ఊరి గేపకం (పాట)

డా||కె.గీత

రేతిరంతా  కునుకుసాటున

నక్కినక్కి మనసు దాపున

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది 

 

సెరువు బురద సెమ్మ దారుల

కలవ తూడు సప్పదనము

గట్టు ఎంట కొబ్బరాకు

గాలిరాలిన పూల రుసి

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

కందిసేల పచ్చకణుపుల

పాలుగారె గింజలేవో

మొక్కజొన్న పొత్తుగిల్లి

దొంగసాటున బుక్కినట్టు

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

 

కన్ను తెరవని పసిరి కాయ

పుల్లసిప్పల నారింజ

జివ్వ సాటున గువ్వ పిట్టై

పొడిసి పొడిసి సంపుతాది

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

ముల్ల తుప్పల రేగి పండు

రాలిపడ్డ పిందె మావిడి

జేబు దాసిన ఉప్పు కారం 

సేతి పొంటి యేలు సీకిన

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

తెల్లవారి శివుని వాకిట 

దండగట్టే సుక్కలోలె 

పారిజాతం పూలతేరు

గప్పునెక్కడ ముక్కు దాకిన 

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

అరటిసెట్టు దువ్వమీన

పేర్లుసెక్కి కంట నీరై

సెంపసివర ఎర్రబడ్డ

సెరిగిపోని ముద్దు మరకై

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

సెరుకు తోట పేమ జంట

ఓడిపోయి సెదిరిపోతే

సెరుకు గెడన పాలవెన్ను

సురుకుసురుకున సలిపినట్టై

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

*****

 

 ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *