ఉనికి మాట

మూర్తిమత్వం అనంతమై…!

– చంద్రలత 

   

అప్పటికింకా వెలుగురేకలు పూర్తిగా విచ్చుకోలేదు. 

చేటంత చేమంతులు బద్దకంగా వళ్ళు విరుచుకొంటూ , తొలికిరణాల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాయి.

జనవరి చివరి… ఢిల్లీ రోజులవి.

ఫలహారశాలలో కాఫీ తేనీరులు దక్క,  మరే  ఫలహారాలు అప్పుడప్పుడే వడ్డించే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. 

ఇక చేసేదేమీ లేక , మరొక కప్పు తేనీరు నింపుకొని, కిటికీలోంచి చేమంతుల రేకులపై వాలుతోన్న పసుపువన్నెలు చూస్తూ ఉన్నా.

ఎప్పటినుండి గమనిస్తున్నారో నన్ను, ఎక్కడో మూలన కూర్చున్న పెద్దాయన ఒకరు , నెమ్మదిగా వచ్చి , మర్యాదా సరదా కలబోసిన గొంతుతో పలకరించారు. 

ఇడ్లీ మిస్స్ అవుతున్నారా?

“ అబ్బే , అలాంటిదేమీ” లేదన్నాను.   

రాత్రి అరకొర తిండి మిగిల్చిన ఆకలి ఛాయలు తప్ప, ఇడ్లీ పట్ల నాకు ఎలాంటి భ్రమలూ లేవు !

నన్ను చూడగానే దక్షిణాది వ్యక్తినని వారు కనిపెట్టేసారు. ఆ సంగతి కూడా, నాకు వారు చెపితే కానీ తెలియ లేదు.

 అయితే వారెవరో, నాకు ఇట్టే తెలిసి పోయింది. నాలుగు మాటల్లోనే.

నాకు నచ్చిన “ శ్రాద్ధ్ ఘాట్ ” సృజనకర్త.

అక్షరాలా యు. ఆర్ .అనంత మూర్తి గారు.

ఏదో ఒక అర్ధరాత్రి పూట , అలనాటి దూరదర్శన్ వారి ధర్మాన , అదాటుగా చూసిన సినిమా అది. 

“అందులోని పిల్లవాడు మీరేనా?” జంకూ గొంకూ లేకుండా అడిగేసా.

ఆయన నవ్వేసారు.

ఇప్పుడయితే అడగగలనా?

అక్క కథను ఆ పిల్లవాడి దృష్టితో చెప్పించడం  .. చాలా హృద్యంగా ఉంటుంది. పసితనం .అమాయకత్వం . 

ఆమె ఒక బాల్యవితంతువు. ఆమె తండ్రి సనాతనుడు. ప్రకృతిధర్మాలకు ఆచారవ్యవహారలకు నడుమ ఆమె. అందుకు సాక్షీభూతం ఆ పసివాడు.

 ఇక , నానా పాటేకర్ నటన గురించి చెప్పేది ఏముంది? ఎన్నాళ్ళు వెంటాడిందో.

నిజానికి “సంస్కార” కూ నెల్లూరికి సంబంధం ఉన్నది. పఠాభి స్వర్ణలత గార్ల వలన.

భవ” సంగతి సరేసరి.

అంతటి పెద్దమనిషి వచ్చి ,ఎదురుగ్గా  కూర్చుంటే ….కాళ్ళూ చేతులూ ఆడుతాయా? నాకు మాత్రం ఎలాంటి వెరుపూ కలగలేదు. స్నేహభరితమైన వారి చిరునవ్వే అందుకు కారణం కావచ్చు. వారి ముఖవర్చస్సు , తేట గా  మాట్లాడే నేర్పు. ఆ మాటల్లోని  తొణికే సునిశిత హాస్యం. ఎటువంటి వారినైనా , స్నేహంలో ముంచేస్తాయి.

పైనుంచి వారు , మన పొరుగు ప్రాంతం వారు కావడం ,

మన కథల్లోని మన జీవితాలు వారికి దగ్గరివి కావడం  నవల పట్ల వారికున్న ఇష్టం, నవలాకారుల పట్ల నమ్మకం . అవో ఇవో అన్నీనో ..కారణం ఏదైనా , వారి సంతోషంలో ప్రస్పుటంగా కనబడింది… ప్రాంతీయ భాషల్లో నవల ఇంకా పచ్చబడి ఉండడం.

నవల నిలబడాలనీ, పదికాలాలు పచ్చగా వర్ధిల్లాలనీ వారు ఎంత బలంగా చెప్పారో.

ఆ తరువాత,

చాణ్ణాళ్ళ తరువాత,

రావెల సోమయ్య గారి ఆహ్వానం. పఠాభి గారి గౌరవంగా సభ ఏర్పాటు చేస్తున్నట్లూ, అనంతమూర్తి గారు ముఖ్య అతిథి అయినట్లూ.

ఈ సారి కలిసినప్పుడు, చాలా మటుకు మా మాటలన్నీ JK గారి చుట్టూనే. 

బడిపిల్లలతో కథ రచన ముమ్మరం గా సాగుతున్న సమయం అది. ఆ వివరాలన్నీ ఎంతో ఇష్టంగా అడిగి తెలుసుకొన్నారు. ముఖ్యంగా, తెలుగులో ఈ ప్రయత్నం జరగడం పట్ల మరింత సంతోషపడ్డారు. ప్రాంతీయ భషలు కళకళలాడుతూ ఉండాలని వారి కోరిక. 

ఆ పై, నవలల గురించీ. మరెంత ఇష్టంగా మాట్లాడుకొన్నామో!

నాతో పాటు ఆ పూట , పెద్దలెందరో ఉన్నారు.

