లో పెట్టింది.హార్లాక్ పదేళ్ళకే తన పియానో టీచర్లను మించిపోయాడు. సినగాగ్ లో స్వంతంగా సంగీతరచన చేసుకొని పాడసాగాడు.

      అయితే, పరిమితమైన మత సంబంధగీతాలు,ఇటాలియన్ సంగీతానికి,మించిన ఆధునిక సంగీతం అతని చుట్టూ వినబడుతోంది. తండ్రి తరుచూ వినే హీబ్రూ మెలొడీలు,ఇటాలియన్ ఓపెరాలకు భిన్నమైన సంగీతం పట్ల హెరాల్డ్ కు కుతూహలం పెరిగింది.వాటి పట్ల ఆసక్తితో, వివిధ సంగీతరూపాలను ఆస్వాదించడం మొదలెట్టాడు.వాటి ప్రభావంతో,స్వంతంగా స్వరకల్పన కూడా చేయసాగాడు.తన పన్నెండేళ్ళవయస్సులో మొదటి స్వతంత్ర స్వరం,’ఇండియానోలా’,వినిపించాడు.

        వూళ్ళోని వివిధ సంగీత బృందాలకు, వాడ్ విల్లె బృందాలకు సంగీతం అందించ సాగాడు.తన స్నేహితులిద్దరితో కలిసి,

“ది స్నాపీ ట్రియో”అన్న సంగీతబృందాన్ని మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు పదిహేనేళ్ళు.అప్పుడే తనకు తనే సరికొత్త నామకరణం చేసుకొన్నాడు, ‘హెరాల్డ్ ఆర్లెన్’ అని.

         సంగీతం హెరాల్డ్ కి సంతోషంతో పాటు సంపాదనను రుచి చూపింది. బడి వదిలేసి, సంగీతాన్నే జీవనంగా మలుచుకోవాలనుకొన్నాడు. సహజంగానే, అతని అమ్మానాన్నలు అభ్యంతరాలు పెట్టారు. ఇక, చదువు కొనసాగిస్తూ, అంచెలంచెలుగా బ్రాడ్వే కి సంగీతం అందించేంతగా హెరాల్డ్ ఎదిగాడు.అతనితో పాటే అతని సంగీత బృందమూ.

         పంతొమ్మిదేళ్ళ వయస్సులో స్వరరచన చేసిన మొదటిస్వరాన్నినమోదు చేశాడు.”బఫ్ఫెల్లోడియన్స్” అన్న స్థానిక సంగీత బృందంలో  ప్రముఖుడిగా ప్రసిద్ధి గాంచాడు. సరిగ్గా అప్పుడే, హాలీవుడ్ ఆహ్వానం అందింది. 

               ఎం.జి.ఎం కి చెందిన ఆర్థర్ ఫీడ్  తమ కొత్త సినిమా ప్రాజెక్ట్ అయిన పిల్లల క్లాసిక్ “ది విజార్డ్ ఆఫ్ ఆజ్ “కు హెరాల్డ్ ఆర్లెన్ -యిప్ హర్బర్గ్ ద్వయం సరి అయిన జోడీ అని భావించాడు.హెరాల్డ్ స్వరరచన లోని మార్మిక అనుభూతి ,చాతుర్యమూ,హర్బర్గ్ పదరచనలోని అభూత కల్పనాశక్తి ఆ పిల్లల అభూత కల్పనను తెరమీద ఆవిష్కరించే అద్భుతమాధ్యమాలని భావించాడు.

       ఒకసారి వొప్పుకొన్నాక,వారిద్దరి ముందు కేవలం రెండున్నర నెలల వ్యవధి ఉన్నది.హెరాల్డ్ సినిమాపాటలు వ్రాయడం చాలా కష్టం అని భావించే వాడు. ఆ సినిమా ఒక అభూతకల్పన కావడంతో,పాటలన్నీ సరదాగా,సందడిగా,సంబరంగా,కోలాహలంగా ఉన్నాయి.మరీ”వి ఆర్ ఆఫ్ టు సీ ద విజార్డ్ ,ది మెర్రీల్యాండ్ ఆఫ్ ఆజ్ , డింగ్ డాంగ్ ! ది విచ్ ఇస్ డెడ్”వంటివి.

             ఒక బ్రహ్మాండమైన,అద్భుత ఊరేగింపు పాట ఈ సినిమాలో ఒక సప్తవర్ణ సంగీత స్వరప్రయోగం.అనేక సంగీత పరికారాల సమ్మిళతం.ఇంతటి సంబరాల సందడికి సమాంతరంగా, ఒక నెమ్మదైన, సున్నితమైన మంద్రస్వరం ఉండాలని స్వరకర్త హెరాల్డ్  బలంగా విశ్వసించారు. దానికి ఒక పొడవాటి,వెడల్పాటి,నిండైన వాక్యం కావాలని హెరాల్డ్ భావించాడు. 

         ఆ స్వరం ఏమిటో హెరాల్డ్ కి ఎంతకీ తట్టలేదు. సినిమాలోని మిగిలిన సంగీత స్వరరచన అంతా పూర్తయినా, అతనిలో బలం గా ఆకాంక్షించిన ఆ స్వరం ఒక రూపం దిద్దుకోలేదు.సమయం మించిపోతుండడంతో విపరీతమైన వత్తిడికి,అశాంతికి గురయ్యాడు.చివరికి  ఆ స్వరం హెరాల్డ్ కి తట్టడం కూడా చాలా నాటకీయం గా, ఆసక్తికరం గా జరిగింది.

         ఒక రోజు సాయంకాలం హెరాల్డ్, ఆన్య దంపతులు సినిమాకి కారులో బయలుదేరారు.మార్గమధ్యంలో,హఠాత్తుగా  ఈ స్వరం హెరాల్డ్ కి తట్టింది.వెంటనే కారును ఆపి,ఆ రోడ్డు పక్కనే కారులో కూర్చుని, ఆ స్వరాన్ని కాగితంపై నిక్షిప్తం చేసాడు. తనకు స్వర సాక్షాత్కారం జరిగిందని  హెరాల్డ్ భావించాడు.ఇన్ని రోజుల తన సంఘర్షణకు శుభం పలికేందుకు అతను విశ్వసించే దేవుడే ఈ స్వరాన్ని తనలో స్ఫురింపజేసాడని అతను ఉద్వేగంతో అనేవాడు.

         ఎంతో ఉద్వేగంతో,స్వరకల్పన పూర్తి చేసి, హార్బర్గ్ కు వినిపించాడు.అతని ఉత్సాహనికి భిన్నంగా,  హార్బర్గ్ విని, నిర్లిప్తంగా ఊరుకొన్నాడు. హెరాల్డ్ తనలో బలంగా,లోతుగా కలిగిన ఆ అద్భుత స్వరభావనను అలా తేలికగా వదిలేయదలుచుకోలేదు. వారిరువురి సన్నిహితమిత్రుడు,ప్రముఖ సినిమాపాటల రచయిత ఇరా గెర్ ష్విన్ సమక్షంలో,గెర్ ష్విన్ అభిప్రాయం కోరుతూ, మళ్ళీ హార్బర్గ్ కు ఈ స్వరం వినిపించాడు. 

       వినీ వినగానే, గెర్ ష్విన్ కి నచ్చింది. అతని సానుకూల అభిప్రాయానికి, హార్బర్గ్  వెంటనే స్పందించాడు. అప్పటికప్పుడు, హెరాల్డ్ ఎదురు చూసిన,ఆ పొడవాటి,వెడల్పాటి,నిండైన వాక్యంతో హార్బర్గ్ పాటకి నామకరణం చేసాడు. “సంవేర్ ఓవర్ ది రెయిన్ బో” అంటూ.

     ఆ నిర్ణయాత్మక క్షణమే,వారిరువురి పాటను అజారమరం చేసింది.

    “సం – వేర్” అన్న పదంలోని విరుపులో, హెరాల్డ్ తన స్వర మార్మికతనంతా నిక్షిప్తం చేశాడా అనిపిస్తుంది.

      ఆ పాటను నలుపు తెలుపుల్లో చిత్రించారు.ఈ పాట పూర్తవ్వగానే, కాన్సాస్ లో తరుచూ వచ్చే గాలిదుమారపు సుడిగాలి వచ్చి, చిన్నారి డొరొతీని,ఆమె కుక్కపిల్ల, టోటోని, తీసికెళ్ళి, మాహామాయ ప్రదేశం, ఆజ్ , లో పడేస్తుంది. 

 ఒక్కసారిగా ఇంద్రజాలం జరిగినట్లుగా, అప్పటి దాకా  కాన్సాస్ లో విషాదఛాయలలో సాగిన ఈ నలుపు తెలుపు సినిమా  సర్వాంగభూషిత సప్తవర్ణాల రంగుల చిత్రం గా మారిపోతుంది. సరిగ్గా, ఆజ్ మహామంత్రజాలం అక్కడే మొదలవుతుంది.

     మాయావి, జిత్తులమారి ‘తూర్పు మంత్రగత్తె’ మరణించడంతో మహోల్లాసంగా సాగే, ఆ మంచ్ కిన్ ల్యాండ్ పుర ప్రజల ఊరేగింపు పాట ఒక పండగ సంబరం.ఇక, వేగంగా, చకచకా సాగుతుంది వెండితెరపై మిరుమిట్లుగొలిపే సినిమాకథనం. కాన్సాస్ లోని వాస్తవ జీవిత చిత్రణలోంచి, ఆజ్ లోని అభూత కల్పనలోకి కథ అడుగుపెడుతుంది.

         ఆ పాట ప్రాధాన్యతను, ఇంద్రజాలశక్తినీ తెలిసిన స్వరమాంత్రికుడు కాబట్టే, హెరాల్డ్ ఆ పాట కోసం పట్టుబట్టాడు.

        హెరాల్డ్ ఎంత బలంగా ఈ పాటను కావాలని అనుకొన్నాడో, ఎం.జి.ఎం.నిర్మాత మెర్విన్ లిరాం, ఎం.జి.ఎం. ఎగ్జక్యూటివ్ ,లూయి  బి. మేయర్ ఈ పాటను అంతే బలంగా వద్దంటే వద్దన్నారు. సహనిర్మాత , ఆర్థర్ ఫీడ్, గట్టి పట్టుదల వలన, కత్తిరించిన ప్రతిసారీ, ఈ పాటను మళ్ళీ అతికించారు. జ్యూడీ గార్లండ్ కు సంగీతసాధన చేయిస్తున్న రోజర్ ఏడెన్స్ ప్రోద్బలం అతనికి తోడయ్యింది. హెరాల్డ్ కు ,హర్బర్ కు ఈ ప్రాజెక్ట్ ను అప్పజెప్పిన,సహనిర్మాత ఆర్థర్ ఫీడ్ ప్రోత్సాహం లేనిదే, బహుశా ఈ పాట, ఎం.జి.ఎం.స్టూడియో కత్తిరింపుల గదిలోని చెత్తబుట్టలో నిమజ్జనం అయిఉండేది.  

     ఈ పాట వాస్తవానికి, కల్పనకు మధ్య ఒక గడపలా నిలబడుతుంది.కాన్సాస్ గాలిదుమారాల్లో నుంచి అద్భుత  సాహస కథాసముద్రంలోకి ప్రయాణించేందుకు,ఈ పాట ఒక పడవలా సాయపడుతుంది

* 1963 లో ప్రతిష్టాత్మకమైన కార్నెగీ హాల్లో, ‘ఈస్టర్ పరేడ్’ లోని, ఒక సరదాపాటను నర్తించిన తరువాత,  సభామర్యాదలకు భిన్నంగా,జూడీ నేరుగా వచ్చి వేదిక మీద చతికిలబడి, “ఇంద్రధనుస్సుకు ఆవలగా!పాడడం మొదలెట్టింది. మునుపెన్నడూ లేని విధంగా, పాట పాడేప్పుడు డగ్గుత్తికతో జూడీ గొంతు పెగలలేదు. కళ్ళ నీళ్ళు పెట్టుకొంటూ, జూడీ పాడిన తీరుకి అందరి హృదయాలు ద్రవించాయి. 

          ఆ పాడేసమయంలో జూడీ మనసులొ ఏమేమి మెదిలాయో ఎవరికి తెలుసు ? అయితే, ప్రేక్షకుల అంతరాంతరాలతో పాటు,ఆ పూట సరిగ్గా ఆ పాట ఆత్మను జూడీ స్పృశించినట్లయ్యింది.

 అప్పుడామె, ఒక వీధి బికారి వేషధారణలో ఉన్నది. 

జ్యూడీ గార్లాండ్, కార్నెగీ హాల్ ,1963

         ఇల్లూవాకిలి లేని ఆ బికారి ఆ పాట రాసిన కాలంనాటి అమెరికా ముఖచిత్రం. అది రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలం. ఆర్దికమాంద్యం అమెరికాను మూలాల్లోంచి కుదిపి వేస్తున్న కాలం అది.అమెరికా ఆర్థికవ్యవస్థ సమూలంగా కుప్పకూలింది. 

           గౌరవంగాజీవనం సాగిస్తున్నవారెందరో,అన్నీ ఉన్నవాళ్ళయ్యీ, ఏమీ లేని వాళ్ళయ్యారు.ఇల్లూవాకిలీ లేని బికారుల్లా వీధుల పాలయ్యారు.ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు,వారు వీరని లేకుండా అందరూ ఆర్దికమాంద్యాన్ని రుచి చూసారు.  

        ఈ పాటరచయిత, హార్బర్గ్ కూడా, తన వ్యాపారాన్ని పోగొట్టుకొని,అప్పులపాలయ్యి ఉన్నాడు. హార్బర్గ్ యిడ్డిష్ భాష  మాట్లాడే సాంప్రదాయ రష్యన్ యూదు కుటుంబంలో, 1896 లో న్యూయార్క్ లో పుట్టాడు. మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొని,హార్బర్గ్ తిరిగి వచ్చాక, కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించాడు.కానీ, అది ఆర్దికమాంద్యం బారినపడి కుదేలయ్యింది.అప్పులపాలయిన కుటుంబాన్ని గట్టున పడేయాల్సిన బాధ్యత అతనిదే. 

        హార్బర్గ్ చిన్ననాటి  స్నేహితుడు, జే గోర్నీ,లోగడ హార్బర్గ్ అడపాదడపా స్థానిక పత్రికల్లో ప్రచురించిన రచనలను చూసి, పాటలరచననే వృత్తిగా స్వీకరించమని ప్రోత్సహించాడు. గోర్నీ ప్రోద్బలం తో, జీవనోపాధి కోసం హార్బర్గ్ పాటలు రాయడం మొదలెట్టాడు.అనతికాలంలోనే అదే హార్బర్గ్ వృత్తిగా మారింది. బ్రాడ్వే సంగీత రూపకాలకు పాటలు రాస్తునే, స్నేహితునితో కలిసి హాలీవుడ్ సినిమాలకు పాటల రచయిత అయ్యాడు. 

       “అమెరికానా (1932) “చిత్రం కోసం  గోర్నీ స్వరరచనలో, 1930 నాటి హర్బర్గ్ పాట, “తమ్ముడూ, నాకోసం ఒక డైం నాణెం ఇవ్వగలవా?” వీధి బికారి అయిన ఒక ఉద్యోగి, చెమట చిందేందుకు వీలులేక, చేయి చాచ వలసి వచ్చిన దుర్భర పరిస్థితి మూలాలని వివరించేలా,  అమెరికా వీధుల్లో చిత్రీకరించబడిన ఈ పాట, అందరి గుండెల్నీ పట్టేసింది.      

