సాప్ట్ వేరు కరోనా వైరు (హాస్య కథ)

-టి.వి.ఎస్. రామానుజరావు

వాసుదేవ మూర్తి వస్తూనే, సోఫాలో కూర్చున్న భార్య వొడిలో దబ్బున తలపెట్టుకుని పడుకున్నాడు. 

“ఏమిటా పిచ్చి వేషాలూ? నలభై ఏళ్ళు వస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాడిలా ఏమిటలా  గారాలు పోతున్నారు? కాసేపట్లో స్కూలు నుంచి బాబు వస్తాడు. లేచి కూర్చోండి” లేచి చీర సర్దుకుంది శాంత.

“వాడు పుట్టి ఇక్కడ నా స్థానం ఆక్రమించేసాడు. అక్కడ ఆఫీసులో ఇంకెవడో నాస్థానం ఆక్యుపై చేస్త్హాడు” వాసుదేవ మూర్తి ఆమెను కౌగలించుకుని, ఒక్కసారిగా బోరుమన్నాడు.

 ఈ సారి శాంత కంగారు పడింది. “ఏమైందండీ?” అతని తలనిమురుతూ లాలనగా అడిగింది.

“నాకు పింకు స్లిప్పిచ్చారు” మళ్ళీ బావురుమన్నాడు.

“ఏమిటా డ్రింకు? ఎవరో బలవంతం చేశారని తాగొచ్చి, పాత పాటలు పాడటమో, లేక ఏడవటమో మీకలవాటేగా?” శాంత విసుక్కుంది. 

“పింకు స్లిప్పే! సిప్ కాదు” నుదుటిపై కొట్టుకున్నాడు.

“చించి వాడి చేతిలో పెట్టి రాకపోయారా? పింకు స్లిప్పు ఏమిటో? పచ్చ స్లిప్పు ఇవ్వొచ్చుగా? ప్రభుత్వం పచ్చదనం, పచ్చదనం అంటుంటే, తోచి చావదా మీ వాళ్ళకు? ఐనా ఎందుకలా స్లిప్పులు ఇచ్చుకుంటూ పోవడం? తాయత్తులో పెట్టి కట్టుకోమంటారా?” శాంత కడిగిపారేసింది. 

“నా ఉద్యోగం తీసేస్తారు”?కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. 

“పోతేపోయింది లెండి, మరొకటి చూసుకోవచ్చు. ఇంతమాత్రానికే ఏడవాలా? కంగారుపడి చచ్చాను, ఏమైందోనని” శాంత ఓదార్చింది.

“నీ ధైర్యం నాకుంటే ఎంతబాగుండు? నీకు విషయం అర్ధం కావట్లేదు. స్టాఫు ఎక్కువైనారని, ఎక్కువ జీతం ఇస్తున్న పెద్ద ఉద్యోగులను తీసేసి, కొత్త వారికి ఉద్యోగాలిస్తున్నారు. ఆ లిస్టులో నన్ను చేర్చారు” మళ్ళీ గొల్లుమన్నాడు.

“పోనిత్తురూ, వెధవ ఉద్యోగం! మరొకటి దొరక్కపోతుందా? ఇంతకీ, తీసేసేటప్పుడు ఎంత జీతం ఇస్తారు?”

“ఈ కంపెనీలో రెండు నెలల జీతం ఇస్తారనుకుంటాను” విసుక్కున్నాడు.   

“అబ్బ, ఆరు లక్షలు! ఇంచక్కా నేను నెక్లేసు, చంద్రహారం చేయించుకుంటానండి.”  

“ఇదొకటా? ఉద్యోగం పోతోందని నేనేడుస్తుంటే, చంద్రహారం చేయించుకోవచ్చని నువ్వు సంతోషిస్తున్నావా?” కోపంగా అరిచాడు.

“ఇష్, మెల్లగా మాట్లాడండి. ఇదేమీ మీకు కొత్త కాదుగా? ఇదివరకు ఇలా తల మాసిన కంపెనీ వదిలేసినప్పుడు, ఓ రెండు నెలలాగి మళ్ళీ ఉద్యోగం తెచ్చుకున్నారుగా? నేను అప్పుడూ ఇలాగే అడిగితే, మీరు తర్వాత అంటూ వాయిదా వేసారు” నిష్టూరంగా అంది శాంత. 

“ఇప్పుడు పరిస్థితి వేరేనే బాబూ! కంపెనీలన్నీ లాభాలు తగ్గాయని, స్టాపు తగ్గిస్తున్నారు. నేను చాలా ప్రయత్నాలు చేశాను. అన్ని కంపెనీలలో ఇదే పరిస్థితి” నిరాశగా చెప్పాడు.

“ఒర్నాయనోయ్! ఇక మనం బతికేది ఎట్లా?” దిగాలుపడింది.

“అదే ఏం తోచటంలేదు” అలవాటు ప్రకారం మెళ్ళో ఐడెంటిటి కార్డు తడుముకోబోయాడు. చేతికి చొక్కా గుండిలు తగిలాయి. పతివ్రత మంగళసూత్రం జాకెటులో దాచుకున్నట్లు, పింకు స్లిప్పు అనగానే, తను ఐడి కార్డు చొక్కలోపల జాగ్రత్తగా దాచుకున్నాడు. అయితే, విడాకులిచ్చిన మొగుడు తాను కట్టిన మంగళ సూత్రం  గొలుసు లాక్కునట్లు, కంపెనీ వాళ్ళు ఉద్యోగంతో పాటు, ఐడి కార్డు కూడా వెనక్కి తీసేసుకుంటారన్న విషయం గుర్తుకొచ్చి, మరొకసారి గొల్లు మన్నాడు వాసుదేవుడు.

“అబ్బ, కాస్త ఆగండి! ఉండి, ఉండి విరోచనాలు అవుతున్న వాళ్ళ లాగా, తలుచుకుని, తలుచుకుని మాటి మాటికి అలా ఏడవకండి. నన్ను ఆలోచించనివ్వండి” శాంత విసుక్కుంది. 

“అప్పుడే లొకువైపొయాను నీకు” మొహం చిన్నబుచ్చుకుని లేచి, వెళ్ళబోయాడు. 

“ఉండండి, ఎక్కడకు వెడతారు? వైన్ షాపుకో, వెంకట్రావు ఇంటికో అంతేగా? దేవదాసులా తాగి పడిపోతారు. ఎక్కడో పడిపోతే నేను వెతకలేను. ఏ కుక్కకో మందు పోసి, దాన్ని ముద్దు చెయ్యబోతే అది కరిచిందనుకోండి. బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి, జాగ్రత్త! ముందు వేడి వేడి కాఫీ పట్టుకొస్తాను. తాగి, కాస్త నిదానంగా ఆలోచిద్దాం. ఎక్కడికి వెళ్ళకండి,ఇక్కడే కూర్చోండి” బెదిరించింది.

ఇద్దరూ కాఫీ తాగుతుండగా సుపుత్రుడు చందన్ లోపలి వచ్చాడు. బ్యాగ్గు అవతల పడేసి, “మమ్మీ, నాకాకలి అవుతోంది. ఏదైనా టిఫిన్ పెట్టు?” అడిగాడు. 

ఏదో  అనబోయిన వాసుదేవరావుని కళ్ళతో సైగ చేసి వారించింది శాంత. చందన్ అమ్మ పెట్టిన టిఫిన్ తినేసి, బయట ఆడుకుంటానికి వెళ్ళిపోయాడు.

“మా నాన్నగారితో మాట్లాడదాం” ఆలోచించి చెప్పింది శాంత.

“నేను రాను. తోచీ తోచనమ్మ తోటికోడలింటికి వెళ్ళిందట. మరీ తేలికైపోతాను, మీ ఇంట్లో.” 

“ఆ సామెతే ఆడవాళ్ళకు సంబంధిచినది. మగాళ్ళు చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదంటారు.”.

“అది కూడా తప్పేనే! ఐనా, ‘ఇల్లరికంలో వున్న మజా’ అంటూ పాడుకోవడానికి నేనేమైనా రేలంగినా? నేను మటుకూ అక్కడకు రాను.”

సరే లెండి, అక్కడికి మీరొక్కరే అల్లుడు అయినట్లు, ఇల్లరికానికి! ఇంకా వున్నారు క్యూ లో. నేను కూడా వెళ్ళను, లెండి. నేను వెడితే మీరు బారు షాపులో బాకీ పడతారు. తర్వాత ఆలోచిద్దురు గానీ, ముందు స్నానం చేసి కాస్త రిలాక్స్ అవ్వండి” శాంత అతన్ని లేవగోట్టింది

* * *    

వాసుదేవుడు మర్నాడు పగలెల్లా తిరిగి తిరిగి, కాళ్ళు నెప్పులు పుట్టి, రాత్రి ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ నొక్కబోయినవాడల్లా, భార్య మాటలు వినిపించి ఆగిపోయాడు. 

“నా కొంప ముంచావు గద నాన్నా! ఏ ప్రభుత్వోగికో ఇచ్చి చేసినా హాయిగా, సుఖంగా  ఉండేదాన్ని. ఇలా  మూడేళ్ళకో, నాలుగేళ్ళకో ఉద్యోగాలు మారడం, కొన్నాళ్ళు ఖాళీగా వుండడం, దాదాపు ప్రతి రోజూ అర్ధరాత్రివేళ రావడం, పని పూర్తి కాకపోతే మామీద విసుక్కోవడం! ప్రోడక్ట్ రిలీజు అయ్యిందనో, మరొకటనో అప్పుడప్పుడూ మందు పార్టీలు –ఇలా ఈ మనిషితో చస్తున్నానుకో. ఓ ముద్దూ లేదు, ముచ్చటా లేదు. కూపస్థ మండూకంలా ఇంట్లో ఆయనకోసం ఎదురు చూస్తూ పడి ఉంటున్నాను. ఎప్పుడో రెండు సార్లు మాత్రం మమ్మల్ని టూరు మీద, వాళ్ళమ్మతో పాటు కాశీ, కంచి, రామేశ్వరం తీసుకెళ్ళారు. అది కూడా పెళ్ళైన కొత్తలో! బాబిగాడు పుట్టాక ఇంతవరకూ ఎక్కడికి పోలేదు. ఇలాగే పెళ్ళయి పదేళ్ళు గడిచిపోయాయి. మొన్ననీ మధ్య దాకా ప్రమోషను అంటూ అడ్డమైన వాడితో తిరిగి, పనిచేసీ, మందుపార్టీలు ఇచ్చి, ప్రమోషను తెచ్చుకున్నారా? ఇప్పుడేమో ఎక్కువ జీతం ఇస్తున్న ఎంప్లాయిసుని తీసేస్తున్నారట. ఏం ఉద్యోగాలు నాన్నా ఇవీ? చిన్న ప్రభుత్వోద్యోగి కూడా వీళ్ళతో సమానంగా సంపాదిస్తున్నాడు. ఉన్న వూరు మారే అవసరం వాళ్ళకు అసలు రానే రాదు. ఏదో సాఫ్టువేరు ఉద్యోగని మురిసిపోయావు. ఈ వేర్లు ఎన్నాళ్ళు పోయినా సాఫ్టుగానే ఉంటాయి నాన్నా, అవి భూమిలో బలంగా పాతుకోవు. గవర్నమెంటు ఉద్యోగి అయితే, తప్పు చేసినందుకో, లంచం పుచ్చుకున్నందుకో సస్పెండు అయినా కూడా, ఉద్యోగంపోదు, పైపెచ్చు ప్రమోషన్లు కూడా ఇస్తారు. మళ్ళీ  నువ్వే ఏదో ఒకటి చేసి, ఆయన్ను ఇదే ఉద్యోగంలో కంటిన్యు అయ్యేలా చెయ్యి. లేకపోతే, ఆయన పిచ్చెక్కిపోతారు. ఉద్యోగం ఇంకెక్కడన్నా దొరికితే, మళ్ళీ ఈ వూరు ఒదిలి మరొక వూరికి పోవాలి. అక్కడ కొత్తగా ఇల్లూ, బాబుకి స్కూలు వెతుక్కోవడం –ఇలా జీవితమంతా గడిచిపోయేట్లు వుంది.  పోనీ ఏ అమెరికానో పోదామన్నా, అక్కడ పరిస్థితులు కూడా బాగాలేవట. ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో ఉద్యోగాలు అంత తేలికగా రావు. పైగా మన వాళ్ళంటే పడక కాల్చి పారేస్తున్నారట. కెనడాలో పర్వాలేదు కానీ, అక్కడ మ్యూజియంలో మంచు విగ్రహాల్లా మారిపోతామని భయం.  నేను కూడా ఇంజనీరింగు చదివి, ఏ సాప్టువేరు కంపెనీలోనో ఉద్యోగం చేస్తున్నట్లుంటే హాయిగా   బతికేసే వారమేమో?” శాంత పెద్దగా మాట్లాడుతోంది, వాళ్ళ నాన్న ప్రసాదరావుతో.  

“అప్పుడు మీ ఇద్దరి మధ్యా గొడవలు మరింత ఎక్కువయ్యేవి. ఇంట్లో పిల్లలను పట్టించు కోకుండా, నా పనీ, నా ప్రమోషను అంటూ దెబ్బలాడుకునే వారు. కొంత మంది సాఫ్టువేరు ఉద్యోగస్తులు, తమతో పని చేసేవారిని చేసుకుంటే ఒకరినొకరు అర్ధం చేసుకుని సంసారం హాయిగా సాగిపోతుందని, ప్రేమించి, పెళ్ళి చేసుకుని, తర్వాత దెబ్బలాడుకుని విడిపోయిన వారున్నారు. ఇద్దరూ ఉద్యోగస్తులైతే పడే బాధలు వేరే. అందులోనూ, ఒకే ప్రోఫెషనులో వుంటే, ముఖ్యంగా సాఫ్టువేరు ప్రోఫెషనులో సమస్యలు ఇంకా ఎక్కువ. ఇక మీ ఆయనకు మళ్ళీ అదే కంపనీలో ఉద్యోగం వేయించడానికి, నేనేమైనా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు”  సినిమాలో కోట శ్రీనివాసరావునా? ఈ విషయంలో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నేనొక రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ని. నాకున్న పొలిటికల్ పరిచయాలు, ఇన్ఫ్లుయెన్స్ అంతంత మాత్రమేనయ్యే. అది అట్లావుంచి, మాటి మాటికీ అల్లుడి డ్రింకు పార్టీల గురించి అదేదో చాల తప్పైనట్లు మాట్లాడి,  అతన్ని చిన్నబుచ్చకు. ఆ మధ్య ఒక   సినిమాలో, “తాగని నాకొడుకెవ్వడు ఈ లోకంలో” అని చెప్పనే చెప్పాడు. అసలు ప్రభుత్వాలకు ఆదాయమే మద్యపానం వల్ల వస్తోంది” మామగారి మాటలు విని ఆయన్ను ఎత్తుకుని గిర్రున తిప్పాలనిపించింది వాసుదేవుడికి.

“అవునవును, మీరు బ్యాంకు ఉద్యోగని నాకు తెలియదా ఏమిటి? కూతురి పెళ్ళన్నా, ఏ పెద్ద ఫంక్షనైనా ఏదో లోను పెట్టడం, ఆ తర్వాత ఆ అప్పు తీర్చేందుకు తిప్పలు పడటం నాకు తెలియదా? మీ బ్యాంకు వాళ్ళకు లోన్లు ఎలా ఇస్తారో, మాకైతే నూట ముఫై రూల్సు, ఆంక్షలూను!” చురక అంటించింది శాంత. 

ఏదో ఒక పాయింటు పట్టుకుని దెబ్బకొట్టాలని చూడడంలో ఆడవాళ్ళు మహా తెలివిగల వాళ్ళురా బాబు అనుకున్నాడు వాసుదేవుడు.

“అందరి లాగే నువ్వూ మాట్లాడుతున్నావు. మాకూ అవే రూల్సు వుంటాయి. ఊరికే ఏం ఇవ్వరు. కాకపోతే, మా జీతాలు, పి.ఎఫ్.లు వాళ్ళ చేతుల్లో వుంటాయి కనుక, లోను కొంత తొందరగా శాంన్షను అవుతుంది.  సరేలే, అల్లుడ్ని రానీ, ఏదో ఒకటి ఆలోచిద్దాం!” 

సంభాషణ అక్కడితో ఆగడంతో, ఇంట్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అనుకుని కాలింగ్ బెల్లు నొక్కాడు.  

“మా నాన్నగారు వచ్చారు” తలుపు తీయగానే చెప్పింది శాంత.

వాసుదేవరావు తల ఊపి సోఫాలో కూలబడి బూట్లు విప్పుకుంటున్నాడు. 

ప్రసాదరావు హాల్లోకి వస్తూనే, “ ఏమండీ, మళ్ళీ రిసెషన్ మొదలైందా మీ సాఫ్టువేరు ఇండస్ట్రీలో?” అడిగాడు.

వాసుదేవరావు మాట్లాడకుండా తలవూపాడు. ప్రసాదరావు అల్లుడి వంక చూసి, “ముందు స్నానానికి గీజరు ఆన్ చెయ్యమ్మా, భోజనం చేసి మాట్లాడుకుందాం” చెప్పాడు కూతురికి.  

 “మీతోపాటు ఇంకెవరన్నా ఇలా బయటకు వచ్చేశారా? మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు?” భోజనం చేస్తూ అడిగాడు ప్రసాదరావు.

“ఈ సిటీలో దాదాపు ఇరవై మందిని రెండు కంపెనీలనుంచీ బయటకు పంపేశారు. దూర ప్రాంతాల నుంచీ వచ్చిన కొంత మంది, వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోయారు. ఒక పది మందిమి మాత్రం ఇక్కడ మిగిలాం. అన్నట్లు మీ స్నేహితుడు సుబ్బారావు గారి అబ్బాయి మీ వూరు, పామర్రుకు వచ్చేశాడు గదా?” చెప్పాడు వాసుదేవరావు. 

“వాడికేం, బోల్డెంత ఆస్తి వుంది. శుబ్రంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు.”

“అమ్మయ్య నాకొక కాంపిటీషన్ తగ్గిందన్న మాట” అన్నాడు వాసుదేవుడు.

“అంటే, ఏమిటి?” అడిగింది శాంత.

“మరొక కంపెనీలో వేకేన్సి వచ్చినా, లేక మా కంపెనీయే మళ్ళీ కొంతమందిని వెనక్కి తీసుకున్నా మాకు వాడితో పోటీ లేదుగదా!”

“మరి మిగతా వాళ్ళ సంగతేమిటి?” 

“ప్రస్తుతానికి ఎక్కడైనా అవకాశం వస్తుందోనని అందరం ఎదురు చూస్తున్నాం.”

“అలా ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు? పోనీ, ఒక సైబర్ కేఫ్ పెట్టుకుంటే?” అడిగాడు మామగారు.

“దాన్లో చాల ఇబ్బందులున్నాయండి. నా ఫ్రెండ్ సైబర్ కేఫ్ పెట్టి నడిపాడు. కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఒకరోజు ఒక పోలీసు ఆఫీసరు గారికి ఏదో పని చేసిపెట్టి, డబ్బులడిగాడట. అతను సివిల్ డ్రస్సులో ఉండటంతో మా వాడికి తెలియలేదు. అతను నవ్వేసి వెళ్లిపోతుంటే, చొక్కా పట్టుకుని ఇస్తావా, ఇవ్వవా అని నిలదీశాడట. తాను పోలీసు ఆఫీసరని అతను బెదిరించాడట కూడా. మా వాడు నమ్మలేదు. దాంతో ఆ సైబర్ కేఫులో  పోర్న్ సినిమాలు  చూపిస్తున్నాడని మావాడిపై కేసుపెట్టి జైల్లో పడేశారు. ఎలాగోఅలా ఆ ఆఫీసరుతో సంధి చేసుకుని, బయట పడ్డాడు. ఆ దెబ్బతో సైబర్ కేఫు మూసేసి, రోడ్లపై చక్కర్లు కొడుతున్నాడు.”  

“అన్నట్లు మీ సుబ్రహ్మణ్యం గారేమి చేస్తున్నారు? ఆయన కూడా బయటున్నారా?” అడిగింది  శాంత.

“బయటుండటం ఏమిటి?” కోపంగా అడిగాడు వాసుదేవుడు.

“అదే లెండి, ఉద్యోగం వదిలేశారాని అడగబోయి అలా అన్నాను” అంది శాంత నవ్వుతూ. 

వాసుదేవరావు కోపంగా ఏదో అనబోయి మామగార్ని చూసి తమాయించుకున్నాడు.

“సుబ్రహ్మణ్యం, వాళ్ళావిడ కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు.”

“మీరు ఒక్కనాడన్నా చెప్పలేదేం? ఎంచక్కా అక్కడ చేసే వెరైటీ టిఫిన్లు తినేవాళ్ళం రోజూ” శాంత సరదా పడింది. వాసుదేవుడికి ఒళ్ళు మండి, ఆమె వంక కోపంగా చూశాడు. 

మామగారు, “మరైతే ఇకనేం బాగానే ఉన్నారన్న మాట!” అన్నాడు.

“వాడు పడుతున్న అవస్థలు రోజూ మాకు చెబుతూనే వున్నాడు లెండి. ఒకో రోజు పనివాడు రాడు. అప్పుడు గిన్నెలూ అవి తోముకోవాలి. పెళ్ళిళ్ళ సీజను వచ్చిందంటే, వంటవాళ్లు రారు. అందుకని, వాడూ, వాళ్ళావిడా ఇద్దరూ అన్ని రకాల పాస్టు ఫుడ్ ఐటంసు చెయ్యడం నేర్చుకున్నారు. అక్కడికొచ్చే కస్టమర్లలో కొంతమంది రష్ టైములో డబ్బులివ్వకుండా జారుకుంటారట. రోజూ పోలీసులకు డబ్బులు, టిఫిన్లు మామూళ్ళు ఇవ్వాలి. ఇది కాక ఆ వీధిలో మినిస్టరుగారెవరైనా వస్తుంటే, షాపు మూసెయ్యాలి. లేకపోతే ఆ రోజు ఆ వీధిలో డ్యూటిలో వున్న వారందరికీ టిఫిన్లు, కాఫీలు ఉచితంగా సప్ప్లై చెయ్యాలి. ఆ సమయంలో వేరే వాళ్ళు కూడా మేము పోలిసులమేనని చెప్పి డబ్బివ్వకుండా వెళ్ళిపోతారు.

రోజంతా కష్టపడితే చివరికి  అయిదొందలు  కూడా మిగలడం లేదని వాడు బాధ పడ్డాడు. మరొకడు ఇతని బాధలు చూసి, ఇంట్లో సమోసాలు తయారుచేసి జంగిడిలో పెట్టుకుని మోటార్ సైకిల్ మీద నాలుగు వీధులు తిరిగి అమ్ముతున్నాడు. పాపం వాడు ఉద్యోగంలో కొత్తగా జేరాడు. చదివే ఇంజనీరింగు చదువుకూ, చేసేపనికి సంబంధం వుండదు కనుక, అతను పని నేర్చుకోవడానికి నానా తంటాలూ పడుతుండటం చూసి, వాడ్ని కూడా తీసేశారు”  నిట్టూర్చాడు వాసుదేవుడు.                                         

“సరే, కొన్నాళ్ళు ఓపిక పట్టండి. మళ్ళీ మంచి రోజులు రాకపోవు. అనవసరంగా దిగులు పడి, ఆరోగ్యాలు పాడు చేసుకోకండి” మామగారి మాటలకు వాసుదేవరావు జవాబు చెప్పలేదు. 