” మరి మనం ఒక ఫోటో తీసుకొందామా?” నవ్వారాయన.

అంతకు మునుపు మాట మాత్రం అనుకోలేదు కదా.. మాటలతో గడిచిపోయింది అప్పటి సమయం. అంతే కాదు., మా శిరీష నూ ఆట పట్టించారు.

“ఈ నవలా రచయిత్రితో నా ఫోటో బ్రహ్మాండంగా రావాలి సుమా !” అంటూ.

అదీ, వారితో గడిపిన కొద్దిపాటి సమయం.

ఒక నవలారచయిత వ్యక్తిగా ఎంతగా ఎదగవలసివున్నదో ,తెలియచెప్పకనే చెప్పారు. విజ్ఞత, వినమ్రత కలగల్సిన వారి ప్రవర్తనతో .ఆఖరి వరకూ.

మార్క్సూ, జిడ్డు కృష్ణమూర్తి కలగలిసిన మార్గం నాది ” అని సౌమ్యంగానే చెప్పారు. సంస్కృత ,కన్నడ,ఆంగ్ల  భాషల్లో లోతైన అధ్యయనం చేసి,ప్రపంచ సాహిత్యాన్ని ఔపాసన పట్టి,ఆంగ్లోపన్యాసకుడి పనిచేస్తూ …  మాతృభాషకే మాణిక్యాలను అమర్చిన ఆయన బహుముఖ ప్రజ్ఞను గురించి ప్రత్యేకించి చెప్పవలసింది ఏముంది? జ్ఞానపీఠం ఆయనకు ఇచ్చి, భారతీయులం మనని మనం గౌరవించుకొన్నాం !

మనిషి పట్ల వారికెంత విశ్వాసమో. మానవధర్మం పట్ల ఎంత గౌరవమో. మానవ సంబంధాల పట్ల ఎంత ఆప్యాయతో  !

వారి ఊపిరి అనంత వాయువుల్లో మమేకవచ్చు గాక !

వారి మూర్తిమత్వం అనంతమై భాసిల్లును గాక !

వారికి, 

ఎంతో ఆప్యాయంగా వీడ్కోలు. 

****

అనంత సంస్కారం

“వీధులలోకెల్ల ఏ వీధి మేలు?

 మాధ్వులు వసియించు మా వీధి మేలు!”

అని మనసా వాచా కర్మణా, గాఢంగా మూఢంగా విశ్వసించే దూర్వాసపురం  అగ్రహారం కథ “సంస్కార.”

కన్నడంలో ‘సంస్కార’ అంటే అంతిమసంస్కారం. దహనసంస్కారం.

జ్ఞానపీఠ్ పురస్కృత U.R. అనంతమూర్తి గారు తమ విద్యార్థిదశలో 1965లో ‘సంస్కార’ కన్నడనవలను రచించారు.

ఆ నవల ఆధారంగా, పఠాభి (తిక్కవరపు పట్టాభి రామిరెడ్డి)గారు నిర్మించి, దర్షకత్వం వహించిన”సంస్కార” కన్నడసినిమా 1970 లో విడుదలయ్యింది.తెరకెక్కడానికి ముందు ఆ తరువాత,ఒక నవలగా,ఆ పై సినిమాగా “సంస్కార” సృష్టించిన సంచలాత్మక అలజడులు ఇన్నిన్ని కావు.ముప్పిరిగొన్న వివాదాలను అధిగమించి,”సంస్కార” పొందిన సత్కారాలు,పురస్కారాలు అంతే విశిష్టమైనవి.

    జాతీయ ఉత్తమ చిత్రంగా  స్వర్ణ కమలం(పఠాభి ,1971),   లొకార్ణొ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో కంచు చిరుత(బ్రాంజ్ లెపర్డ్,1972) , భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో ఉత్తమ చిత్రం (పఠాభి,1992),కర్ణాటక ప్రభుత్వంచే, 1970 లో ఉత్తమ చిత్రం(పఠాభి),ఉత్తమ కథారచయిత(U.R. అనంతమూర్తి),ఉత్తమ సహాయనటుడు(B.R. జయరాం),ఉత్తమ సినిమాటోగ్రాఫెర్ (టాం కోవన్ ) రాష్ట్ర పురస్కారాలు పొందారు. 

     కథలో ముఖ్యభూమికలు ప్రాణేశాచార్య (గిరీష్ కర్నాడ్),నారాయణప్ప(పి. లంకేశ్),ముఖ్య స్త్రీ భూమిక,చంద్రి (స్నేహలతారెడ్డి).

       పశ్చిమకనుమల్లోని దక్షిణకర్ణాటకలో, శృంగేరీమఠానికి సమీపాన ఉన్న గ్రామం దుర్వాసపురం. అక్కడి మాధ్వ బ్రాహ్మణులకు పరమనిష్టాగరిష్టుడు, వారాణాసి వెళ్ళి వేదవేదాంగ అధ్యయనం చేసి వచ్చిన,పండితుడు ప్రాణేశాచార్య మార్గదర్శి. అగ్రహార పెద్ద.ఆ అగ్రహారం మంచీచెడూ చూసేవాడు. ప్రాణేశాచార్య మాటే అక్కడి వారికి వేదవాక్కు.

       దుర్వాసపుర కొలమానం ప్రకారం,ప్రాణేశ్వరాచార్య పరమవందనీయుడు.నారాయణప్ప పరమభృష్టుడు.

 ప్రాణేశాచార్య మాధ్వబ్రాహ్మణ్యానికి ఆయువుపట్టు,నిలువెత్తు సజీవ ఉదాహరణ అయితే, అందుకు పూర్తి భిన్నమైన వాడు నారయణప్ప.