                      వాళ్ళెప్పుడూ చెప్పేవారు నేనొక కలను నిర్మిస్తున్నానని.మందను అనుసరించాను.

                      పొలం దున్నమన్నా,తుపాకులు చేపట్టమన్నా,ఆ పనిని నేను వెంటనే అందుకొన్నాను.

                      వాళ్ళెప్పుడూ చెప్పేవారు నేనొక కలను నిర్మిస్తున్నానని.శాంతి,కీర్తి ప్రభవిస్తాయని.

                      మరి ఇప్పుడు నేనెందుకని వరసల్లో నిలబడి, బ్రెడ్ కోసం చేయి చాస్తున్నాను?

                      తమ్ముడూ, నాకోసం ఒక డైం నాణెం ఇవ్వగలవా?

        అటు బ్రాడ్వే లోను, ఇటు హాలీవుడ్ లోను, ఆ దరిమిలా, ఆర్దికమాంద్యపు అమెరికా సామాన్యుల జాతీయ గీతమే అయ్యింది!

“ఇదొక కాగితం జాబిల్లి”, “పనిలేని పేదలు  సోమరిధనికులయినపుడు” లాంటి అనేక పాటలు హార్బర్గ్ ను చిరపరిత పాటల రచయితను చేసాయి.ఆ క్రమంలోనే, హెరాల్డ్ తో కలిసి ,తమ చిన్నపిల్లల క్లాసిక్ కు పనిచేఉయాల్సిందిగ ఎం.జి.ఎం నుంచి ఆహ్వానం అందుకొన్నాడు. 

     “ది విజార్డ్ ఆఫ్ ఆజ్”  సినిమాలోని అన్ని పాటలు సరళంగా,లలితంగా, సంబరంగా, చిన్నపిల్లల పాటల్లా సాగాయి.      “ఇంద్రధనుస్సుకు ఆవలగా!పాట స్వరాన్ని వినగానే, హర్బర్గ్ మిగిలిన పాటలవరసలో  ఇది ఇమడదని భావించాడు. కాన్సాస్ నుంచి వచ్చిన ఒక చిన్నపిల్ల పాడగలిగిన పాటలా లేదనీ, ఎంతో ఘనంగా, సంక్లిష్టంగా ఉన్నదనీ ,మిగిలిన పాటలకు సరిగ్గా భిన్నంగా ఉందనీ భావించాడు. 

        ఖచ్చితంగా ఆ భిన్నత్వం కొరకే ఈ స్వరం కోసం హెరాల్డ్ పట్టుపట్టాడు. రెండవసారి గెర్ ష్విన్ సమక్షంలో హెరాల్డ్ ఈ పాటను వినిపించినపుడు, హర్బర్గ్ వెంటనే పాట శీర్షిక వాక్యాన్ని చెప్పేసాడు. “ఇంద్రధనుస్సుకు ఆవలగా!

        ప్రతి సంస్కృతిలోనూ, ఇంద్రధనుస్సుతో ముడిపడిన నమ్మకాలు ఎన్నో ఉంటాయి.ఇంద్రధనుస్సు భూమిని తాకే చోట, నిధి నిక్షేపాలు ఉంటాయని భావించేవారు కొందరయితే, అమృతభాంఢం ఉంటుందనుకొనే వారు కొందరు.భూమికి దివ్యలోకాలకి ఇంద్రధనుస్సు ఒక నిచ్చెన అనీ, వంతెన అనీ భావించం పరిపాటి. 

కమ్ముకొచ్చే కారుమబ్బులపై దోబూచులాడే సూరీడి వెలుగుసంతకంమై  విరిసిన సప్తవర్ణాల ఆశాచాపంగా భావిస్తాం. ఆ భావనే ఆశావహదృక్పథానికి మూలం. 

           పాశ్చాత్య సంస్కృతిలో నీలిపిట్ట సంతోషానికి ప్రతీక. స్థానిక అమెరికన్ల సంస్కృతిలో నీలిపిట్ట వసంతాగమనానికి , నవ జీవనఆరంభానికి సూచిక.                                                                                                      యిప్ హార్బర్గ్ 

      నూతనతేజాన్ని, నవ చేతననను సదా ఆహ్వానించే  హార్బర్గ్ పాటలు,సామాజిక వ్యాఖ్యానాలకి, స్వంతంత్ర భావనలకు, సున్నితత్వానికి ప్రసిద్ధి. జాతివివక్షత, లింగవివక్షత ను ఖండించేవాడు.నాస్తికుడు.మతాన్ని విమర్షించేవాడు.రాజకీయస్పష్టత తో రాయగలిగినవాడు.సోషలిస్ట్. 

       యిప్ హార్బర్గ్ ఏనాడు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేదు.ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. అయినా, ఆనాటి యువతరం పై యిప్ ప్రభావం ఎంతగా ఉండేదంటే, విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనే యువతను “యిప్ సెల్స్(Yipsels)“ అని పిలిచేవారు. అదే ప్రాచుర్యం దృష్ట్యా ,హర్బర్గ్ ను 1950నుంచి 1962 వరకు ,సినిమా,టివి, పత్రికలలో వ్రాయకూడదని బహిష్కరించారు. ఆ నిషేధ కాలంలోనూ,ఆ తరువాతా అతని పాటలు మాత్రం  ఎందరెదరిలోనో ఆలోచనలను కలిగిస్తూ,హృదయాలను స్పృశిస్తూ, ఆశావాదాన్ని,సానుకూల దృక్పథాన్ని ప్రకటిస్తూ,అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నాయి. 

     ఆర్దిక సంక్షోభాల నుంచి, ప్రపంచ యుద్ధాల నుంచి, అస్తిత్వసాధానాలనుంచి,మానవహక్కుల ఉద్యమాల నుంచి, 

  జాతి, స్త్రీ వివక్షా వ్యతిరేక ఉద్యమాల నుంచి, అంతరిక్షశోధనల దాకా, ఆ పదాలు నిరాఘాటంగా ప్రయాణిస్తూనే ఉన్నాయి. అందుకు, ఈ పాటే ఒక ఉదాహరణ.  

      ఈ పాటలోని యూదుమూలాలను వెతుకుతూ, యూదుమతాధికారి, రబ్బీ బెర్నార్డ్ రోసెంబర్గ్ ,2014 లో ఒక సంపాదకీయం వ్రాసారు. హేరాల్డ్ , హర్బర్గ్లు ఇరువురు యూదు జాతీయులు కనుక, ఆనాటి(1938) యూరోప్ లో యూదులపై జరుగుతోన్న దారుణమారణ కాండపై స్పందన ‘ఇంద్ర ధనుస్సులకు ఆవలగా!’ పాటను అని భావించారు.

     ఈ పాటలోని నిమ్మచినుకులు ,వారిపై యూరోప్ లో కురిసిన నాజీ జాత్యహంకార యాసిడ్ బిందువులని , కాన్సెంట్రేషన్ క్యాంపులలో విషవాయువులకు అసువులుబాసిన లక్షలాది మంది యూదుల దహనకాండలపై ఎగిసిన చిమ్నీ పొగలలో వారు ఆకృతి దాల్చుతారని అంటూ ,ఈ పాటలోని వాక్యాలను యూదు మతాధికారి వ్యాఖ్యానించారు. 

    అంతటి దుర్భర పరిస్థితిలోనూ,ఆశావహభావాన్ని నింపే ఈ పాట అనేక మంది యూదుల హృదయస్పందనగా మారింది.

       “ఈ లోకమంతా నమ్మకం లేని గజిబిజి గందరగోళమైనపుడు” పాట తొలివాక్యాల్లోని ఈ వాక్యం సినిమా పియానో షీట్లలో ఉన్నా,  సినిమాపాటలో ఉంచలేదు.అలాగే రెండో చరణం మొదట్లోని వాక్యం,

                 “ఒకప్పుడు లీలగా మాట్లాడిన ఆ మాటను బట్టి ” పాట బ్రిటిష్ ప్రతి లోనే ఉన్నది.                                   