ఆ రాత్రి వాసుదేవుడు భార్యతో చెప్పాడు. “నా క్లోజు ఫ్రెండ్ ఒకడు కువైట్ వెళ్ళాడు. అక్కడ మంచి కంపెనీలో వాడికి ఉద్యోగం దొరికింది. తను కాస్త సెటిల్ అవగానే, నాకు కూడా ఏదో ఒకటి చూస్తానన్నాడు.”

“అంత దూరం ఒద్దండి, ఏదో ఒకటి ఇక్కడ దొరక్కపోదు. ఈ ఫ్లాటు అమ్మేసి లోను కట్టేద్దాం. ఏదీ దొరక్కపోతే, మనం ఏదో ఒక పల్లెటూరు వెళ్ళిపోయి, ఓ రెండెకరాలు కొనుక్కుని కూరగాయలన్నా పండించుకుని బతికేద్దాం. అంతేగాని, మీరు కువైట్ వెడతానంటే నేనొప్పుకోను” ఖండితంగా చెప్పింది శాంత.                                                                                                                                      

* * * 

ఆ రోజు ఉగాది కావడంతో పొద్దున్నే లేచి,  ముందు కాఫీ తాగి స్నానం వగైరాలు ముగించుకుని, ఉగాది పచ్చడి తయారు చేసింది శాంత.  కాస్త నోట్లో వేసుకుని రుచి చూసి, “అమ్మయ్య బాగానే వుంది, ఇక ఈ సంవత్సరం బాగుండబోతోందన్న మాట “ అనుకుంటూ సంతృప్తి పడింది. మొగుడ్ని లేపి, గబగబా తెమిలి తయారవమంది. “పొద్దున్నే ఏమిటే ఈ గోలా, హాయిగా నిద్ర పోకుండా?” విసుక్కున్నాడు పతి దేవుడు.

“ఇవాళ ఉగాది! చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని, పూజ చేసి ప్రసాదం తినాలండి!” తెలియజెప్పింది శాంత.

“కొత్త బట్టలు ఎన్నైనా కట్టుకుంటా, కానీ పూజలు వగైరా నా వల్ల కాదు. అవేవో నువ్వే చేసుకో. ఆ ఉగాది పచ్చడి కూడా నువ్వే తిను” చిరాకుపడ్డాడు వాసుదేవరావు.

“పోనీలెండి, నేనే తింటా. ముందు  తమరు పక్క మీద నుంచీ లేవండి” అంటూ పనిలో పనిగా సుపుత్రుడ్ని కూడా లేపింది శాంత. 

మొగుడికి, సుపుత్రుడికి తలంటి పోసి, ఇద్దరికీ ఉగాది పచ్చడి పెట్టిందో లేదో, బయట కాలింగు బెల్లు మోగింది. పచ్చడి నాకుతున్న చేతితోనే, తలుపు తెరిచి చూశాడు చందన్. ఫ్లాటు బయటే రెండడుగులు దూరంగా నిలబడ్డారు నలుగురు మనుషులు.      

“వాసుదేవరావు గారిల్లు ఇదేనా?” బయటే నిలబడి అడిగారు వాళ్ళు. ఔనన్నట్లు తలూపాడు చందన్. తండ్రిని పిలవడానికి లోపలి పరిగెత్తాడు.

 “విజేయేంద్ర మీ ఫ్రెండ్ కదా?” అడిగాడు ఒకతను. 

“అవును, ఏమైందతనికి? ఏమైనా యాక్సిడెంటా?” అడిగాడు వాసుదేవరావు కంగారుగా. 

“అంతకంటే ఎక్కువే! మీరంతా మాతో రావాలి!” దూరంగా నిలబడే చెప్పాడు ఒకతను.

వాసుదేవుడు ఖంగారుపడ్డాడు. “వాళ్ళింట్లో చెప్పారా? మేమంతా ఎందుకు? నేను వస్తాను.”

“అందరికీ చెప్పడం జరిగింది. మీరు వెంటనే బయల్దేరాలి. మీ ఆవిడా, పిల్లలూ కూడా!” గట్టిగా చెప్పాడు. 

“మేము రాము, ఆయనా రారు!” కోపంగా చెప్పింది శాంత. 

“మీరు రానంటే కుదరదు. బలవంతంగానైనా  తీసుకుపోతాం” కోపంగా అన్నాడతను. 