    బ్రాహ్మణ్యాన్నితోసిరాజని,మాంసాహారం తింటూ,మద్యపానంచేస్తూ, నాటకాలు వేస్తూ,చంద్రి అనే వేశ్యతో తన ఇంట్లోనే,ఆ మాధ్వవీధిలోనే,నారాయణప్ప సహజీవనం చేస్తూఉంటాడు.నారాయణప్ప ఇంట్లో తరతరాలుగా పూజించే, మాధ్వులు పరమపవిత్రంగా భావించే,సాలగ్రామశిలని,ఒకరోజు తుంగానదిలో పారేస్తాడు. 

   తనకి తోడు మరికొందరు బ్రాహ్మణయువకులను ప్రభావితం చేసి,తన శిష్యబృందాన్ని తయారుచేస్తుంటాడు. ఒకరోజు నారాయణప్ప,తన మహమ్మదీయ మిత్రులతో,శిష్యబృందంతో కలిసి,దేవాలయం కొలనులోని చేపలను పట్టుకొని, వండుకొని తింటాడు.పరమపవిత్రంగా భావించే,దేవాలయ కొలనుచేపలకు పట్టిన గతికి ఊరంతా అట్టుడుకిపోతుంది.

దుర్వాసపుర బ్రాహ్మణులంతా ఏకమై, నారాయణప్పను వెలివేయమని ప్రాణేశాచార్యను అడుగుతారు.

ప్రాణేశాచార్య, నారాయణప్పకు కొంతవ్యవధి ఇచ్చి, అతనిలో పరివర్తన కలిగించే ప్రయత్నం చేద్దామని సర్దిచెపుతాడు. నారాయణప్ప బ్రాహ్మణ్యాన్ని వదిలినా, బ్రాహ్మణ్యం అతనిని వదలలేదు.

ఇంతలో ఒకరోజు, నారాయణప్ప పొరుగూరైన శివమొగ్గ (షిమోగ) కు వెళ్ళి,వచ్చీ రాగానే,జ్వరాన పడడం, రెండోరోజున కన్నుమూయడంతో కథ మొదలవుతుంది.

       దుర్వాసపురం ఆచారం ప్రకారం, వెంటనే అంతిమ సంస్కారం చేయాలి.అవి పూర్తయ్యే దాకా, వూళ్ళోని పెద్దలెవరూ భోజనం చేయకూడదు.నారాయణప్పకు సంతానంలేదు. అంతిమ సంస్కారం ఎవరు చేయాలి అన్నది అక్కడ తలెత్తిన సమస్య.

        బ్రాహ్మణ్యం పాటించలేదు కనుక,నారాయణప్ప దాయదులు అంతిమసంస్కారం చేయడానికి వప్పుకోరు. అతడిని బ్రాహ్మణ్యం వదలలేదు కనుక, బ్రాహ్మణేతరులు దహనసంస్కారాలు చేయడానికి అంగీకరించరు.ఈ విపత్కర పరిస్థితిలో,కర్తవ్యం ఏమిటో నిర్ణయించవలసిన బాధ్యత ప్రాణేశాచార్య మీద పడుతుంది.

ఇంతలో,ఎంతకూ తేలని చర్చలతో, తెగని వాదోపవాదాలు తర్జన భర్జనలతో,పొద్దు వాలిపోతుంటుంది. వీధిలో ఒక పక్కగా ఒదిగి కూర్చున్న చంద్రి,వీధిగడప లోపల గదుల్లో చేరి ఆత్రంగా చెవులు నిక్కించి వింటున్న అగ్రహారంస్త్రీలు ,ప్రాణేశాచార్య నిర్యయం కోసం ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు.ఇంతలో చంద్రి, తన వంటిమీదున్న నగలనుతీసి , అగ్రహారం పెద్దలుకూర్చున్న అరుగు మీద, ప్రాణేశాచార్య ముందు పెడుతుంది.

ఒక్కసారిగా, అరుగు మీది నారాయణప్ప దాయదుల ధోరణి మారిపోతుంది. ప్రాణేశాచార్య నిర్ణయిస్తే, అంతిమసంస్కారం చేయడానికి అభ్యంతరం లేదని ఒకరి తరువాత ఒకరు ప్రకటిస్తారు.

ప్రాణేశాచార్య , ఆ నగలను మూటకట్టి, లోపలికి తీసుకెళుతూ, ‘తనకూ స్పష్టత రావడం లేదని,శాస్త్రాలను తరచి చూస్తానని ,తనకు కొంత సమయం కావాలని’ అడుగుతాడు.అందరూ అతని మాటను మన్నించి,ఇళ్ళకు మళ్ళుతారు. చంద్రి ప్రాణేశాచార్య ఇంటి అరుగు వద్దే, ఒక పక్కగా వేచి ఉంటుంది.

      వీధిలోకి ఒక్కో ఎలుక వచ్చి,గింగిరాలు తిరిగి,రక్తం కక్కుకొని,చచ్చిపోతూ ఉంటుంది. రాను రాను చచ్చే ఎలుకలు ఎక్కువవుతూ పోతాయి.కడుపులో తిరిగే ఎలుకలతో,పెద్దలు అల్లాడిపోతుంటారు.

        తెల్లవార్లూ శాస్త్రాలన్నీ తిరగేసినా, ప్రాణేశాచార్యకు సమస్యకు పరిష్కారం దొరకదు.అర్థరాత్రి బయటకువచ్చిన అతనికి, చంద్రి వొణుకుతూ కనబడుతుంది.ఆమెకు పడుకోవడానికి చాపాదిండు ఇచ్చి,ఆమె నగలను ఆమెకు తిరిగి ఇచ్చేస్తాడు.”అతనులేడు.నువ్వు బతకాలిగా”అంటూ.

