
రిస్క్ తీసుకుంటాను(కవిత)
-కొండేపూడి నిర్మల
మొదటి పెగ్గు..
మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి
తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు
జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి చెబుతుంది
సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు
గోడమీద తగ కావిలించుకుని దిగిన హనీమూన్ ఫొటో
వింత చూస్తూ వుంటుంది.
సత్యనారాయణ వ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని
ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు
బుస బుస బుసా మైకం గ్లాసులోకి దూకుతుంది
శూన్యంలోకి చీర్స్ కొట్టి ఒక గుక్క తాగుతాడు
అఫ్కోర్స్ | ఎంత తొందరలో వున్నా గాని చీర్స్ మర్చిపోడు
పిల్లల కళ్ళకి గంతలు కట్త్డడమెలాగా అని
నేను దారులు వెతుకుతూ వుంటాను
ఈ చెవిమాట ఆ చెవికి చేరదు.
ఎందుకంటే రెంటి మధ్యా జానీవాకరు వుంటుంది
“అన్నట్టు నీ కొత్త చెప్పులు ఇంకా కరుస్తున్నాయా?” వాడి ప్రశ్న..
“కరిచినా తప్పదు కదా, వాటితోనే కాపరం చేస్తున్నా..”నా జవాబు
రెండోపెగ్గు..
మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
మూతి ముందుకు చాపు రెండో పెగ్గు అందుకుంటాడు
హోం వర్కు మానేసి స్కేళ్ళతో బాదుకుని ఏడుస్తున్న పిల్లల
తిక్క కుదరడం కోసం టివి లో హార్రర్ సినిమా పెడతాను
కళ్ళు తేలేసి ముగ్గురూ అక్కడే పడి వుంటారు
“ఇంట్లో ఈ సంత నాకొద్దు”-గరిటె విసిరేస్తాను
“నీ ఇల్లు కాదిది నా ఇల్లు”- ధడాల్న తలుపు మూసుకుంటాడు
“నీయమ్మ-నీయక్క-నీయబ్బ” మృదు సంభాషణ చేస్తాడు
ఈ బూతు మాట ఆ బూతుకి వినిపించదు
ఎందుకంటే ఇద్దరి నాల్కల మీద ఒకే ఉప్పు తిన్న రోషం వుంటుంది
ఏ తప్పు లేకుండా మా ఇద్దరి అమ్మా,అక్క,అయ్యలు
వాళ్ళ వూళ్ళో శీలం పోగొట్టుకుని నిలబడతారు
తెగ కావిలించుకుని దిగిన హనీమూన్ ఫొటో
భయంతో గోడకి కరుచుకుంటుంది
మూడో పెగ్గు…
ఇల్లంతా నిద్రకు జోగుతూ వుంటుంది
వున్నాడో పోయాడొ చూడ్డం కోసం లోపలికి వెడతాను
పొట్ట చీల్చిన మిర్చీ బజ్జీ మాదిరి ప్రాణ నాధుడు పొర్లుతూ వుంటాడు
తిండికి రమ్మని భుజం తట్టి చెబుతాను
“చెప్పుల్ని మొగుడితో పోలుస్తావా.. ఎంత పొగరు”
అంటు చెయ్యెత్తుతాడు
అదే చేతిని వెనక్కి విరిచి గోడకేసి కొడతాను
ఈదెబ్బ మాట ఆ దెబ్బ వినదు
నాలుగో పెగ్గు…
కళ్ళు నిద్ర పోతున్నా నేను మెలకువ గాణే వుంటాను
“చెప్పుల్ని మొగుడితో కరిపిస్తావా ఎంత పొగరు”
సీసా భూతం మొరుగుతూ వుంటుంది
మొరిగి మొరిగి మొరిగి మూలాలు తెగిపడేట్టు వాంతి చేస్తాడు
తెమడ తెమడ తెమడగా అతని వ్యక్తిత్వం ఉట్టిపడుతుంది
పైజమా తడిసి ప్రభుత్వం మడుగు కడుతుంది
మొగుడు సీసాలో వుండగా నేను చాలా రిస్క్ తీసుకుంటాను
సిద్ధంగా వున్న నీళ్ళ బక్కెట్టు నెత్తిన దిమ్మరించగానే
ఇటు సర్కారూ, అటు జానీ వాకరూ ఒకర్నొకరు తోసుకుంటూ
తూములోకి పరిగెడతాయి
ఈ తూములో మాట ఆ తూముకి వినిపించదు
రెండిటి మీదా ఒకే మంత్రి వాగ్దానం అట్టకట్టి వుంటుంది
తెగ కావిలించుకుని దిగిన హనీమూన్ జంట
తటాల్న విడిపోయి ఇంకెవరితోనో లేచిపోతారు
మొగుడు సీసాలో వుండగా నేను చాలా రిస్క్ తీసుకుంటాను
*****

కొండేపూడి నిర్మల వృత్తిరీత్యా విలేకరి, ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి. వీరికి కధ, కవిత, కాలమ్ – ఈ మూడు సాహిత్య ప్రక్రియల్లోనూ తగిన ఆసక్తి అభినివేశం వున్నాయి. ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యం లోనూ ఒక ప్రత్యేక ముద్ర కోసం కృషి చేశారు. పుట్టింది హైదరాబాదు అయినా బాల్యం , విద్యాభ్యాసం విజయవాడలో గడిచాయి. 1977 లో విజయవాడ మారిస్టెల్లా కాలేజీలో బి.ఎ. డిగ్రీ చేశారు.
1978 లో ఆంధ్రజ్యోతి పత్రికలో సంపాదక శాఖలో కెరీర్ ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు ప్రచురణ , ప్రసార, అంతర్జాల మాధ్యమాల్లో సబ్ ఎడిటర్ , ప్రోగ్రామ్ ప్రెజెంటర్ , కంటెంట్ ఎడిటర్ స్థాయిలో పనిచేశారు.
2000 లో అభివృద్ధి రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో జండర్, అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ గా నీరు- పారిశుధ్య౦ విభాగానికి పని చేశారు.
అన౦తరం అర్బన్ డెవలప్ మెంట్ , వెలుగు ప్రాజెక్టులకు న్యూస్ లెటర్ ఎడిటర్ గా చేశారు. కొంతకాలం అధికార భాషా సంఘంలో వ్యవసాయ , పాలనా అంశాలకు సంబంధి౦చిన నిఘంటువు రూపకల్పనలో పాత్ర వహించారు.
ప్రస్తుతం జండర్ సమాచార రంగాల్లో శిక్షకురాలుగా , పాఠ్యా౦శాల రచయితగా , అనువాదకురాలుగా వున్నారు. ఫోటోషాప్ , గ్రాఫిక్స్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ లో అభిరుచి వుంది.అది కాక సమకాలీన సమస్యలపై కవుల కవిత్వాన్ని వీడియోలుగా రూపొందిస్తున్నారు. ఫోటోషాప్ , గ్రాఫిక్స్ వాహికలుగా కవిత్వానికి దృశ్య రూపం ఇవ్వడానికి కొన్ని వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
