ఒక భార్గవి – కొన్ని రాగాలు -2

నీలాంబరి-ఒక రాగం

-భార్గవి

 
ఈ పేరే నాకు ఒక నీలి ఊహను కలిపిస్తుంది.ఇది ఒక రాగం పేరుగా ఉండడం మరీ ఊరిస్తుంది,అది ఒక సాంత్వననీ ,సుషుప్తినీ కలిగిస్తుందంటే మరీ విశేషంగా తోస్తుంది.
 
అనాదిగా భూమికి పైకప్పుగా భాసిల్లుతున్న ఆకాశం రంగు నీలం,అందుకే గాబోలు “నీలవర్ణం శెలవంటే ఆకసమే గాలికదా “అన్నాడొక కవి.
 
లీలా మానుష అవతారాలయిన రాముడూ,కృష్ణుడూ ఇద్దరూ నీల వర్ణులుగానే వర్ణింపబడ్డారు.
ఈ కల్పనామయ లోకాన్ని వీక్షించే కంటి పాపలు నీలం
సృష్టి కార్యానికి ప్రేరేపించే మన్మథుడి అయిదు బాణాలలో ఒకదాని పేరు నీలోత్పలం అంటే నీలికలువ.
 నీలంరంగు ఒకరకమయిన శాంతినీ,సాంత్వననూ కలిగించినట్టే ,నీలాంబరి రాగంలో కీర్తనలూ పాటలూ కూడా చాలావరకూ లాలి పాటలు గానూ,జోల పాటలు గానూ వున్నాయి.
 
నీలాంబరి 29వ మేళకర్త అయిన ధీరశంకరాభరణ రాగం నుండీ జన్య రాగం,వక్ర రాగం
 
వివిధ వాగ్గేయకారులు ఈ రాగంలో చేసిన కృతులు పరిశీలిస్తే—–
 
త్యాగరాజ స్వామి చేసిన వాటిలో మూడిటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 
 
ఉయ్యాలలూగవయ్యా శ్రీరామా—సుధా రఘునాథన్ చాలా చక్కగా పాడారు.
 
ఎన్నగా మనసుకు రాని పన్నాగ శాయి—-ఈ కీర్తన ఎంతో మంది పాడారు కానీ నాకు “త్యాగయ్య” సినిమాలో నాగయ్య గారు,జయమ్మ తో కలిసి పాడినది వింటుంటే జీడిపప్పు పలుకులతో నిండిన క్షీరాన్నం లాగా వుంటుందెందుకో,ముఖ్యంగా జయమ్మ గారి మెత్తని గొంతు ,నీలాంబరికి మరింత మెత్తదనాన్ని చేకూర్చింది.
 
లాలియూగవే —-ఇది  రాధా జయలక్ష్మి గార్ల గాత్రంలో చక్కగా పల్లవించింది,స్వరాలను అలవోకగా  పలికించారు వారు 
 
“అంబ నీలాయతాక్షి “–అనే ముత్తు స్వామి దీక్షితర్ కీర్తన వున్నది కూడా నీలాంబరి లోనే
 
అన్నమయ్య పదాలలో —“తొల్లియును మర్రాకు తొట్టెలనే ఊగె “అనే పదాన్ని యం.యస్ .సుబ్బలక్ష్మి  ఎంత మధురంగా పాడారో ,”చిరు పాల శెలవి” తో అన్న చోట “శెలవి” అనే మాట పలికిన తీరుకి ప్రాణం కడట్టుతుంది,ఆ అమృతాన్ని గ్రోలటానికి చెవులెంత పుణ్యం చేసుకున్నాయో అనిపిస్తుంది.
 
“మాధవ మామవ దేవ”–అనే నారాయణ తీర్థ తరంగాన్ని నీలాంబరిలో మల్లాది బ్రదర్స్ ఆవిష్కరించిన తీరు అనన్య సామాన్యం,వారి గొంతులో నేదునూరీ,ఓలేటి కొలువై వున్నారు మరి!
“శృంగార లహరి శ్రిత జన శుభకరి” అనే మహా సుఖ మైన కృతి (మైసూరు లింగరాజ్ అర్సు) పంతుల రమ గారు చాలా అద్భుతంగా ఆలపించారు ,చివరలో స్వరాల జలపాతం కురిపించారు —దీనిని చాలామంది నర్తకీ మణులు నాట్యాంశం గా ప్రదర్శిస్తారు.
 
ఇక ఇది సినిమా పాటలలో అరుదుగా వినిపించే రాగం
 
ఎ.ఆర్ రహమాన్ –ప్రేమికుడు సినిమాలో ,ఉన్నికృష్ణన్ గొంతులో వినిపించిన “ఓ చెలియా నాప్రియ సఖియా చేజారెను నా మనసే ” ఎంత మందిని ఉర్రూత లూగించిందో తెలుసుగా ,ఆ పాటకు “నీలాంబరి “రాగమే ఆధారం.
 
 కానీ “ముద్దుబిడ్ద “సినిమాలో ఆరుద్ర-పెండ్యాల-కె.బి.తిలక్ కాంబి నేషన్లో వచ్చినది “ఎవరుకన్నా రెవరు పెంచారు “వింటుంటే ఆహా సినిమా పాటని “నీలాంబరి”లో ఎంత చక్కగా మలిచారు అనిపించక మానదు.ఈ త్రయం ఇలాంటి ఆణి ముత్యాలను ఎన్నింటినో అందించారు ఉదా—-ఉయ్యాల-జంపాల,ఈడూ-జోడు,ఎం.ఎల్ .ఎ ఇత్యాది సినిమాలలో పాటలు.
 
ఆరుద్ర రాసిన ఈ సినిమా పాట విన్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు “ఏం ఇప్పుడు సినిమా పాట సాహిత్యానికేం తక్కువయింది?” అన్నారట.
పాటను చక్కగా పాడినది పి.లీలఅయితే అంత చక్కగానూ అభినయించింది జమున,జమున పక్కన తోడుకోడలుగా  నటించింది లక్ష్మీ రాజ్యం.
అంత గొప్ప సాహిత్యం ఒక సారి చూడండి
 
ఎవరు కన్నారెవరు పెంచారు
నవనీత చోరుని గోపాల బాలుని
ఎవరు కన్నారెవరు పెంచారు
 
నోము నోచీ,నెలలు మోసీ
నీలమేఘశ్యాము కన్నది దేవకీ
లాలపోసీ,పాలుపట్టీ జోలపాడే కలిమి కలిగె యశోదకీ”ఎవరు”
 
తడవతడవకు కడుపుశోకము
తాళజాలక పెంచనిచ్చెను దేవకీ
తాను కనకయె తల్లి అయ్యెను
తనయుడాయెను దేవుడే యశోదకీ “ఎవరు”
 
ఎవరు కన్నా ఎవరు పెంచిన
చివరికతడానంద మిచ్చిన దెవరికీ
అవనిలో తనపైన ఎన్నో
ఆశలుంచిన వారికీ,తననాశ్రయించిన వారికీ “ఎవరు “

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.