       చంద్రి ప్రాణేశాచార్యనిర్ణయానికై ఎదురుచూస్తూ,అక్కడే పడుకొంటుంది.

తెల్లవారే, ఊరి మీదికి గద్దలు,రాబందుల గుంపు వస్తుంది.ఊరంతా ఎక్కడ చూసినా ఎలుకలు చచ్చిపడుతుంటాయి. చచ్చిన ఎలుకల కంపుతో  శిథిలమవుతున్న మృతదేహపు దుర్గంధం కలగలసి, భరించలేనంత దుర్వాసనవ్యాపిస్తూ ఉంటుంది.సాధ్యమైనంత తొందరగా దహనసంస్కారాలు పూర్తికావాలి.

ప్రాణేశాచార్య మీమాంసను వీడని తన అశక్తతను ఊరివారికి వెల్లడిస్తాడు.మారుతి గుడికి వెళ్ళి ధ్యానం చేస్తే,ఒక స్పష్టత వస్తుందని,ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో ప్రయత్నిస్తానంటాడు.ఒక బృందం పీఠాధిపతిని కలవడానికి బయలుదేరుతుంది. దారిలో పారిజాతపుర అగ్రహారానికి పెద్దయిన మంజప్పను కలిసి,స్మార్తులమయిన వారు మాధ్వుల కన్న తక్కువ శాఖవారయినా,వారికి నారాయణప్పతో ఉన్న సానుకూలసంబంధంచేత,సంస్కారాలు చేయడానికి అంగీరిస్తారు. అదీ ప్రాణేశాచార్య నిర్ణయించాక.

పీఠాధిపతి , బ్రాహ్మణ్యం గాడితప్పినా, నారాయణప్ప బ్రాహ్మణ్యం వదులుకొన్నా, బ్రాహ్మణ్యం అతనిని వదలలేదు కనుక, ప్రాణేశాచార్య ఆధ్వర్యంలో, వెంటనే దహన సంస్కారాలు జరిపించమని, నారాయణప్ప ఆస్తిపాస్తులు మఠానికి జమచేయమని చెపుతాడు.

మఠానికి వెళ్ళిన వారిలో ఒకరు దారి మధ్యలోనే కుప్పకూలుతారు. మరొకరు మంటల జ్వరాన పడతాడు. స్వామిజి అతనిని అక్కడే ఆగి , వైద్యచికిత్స అందించమని పురమాయిస్తాడు. మిగిలిన వారిని తక్షణం ఊరికి తిరిగి వెళ్ళి, సంస్కార కార్యం పూర్తి చేయమని ఆదేశిస్తారు.

హనుమాన్ ధ్యానం కోసం వెళ్ళిన ప్రాణేశాచార్య, తుంగానది స్నానం చేసి, అడవిలో హనుమన్ మందిరానికి వెళ్ళి ధ్యానానికి కూర్చుంటాడు.అతనినిర్ణయంకోసమై ఎదురుచూస్తున్న చంద్రి, అతన్నిఅనుసరించి వెళుతుంది.

తుంగానదిలో స్నానం చేసి, ఆ తడిఆరని వంటితో,తడికోకతో, అతన్ని అనుసరిస్తుంది. ఒక అరటిపళ్ళ హస్తాన్నితీసుకొని,కొంగుచాటున దాచి తీసుకువెళుతుంది.

రోజంతా ధ్యానంలో ఉన్నా,ప్రాణేశాచార్యకు పరిష్కారం దొరకదు.అతనిని ముంచెత్తిన నిరాశానిస్పృహలు ఒక వైపు,దహించే ఆకలిదప్పులు మరోవైపు.

ఆ నట్టడవిలో,చిమ్మచీకటిలో ఠావులు తప్పిన శరీరంతో అడుగులుతడబడుతూ, ఊరి వైపు నడుస్తుంటాడు.ఆ వేళలో అక్కడ ఊహించని వేగంతో వచ్చి, అతని పాదాలపై పడుతుంది.

ఆ క్షణాన ప్రాణేశాచార్య మనసు,తనువు ఒక్కసారిగా అతని అదుపు తప్పుతాయి.అర్థరాత్రి అతనికి మెలుకువ వచ్చేసరికి, చంద్రి వొడిలో కళ్ళుతెరుస్తాడు.అతని నోటివెంట వచ్చే మొదటిమాట.”అమ్మ!”

ప్రాణేశాచార్య జరిగినదేమిటో గ్రహించి, ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనవుతాడు. నెమ్మదిగా కూడదీసుకొని, చంద్రితో  నారాయణప్ప సంస్కారం చేయిస్తానని చెపుతాడు.

      ఆ మాట అతని నోటవినగానే,చంద్రి ఊరికి తిరిగి వెళుతుంది.మాటమాత్రం పొక్కనీయకుండా,ఆ రాత్రికి రాత్రే, నారాయణప్ప మహ్మదీయమిత్రుల సాయంతో దహనం పూర్తి చేసి, ఊరు విడిచి వెళ్ళిపోతుంది.

       నారాయణప్పకూ తనకూ మధ్యన ఉన్న అంతరాలరేఖ చెదిరిపోయిందని, తనూ నారాయణప్పలా

అయిపోయాడన్న స్పృహ కలగగానే,ప్రాణేశాచార్య  అపరాధభావనలో మునిగిపోతాడు.తీవ్ర అంతర్మథనం మొదలవుతుంది.ఆ తెల్లవారే,భాగీరథి, ప్రాణేశాచార్య భార్య కాలంచేస్తుంది.ఆమె దహనసంస్కారాలు పూర్తిచేసుకొని,అతను ఊరువిడిచి అడవి దారిపడతాడు.