          ప్రజాస్వామ్యాన్ని విశ్వసించిన హార్బర్గ్ ఫ్యాక్టరీ పొగగొట్టాలగురించి వ్రాసాడనీ, ఆర్దికమాంద్యం లోని కార్మికుల కష్టాలు కమ్ముకొచ్చిన కారుమబ్బులనీ, వెలసిన ఇంద్రధనుస్సు రూజ్వెల్ట్ ప్రభుత్వం ప్రకటించిన, “న్యూ డీల్”, ఆర్దిక సంస్కరణ విధానాలపై హార్బర్గ్ కు కలిగిన  నమ్మకం అనీ, ఆర్ధికమాంద్యపు భీతావహులకు అందివచ్చిన ఆశావహదృక్పథం అని అంటారు.

            అమెరికా అంతా ఆర్ధిక సంక్షోభంలో అతలాకుతలం అవుతున్న ఆ కాలాన, ఎం.జి.ఎం. సుమారు మూడు మిలియన్లు వెచ్చించి, అంగరంగవైభవంగాఈ సినిమాను చిత్రించింది.బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది.ఈ పాట ఆ ఏడాది ఆస్కార్ పురస్కారాన్ని అందుకొంది.

      లోగడ సుమారు దశాబ్దకాలపు రచనానిర్బంధాన్ని విధించిన ప్రభుత్వమే, హర్బర్గ్ పాటను ప్రాధాన్యతను అంగీకరించింది.

 అతని “పొడవాటి,వెడల్పాటి,నిండైన వాక్యం” తో, అతని చిత్రంతో, అతని పేరిట, ఇంద్రధనుస్సు విరిసిన, ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.

    “నిమ్మచినుకుల పాటలు” అని సంగీతదర్షకుడు ప్రస్తావించే, ఈ సినిమా పాటలన్నిటికీ మూలభావన ఆ కథలోనే ఉన్నది. కష్టాలు ఎదుర్కొంటోన్న చిన్నపిల్ల డోరోతీ, హృదయాన్ని ఆశించే తగరం మనిషి, మెదడును ఆశించే దిష్టి బొమ్మ, ధైర్యాన్ని కోరుకొనే పిరికి సింహం, వీరందరి కష్టాలకీ , పరిష్కారాలని చూపే, ఆజ్ మహామాంత్రికుడు. ఈ ముఖ్యపాత్రలన్నిటి చుట్టూ కథారచయిత 

ఎల్. ఫ్రాంక్ బాం  అల్లిన అద్భుత సాహసాల పిల్లలనవల, ‘’ది వండర్ఫుల్ విజార్డ్ ఆఫ్ ఆజ్.”

       1900 లో అచ్చయిన, ‘’ది వండర్ఫుల్ విజార్డ్ ఆఫ్ ఆజ్” లోని కథే , జ్యూడీ గార్లండ్  డొరొతీ గా నటించిన సినిమా, ‘ది విజార్డ్ ఆఫ్ ఆజ్’(1939)” ఈ పుస్తకాన్ని మొదటి అచ్చమైన అమెరికన్ పిల్లల నవలగా పరిగణిస్తారు. అమెరికా లోని స్థానిక స్థలకాల సామాజిక విశేషాలను ప్రస్తావిస్తూ,ప్రతిఫలిస్తూ సాగిన కథలు ఇవి. కాన్సాస్ మొక్కజొన్న పొలాలమీది గాలిదుమారాలలో పుట్టిన కథలివి.   

      ఆనాటి అమెరికన్లు వింతలూ విడ్డూరాల విశేష భూమిగా భావించే, “ఆజ్” అని పిలిచే, ఆస్ట్రేలియా పేరిట , ఒక ఇంద్రజాల మాయాలోకాన్ని సృజియించిన కల్పానా చాతుర్యం.తరువాతి నవలలలో, డొరోతీ తన అంకుల్ హెన్రీతో కలిసి, ఓడ ఎక్కి ,వెళ్ళి ఆస్ట్రేలియా లోని తమ బంధువులను కలిసివచ్చే సాహసయాత్ర కూడా వుండడం విశేషం.

తాను సృష్టించిన వింతలోకం ఆజ్ చుట్టూ, ముఖ్యపాత్రలన్నిటి చుట్టూ కథారచయిత ఎల్. ఫ్రాంక్ బాం  అల్లిన అద్భుత సాహసాల పిల్లలనవల.ఇదే, ఆజ్ వరసలో 1900 నుంచి 1918 వరకు 14 పిల్లలలు నవలలు రాశాడు బాం. రెండు నవలలు  అతని తదనంతరం, ప్రచురించబడ్డాయి. ఈ “ఆజ్ పిల్లల నవలలు” ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఎల్. ఫ్రాంక్ బాం తదనంతరం, 1921 నుంచి 1970 వరకు, “ఆజ్ వరస” లోనే,  రుథ్ R. థామ్సన్ రచించిన 21 నవలలు అచ్చవుతూనే ఉన్నాయి.. పిల్లల,పెద్దల  అభిమానాన్ని కూడగట్టుకొంటూనే ఉన్నాయి.     

బాం సృష్టీంచిన ఆజ్ అద్భుత కల్పనా లోకపు ఊహా మాయాజాలానికి ఇదొక మచ్చు తునుక.

ఆజ్ నవల”లను తెరకెక్కించే తొలిప్రయత్నాలలో”ది ఫెయిరీలాగ్ అండ్ రేడియో ప్లేస్ (1908)” అన్నది ముఖ్యమైనది. దీంట్లో ఫ్రాంక్ బాం స్వయాన పాల్గొన్నాడు

                      ఎల్. ఫ్రాంక్ బాం (1919)                        

                దాదాపు శతాబ్దం తరువాత వాస్తవరూపం దాల్చబోయే సాంకేతిక నైపుణ్యాల ఊహారూపాలను ఈ నవలలు   కల్పించాయి. టెలివిజన్, ల్యాప్ టాప్, వైర్ లెస్ ఫోన్, ఆగుమెంటెడ్ రియాలిటీ, కృతిమ మేధస్సును, అనుభూతిని  కోరుకొనే లోహపు మనిషి,ఆడవారు చేయలేరని అతని కాలంలో భావించే భారీ పనులు,ప్రమాదంతో కూడిన సాహసకార్యాలు సునాయాసం గా చేసే మహిళలూ, దుస్తులపై ప్రచారం ..మొదలయినవి ఎన్నో.

    మహిళాసాధికారతా ఉద్యమాలతో కలిసి పని జేసే వాడు. రెండవ ఆజ్ నవల,ది మార్వెలస్ ల్యాండ్ ఆఫ్ ఆజ్ (1904), లోనే, అల్లిక సూదులు, దారపు ఉండలతో మహిళలు సంఘటితమై, తిరుబాటు చేసి, అధికారాలను తమ చేతికి తీసుకోవడం చిత్రించాడు.

      ఆజ్ మహామాంత్రికుడు కేవలం జానపదకథల్లోని కల్పిత పాత్ర కాక పోవడం, డొరోతీ లాగానే కాన్సాస్ నుంచి ఒక సుడిగాలిదుమారం తెచ్చి అతనిని ఆజ్ లోకం లో పడేయడం తో, అతని సాంకేతిక నైపుణ్యంతో అక్కడి మహా మాంత్రికుడిగా చలామణి అయ్యి , అలాగే స్థిరపడతాడు.”తెర వెనక మనిషిని పట్టించుకోకండి!”అని వారిస్తూనే, మైక్ లు,స్పీకర్ల సెట్,  టెలివిజన్, తెర వెనక వుండి కథనంతా నడిపిస్తాడు. చివరికి అప్పటికి ఇంకా సులభతరం కాని , హాట్ ఎయిర్ బెలూన్ లో ఎక్కి కాన్సాస్ కు తిరిగి  వెళ్ళిపోతాడు. 

