స(ప్త)మస్త ఋతువుల సంవేదన ఆమె కవిత్వం

(ఏడో ఋతువు కవితా సంపుటి పై సమీక్షా వ్యాసం)

-వురిమళ్ల సునంద

వైష్ణవి శ్రీ గారి పేరు వినగానే కవి సంగమం లో విరివిగా కవితలు రాస్తున్న కవయిత్రి గా స్ఫురణకొస్తారు. 
దారి దీపమై ఎందరో కవులకు దిశానిర్దేశం చేస్తున్న శ్రీయుతులు కవి యాకూబ్ గారు ప్రారంభించిన కవి సంగమం చెట్టు పై మొట్టమొదటగా 2015లో తానూ ఓ చిన్న పిట్టలా వాలానని అంటారు కవయిత్రి.
ఆలస్యంగా కవితా సృజనకు పూనుకున్నా వీరు తన కవితలతో కవి సంగమం లోని ఎందరో తలపండిన , వర్థమాన కవుల అపూర్వ అభిమానాన్ని చూరగొనడం విశేషం.
కవిత్వం రాయడమనేది ఎప్పుడు మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు. తాను రాసిన కవిత్వం సమాజంలోని అమానవీయ, అసమానత,కుల వివక్షత లపై  ఎక్కుపెట్టిన శరమై చదువరులను ఆ దిశలో ఆలోచింప జేస్తుందా లేదా అనేది ముఖ్యం.అందులో  వైష్ణవి శ్రీ గారు సంపూర్ణంగా కృతకృత్యులయ్యారనడానికి వీరి కవితా సంపుటి లోని కవితలే నిదర్శనం.
కవిత్వమంటే ఏదో ఉబుసుపోకకు రాసుకునేది కాదు.ఏవో నాలుగు మాటలు ఏర్చి కూర్చి అదే కవిత్వమంటే సరిపోదు. కవిత్వం ఒక ఆత్మ కళ.అంతర్లీన హృదయానుభూతుల సమాహారం. కవిత్వం రాయడమంటే తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను, వేదనా భరిత జీవితాలను అవలోకించినపుడు సహానుభూతి చెంది, తద్వారా హృదయాంతరాళలో పెల్లుబికే  భావోద్వేగాలకు అక్షర రూపం ఇవ్వడమే కవిత్వం.చుట్టూ ఉన్న పాఠక లోకాన్ని హృదయ సంవేదనలకు లోను చేసి సరికొత్త భావనా ప్రపంచంలోకి నడిపించడం.
కవి గానీ, కవయిత్రి గానీ కవిత్వం రాస్తున్నారంటే వారు తమ అంతరంగాన్ని నిత్య నూతనంగా ఆవిష్కరించుకోవడం.సమాజం పట్ల బాధ్యత వహిస్తూ , తమను కదిలించిన సంఘటనను, సమస్యను, సన్నివేశాన్ని, సంఘర్షణతో కూడిన జీవితాన్ని నిర్మొహమాటంగా, నిర్భయంగా సజీవతను నింపి అక్షరాల్లో వ్యక్త పరుస్తూ పాఠకుల ముందు నిలబడే సాహసం చేయడమే.అలాంటి పైనే చేశారు కవయిత్రి.ఇలా ‘కవి గానీ కవయిత్రి గానీ తన జీవితంలో అనేక జీవితాలు జీవిస్తారని’ ప్రముఖ ఉర్దూ కవి మఖ్దూం అంటారు.
ఈ కవితా సంపుటిలో ఉన్న 78 కవితలను సమాజం లోని అనేక అసమానతలపై శరాలుగా సంధించి తనదైన ముద్రతో పాఠకుల ముందు నిలబడతారు.వారిని స్పందింప జేసి ఆలోచింప జేస్తారు.
వీరి మొదటి కవిత ‘ *వాడిన* *విశాఖ* ‘కవయిత్రి విశాల వాసి కావడం వల్ల కావచ్చు మొదటగా తన జన్మభూమి అయిన విశాఖ తను చూస్తుండగానే ఎంతగా మారిపోయిందో కవిత చెందుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి పేరుతో నెలకొల్పిన పరిశ్రమల కాలుష్యం వల్ల అందమైన విశాఖ ప్రస్తుతం కన్నీటి గాయం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. ‘సాగర గర్భాన్నుంచి/నీళ్ళోడి విప్పారిన విశాఖ .‌..అనే  చక్కని ఎత్తుగడ తో ప్రారంభించిన ఈ కవితలో నీళ్ళోడి విప్పారడం అనే కొత్త పదబంధం సాగర గర్భాన్నుంచి ఉదయించిన విశాఖ అని చెప్పడం కవయిత్రి సృజనకు చక్కని ఉదాహరణ.