బహుశా అతను ఆఫీసరు అయ్యిఉంటాడు.  

“ఎందుకు?”  అవతల పక్కగా నిలబడిన వాళ్ళను చూసి, భయపడుతూ అడిగింది శాంత. 

“అవన్నీ తర్వాత చెబుతాం. మీరు బయల్దేరండి!”  

“ఉండండి, కొద్దిగా కాఫీ అన్నా తాగనివ్వండి. నాకు పొద్దున్నే కాఫీ  తాగకపోతే తలనెప్పి వస్తుంది. మీకు కూడా కాఫీ తెస్తాను.”

“అమ్మా, మీకు కాఫీ తాగకపోతే తలనెప్పే వస్తుంది. మేం తాగితే సకల రోగాలు వస్తాయి. కనుక, మీరు కాఫీ తాగేసి, తొందరగా తెమలండి.” మర్యాదాగా చెప్పాడతను.    

“పోనీ ఉగాది పచ్చడి తిటారా? పచ్చడి చాలా బాగా చేశాను. కొంచెం రుచి చూద్దురుగాని.” 

“ఏమమ్మా, ఇక ఇవన్నీ ఆపి బయల్దేరుతారా? మేము మర్యాదాగా మాట్లాడుతుంటే, మీరు కావాలని లేటు చేస్తునట్లుంది. మాకు ఇంకేమీ పన్లు లేవనుకున్నారా?” విసుకున్నాడతను.  

శాంత మొహం మాడిపోయింది. “ఏమిటండి ఇదంతా, ఎవరు వీళ్ళు? పోలీసులా?అంటూనే ఏడ్చేసింది.

 “నువ్వు ఊరికే కంగారు పడకు. పోలీసులు అయినా నేనేం వెధవ పన్లు చెయ్యలేదు. కనక మనకేం ప్రమాదం లేదు” వాసుదేవుడు ఆమెను ఓదార్చాడు. వాసుదేవుడికి సగం అర్ధం అయ్యీ కానట్లుంది. పాంటు  తొడుక్కుని, కంగారులో చొక్కా గుండిలు సగం పెట్టుకోకుండానే బయటకు వచ్చాడు.

శాంత ఎందుకైనా మంచిదని వాళ్ళ నాన్నకు ఫోను చేసింది. “నాన్నా, మమల్నందర్నీ ఎక్కడికో తీసుకుపోతున్నారు. పోలిసులేమో తెలియదు. ఎందుకంటే, ఏమో చెప్పడం లేదు. నువ్వు తొందరగా రా!” ఏడుస్తూనే  చందన్ కు గబగబా బట్టలు తొడిగి, వాడ్ని తయారు చేసింది. తలుపు తాళం వేసి, తాళంచెవి  పక్కఫ్లాటులో ఇచ్చింది. 

ఆఫీసరు ఏదో అనబోయి ఆగాడు. పక్క ఫ్లాటులో వాళ్ళు తొంగి చూడడం అవమానంగా అనిపించి గబగబా ముందుకు నడిచాడు వాసుదేవరావు. వాళ్ళు ఎక్కిన వ్యాను గాంధీ హాస్పిటలుకు వెళ్ళింది. దాంతో విజేయేంద్రకు ఏదో అయ్యిందనుకున్నాడు వాసుదేవరావు.                                                                                                    

వాళ్ళని ఒక గదిలోకి పంపి బయటే ఆగిపోయారు పోలీసులు. ఆ గదిలో అందరూ పైనుంచీ కింద దాకా మాస్కులు, స్పెషల్ డ్రస్సులు ధరించి వున్నారు.  అందరిలో ఒక డాక్టరు ముందు కొచ్చి వాళ్ళ రక్తం శాంపిల్సు తీసుకున్నారు. శాంతకు కాళ్ళ లోంచి వణుకు మొదలైంది.

“ఎందుకండీ, వీళ్ళు మన  బ్లడ్ సాంపిల్సు తీసుకుంటున్నారు? అసలు మీ ఫ్రెండ్ బతికే వున్నాడా? మీరేమన్నా అతగాడిని చంపేశారా?” వాసుదేవరావుని రహస్యంగా అడిగింది.  

 “ ఛీ, నీ కన్నీ వెధవ అనుమానాలు” భార్యపై విసుక్కుని,  “ఇదంతా దేనికండి? విజయేంద్ర ఎక్కడ? ఏమైంది అతనికి?” వాసుదేవరావు కంగారుగా అడిగాడు.

