విషాద నిషాదము

చతుర్థ భాగము – స్వరాంతరము

-జోగారావు

భర్త రవిశంకర్ నుండి సంబంధాలను తెగతెంపులు చేసుకున్న అన్నపూర్ణాదేవి 1967 వ సంవత్సరములో దక్షిణ ముంబయ్ వార్డెన్ రోడ్ లో ఉన్న ఆకాశ గంగా ఎపార్ట్ మెంట్ ఆకాశ హర్మ్యములోని ఆరవ అంతస్తులో ఉన్న ఎపార్ట్ మెంట్ కు తన పాతికేళ్ళ కుమారుడు శుభేంద్ర తో మారేరు.

ఆ రోజు నుండే అన్నపూర్ణాదేవి బయట ప్రపంచం తో సంబంధాలు విఛ్ఛేదము చేసుకున్నారు.

ఇప్పుడు ఆవిడ ప్రపంచం కేవలము సంగీతము కొడుకు శుభో లకు పరిమితమయిపోయింది.

ప్రతిరోజూ ఆవిడ తన ప్లేట్ బాల్కనీ లో గింజలు జల్లుతూ, గింజలను తినడానికి వచ్చిన వందల పావురాల రెక్కల చప్పుడు వినిపిస్తున్న సంగీతాన్ని ఆస్వాదించడము అలవాటు చేసుకున్నారు.

తన దగ్గకు సంగీతము నేర్కుకోవాలని వచ్చిన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి వారు.

ఆ పరీక్షలలో తనకు సంతృప్తికరముగా నెగ్గిన వారినే శిష్యులుగా స్వీకరించేవారు.

తనకు సంగీత విద్య ప్రసాదించిన గురు దేవులైన తండ్రి కి ఇచ్చిన మాట ప్రకారము సంగీతము నేర్పడానికి ఆవిడ శిష్యుల నుండి ధనము తీసుకునేవారు కాదు. ఆవిడ సంగీత పాఠాలను అర్ధరాత్రి నుండి సూర్యోదయము వరకూ చెప్పేవారు.

ఆవిడ బయటి వ్యక్తులతో పని లేకుండా, పని మనిషిని గానీ సేవకులను గానీ పెట్టుకోకుండా ఇంటి పని వంటపని అన్నీ స్వయముగానే చేసుకునేవారు.

ఉదయము ఆరు గంటలకు గుమ్మము ముందు ఉంచిన పాల పేకెట్లు తీసుకోవడానికి మాత్రమే ఆ ఇంటి తలుపులు తెరుచుకునేవి.

ఆ ఇంటిలో మనుషులున్న సందడి కేవలము రాత్రి పూట ఆ ఇంటి నుండి వచ్చే సంగీత నాదాలను బట్టి తెలిసేది.

ఆవిడ ఆ ఇంటికి వచ్చిన కొత్తలో ఒక కుక్కపిల్లను పెంచుకుని దానికి మున్నా అని పేరు పెట్టుకున్నారు.

ఆవిడ టెలిఫోన్ లో కూడా మాటాడే వారు కాదు. ఏ పత్రికకూ ఇంటర్వ్యూ లు ఇచ్చేవారు కాదు. తన ఫోటోలు తీసుకొనడానికి కూడా ఎవరినీ అనుమతించేవారు కాదు. తన వద్దకు వచ్చిన శిష్యులతో ప్రతి రాత్రి అయిదు ఆరు గంటల సాధన చేయించేవారు. ఆవిడ సంగీతము బోధించేటప్లుడు శిష్యుల పట్ల కఱకు గా, కఠినంగా, వ్యవహరించేవారు. సంగీత సాధన ముగిసిన వెంటనే , సామాన్య గృహిణి వలె శిష్యులకు తేనీరు ఇచ్చేవారు.

తప్పనిసరి పరిస్థితులలో, నేత్ర పరీక్షలకు, దంత పరీక్షలకు, ఆవిడ ఇంటి నుండి బయటకు వచ్చేవారు. ఆవిడ బయటకు వచ్చినా, ఎవరికీ తెలిసేది కాదు.

