క్రిమి సమ్మారం

-డా||కె.గీత

క్రిమి సమ్మారవంటన్నారు ఏటి బాబయ్యా!

ఈగలకి ఇసనకర్రలు

దోవలకి కిరసనాయిలు

ఎలకలకి ఎలకలమందు

పందికొక్కుకి ఎండిసేప ఎరా

సీవలకి సీనా

సెదలకి పొగ

వాపుకి సున్నం

పుండుకి కారం

తేలు కుట్టినా, పాం కుట్టినా

సెరువు కాపరి మంత్రం

జొరవొచ్చినా, జబ్బు సేసినా

పీరుసాయెబు తాయెత్తూనండి

పూనకానికి యేపమండా

దెయ్యానికి దెబ్బలూనండి

పొద్దల్లా సేలో

కాళ్లని ఏళ్లాడే జెలగలకి పొగాకు ఉమ్ము

మేకల్ని తరివే తోడేలుకి ఉండేలు దెబ్బ

పిట్టలకి వొడిసి రాళ్లు

పందులుకి ఈటె పోట్లు

పొగులూ, మాపులూ

క్రిమి సమ్మారవేనండి-

ఇప్పుడు ఆరడుగుల దూరవంటన్నారు

ఊరూరూ తిరిగేవోళ్లం

ఎప్పుడూ ఊరికీ మాకూ

ఆరు కోసుల దూరవేనండి

ముక్కుకి గుడ్డలంటన్నారు

వొంటి నిండా గుడ్డలేయి బాబయ్యా

ఓ సబ్బు ముక్కుంటే

సేతులేం కర్మ ఒళ్లంతా తోంకుంటాం

రకతాలు కారతన్న పాదాలకి

సెప్పుల జతుంటే

పేణాలు ఈడ్సుకుంటా గూడేనికి సేరుతాం

ఇంతెందుకు

మడిసిని మడిసిగా సూడని

“క్రిమి”ని సమ్మారం సేసే

మందేవైనా ఉంటే

అందరికీ ఇప్పించండి బాబయ్యా!

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.