       ఆ అడవిదారిన పోయే ఒక బాటసారి, పుట్ట (B.R.జయరాం) అతనికి తోడవుతాడు.పుట్ట ఒక మలేరి కులస్తుడు.తండ్రి బ్రాహ్మణుడు.తల్లి శూద్రవనిత. పుట్ట ప్రాణేశాచార్యకు బ్రాహ్మణేతర జీవితాన్ని పరిచయంచేస్తాడు.ప్రాణేశాచార్య లోని అపరాధభావం నుంచి, సందిగ్దత నుంచి,తన పై అచంచల విశ్వాసం కలిగిన తన ఊరివారిఫై తన బాధ్యత , ఒక అంటువ్యాధి తీవ్రంగా ప్రబలుతున్న అత్యవసర పరిస్తితిలో  తక్షణకర్తవ్యం  ఏమిటో  గ్రహించేవరకూ… ప్రాణేశాచార్యకు పుట్ట తోడుగా ఉంటాడు.ఒక సామాన్యుడిగా,లౌక్యుడిగా, సంసారిగా  పుట్ట ప్రాణేశాచార్యకు ఒక సమాంతరజీవనాన్ని పరిచయంచేస్తాడు. “పొడుపుకథల పుట్ట, వాగుడు కాయ పుట్ట అని అందరూ అంటుంటారు. నేనేమీ చిన్న బుచ్చుకోను.  మనుషులు ముడుచుకుపోయి ఉండడం చూసి ఊరుకోలేను. నాకు మనుషులంటే ఇష్టం” అంటూ. మనిషికి మనిషి తోడు అన్న సహానుభూతిని వ్యక్తపరుస్తాడు.  

     తనలో తాను కుంగిపోతోన్న పోతోన్న ప్రాణేశాచార్య, అడవి దారిన వాళ్ళ కాళ్ళకు అడ్డంగా  ఒక సర్పం రావడంకూడా గమనించడు.  పుట్ట దానిని ఒక్కవేటుతో చంపి ఆ పై, దానికి శ్రద్ధగా దహనసంస్కారాలు చేస్తాడు. కుబుసం విడిచి పాము  రెండు సార్లు జన్మిస్తుంది. ద్విజ కనుక దహనసంస్కారాలు చేయడం ధర్మం అంటూ. ప్రాణేశాచార్య కు ఒక్కసారిగా స్పృహవస్తుంది.’బ్రాహ్మణుడు రెండు సార్లు జన్మించే వాడే.ద్విజుడు.మరి, తనేమిటి నారాయణప్పను అలా వదిలేసి వచ్చాడు?’  

        ప్రాణేశాచార్య నిష్కామయోగం మోక్షమార్గం అని నమ్మి,దాంపత్యసుఖానికి వీలుపడని జబ్బుమనిషి భాగీరథిని వివాహమాడతాడు. పరమనిష్టతో, గృహస్తాశ్రమాన్ని నిర్వహిస్తుంటాడు.ఎంతో ఇష్టంతో ఒక పసిబిడ్డలా ఆమె ఆలనాపాలనా చూస్తుంటాడు.స్నానపానాదులనుంచి,ఔషధాలఇవ్వడం,వంటావార్పు అన్నిపనులు స్వయంగా చేస్తుంటాడు.అతని నిబద్దత కలిగిన వ్యక్తిగతజీవితం వలన,పవిత్ర వ్యవహారశైలి వలన,దుర్వాసపురంలోనే కాక చుట్టూ ఉన్న గ్రామాల్లోను, పీఠంలోనూ, గౌరవమర్యాదలతో వందనీయుడవుతాడు.

      చంద్రితో కలయిక, మానవ సహజ స్వభావానికి దూరంగా, ఇన్నాళ్ళు అతను బలంగా విశ్వసించి,ఇరవై ఏళ్ళపాటు ఘోటక బ్రహ్మచారిగా సంసారజీవితాన్ని జీవించిన అతని అలౌకికభావనలోని డొల్లతనాన్ని ఒక్కసారిగా బద్దలు చేస్తుంది.అతనూ అందరిలాంటి మానవుడే.మానవాతీతుడు కాడు.ప్రాణేశాచార్యలో ఒక స్పష్టత వచ్చి,తన వూరికి బయలుదేరడంతో కథ ముగుస్తుంది.

***

        1965 లో బర్మింగ్ హాంలో విద్యార్థి గా ఉన్న అనంత మూర్తి గారు, ఇంగ్మార్ బర్గ్మాన్ నిర్మించిన  నార్వేజియన్ సినిమా “ది సెవెంత్ సీల్ (1957)”  చూసినప్పడు కలిగిన  ప్రేరణతో “సంస్కార” నవలను  రచించారు.

వ్రాతప్రతిని  అనంతమూర్తిగారు గిరీష్ కర్నాడ్ కు పంపడం, గిరీష్ నవలను  నాటకీకరణ చేసిన నాటకవ్రాతప్రతి ని, “మద్రాస్ ప్లేయర్స్”నాటకసంస్థ కు చెందిన పఠాభి(తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి)గారిని, S.G.వాసుదేవ్ గారిని సంప్రదించడం, పఠాభి “సంస్కార”ను తెరకెక్కించాలనుకోవడం ,వెంటవెంటనే జరిగాయి.

