కాలం మారిపోయింది బాబోయ్!

-వసంతలక్ష్మి అయ్యగారి


ఈమధ్య సహోద్యోగులూ,స్నేహితులపిల్లల పెళ్లిసంబంధాలు,తత్సంబంధితమైన సమాచారం, మాటైము తో పొంతన లేని వింతపోకడలు గమనిస్తుంటే  గమ్మత్తనిపించినా విస్తుపోకతప్పడంలేదు.

మగపిల్లల తల్లిదండ్రులు మరీ అవస్థపడుతున్నారనిపిస్తోంది!
ఒకమాటైతే నిజం. పిల్లలెవరైనా,25-28సం.ల వయసులో ప్రేమించి పెళ్లిళ్లు సాఫీగా జరిగిపోయి సంసారసాగరపుయీతలో పడిపోతే గొడవేలేదు తల్లిదండ్రులకు!
ఇపుడన్నీచిన్న సైజుకుటుంబాలే…పైపెచ్చు పెళ్లౌతూనే వేరు కాపురాలేకనుక ..సమస్యలతీరు మారుండచ్చు..కానీ తీవ్రత తగ్గినట్టేననిపిస్తోంది!

ఈకాలపు పెళ్లిసంబంధాలూ, arranged marriages చిట్టా తీస్తే మాత్రం,
కుర్రకారు ఎదుర్కొంటున్న పరిస్థితి దుర్భరంగా ఉంటోందనిపిస్తోంది.మాట్రిమొనీ,వెబ్ రెజిస్ట్రేషనుకాకుండా కులాలవారీ పరిచయవేదికలూ..వింటున్నాం.
సంబంధాలు చూడండి,చెప్పండీ అంటూ స్నేహితులడిగితే…కాగితాలు,పెన్నులు వెతుక్కోకుండా..వధూవరుల రిజిస్ట్రేషన్ నంబరోటిచ్చేస్తున్నారు.అది సైట్ లో నొక్కితే, కథ,కమామీషు వారే చూసుకుంటారట!మధ్యవర్తులకు పనితప్పింది!ఎన్ని వివాహవెబ్బులెన్నున్నా…మనీ,మాట్రిమనీలన్నీ ఉన్నా…మబ్బులిలా కమ్ముకొస్తుంటే…ఆ ఘడియ ఆసన్నం కాకపోతే …పిల్లలూ,పెద్దలూ ప్రసన్నమయ్యేదలా చెప్పండి?

మొన్నామధ్య తెలిసిన వారి కుర్రాడు..(పెళ్లిచూపులంటూ ) చూస్తూ చూస్తూ ముప్ఫై దాటేసాయి..! ఆజానుబాహువుడు!
మంచి కుటుంబనేపథ్యం..పెళ్లై విదేశాలలో బాగాసెటిలైన ఓఅక్కయ్య , యమ్.బీయే చదివి మంచి ఉద్యోగం చేస్తోంది. ఆస్తులున్న తల్లిదండ్రులు, సంప్రదాయకుటుంబం, దుష్టాలవాట్లు దరిచేరలేదు.

వీడి పెళ్లికి మూడేళ్లుగా పేరెంట్స్ పడుతున్న అవస్థ వర్ణనాతీతమే!
ముందుగా ప్రొఫైలు పరీక్షలూ, జాతకాలూ, పొట్టీ పొడవులూ, హైటూ వెయిటూ మ్యాచింగులయ్యాకా…చూపులుదాకా వస్తేమాత్రం పక్కకెళ్లి  ప్రైవసీ సిట్టింగులూ!
కుదిరితే, ఓ ఔటింగూ! ఆపై ఛాటింగూ! ఎక్కువైతే బుడుంగూ!!

తొలి సిట్టింగులో తొలి ప్రశ్న..ప్యాకేజీ..ఎంత K?అంటే సంవత్సరజీతంఎన్ని వేలని?నెలకి లక్షన్నర రానిదే నో..ట!
60-70 k నెలకితెచ్చినా చచ్చుగాడికిందే లెక్కట! “మీయింట్లో వెట్ ట్రాష్..డ్రై ట్రాష్ రెండూ ఉన్నాయా? “అనడిగిందట.
ఆహా..యీజీ ప్రశ్నేకదా  అనుకుంటూ అమాయకంగా..”ఓ..ఉన్నాయన్నాడట..”!
అంతే..సారీ పొమ్మందట.అంతే యిన్నసెంట్ గా..ఏంటిదానర్థమంటేనూ..అత్త వెట్,మామగారు డ్రై ట్రాష్ బిన్నులట!

అన్నట్టు.. వెయిట్ కీ వెయిటేజ్ ఉందట! ఎంత K అంటూ షార్టుకట్ లోనే చెప్పుకుంటారు.pay package 100 K దాటితే “యిన్నూ”, వెయిటు వంద దాటిందో..”ఔట్”!