 “అతను ఇటలీలో ఉన్నప్పుడు కరోనా వైరస్ సోకిందని నిర్దారణ అయ్యింది. డిల్లీలో అతనికి టెస్టులవీ చెయ్యబోతే, తప్పించుకుని ఇంటికి వచ్చేశాడు. అతను ఎవరెవరితో కాంటాక్టులో ఉన్నాడో వారందర్నీ ఇప్పుడు వెతుకుతున్నాము. మీ ఇంటికి ఎవరన్నా వచ్చారా? మీరు ఇంకేవరితోనైనా కలిసి తిరగడం, లేదా ఫంక్షన్స్ లో పాల్గోవటం కానీ చేశారా?” అడిగాడు.

“మేము ఫ్రెండ్సు ఇదుగురమూ రోజూ కలుస్తుంటాము. ఆ, అన్నట్లు మా మామగారీ మధ్య మా ఇంటికి వచ్చి వెళ్ళారు. అంతకు మించి మరెవరితోనూ కాంటాక్టులో లేము. అయినా ఎందుకు ఇన్ని ప్రశ్నలు  అడుగుతున్నారు? కరోనా వైరసుకు, మాకు ఏమిటి సంబంధం?”  

“మీ మామగారింట్లో ఎంతమంది ఉన్నారు?” వాసుదేవరావు ప్రశ్నకు జవాబివ్వకుండా మళ్ళీ అడిగాడు డాక్టరు.

“ముగ్గురు. మామగారు, అత్తగారు, బావమరిది.”  

“పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏమిటో? పండగపూట ఈ న్యూసెన్సు ఏమిటి? అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగారు. ఇక మమ్మల్ని పంపుతారా? పండగ పూట ఇక్కడ ఉండటం నాకిష్టం లేదు.” శాంత ఖండితంగా చెప్పింది.

“ఇక పండగ, పబ్బం అన్నీ మీ కిక్కడే!” అన్నాడు డాక్టరు, శాంత కోపం చూసి నవ్వుతూ.  

“అసలు మీ మూలంగానే ఇదంతా! పొద్దున్నే మీ మొహమే చూసినట్లున్నాను. హత్యలూ, లూటిలూ చేసిన వాళ్ళేమో హాయిగా తిరుగుతున్నారు. మనకేంటి ఈ ఖర్మ?” మొగుడికేసి కోపంగా చూసింది. “ఏమంటున్నారు మీరు? ఆయనెవడికో రోగం వస్తే వైద్యం చెయ్యండి, లేదా వదిలెయ్యండి! మాకేంటి సంబంధం? మానాన్న గారేం చేశారు? వాళ్ళకేం సంబంధం? మమ్మల్ని అందర్నీ ఇంట్లోంచి పట్టుకొచ్చి పండగ పూట పొద్దున్నే ఇలా బెదిరిస్తారా? మీమీద పోలిస్ కంప్లైంటు ఇస్తాను” వాసుదేవరావు ఒక పక్క వారిస్తున్నా వినకుండా ఆ డాక్టరు మీద అరిచేసింది. శాంతకు క్షణ క్షణం బి.పి.పెరిగిపోతోంది.

 “మీరేమన్నా చేసుకోండి. అనవసరంగా అరిచి బి.పి. తెచ్చుకోకండి. దాని వల్ల మీకు మరింత నష్టమే తప్ప లాభంలేదు. మీరు మాత్రం వెళ్ళేందుకు వీల్లేదు. ఈ కరోనా వైరస్  గురించి మీకెవరికి తెలియద నుకుంటాను. ఇది ఒక అంటు రోగం. ప్రమాదకరమైంది. మీ అందరికి ఆ వైరస్ సోకే అవకాశం వుంది. అది పద్నాలుగు రోజులలో బయట పడవచ్చు. అందుకని ఈ పద్నాలుగు రోజులు మీరు ఇక్కడే వుండాలి. మీకు పదిహేనో రోజు పరీక్షలో ఏమి లేదని నిర్దారణ అయితే ఇంటికి పంపెస్తాము” డాక్టరు చెప్పాడు.

“ఒక వేళ మాకూ ఆ వైరస్ సోకినట్లైతే?” భయపడుతూనే అడిగింది శాంత. 

“అది పూర్తిగా తగ్గేదాకా మీరు క్వారంటైనులో అంటే, విడిగా ఎవరితో కలవకుండా ఇక్కడే ఉంటారు” సింపుల్ గా చెప్పాడతను.

“ఆ..” అంటూ అరిచి శాంత కళ్ళు తిరిగి పడిపోయింది. చందన్, వాసుదేవరావులు కంగారుగా ఆమెను లేవదీశారు. డాక్టరు బెడ్  పై శాంతను పడుకోబెట్టించి పరీక్ష చేయసాగాడు.

 ( ఈ కధలో పాత్రలూ, సంఘటనలు కల్పితం. కేవలం హాస్యం కోసం రాసిన కధే గానీ, ఎవర్నీ చిన్నబుచ్చడం గానీ, అవమానించడం గానీ రచయిత ఉద్దేశ్యం కాదు.)                       

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.