         పఠాభి గారు నిర్మించి, దర్షకత్వం వహించగా, వారి సతీమణి స్నేహలతా రెడ్డి గారు ప్రధాన స్త్రీ భూమిక,చంద్రి, పాత్ర పోషించారు.  S.G.వాసుదేవ్ కళాదర్షకులు కాగా, టాం కోవన్ సినిమాటోగ్రాఫర్. సింగీతం శ్రీనివాస రావు గారు సహాయ దర్శకులు. గిరీష్ కర్నాడ్,(ప్రాణేశాచార్య),పి.లంకేశ్(నారాయణప్ప),స్నేహలతారెడ్డి (చంద్రి),బి.ఆర్. జయరాం(పుట్ట)మొదలగు వారు ప్రధాన తారాగణం.ఈ హేమాహేమీలందరూ , సాహితీవేత్తలు,కళాకారులు, పత్రకారులు,సామజిక కార్యకరతలు. ఆనాటీకి ఈనాటీకి ఆయారంగాలలో నిబద్దతతో నిలబడినవారు. నవలగా రేపిన దుమారంతో పాటూ, ఇందరు లబ్దప్రతిష్టులు పూనుకొని తీసిన సినిమాగా, గొప్ప అంచనాలతో ఈ సినిమా మొదలయ్యింది.

          ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ, ఉత్తమాభిరుచిని ప్రకటిస్తూ నిర్మించబడిన ఈ సినిమా, అటు కన్నడనాట ఎంత ప్రభావాన్ని చూపిందో భారతీయసినిమాపై అంతే ప్రభావాన్ని చూపింది.కన్నడ సినిమారంగాన సమాంతర సినిమాకు “సంస్కార” తెరతీసింది. అతి కొద్దిమేకప్, సహజత్వానికి దగ్గరగా ఉండే దుస్తులు, అలంకరణలతో పాటు, నాటకరంగానికి చెందిన వారు తారు తారాగణం కాగా, నవలలోని దూర్వాసపురానికి అతి చేరువలో ఉండే, “వైకుంఠపురం” అగ్రహారాన సినిమా తీయడం ఒక విశేషం. ఇది ఆనాటి మైసూరు రాష్ట్రం  లోని శృంగేరీ పీఠాని సమీపంలో ఉన్న అగ్రహారం. 2014 లో అనంతమూర్తి గారు అన్నట్లుగా, పరమనిష్ట అగ్రహారం అయినా, సినిమా చిత్రీకరణకు అక్కడి వారు అందించిన సహకారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.శృంగేరీ శారదా పీఠం వారు అభ్యంతరాలు లేవ నెత్తినా,అగ్రహరవాసులు సహకరించారు.  ‘కథ తెలిసి ఉంటే ఎలా స్పందించారో తెలియదు కానీ, ముఖ్యంగా ఆడవారు,ఎటువంటి అంటూసొంటూ లేకుండా టాం కోవెల్ ని,తమ వంటిళ్ళలోకి రానివ్వడం విశేషం.’ సినిమా విడుదల అనంతరం వైకుంఠ పురం ఒక దర్షనీయ స్థలం అయ్యింది. తెర ముందు వెనకా, ఇన్ని విశేషాలు ఉన్నప్పటికీ, 1969లో మద్రాస్ సెన్సార్ బోర్డ్ వారు ఏ కారణం చెప్పకుండానే,”సంస్కార” ను నిషేధించారు. నిషేధించబడిన మొదటి కన్నడ సినిమా కూడా ఇదే.యూనియన్ మినిస్ట్రీ  అండ్ బ్రాడ్ కాస్టింగ్ వారి ప్రమేయంతో, ‘సంస్కార’, 1970 లో విడుదల అయ్యింది.

         ఒక సినిమా ‘సంస్కార’ నవలకు ప్రేరణ అయితే, ఆ నవల ‘సంస్కార’ సినిమా కు ఆధారం అయ్యింది.

        నవల చదివి సినిమా చూడడమా, సినిమా చూసి నవల చదవడమా అన్న సంశయంలోనే ,  రెండింటినీ సమాంతరంగా తడిమి  చూస్తే,  ఒక నవలగా ఒక సినిమాగా దీనికి గల పరిమితులు అపరిమితులు అర్థమవుతాయి. 

నారాయణప్ప అంతిమ సంస్కారం తో మొదలయిన కథ అయినప్పటికీ,ఇది అంతటితో పరిమితమవదు.

పరాకాష్టకు చేరుకొన్న మూఢత్వం  నేపథ్యంలో, అటు పరమనిష్టకు, పరమభృష్టతకు అనివార్యంగా జరగవలసిన సంస్కరణలపై ఈ కథ దృష్టి నిలుపుతుంది.

         పట్నాలతో సంబంధాలు, రాకపోకలు కలిగిఉండి, పత్రికలు చదివే ,మంజప్ప సమకాలీన సామాజిక ,రాజకీయ మార్పులపై అవగాహనకై ప్రయత్నిస్తూ, ఆకళింపు చేసుకొనేప్రయత్నంలో,ఆధునికత వైపు అడుగులువేస్తున్నవాడు. నవల చివరికి పరివర్తనకు సిద్ధమైన ప్రాణేశాచార్యకు సమాంతరంగా, ఒక మెట్టుపైన నిలబడతాడు పారిజాతపురం మంజప్ప.

     కాళిదాసు శకుంతల వర్ణన రేకెత్తించిన మైకంలో,ఏటికి నీళ్ళకు వచ్చిన కడజాతి యువతి బెల్లిని, ఆమె ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండా,మాట మాత్రం మాట్లాడకుండా అనుభవించి, తాపం తీర్చుకొన్నవాడు,నారాయణప్ప శిష్యుడు, 

  శ్రీపతి. చివరికి బెల్లి అమ్మనాన్నలు,పిళ్ళా దంపతులు,ప్లేగుబారిన పడి చనిపోయినపుడు,వారిని వారిగుడిసెలోనే తగలబెడతారు వాడవాసులు.అంతా ఒక్కరోజులో జరిగిపోతుంది.తగలబడుతున్న గుడిసెను, అందులోని అమ్మనాన్నలను చూడలేక, దూరంగా పరుగులు పెడుతున్న బెల్లికి అడ్డంపడి,ఆమె ఆక్రోశాన్ని పట్టించుకోక, తన తాపం తీర్చుకొవాలని ప్రయత్నిస్తాడు శ్రీపతి.తన తాపంతీర్చుకోవాలని బలవంతంగా ప్రయత్నిస్తాడు శ్రీపతి. నారాయణప్ప నాటిన బీజాల్లొ మొలిచిన విషవృక్షం,పాశవికంగా దిగజారిన, శ్రీపతి.