       విజార్డ్  ఎలాంటి మాయాజాలం మహిమలూ, మంత్రాలుతంత్రాలు లేని  మనలాంటి మామూలు మనిషే అని గ్రహించ గానే దిష్టిబొమ్మ అంటుంది.” నువ్వు వట్టి హంబగ్! ”  “అవును ,నేనొక హంబగ్ నే !” విజార్డ్ వెంటనే అంగీకరిస్తాడు. 

     “హంబగ్” అన్న పదం ఒట్టి మోసకారికి ,వంచనాపరుడికి పర్యాయపదం అయి, వాడుక భాషలో సాధారణమై పోయింది. ఇలాంటి అనేక పదాలకు, వాక్యాలకు ,భావాలకు ఈ నవలలు మూలమయ్యాయి. అమెరికన్ పిల్లల రచనలలో కొత్త ఒరవడిని సృష్టించాయి ఈ కథలు.

    సాంప్రదాయ పిల్లల సాహిత్యంలోని మాయావి ముద్రకి ఫ్రాంక్ బాం కొత్త పోకడ అద్దాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన  మహా మాంత్రికుడిగా చలామణి కాగలిగిన మామూలు మనిషిని, మనకు ఆనాడే పరిచయం చేశాడు. బాం పిల్లల సాహిత్యంలో హింస, నీతిబోధలు, శృంగార కథలు ఉండకూడని భావించాడు. ఆ నిబద్దతతోనే రాసాడు. 

     ‘ఆలోచనా? అనుభూతా? మనిషికి ఏది ముఖ్యం?” ఇంత లోతైన ప్రశ్నకు , ఒక సంభాషణ ద్వారా చెపుతాడు. 

   దిష్టిబొమ్మ మెదడు కావాలనుకొంటుంది. తగరంమనిషి గుండె కావాలని అనుకొంటాడు. 

  “నేను హృదయాన్నే కావాలనుకొంటాను. ఎందుకంటే, మెదడు మనిషిని సంతోషపెట్టలేదు. సంతోషమేగా మన జీవన పరమావధి.” తగరం మనిషి అంటాడు, “ఒకప్పుడు నేను మెదడు, హృదయం రెండింటిని ప్రయత్నించి చూశాను. రెండింటిలో నాకు హృదయమే కావాలి.”

    వారిద్దరి సంభాషణలను, అభిప్రాయాలను , హార్బర్గ్ రెండు పిల్లల పాటల్లో రాస్తాడు. సరదాగా ఉంటూనే మౌలిక భావనలను స్పృశిస్తాయవి.                  

 “నాకే కనుక  ఒక మెదడు ఉంటే…,” తలలో గడ్డి కూర్చిచేసిన దిష్టిబొమ్మ పాడుతుంది.                                                                   

   “ చిన్ని పిచ్చుకతో స్నేహం చేస్తా.

     కోడికూరలో మూలిగలెందుకున్నాయో

    కాస్త ఆలోచిస్తా.

    సముద్రం ఎందుకు ఆపకుండా రొదపెడుతుందో,

   ఇంకాస్త లోతుగా ఆలోచిస్తా.”

“సెంటిమెంటల్ ఫెలో” అని విజార్డ్ సంభోదించే తగరం మనిషి (కొయ్య లోహం మనిషి) పాడుతాడు, తనకు హృదయం ఎందుకు కావాలో.    “నాకు హృదయం ఉంటే…”

                                   “ మనిషి ఒక ఖాళీ తగరపు టీపాత్ర అయినపుడు,

                                     భోళాగా, ఘనంగా ఉంటుందేమో! 

                                      కానీ,

                                     నేను ఒక మనిషిని అవ్వాలనుకొంటున్నా!

                                     కాబట్టే,

                                     కొంచెం హృదయం ఉండాలనుకొంటున్నా!”

       “నీలో బోలెడంత ధైర్యం ఉంది.నాకు స్పష్టంగా తెలుసు.” పిరికిసింహంతో ఆజ్ మాహామాంత్రికుడు అంటాడు,” నీకు కావాలినదల్లా నీ పై నీకు నమ్మకం. ప్రమాదం ఎదురయినపుడు భయపడనిజీవి అంటూ ఏదీఉండదు.నిజమైన ధైర్యం అంటే భయపడుతున్నప్పుడు ఎదురయిన ప్రమాదాన్ని ఎదుర్కోగలగడమే. అలాంటి ధైర్యం నీలో బోలెడంత ఉన్నది.”  

        జీవితం పట్ల నమ్మకాన్ని, ప్రేమను,ఆశను నింపగలిగిన ఆ పిల్లలనవలలోని వాక్యాలు, ఆనాటికీ ఈనాటికీ ఆలోచనల్లో అనుభూతుల్లో ఆశావహదృక్పథం కొరుకోనే వారందరికి ఊతంగా అంది రాగలగడమే,కాలాలకు అతీతంగా ఫ్రాంక్ బాం కలంలోంచి చిప్పిల్లిన అద్భుతకల్పనలు  సాధించ గలిగింది.

*

                             “ హరివిల్లు వంపుల్లో ఒదిగిన ఆనందభాండం

                                అందుకోవడానికే నేనెప్పుడు ప్రయత్నిస్తూన్నా.”

                                “ నేనెప్పుడూ ఇంద్ర ధనుస్సుల వెనకే పరిగెడుతున్నా.

                                   చిన్ని నీలిపిట్టను చూడాలని ప్రయత్నిస్తూనే ఉన్నా.”

        1941 లో, “నేనెప్పుడూ ఇంద్రధనుస్సులను వెంటాడుతూనే ఉన్నా”  అంటూ జ్యూడీ గార్లాండ్ “జీగ్ ఫీల్డ్ గర్ల్”సినిమా లో పాడిన 1917 నాటి వాడ్ విలె పాట, జ్యూడీ జీవితంలో విరిసిన  ఇంద్రధనుస్సుల చాటునున్న ఛాయలను ప్రతిఫలిస్తుందా అనిపిస్తుంది.

           అతి పిన్న వయస్సులో అఖండ విజయాన్ని,అత్యున్నత కీర్తినీ,  ప్రతిష్టాత్మక మైన పురస్కారాలను, అత్యంత జనాదరణనూ, అంతులేని సంపదనూ సాధించిన ప్రతిభాశీలి జ్యూడీ జీవితమంతా విరిసిన ఇంద్రధనుస్సై ఉండాలి. కానీ,జ్యూడీ జీవితం లో ఇంద్రధనుస్సుల మెరుపులతో పాటు, నీడలు కూడా పరుచుకొని ఉన్నయన్నది వాస్తవం. విజయానికి, విఫలానికీ మధ్యన  సన్నని రేఖపై జ్యూడీ జీవనం సాగింది.   

                        ” నేనెప్పుడూ ఓడిపోతూనే ఉన్నా.

                            దానికి కారణం ఏమై ఉంటుందో.

                           ఒకవేళ ఈ లోకాన్ని నిందించాలేమొ! 

                           నా ఓటమికి నేనే  కారణమేమో!

                           నేనెప్పుడూ ఇంద్ర ధనుస్సుల వెనకే పరిగెడుతున్నా.

                            తరుముకు వస్తోన్న మబ్బుల్ని చూస్తున్నా

                            నా కలలాంటివే నా ప్రణాళికలూ…

                             ఆకాశంలో ముగుస్తాయి.”

                    నేనెప్పుడూ సహజంగానే విఫలజీవిని.

                        నేను తాకినదేదైనా, ఓడిపోవాల్సిందే 

ఇంతటి నిరాశానిస్పృహలను  చవి చూసినప్పటికి కూడా, జీవితేచ్ఛకు, జీవన కాంక్షకూ ప్రతీకగా మూర్తిమత్వం చెందడం బహుశా, జ్యూడీకే సాధ్యపడింది.

