నల్ల పాదం

-సతీష్ బైరెడ్డి

 

మేము శ్వాసిస్తే సహించలేరు

మా విశ్వాసాన్ని భరించలేరు

శతాబ్దాలుగా  మా స్వేచ్చా కంఠాలపై

శ్వేత ఖడ్గాలు వేలాడుతూనే ఉన్నాయి.

మేమంటే హృదయము,మేధా లేని

ఒట్టి  నల్ల రంగే

పుట్టుకతోనే నిషిద్ధ

మానవులగా మారిన వాళ్ళం

మా కలలు నిషిద్ధం

మా కదలికలూ నిషిద్ధం

అగ్ర రాజ్యంలో పేదరికంతో

పెనవేసుకపోయిన జీవితాలు మావి

నల్ల జాతిని నేరానికి చిరునామా

చేసింది  శ్వేత రాజ్యం

పీఠాల  మీది బతుకులు వారివైతే

పాదాల కింద నలిగిన ప్రాణులం మేం

మేం”బ్లాక్ మెయిల్” గాళ్ళం

మేం “బ్లాక్ షీప్” లం

మేం”బ్లాక్ క్యాట్” లం

మేం”బ్లాక్ క్లాత్”లం

మాదంతా “బ్లాక్’ లక్కే

నాగరికత లెక్కల్లో

నల్ల దేహాల లెక్కలు లేకున్నా

పోలీస్ స్టేషన్ నిండా మా ఫోటోలే

కమిలే దేహాలు మావే

కాలుతున్న చితులూ మావే

గాయ పడిన నల్ల గుండెల

లోయల లోతుల్ని చూడగలరా…

అంతు చిక్కని లోతుల్లో

ఘనీభవించిన మా దుఃఖ సముద్రాన్ని

తడమగలరా..

వేల ఏళ్ల మా వెర్రి ఏడుపుల్ని

ఈ నేల మీది గాలంతా మౌనంగా

వీక్షిస్తూనే ఉంది

మా పాద ముద్రల్ని పట్టగలిగే

పరికరాలున్నాయి గానీ

మా గుండె మంటల్ని

నమోదు చేసే రాడార్లేక్కడున్నాయి

తెల్లని మృగమేదో తెగ వేటాడుతున్నది

ఇక చాలు…

మా మెడల మీద మోకాళ్ళు మోపే

చరిత్రకిక చరమ గీతం పాడాలి

పొక్కిళ్ళయిన మా దేహ వాకిళ్లపై

వెన్నెల ముగ్గులేయాలి

నల్లని గీతాల నగారా మోగుతున్నది

నేల నలు దిక్కులా నల్ల కలువల

దండు దరువేస్తున్నది

శ్వేత సౌధం మీద నల్ల

పాదం మోపనున్నది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.