ఈ విధముగా తన జీవన శైలితో, అన్నపూర్ణాదేవి 1967 నుండి 13 అక్టోబర్ 2018 వరకు 51 సంవత్సరాలు గడిపేరని అంటే నమ్మశక్యము కాదు కదా !

అన్నపూర్ణాదేవి జీవితంలో మరువలేని సంఘటన 1970 లో జరిగింది.

ప్రతిరోజూ ఆరు గంటల సంగీత సాధన చేయలేక శుభేంద్ర ఒక రోజు తల్లి నుండి బయటపడాలని అనుకున్నారు. ఆ సమయములో, ముంబయ్ వచ్చిన తన తండ్రి రవిశంకర్ కు ఫోన్ చేసి తనకు తీసుకుని వెళ్ళమని అడిగేరు.

శుభో కోరిక మేరకు రవిశంకర్ అతనిని తనతో తీసుకుని వెళ్ళడానికి వచ్చేరు.

దిగ్భ్రాంతి చెందిన అన్నపూర్ణాదేవి శుభో ను మరో రెండేళ్ళు తన వద్ద ఉంచితే అతని సంగీత విద్య పూర్తి అయి ప్రథమ శ్రేణి సితార్ కళాకారుడిగా, తన తండ్రికి సమ ఉజ్జీగా ఎంతో పేరు తెచ్చుకుని తల్లి దండ్రుల పేరు నిలబెడతాడని ప్రాధేపడ్డారు. కన్నీట పర్యంతమయి వేడుకున్నారు. రవిశంకర్ ఆవిడ ప్రార్థనలను పెడ చెవిని పెట్టి శుభో తో గడప దాటుతూంటే, ఆవిడ లో మాతృత్వము, మాతృత్వమును మించి శిష్యానురాగము పెల్లుబికేయి. అన్నపూర్ణాదేవి ఆగ్రహంతో “ నా జీవితాన్ని నాశనము చేసింది చాలక ఇప్పుడు శుభో జీవితాన్ని కూడా నాశనము చేస్తారా ? అని గద్దించినా ప్రయోజనము లేక పోయింది.

తనతో జీవితాంతము ఉంటానని రక్షణ కల్పిస్తానని వైదిక మంత్రముల మధ్య బాస చేసిన పెనిమిటి, చేదోడు వాదోడుగా ఉంటాడని భావించిన కన్న కొడుకు దూరమయిపోతుంటే, ఆ మూగ జీవి ఎంత రోదించిందో ?

జీవితములోనూ, ఇంటి లోనూ ఒంటరిదానిని చేసి శాశ్వతముగా దూరమయిపోతున్న భర్తను బిడ్డను చూస్తూ ఒంటరిగా మిగిలిపోయిన ఆవిడని చూస్తూ ఆ ఇంటి గోడలు విలపించే ఉంటాయి.

ఇక ఆ శోకతప్త జీవికి మిగిలిందేముంది సంగీతము తప్ప.

ఆకాశగంగ లో ఏకాంతరంగ గా మిగిలిపోయిన అన్నపూర్ణాదేవి తన జీవత శేషమును సంగీతమునకే అంకితమని భావించేరు.

ఒంటరితనము , ఏకాకి జీవితము అన్నపూర్ణాదేవిని కృంగదీయడానికి

ప్రయత్నించినా ఆత్మ స్థైర్యముతో సంగీత సాధననే ఆలంబనగా చేసుకుని

శిష్యులకు సంగీతము నేర్ప సాగేరు.

రెండేళ్ళు గడిచేయి.

తన గురువు తండ్రి అయిన ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ 06 సెప్టెంబర్ 1972 న మరణించిన వార్త తెలిసింది.

ఇక పుట్టిల్లు మైహర్ తో ఋణము తీరిపోయిందని భావించేరు.

అయినా, ఆవిడ మైహర్ శారదాంబ ఆశీర్వాదముతో ఆకాశగంగలో శిష్యులను సంగీత స్నానము చేయిస్తూ వారిని నిష్ణాతులను చేయిస్తున్నారు.



*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.