ఇంకోడు గుడ్ లుకింగ్…కెనడాలో మాంచి జాబ్.వెరీగుడ్వర్కింగ్ ,స్టిల్ ఎర్నింగ్ ఫాదర్!ఆడపిల్లలంతా అమెరికాలో చదువుకుని జాబ్ చేస్తున్న సంబంధాలొస్తున్నాయట.కనీసంనాలుగైదుపోగయ్యాక ఏ డిశంబరు నాటికో పిల్లవాడొస్తానన్నా…ఆడపిల్లలు మాత్రం “అమ్మో అమెరికావదిలి చూపులూ… మ్యాచులూ అంటూ యిండియాకి వస్తే రిస్కులో పడిపోతాం” అంటున్నారట! ట్రంపు పుణ్యమా అని!!

ముందుగా ఫోటోలు, పంతులు, జాతకాలూ, పేరెంట్ల మాటామంతులూ అయ్యాక,
ఓమాదిరిగా ముందుకెడితే ఫేస్ బుక్ లు యిరువైపులవారూ తెరచి చూసుకుంటూ పోతారట. ఎక్కడ..ఏ ఫోటోలో పిల్ల లావుగా కనిపించినా, ఫోటోషాప్ చేసినట్టనిపించినా, మేకప్పు తొలగినా,జుట్టు చెదిరినా, తింగరిపిల్లలతో కలిసున్నా, పబ్బూ,గబ్బూ ఫోటోఖర్మకొద్దీ కనిపడినా,,,అబ్బాయి స్కైపులోకి రమ్మంటాడట.నివృత్తులయ్యాక, వృత్తి గురించిన ప్రసక్తి! అదంత ఆసక్తికరంగా లేకపోయినా,
ఈ భామలు…“ఒరేయ్!నచ్చావురా…కానీ యిక్కడికి నువ్వేవచ్చేయ్రా…నేజాబ్ వదలను..హాఁ.ఊఁ“.అంటూ ముద్దుముద్దుగా గారాలూ,బీరాలూ,పోయారో పేద్ద బ్రేకే!కెనడా అయితే రాననీ,గ్రీన్ కార్డుంటేనే అమెరికాజాబుగాడైనా ఓకే
అనీ అంటారట.

మరికొందరమ్మాయిలు, బాగాఉన్నవారైతే , తల్లిదండ్రులముందు ఊకొట్టి,సంబంధం ఓ కొలిక్కొచ్చి,కుర్రవాడు ఊహల్లో కొట్టుకునేదాకా వచ్చాకా…ఫోన్ చేసి “అమెరికాలో మాంఛి యూనివర్సిటీలో సీటొచ్చిందిబాబూ…మాయింట్లోయింకాచెప్పలేదు..నేచక్కాపోతున్నాను..
చదువయ్యాకా నేను అక్కడే జాబ్ చేస్తాను.యిపుడే పెళ్లేంటీ..సారీ..బైబై! “ అంటున్నారట!

మరో కేసు..అబ్బాయి వాళ్లు ఆచార్యులు.నిష్టాగరిష్ఠులు! అమ్మాయి కూడా ఆచార్యులే అవడంతో మ్యాచ్ ముందుకుసాగింది.మాటామంతీ కలిసాకా,సునాయాసంగా పిల్లకూసినకూతేంటో తెలుసా? “నేను అనాయాసంగా మాంసాహారం పట్టేస్తాను.స్నేహితులతో బాగా అలవాటైంది.యింట్లో తెలీదు.నువ్వు మాత్రం యింట్లోనే చేసికూడా పెట్టాలిసుమా..!”

మరోమంచి ముచ్చట..యీ తతంగం అంతా పూర్తయి..కెనడా నాఅని ముందు చిన్నచూపు చూసి,ఫరవాలేదులే అని దయతలచిన మరోఅమ్మాయి , రెండు ముహూర్తాలు పెట్టుకున్నాకా,రాత్రిది అయితేనే ఒప్పుకుంటానందట.అబ్బాయి అక్కగారు సింగపూరట. పగటిముహూర్తమైతేనే బాగుంటుందందట. పిల్ల అలిగిందట. తల్లులు నలిగారట. పెళ్లి పటాపంచలైందట!

ఇంకో పెళ్లికొడుకు అమెరికాలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు  పీజీ యిక్కడే పొడిచి..!వాడితల్లిదండ్రులు సదాచారం, సంప్రదాయం అంటూ ఏడాదికిన్ని చొప్పున సంబంధాలు పోగేసి పిల్లాణ్ని పిలిపిస్తే…”సారీ!రోజులు టఫ్గా మా రాయి హెచ్ వన్ గాళ్లకి. ఎలాగైనా అమెరికాలో గ్రీన్ కార్డున్న పిల్లని వీలైతే చూడండి,లేదా నేనేతెల్లదాన్నో చేసేసుకుంటానని అల్టిమేటమట!

అమ్మలూ,అయ్యలూ అన్నీ అమర్చాకా..పిల్లవాడు చూపులకొచ్చి కనబోయే పిల్లల నంబరు గురించి చర్చించి, “మనలైకులు కలవవులే..సారీ “ అంటున్నారట. మరికొందరు డైపర్ వీసా ల పేరెంట్ల డ్యూటీలగురించీ ముందుగానే మాటలట. నాజీతం మా పేరెంట్సుకిస్తానంతే, అంటున్న భామలూ ఎక్కవవౌతున్నారు!
గాల్ఫ్రెండ్సెంతమంది,బాయ్ఫ్రెండ్స్ మాటేమిటీ వరకే కాకుండా, డైటింగూ, డేటింగూ  ప్రశ్నలూ సైతం పచ్చిగా, నిక్కచ్చిగా పంచుకుంటున్నారు.ఇవన్నీ గాక “లోగుట్టు పెరుమాళ్ల కెరుక” కేసులెన్నో కదా!