                                    బేబీ  (1929 )                                   

             జ్యూడీ  వాడ్ విల్ కళాకారులయిన ఎథెల్ మరియాన్ గమ్మ్ , ఫ్రాన్సిస్ గుమ్మ్ ల కు 1922 లో జన్మించింది.

           అమ్మానాన్నలు తమ మూడవ బిడ్డకు, ఫ్రాన్సిస్ ఎథెల్ గమ్మ్ అని నామకరణం చేసారు. గ్రాండ్ రాపిడ్స్ ,మిన్నిసొటాలో   వారికుటుంబానికి ‘వాడ్ విల్’ ప్రదర్షంచించే థియేటర్ ఉండేది.వారి స్వంతథియేటర్లోనే రెండున్నరేళ్ళ వయస్సులో, తన ఇద్దరు అక్కలు ,మేరీజేన్, డొరొతీ లతో కలిసి, ఫ్రాన్సెస్ ఎథెల్ “గమ్మ్ సిస్టర్స్” పేరిట  వాడ్ విల్ ప్రదర్షనలు ఇచ్చే వారు.

వాడ్ విల్  వ్యంగ్యాత్మకంగా సాగే నృత్యప్రదర్షనలు. హాస్యం, వ్యంగ్యం,సంగీతం,నాట్యం,నాటకం,ఇంద్రజాలం,ఇలాంటి  వైవిధ్యభరితమైన అంశాలన్నిటినీ కలగలిపిన కళా ప్రదర్షన వాడ్ విల్

      “బేబీ గమ్మ్”గా, రెండున్నరేళ్ళ జ్యూడీ ప్రేక్షకుల అభిమానాన్ని ఇట్టే సంపాదించేసింది.వారి థియేటర్, కుటుంబ ప్రదర్షనలు ఆ ప్రాంతంలో ఎంతో పేరు మోశాయి.అయితే, జ్యూడీ తండ్రి ఫ్రాన్సిస్ గమ్మ్ ఒక నటుడి పట్ల  వాంఛాపూరితంగా తీసుకోబోయిన చొరవ,తీవ్ర వివాదస్పదమైంది.వారి థియేటర్ ను అమ్మేసి కుటుంబం అంతా మినిసొటాను వదిలి , కాలిఫోర్నియాకు వెళ్ళవలసి వచ్చింది. 

        1934లో చికాగోలో వాడ్ విల్ ప్రదర్షనలు ఇచ్చేటప్పుడు,ఆ ఓరియెంటల్ థియేటర్ యజమాని,జార్జ్ జెస్సెల్, వేదిక మీద కదలాడే పూలమాలను తలపిస్తూ వాడ్ విల్ ప్రదర్షనలు చేసే ఆ సొదరీమణులకు “గమ్మ్ సిస్టర్స్” అన్న పేరును, ప్రేక్షకరంజకంగా “గార్లండ్ సిస్టర్స్” అని మార్చాడు. “ఫ్రాన్సిస్ ఎథెల్ గమ్మ్” అలా  “జ్యూడీ గార్లండ్” అయ్యింది. వాడ్ విల్ ప్రదర్షనలు ఇస్తూనే, పిల్లలను హాలీవుడ్ లో ప్రవేశపెట్టాలని జ్యూడీ తల్లి ప్రయత్నిoచింది. 

     జ్యూడీ తన పన్నెండేళ్ళ వయస్సులో , ఎం.జి.ఎం వారికి కాంట్రాక్ట్ సంతకం చేసింది.  అటు బాలనటి గాను, ఇటు కథానాయికగాను నటించడానికి వీలుపడని వయసది.ఆమెతో సంతకం చేయించుకొనేనాటికి ఎం.జి.ఎం వద్ద జ్యూడీ కి సరిపడే పాత్రలేమీ సిద్ధంగా లేవు. ఆమెను బడికి పంపారు.ఎలిజిబెత్ టైలర్, లానా టర్నర్ వంటి వారు ఆమె సహాధ్యాయులు.

     ఒకరకంగా,ఆమె వయస్సుకు తగ్గ కథనుసిద్ధం చేస్తూ, ‘డొరోతీ’ పాత్రకు సరిగ్గా సరిపోయే బాల తార “షిర్లీ టెంపుల్” నటించడానికి అనుమతించమని ప్రయత్నించారు. షిర్లీ టెంపుల్ అప్పటికే క్రాంటాక్ట్ లో ఉన్న యూనివర్సల్ స్టూడియో అనుమతి నిరాకరించడం తో,  జ్యూడీ డొరోతీ అయ్యింది.

         ఈ సంగీత ప్రధాన చిత్రానికి జ్యూడీ వయస్సుకు మించిన పాట పాడవలసివచ్చింది. జ్యూడీ తరువాతి కాలంలో గుర్తుతెచ్చుకొంది,”సంగీతదర్షకుడు హెరాల్డ్ తననెప్పుడూ చిన్నపిల్లనని తక్కువ చేసి చూడలేదని, సమవయస్కురాలిలా గౌరవించాడనీ. స్వేచ్ఛనిచ్చాడనీ. “బహుశా  సంగీతదర్షకుడు హెరాల్డ్ ప్రకటించిన ఆ నమ్మకమే, జ్యూడీ గళాన్ని స్వేచ్ఛాభరితంగా వినిపించగలింది.   

     ఈ సినిమా  జ్యూడీ కి ఒక  పక్కింటి చిన్నపిల్ల రూపాన్ని ఇచ్చింది. అలా ఇచ్చి ఊరుకోలేదని, అలాగే ఉండాలన్న నిర్భంధం చాలాకాలం పాటు కొనసాగిందని ఒక బలమైన ఆరోపణ.ఆమె బరువును తగ్గించుకోవాలన్న వత్తిడి.కఠోర భోజన నియమాలతో పాటు,నాడీవ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపే పెరుగుదల నియంత్రణా ప్రేరకాలు, నిద్రమాత్రలు, ఆంఫిటమిన్లు, బార్బిటురేట్లు, పొగాకు, మద్యం  అలవాటు చేశారని ఆరోపణ. ఆమె సహాధ్యాయి లానాటర్నర్, “తదుపరి జీవితంలో  జ్యూడీ స్వయంకృతాన్ని కూడా తోసిరాజనలేం”అన్నది.                                                  

         జ్యూడీ గార్లండ్            

ఆస్కార్ అకాడెమీ జువెనైల్ అవార్డ్  అందుకొన్న మొదటి బాలతార జ్యూడీ గార్లాండ్.అయితే, చాలాకాలం పాటు ఆ పక్కింటి చిన్నపిల్లరూపాన్ని కాపాడవలసిరావడం ఒక పక్క వత్తిడిగా ఉండగా, తన తోటి సహాధ్యాయులయిన ఎలిజెబెత్ టేలర్, లానా టర్నర్, అవా గార్డనర్, గ్రేటా గార్బొ వంటి వారు తమ సౌందర్యంతో అపురూపమైన తారా ప్రశస్తిని పొందారు. జ్యూడీ నాలుగడుగుల పదకొండు అంగుళాలకు మించి ఎదగకపోవడంతో, తనను తాను ఒక అనాకారిగా భావించుకొనేది. తన రూపలావణ్యాల పట్ల, నటనానైపుణ్యాల పట్ల తానే సందేహపడుతూ ఉండేది. ఆమె సౌందర్యంపట్లా, నటనపట్లా ఆమె సన్నిహితులు ఎప్పుడూ ఆమెకు నమ్మకం కల్పిస్తూ ఉండాల్సి వచ్చేది.