ఇందులో” ఇప్పుడు తీరం అంచున కాలుష్యపు ఏతమెక్కి గువ్వ పిట్టయింది” అని రాసిన కవిత ఏ ఒక్క విశాఖ విషయంలోనే కాదు నేడు ఎన్నో అందమైన పట్టణాలు చారిత్రక నేపథ్యం ఉన్న వన్నీ నేడు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని కన్నీటి గాయాలవుతున్నాయి.
అందుకే కవయిత్రి అంటారు “చేయాల్సిందల్లా ఒక్కటే/తడి ఆరని మట్టిలో/విశాఖ ను చిగురింప జేసే పిడికిలి … కావాలని..ఈ విధంగా పాఠకులను కర్తవ్యోన్మఖులను చేస్తారు.
నేటి బంధాలు అనుబంధాలన్నీ అంతమవుతున్న ఆప్యాయతల నడుమ వాస్తవాలతో పోరాడలేక అస్తిత్వం తో ఓడలేక “జీవిత నౌకను ఒడ్డున చేర్చాలనే ఆరాటంలో/అనుబంధాల బేరసారాలతో../నే  బాధను “బతుకు బండి ‘కవితలో వ్యక్త పరుస్తారు.
“జీవన వాహిని” కవితలో జీవితం అంటే ఏమిటో ..ఎంత గొప్పగా నిర్వచిస్తూ రాశారో ఈ పంక్తులు చదివితే తెలుస్తుంది” జీవిత మంటే….
జ్ఞాపకాల గాళ్ళ సందుల్లోంచి నడిచే/అనుభూతుల నడక/ ఎర్రగా విచ్చిన మందారపు గాయాల మధ్య/నలిగే క్షణం/
నిర్వేద నైరాశ్యాల మధ్యనో గెలుపు/ హర్షాతిరేకాల మధ్యలో ఆడే ఊగిసలాట/పొత్తిళ్ళ నుండి మృత్యు కుహరం దాకా/బ్రతుకు నీడ్చే మెలోడ్రామా….. అని . జీవితాన్ని కాచి వడపోసిన ఈ పంక్తులు చాలు కవయిత్రికి జీవితాలపై ఎంతటి అవగాహన ఉందో..
“స్నేహ గీతిక”లో’…. నీ జ్ఞాపకంగా నీ శ్వాసని/ నా గుండెలపై వీలునామా రాసేసుకున్నాను కదా/..అనంత వాయువుల్లో కలిసిపోయే క్షణాల్లో సైతం/ ఆనందంగానే సాగుతుంది మరి/ అంటూ ఒకసారి స్నేహం చేయిపట్టుకుంటే అది జీవితాంతం కొనసాగాలాలని స్నేహం విలువను చక్కగా రాశారు.అలాగే ..’ఏదీ ఆశించని  త్యాగ గుణం /కన్నవారికి తప్ప ఎవరికుంటుంది/? అంటూ “కన్నీ’ళ్ళ భారం కవితలో తన బాల్యాన్ని నెమరేసుకుంటూ ఆ త్యాగ మూర్తులకు ఎంత ఇచ్చినా ఋణం తీరదు కానీ .. “ప్రతి ఉదయాన్ని కన్నవారితో/ వెచ్చటి పొద్దులా చుట్టేసుకుందాం../జీవితమంతా చల్లని సాయంత్రమవుదాం..అనడంలో వెచ్చని పొద్దు నిరాశా నిస్పృహలు తొలిగించే చైతన్యం,, చల్లని సాయంత్రం పడమటి సంధ్యలో వాలే దేహాలకు చక్కని ఓదార్పు ప్రశాంతత కలిపించడం”… అందుకే “సినారె గారు అంటారు కప్పి చెప్పేది కవిత్వం అని” ఈ వాక్యాలు చాలు కవయిత్రి సృజనకు..