దానాదీనా.. అమెరికా లో ఉద్యోగాలున్న కుర్రాళ్లకి పిల్లనివ్వడానికి, పిల్ల పేరెంట్లూ సుముఖంగా లేరనే మరోవిషయం తేటతెల్లమౌతోంది. ఇక్కడుంటున్న పిల్లలధ్యాసకూడా…ఆకుపచ్చకార్డుమీదేతప్ప, పచ్చని సంసారంగురించికాదని తెలుస్తోంది.

తాజాగా మరోటి ! ఇద్దరు పేరున్న డాక్టర్ల ముద్దుబిడ్డడు. తాంబూలలుచ్చుకుని మరో నెల్లాళ్లలో పెళ్లనగా డల్ అయిపోయాడు.
కథలోకెడితే….
పిల్ల, అబ్బాయి పాత ఫోటోలుచూసి..”హమ్మో బండగాడు..యిపుడు వీడు స్లిమ్ అయినా, రేపు పెళ్లయ్యాకా ఉబ్బుతాడనీ, అపుడు యీ పాపాయి వాడికి physical Instructor అవాలిగానీ పెళ్లాంకాదని నూరిపోసిందట వాళ్ల బామ్మలుంగారు . దెబ్బకి నో చెప్పేసిందట. “వాడులావుగా ఉన్నప్పటి ఫోటోలన్నీ, మాఅమ్మాయి పెళ్లి ఆల్బమ్స్ లోనూ చూశారుకదండీ” అంటే ….ఆబామ్మగారన్నమాటేమిటో తెలుసా? “మీ అమ్మాయి వంటిమీదున్న నగలు చూశామేగానీ..మీవాడిఒళ్లుచూడ లేదుగా ఆ ఆల్బమ్లో అన్నారుట.”
పైగా చాలా సింపుల్ గా “ ఆ పీటలమీదకళ్యాణాలే పెటాకులవుతుంటే..యిదెంతలెండీ ..” అందట ఆ మహాయిల్లాలు!

ఏమైనా సోషల్ మీడియా, స్మార్టుఫోనులు రాకమునుపే గంటలకొద్దీ ఫోనులో సుత్తులు కొట్టుకుని “స్వీట్ నథింగులు “కాకుండా “హాట్ సమ్థింగులతో “ చెడగొట్టుకున్న సంబంధాలెన్నో! పరమానందంగా మా కు “మెంటల్ కం పా టి బి లి టీ  “లేదని వద్దుకున్నామండీ! అని చిలుకల్లా పలుకుతున్నారు పిల్లకాయలు ప్రపంచజనాలతో!

యింక యిపుడు లేటెస్టు పాస్టైమ్ ,ఒళ్లోకి వచ్చి కూర్చున్న ఫేస్టైము తోనైతే, ర చ్చ  రచ్చే!
నీగది బాలేదూ..యింటీరియర్సు పూర్ …మూలగదిలో బామ్మచీరబాలేదు…వంకలూ పెడతారేమో! కాదేదీ కళ్యాణ గండానికనర్హం టైపులో వింటున్నా!!

                   
ఛాయిస్ యెక్కువైతే వచ్చే తిప్పలేనేమో ! యీ మధ్య యిలా అలా అన్వేషణ లోపడి, యింకామంచిదొస్తుందేమోనన్న పేరాశ లో పడి విదేశమనీ ఉద్యోగమనీ… హెచ్వన్ లో వస్తే యిరుక్కుపోతామనీ.. కారణమేదైనా … చూస్తూ చూస్తూ ముప్ఫయ్ ముచ్చటగా దాటుతున్నాయి.

ఆడపిల్లల తల్లులు ఫోన్లోనే మగపిల్లాడి తల్లి లేదా తండ్రితో డైరెక్టుగా ఆస్తిపాస్తులు…జీతం వంటివి అడిగి తమ పిల్లకన్నా తక్కువజీతగాళ్లను ముఖానే చెప్పి తిరస్కరిస్తున్నారట. కులం,మతం, సగోత్రం, ఉద్యోగం, సద్యోగం, సంగీతం, సాహిత్యం, వంటా,వార్పూ,ససంస్కారం,
సన్మార్గం, సౌశీల్యం, తరతరాలవంశచరిత్ర, అత్తమామలసాంగత్యం…యివన్నీ కనీసార్హతల సూచీ లోంచి తుడిపి పారేసినా..ఎన్నిరకాల తిప్పలో చూశారా?

కల్యాణ ఘడియలు యెందుకిలా జాప్యమవుతున్నాయో రానురానూ!
ఆయాగ్రహరాజులు యెందుకలుగుతున్నారో ?!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.