        డొరోతీయే జ్యూడీ అన్నంతగా చిన్న వయస్సులో తారాపథానకి ఎదిగిన జ్యోడీ, ఆ మిరుమిట్లకు బాగా ప్రభావితురాలయ్యింది. వత్తిడి ,అందోళలనకు తరుచూ ఆల్కాహాల్ ను, నిద్రమాత్రలను ఆశ్రయించేది. చివరికి ఆ బార్బిటురేట్ మాత్రలను  మితిమీరి తీసుకోవడం వలననే,తన 47 వ యేట 1969లో ఊపిరి వదిలింది. వాడ్ విల్ కళాకారిణిగా, గాయని గా,నటిగా,డ్యాన్సర్ గా టివి ఆర్టిస్ట్ గా జ్యూడీ వేసిన ముద్ర అసామాన్యమైనది.గత శతాబ్దపు అత్యుత్తమ ప్రభావవంతమైన 10 మంది నటీమణులలో ఒకరిగా పరిగణించ బడుతోంది. 

            జ్యూడీ ప్రభావం ఆమె ప్రతిభ వలననే కాదు. ఆమె స్పృశించిన అనేక జీవితాలవలన కూడా.ముఖ్యంగా, జ్యూడీ, ఆమె ఇంద్రధనుస్సు పాట చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు.జ్యూడీ నే మొదటి ప్రభావితురాలు.”ఆ ఇంద్రధనుస్సు భావనను మించి జీవించాలని ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.కానీ, ఇంద్రధనుస్సు నా జీవితంలో ఒక భాగమయిపోయింది” అని అంటుంది జ్యూడీ. 

       అయిదు వివాహాలు, విఫలాలు,వాటి చుట్టుముట్టిన విషాదం. పిల్లలు ,వారితో ఆమె అనుబంధం, ఒక పక్క అఖండ పేరుప్రతిష్టలు, మరోపక్క వరుస దాంపత్య వైఫల్యాల మధ్యన పిల్లల బాగోగులు చూడడం, తనలోతన పట్ల మితిమీరిన అపనమ్మకం, మత్తుమందు ప్రభావాలు, వీటన్నిటీ మధ్యన ఒక ఆశావాహ జీవితాన్ని కొనసాగించడానికి, తన పాటే తనకు తోడయ్యింది.  

       బహుశా అందరికన్నా ముందుగా ఆమెకే ఆమె పాట ఆసరా కావాల్సివచ్చింది. 1963 లో కార్నెగీహాల్ లో పాట పాడుతూ పాడుతూ కంటతడి పెట్టడం, ‘జ్యూడీ కూడా మన లాంటిదే. మనం ఎదుర్కొంటోన్న లాంటి కష్టాలకు ఆమె అతీతురాలు కాదు’ అన్న భావన కలుగుతుంది ఎవరికైనా.

జ్యూడీ నటనాజీవిత పతాకదశలో ఎదుర్కొన్న వ్యక్తిగత జీవితంలోని వత్తిళ్ళు,  ఆమెను ఎందరికో సన్నిహితురాలిని చేసాయి.

ముఖ్యంగా, ఆనాటి అమెరికా స్వలింగసంపర్కులు జ్యూడీ కష్టాల్లో తమను తాము చూసుకొన్నారు. జ్యూడీ వారికి ఒక ప్రతీక అయ్యింది. ఇంద్రధనుస్సు పాట వారికి మార్గదర్శి అయ్యింది.వారి  ఉద్యమగీతం అయ్యింది. ఇంద్రధనుస్సు వారి పతాకం అయ్యింది.

                                               LGBT స్వలింగసంపర్కీయుల ఇంద్రధనుస్సు ఉద్యమ పతాకంతో డొరొతీగా జ్యూడీగార్లండ్

     ‘ ది విజార్డ్ ఆఫ్ ఆజ్’ లోని పిరికిసింహం లో  స్వలింగసంపర్కీయులు తమను తాము గుర్తించారు. ఆనాటి అమెరికన్ సమాజం లో  వారి పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకభావన ను ఎదురొడ్డి, సంఘటితం అయ్యే క్రమంలో ఉన్న కాలం అది. బహిరంగంగా తమ హక్కులకోసం మాట్లాడే ధైర్యాన్ని కూడగట్టుకొంటొన్న సంధర్భం అది. 

       పిరికి సింహం భయాలు, అభద్రత, సంకోచాలు, తెర పైన హావభావాలు,ముస్తాబు,చేష్టలతో,  తెర పైన వారి ప్రతినిధిలా కనబడింది. డొరోతీ ఎటూవంటి సంకోచం లేకుండా, పిరికి సింహంతో స్నేహం చేయడం, సింహానికి  ఆజ్ మాంత్రికుడు ధైర్యం చెప్పే మాటలు,ఇవన్నీ వారికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. డొరోతీనే జ్యూడీ ,జ్యూడీనే డొరోతీ వారికి. అలా జ్యూడి వారికి సహజంగానే శ్రేయోభిలాషి అయ్యింది.ఆమె పాట వారికి ఉద్యమ ఉత్తేజం అయ్యింది.

    జ్యూడీ తన తండ్రి గే మనస్తత్వాన్ని గమనించింది.అతనిని అంగీకరించలేని ఆనాటి సమాజం లో, జ్యూడీ కుటుంబం  సాధారణ సామాజిక జీవితం గడపడానికి అనేక కష్టాలను అనుభవించింది. పుట్టిన వూరిని, నిర్మించుకొన్న థియేటర్ ను, వ్యాపారవ్యవహారాలను వదిలి, దూరంగా వలస వెళ్ళాల్సి వచ్చింది.

 జ్యూడీ తల్లి తమను పెంచడానికి పడిన ఇబ్బందులు, జ్యూడీకి తెలుసు.చిన్నతనాన తమ కుటుంబాన్ని తన సంపాదనపై పోషించాల్సిన పరిస్థితులు తెలుసు. 

      జ్యూడీ భర్తలలో ఇద్దరిలో, వివాహనంతరం ‘గే’ మనస్తత్వాన్ని గ్రహించడం,ఆ తరువాత వివాహబంధం నుంచి విడిపోవడం,ఆ విషాదం అంతా ఆమెకు అనుభవం ఉన్నది.  జూడీ రెండవభర్త ,విన్సెంట్ మిన్నెలీ, ప్రసిద్ధ దర్షకుడు, ‘గే’ అని తెలిసినప్పుడు , జ్యూడీ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.ఇద్దరూ విడిపోయారు.వారిరువురి కుమార్తె, లిజామిన్నెలి కూడా తల్లి లాగానే  నటి గా ఎమ్మీ ,టోనీ, గామీ, ఆస్కార్ పురస్కారాలు అందుకొంది. విషాదం ఏమిటంటే, జూడీ నాల్గవ భర్త, మార్క్ హెరాన్, లిజా భర్త, పీటర్ ఆలెన్,ల మధ్య శారీరక సంబంధం ఏర్పడడం.

         అటు కళాకౌశలంలో,తారాపథంలో, గౌరవపురస్కారాల్లో తల్లి ని అనుసరించిన లిజా మిన్నెలి , ఇటు జీవితంలొనూ తల్లి లాగానే జీవించవలసి వచ్చింది.తన తల్లి జీవితచరిత్రను వ్రాసేటప్పుడు లిజా ఒక ముఖ్యమైన విషయాన్ని రాసింది. అది జూడీ అన్నమాట,”ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ విషాదాలు ఉంటాయి.నన్ను ఒక విషాద ప్రతీక గా గుర్తించడం నాకు  ఏ మాత్రం ఇష్టం లేదు.”