       ప్రబలుతున్న ప్లేగువ్యాధి,ప్రాణేశాచార్య ముక్తి శోధన,భాగీరథి అనారోగ్యం, మహాదాసు కథ , శ్రీపతి ఆఘాయిత్యం,బాలవితంతువు లక్ష్మీదేవమ్మ గోడు, దశాచార్య ఆకలి చావు,ఇల్లు వదిలి, సైన్యంలో చేరిన శ్యామ, పుట్ట వంటి మిశ్రమ కులాల వారి స్థితిగతులు, ఇలా అనేకానేక ఉపకథలు నవలనిండా. ఇన్ని పొరలుపొరలుగా విస్తరించిన కథనం ముగింపు లేకుండానే పూర్తవడం ఒక విశేషం. ప్రతిపాత్రా మానవస్వభావాలను సహజంగా ప్రకటిస్తాయి.

       ముగింపులేని ‘ఓపెన్ఎండ్’ వలన, పాఠకులనుంచి రచయిత UR అనంతమూర్తి   అంచనాలేమిటో స్పష్టంగా ప్రకటించడమైనది. రచయిత కులవ్యవస్థ  నుంచి, అంటరాని తనం నుంచి తలెత్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు కోరుతున్నారు. అంధవిశ్వాసాలకు ,మూఢనమ్మకాలకు దహనసంస్కారం చేయమంటున్నా. సాంప్రదాయాల గుప్పిటలో కుంచించుకుపోయిన ఆలోచనలను,కార్యాచరణనూ సంస్కరురించుకోమంటున్నారు.

*

నవలలో పదాలతో కథ కళ్ళ ముందు ఊహాజనితదృశ్యం కనబడుతుంది. సినిమాలో దృశ్యాలతో ఊహాతీత భావనలను ప్రకటీంచాల్సి వస్తుంది.

సంస్కార  నవలలో నారాయణప్ప దహనసంస్కారం కథ మధ్యలోనే అయిపోతుంది.  ప్రాణేశాచార్య నోట సంస్కారం చేయవచ్చు అన్న మాట వినీ వినగానే, చంద్రి రహస్యంగా దహనం పూర్తిచేసి , ఊరు విడిచి వెళ్ళి పోతుంది.

నవలను సినిమాగా మలచినపుడు జరిగిన ప్రధానమైన మార్పు,సినిమా ముగిసినా సంస్కారం జరగదు. సంస్కారం  జరిపించాలన్న నిశ్చయంతో ప్రాణేశాచార్య ఊరిలోకి వెళతాడు.

చంద్రి కాకుండా ప్రాణేశాచార్య సంస్కారవిధులకు సిద్దమవడం వలన సినిమాలో అతనిపాత్ర ఔన్నత్యం పెరుగుతుంది.

బ్రాహ్మణ్యం గాడి తప్పినా, ఊరంతా అడిగినా ప్రాణేశాచార్య నారాయణప్ప ను ఎందుకు వెలివేయలేదు వంటి అనేక మౌలిక సందేహాలకు నవలలో సమాధానం దొరుకుతుంది.వెలివేస్తే నారాయణప్ప మహమ్మదీయమతంలో కలుస్తడని . డాన్న సందేహం.  రెండోది, ప్రాణేశాచార్యకు నారయణప్ప పై గల ఆపేక్ష.గాడితప్పిన మనిషి మార్గాన పెట్టవచ్చునన్న ఆలోచన, ఆదర్షభావంలతో పాటుగా,వారణాసిలోఅతని సహాధ్యాయి,మహాబలి, వలె,పండితుడు కాగల సమర్థత ఉండీ వేశ్యావాటీకల్లో  మునిగిపోతాడేమో అని. బాగీరథితోనూ, చంద్రి నగలు తిరిగిచ్చినపుడు,పుట్టతో వ్యవహరించేటప్పుడు, ప్రాణేశాచార్యలో ఒక సౌజన్య స్వభావం,హుందాతనం కనబడుతుంది. ఆలాగే, తొందరగా నిర్ణయం తీసుకోలేని అతని ధ్వైదీభావన కూడా ఒక కారణం కావచ్చు.

పఠాభి గారు సూటిగానే వివరించారు.‘సంస్కారం చేయాలన్న అంశంతో సినిమా మొదలయ్యింది. అది మధ్యలోనే పూర్తయితే, ప్రేక్షకులకు కథ తేలిపోతుంది.ఆ సంస్కారం ఎప్పుడు ఎలా జరుగుతుంది ?ఎవరు చేస్తారు? అన్న ఉత్కంఠే సినిమాను నడిపిస్తుంది.చివరికి ప్రాణేశాచార్య చేస్తాడన్న సూచన వలన, అతని ఔన్నత్యం పెరుగుతుంది. సినిమాకి హీరోయిజం దక్కుతుంది.’

