చీకటి పెట్టెలు

-కొండేపూడి నిర్మల

“అమ్మానాన్నెప్పుడొస్తారు ?” ఎడబిడ్డ అడిగాడు

వస్తారు బాబూ , తెల్లారి బ౦డికి వస్తారు

చండి బిడ్డను ఎత్తుకుని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆమె అన్నది

దూరంగా జెర్రిపోతులాంటి రైలు చీకటి పెట్టెల్ని

ఈడ్చుకుంటూ పరిగెడుతోంది

“అమ్మా నాన్న మిఠాయి తెస్తారా ?”

తెస్తారు బాబూ పెద్ద పెట్టెనిండా తెస్తారు

ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిన బుగ్గమీద ముద్దు పెట్టి చెప్పింది

తెల్లారుతూనే ఒక పెట్టెను సాయంపడుతూ

కొంతమంది మనుషులొచ్చారు

“అమ్మా ఈ పెట్టె నాన్నప౦పించేదేనా “

అమ్మ జవాబు చెప్పలేదు కుప్పకూలిపోయి ఏడుస్తోంది

ఏం అర్ధం అయిందో తెలీదు వళ్ళో చంటిబిడ్డ గుక్కపెట్టాడు

“అదిగో నాన్న ఆ బండిలో వస్తారు  చూడు “

తమ్ముడ్ని ఎత్తుకుని కిటికీ వైపు  చూపిస్తూ అన్న జవాబు చెప్పాడు

జెర్రిపోతులాంటి రైలు చీకటి చీకటి పెట్టేల్ని ఈడ్చుకుంటూ పరిగెడుతోంది


*****

Leave a Reply

Your email address will not be published.