         ఇంతటి విఘాతాల అనంతరం  కూడా, జూడీ, ఆనాటి సమాజం ఏ మాత్రం సహించజాలని స్వలింగసప్కర సమాజాన్ని పట్ల ద్వేషం పెంచుకొకుండా, సహానుభూతి ప్రకటించడం విశేషం. వారి ఉనికిని గుర్తించి, వారి ఉద్యమానికి  ఊతంకావడాన్ని గమనించాలి. విషాదాల నుంచి, విఘాతాల నుంచి మానవీయ ఆర్ద్రతతో, సహృదయతతో జూడీ ఎదిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

      ‘గే’  భావాలను అర్థం చేసుకొంది. వారిపట్ల తన సహానుభూతిని ప్రకటించింది. ‘గే  ఐకాన్’ గా తనను పరిగణించడాన్ని,ఆనాటి సంకుచిత సమాజం లోనే, ఒక గౌరవంగా భావించింది. బహిరంగంగా అంగీకరించింది. ఆనాటి సభ్య సమాజం దూరంగా పెట్టిన, వారి “గే క్లబ్”లలోకి వెళ్ళి, వారి నైతికబలం కోసం ప్రదర్షనలు ఇచ్చేది. వారి లైంగిక స్థితిని మానవవీయ కోణాన్ని అర్థం చేసుకొన్నవారిలో,  ఆమె తరంలో జ్యూడీ ముందుంటుంది. ఈ విషయంలో కూడా లిజా, తన తల్లిని అనుసరించింది.           

       ఆజ్ మహా మాంత్రికుడు  హృదయం కావాలన్న తగరం మనిషితో అన్నట్లుగానే, “నువ్వెంత ప్రేమించ గలవన్నది హృదయానికి కొలమానం కాదు. నిన్నెంతగా ప్రేమించారన్నదే హృదయానికి కొలమానం.”

       నిజమే, ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును.

        డొరోతీనీ,ఆమె పాటను  ప్రేమించినంత కాలం, జ్యూడీ పట్ల మన హృదయం స్పందించకుండా ఎలా ఉంటుంది?

*           ఇంతకీ ఈ పాట ఎవరిది?

           డోరొతీ గేల్ దా? జూడీ గార్లాండ్ దా? ఫ్రాంక్ బాం దా? హెరాల్డ్  ఆర్లాన్ దా? యిప్ హార్బర్గ్ దా? 

            నిరుద్యోగులుదా? నిర్భాగ్యులదా? దుఃఖితులదా? బాధితులదా? వంఛితులదా ? యూదులదా? స్వలింగ సంపర్కీయులదా?

            అభూతకల్పనలో పుట్టిన ఈ పాట, ఒక చిన్నపిల్ల పాడిన ఈ పాట ,తరతరాలుగా  శ్రోతల హృదయాలను స్పృశించగలిగిందంటే,   అంతరాంతరాలను కదిలించి, సహస్రాబ్ది శతాబ్దపు ఉత్తమ గీతంగా ఎంపిక అయ్యిందీ అంటే, 

    అందుకు మూలం ఆ పదాలలో ఒదిగిన ఆశావహ దృక్పథం.మానవ స్పృహ.మానవ స్పర్ష . 

    అవన్నీ తమ స్వంతం అనుకున్న వారందరివీ. ఈ ఇంద్ర ధనుస్సు, ఈ చిన్ని నీలిపిట్ట,ఈ  కాలాలకు,ఖండాలకు అతీతమైన పాట !               

డొరోతి : (దిగులుగా చావిడి దగ్గర గడ్డివాము పక్కన నిల్చుని, టోటోతో మాట్లాడుతూ…)

 “కష్టాలు ఎదురవ్వని ప్రదేశమా? టోటో, ఎక్కడైనా అలాంటి ప్రదేశం ఉంటుందంటావా? ఉండే ఉంటుంది. అక్కడికి పడవలోనో రైలులోనో వెళ్ళలేము. అది చాలా చాలా దూరంగా ఉంటుంది. జాబిల్లి కన్నా దూరంగా. వర్షం కన్నా  దూరంగా…”

పాట:      ఎక్కడో ఇంద్రధనుస్సుకు ఆవలగా, 

               దూరాన, పైన  ఏదో ఒక చోట ,

               చిన్నప్పటి నా జోలపాటలో విన్న 

               అద్బుత లోకం ఒకటి ఉంది.

                   ఎక్కడో ఇంద్రధనుస్సుకు ఆవలగా, 

                   నీలాల నింగి వంపుల్లో, 

                    నిజంగానే నిజమవుతాయి,

                    ధైర్యంగా నీవు కనే కలలన్నీ!

                    ఏదో ఒక రోజు, 

                    రాలిపడే ఆ చుక్కలను కోరుతాను.

                    నిద్ర లేచేసరికి కారుమబ్బులన్నీ

                    నా వెనగ్గా తేలిపోతాయి.

                   కష్టాలన్నీ నిమ్మచినుకుల్లా

                   కరిగిపోతాయి,

                   దూరాన పొగగొట్టాల మీదుగా.

                   సరిగ్గా అక్కడే, 

                   నీకు నేను కనబడతాను.

                   ఎక్కడో ఇంద్రధనుస్సుకు ఆవలగా,

                   నీలి పిట్టలు ఎగురుతున్నాయి.

                   నీలిపిట్టలు ఇంద్రధనుస్సు 

                   పైకెగిరి, సాగి పోతున్నాయి.

                   మరి, నేనెందుకని ఎగరలేను?

                   కువకువలాడే చిన్నినీలిపిట్టలు

                  ఇంద్రధనుస్సు పైకెగిరి పోతున్నాయి.

                   మరి, ఎందుకని?  ఓ! నేనెందుకని ఎగరలేను?   

*

యిప్ హార్బగ్ వ్రాసిన పరిచయ వాక్యాలతో…

 ( ఈ లోకమంతా గజిబిజి గందరగోళమైనపుడు

  వానచినుకులు చుట్టూ దొర్లిపడుతున్నప్పుడు

 స్వర్గం ఓ ఇంద్రజాల రేఖను తెరుస్తుంది.

  ఆకాశమార్గమంతా కారుమేఘాలు కమ్ముకొన్నప్పుడు

  అక్కడొక ఇంద్రధనుస్సు రహదారి కనబడుతుంది.

 

 మన కిటీకీ అంచుల్లో మొదలయ్యి

  సూరీడి వెనక వైపు దాకా

 వానకు ఒక అడుగు అవతలగా )

ఎక్కడో ఇంద్రధనుస్సుకు ఆవలగా, 

దూరాన, పైన  ఏదో ఒక చోట ,

చిన్నప్పటి నా జోలపాటలో విన్న 

అద్బుత లోకం ఒకటి ఉంది.

ఎక్కడో ఇంద్రధనుస్సుకు ఆవలగా, 

నీలాల నింగి వంపుల్లో, 

నిజంగానే నిజమవుతాయి,

ధైర్యంగా నీవు కనే కలలన్నీ!

ఏదో ఒక రోజు, 

రాలిపడే ఆ చుక్కలను కోరుతాను.

నిద్ర లేచేసరికి కారుమబ్బులన్నీ

నా వెనగ్గా తేలిపోతాయి./విచ్చిపోతాయి.

కష్టాలన్నీ నిమ్మచినుకుల్లా

కరిగిపోతాయి,

దూరాన పొగగొట్టాల మీదుగా.

సరిగ్గా అక్కడే, 

నీకు నేను కనబడతాను.

ఎక్కడో ఇంద్రధనుస్సుకు ఆవలగా,

నీలి పిట్టలు ఎగురుతున్నాయి.

నీలిపిట్టలు ఇంద్రధనుస్సు 

పైకెగిరి సాగి పోతున్నాయి.

మరి, నేనెందుకని ఎగరలేను?

కువకువలాడే చిన్నినీలిపిట్టలు

ఇంద్రధనుస్సు పైకెగిరి పోతున్నాయి.

మరి, ఎందుకని?  ఓ! నేనెందుకని ఎగరలేను?   

సహస్రాబ్ది శతాబ్ది పాట ఒక సమిష్టి ఆశాగానం!    

References : 

1.జ్యూడీ గార్లండ్, ది విజార్డ్ ఆఫ్ ది ఆజ్  (1939)

                          https://www.youtube.com/watch?v=oW2QZ7KuaxA

  1. జ్యూడీ గార్లండ్, కార్నెగీ హాల్,1963

                          https://www.youtube.com/watch?v=ss49euDqwHA

  1. యిప్ హార్బర్గ్ , 1979

           https://www.youtube.com/watch?v=eNiXnzh3abk

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.