       చంద్రి శూద్రమహిళ.వేశ్య. నారాయణప్పతో సహజీవనం చేస్తుంది.బ్రాహ్మణవీధిలోని అతని ఇంట్లోనే. వీధిలో స్త్రీలందరి  పెరళ్ళలో పూచే పూలు దేవునికి సమర్పించాక, ఆ తరువాతే,వారు ఆ వడలిన వాడిన పూలను తలలో తురుముకోగలుగుతారు.  నారాయణప్ప  పెరటిలో పూసే మల్లెలు, జాజులు అన్నీ  చంద్రి కోసమే. చంద్రి తలలో జాజి పూల మాల నాగుపాములా వేళ్ళాడుతూ ఉంటుంది.

చద్న్రి కి సినిమా మొత్తంలొ ఎక్కువ మాటలు లేవు. చంద్రిని పరిచయంచేసే మొదటి దృశ్యమే, ప్రాణేశాచార్య నారయణప్పను కలిసి,హితబోధ ఏయడానికి వచ్చినప్పుడు నారాయణప్ప అప్పుడు ప్రాణేచార్యకూ మద్యం సీసా ఇవ్వమంటాడు. చంద్రి మౌనంగానే నిరాకరిస్తుంది.అతను చనిపోగానేమొదట పరిగెత్తుకు వెళ్ళి వార్త చెప్పేది ప్రాణేశాచార్యకే. ఊళ్ళో పెద్దలందరు తర్జన భర్జనలు అప్డుతంటే, వెనక నుంచి బ్రాహ్మణస్త్రీలు ఎత్తిపొడుపులు,హేళనలు  చేస్తుంటే,మౌనంగా తన నగలు తీసి అరుగు మీద పెడుతుంది. మొదట నగలు, ఆ తరువాత అరటిపళ్ళు ,ఆపై తనను తానే సమర్పించుకొంటుంది. ప్రాణేశాచార్య నోట ఒక్క మాట వినడానికి అతని,అరుగునీడలో ఉంటుంది.అతని వెన్నంటే వెళుతుంది.తుంగానదివద్ద స్నాననికి వెళ్ళైనా మారుతిగుడిలో ధ్యానానికి వెళ్ళినా.

ఒక రకంగా, కథ ఎప్పుడు కదలక చతికల బడుతుందో అక్కడ చంద్రి, ఒక్క  చిన్న కుదుపు ఇస్తుంది.

 ఊళ్ళొ వాళ్ళు మఠానికి పరిష్కారానికి వెళితే, చంద్రి వూళ్ళో ఉన్న నారాయణప్ప స్నేహితుల దగ్గరకు వెలుతుంది.దహనం చేయమని కోరుతూ.చివరికి, ప్రాణేశాచార్య అంశ తనలో ఊపిరి పోసుకుంటే చాలని అనుకొంటూ ఎటో వెళ్ళి పోతుంది. చంద్రి తనే అతనిని ప్రేరేపించానని భావిస్తుంది. ప్రాణేశాచార్య మాత్రం, అనుకోని సమయంలో అనుకోని చోట, ఆకస్మాత్తుగా, చంద్రి రొమ్ములు తనను తాకగానే కలిగిన ప్రకంపనానికి చలించడం స్వయంకృతమే అంటాడు.మరలా ఆమె స్పర్ష కోసం తపిస్తాడు. అదీ కొద్ది సేపే. పుట్టన్న పద్మావతి అనే వేశ్య దగ్గరికి  తీసుకెళ్ళినప్పుడు, నిలవలేక తిరిగి వచ్చేస్తాడు. చంద్రికి తన పట్ల తనకు స్పష్టత ఉంది.ఆమె పరిమితులు తెలుసుకొనే మసలుతుంది.

               అన్ని అణిచివేతల మధ్యన,ఎక్కడికక్కడ తిరుగుబాటు ఉంటుది. శ్రీపతి భార్య అతనిని కలవనీయదు. “కాళ్ళు మెలివేసి, తొడలు బిగబెట్టి” అతనిని ఎలా దూరంగా పెట్టాలో ఆమెకు తెలుసు.మరోపక్క, శ్రీపతికి తోచినప్పుడల్లా,వెళ్ళే బెల్లి చివరికి,ఆమె ఆమ్మనాన్నలు గుడిసెతో సహా తగలబడుతుంటే కూడా, వదలడు. బెల్లి మొదటి సారి అతన్ని దూరంగా తరిమేస్తుంది. ఇదంతా భూతప్రేతాల పని అని. ఇప్పుడు అక్కడ నుంచి  వెళ్ళక పొతే అవి అతనిని కబళిస్తాయని. శ్రీపతి కిందా మీదా పడుతూ అక్కడినుంచి బతుకు జీవుడా అని పరిగెత్తుతాడు. 

బ్రాహ్మణ స్త్రీలకు, మెలారి స్త్రీలకు  కుటుంబబంధనాలలో ఎక్కువ బేధం లేదని తెలుస్తుంది. చంద్రి కి ఉన్నంత స్వతంత్రం వారికి ఎన్నడూ లేదు. ఇంటీకి వంటకి పిల్లలకి పరిమితమైన వారి జీవితాలలొని , అణగారిన ఆలోచనలను ఈ నవలలో చూడొచ్చు.

ఇలా ఈ కథను తరిచిచూస్తున్న కొద్దీ తవ్వెడు.అన్నింటి మూలసూత్రం ఒక్కటే , మానవ స్పర్శ .

నిరంతరం ఎవరికి వారం,ఎప్పటికప్పుడు సంస్కరించుకోవడంలోనే ,సజీవంగా మిగిలేది వెలిగేది మానవ సంస్కారం.

ఆ క్రమంలో ఎన్నో మూఢభావనలకు దహనసంస్కారం తప్పదు.అది తప్పని పరిస్థితులు తప్పక ఎదురవుతాయి. 

అది సత్యం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.