“దేహమేరా దేవాలయం” అన్న కవితలో ‘సాటి మనిషికి సాయపడని మనిషితనమెందుకో/ పరాయి కులపోడని వెలివేసె అవిటితనమెందుకో/ మనిషిననే గర్వాన్ని/ మానవత్వపు ముసుగులో/ దేహమంతా కట్టుకుంటాడు..నేటి మనుషుల నైజాలను విమర్శిస్తూ  దేవాలయం లాంటి దేహాన్ని ఎలా కలుషితం చేసుకుంటున్నాడో .. సమాజంలో పెద్దమనిషి తరహాగా జీవిస్తూ లోలోపల ఎంతటి అపకారాన్ని తలపెడుతున్నాడో తెలిపే కవిత ఇది. ఇలాంటి కవితలతో మనిషి ఎలా వుండాలో ఎంత చెప్పినా మారుతారా సందేహం.
కవిగా తనకేం కావాలో  ఈ సమాజంలో తానెలా ఉండాలని కాంక్షిస్తున్నారో తెలిపే కవిత” కొన్ని క్షణాలు” ఇందులో అంటారు “
“నాకంటూ కొన్ని క్షణాలు కావాలిప్పుడు/ నన్ను నన్నుగా నాలో నేనుగా/ నాదైన లోకంలో విహరించే/ నాలో నేను ప్రవహించే క్షణాలు” అంటారు ఇలా ఏ కవి అయినా తనలోకి తాను ఆంతరంగిక ప్రయాణం చేయకుండా కవిత్వాన్ని సృజించలేరు. తన లోలోతుల్లోకి తవ్వుకుంటూ తనను తాను వెతికి పట్టుకొని శిల్పంగా మలుచుకోవాలని ,తన ఉనికిని చాటుకోవాలని ఉంటుంది.. జీవితం గురించి ఇంతకు ముందే చక్కటి నిర్వచనం ఇచ్చిన వీరే “”కొన్ని జీవితాలు ఇంతే” నంటూ రాసిన కవిత చదువుతుంటే మన చుట్టూ ఉన్న కొందరిని చూసినప్పుడు ఇవెంత అక్షర సత్యాలో తెలుస్తుంది…. ” కొన్ని జీవితాలంతే/ చిగురించనూ లేవు/ మరణించనూ లేవు/ గెలవనూ లేవు/ ఓడిపోనూ లేవు/
శూన్యానికి మిధ్యకు మధ్య/ జీవశ్చవంలా వేలాడుతుంటాయి/.. ఇక్కడ కవయిత్రి ఉపయోగించిన పదాలు శూన్యం మిధ్య అనడం ఒకేలా అనిపించినా శూన్యం అంటే ఏమీ లేని స్థితి అయితే మిధ్య అంటే భ్రమకు లోనవ్వడం అన్నమాట.. ఇంకా ఈ కవితలో “నడకలు నిద్ర పోతాయి/ కలతలు విడవడనంటాయి/స్వప్నాలు నడవనంటాయి/ఊహలు జనించనంటాయి/ఓదార్పుకు ఆందనంటాయి… అనడంలో చైతన్య వంతంగా ముందుకు సాగాల్సిన నడక కుంటుపడి వ్యధాభరిత జీవితాలు మానవత్వపు జీవమందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని అర్థం. బలమైన పదజాలంతో కవయిత్రి కి భాష పట్ల,భావం పట్ల గల పట్టు అర్థమవుతుంది.
“అగ్ని పునీతలు” కవితలో “మనిషిలో మానవత్వపు జాడల కోసం ప్రాకులాట!/అగ్ని పునీతనైన నా నవ్వును రక్షించే/నా మాలి కోసం వెతుకులాట!!… అంటూ రాసిన కవితలో జీవితమనే తోటలో వికసించే ప్రతి పువ్వుకు,రెక్కకూ ఉన్న మాలీలు పెట్టే శీల పరీక్షలో అగ్నిపునీతలైనా అడుగడుగునా ఆనందాన్ని హరించే మాలులతో ” స్వచ్చమైన గాలుల స్వేచ్ఛలు/ పంజరాన చిక్కి విషాదరాగాలందిసైతున్నాయి..అంటూ రాసిన కవితే కాకుండా ‘ప్రాతి వత్యం ప్రబోధాలు'” అనే కవితలో కూడా పురుషాహంకార ఆధిపత్యంలో స్వేచ్ఛను కోల్పోయిన మహిళల వేదనలు కనిపిస్తాయి.”కర్కశ కామపు ఇనుప కట్టడాల కింద/నలిగి నస్వరమయ్యే శరీరాన/ అమ్మతనాన్ని చిగురింప చేసే/ తెలివైన పురుషాధిక్య ప్రపంచం…
ఆడదాని ఆరు ఋతువులన్నీ/మృగాడి బంధిఖానే/అవసరమైనప్పుడల్లా… అంటూ  ఆవేదన వ్యక్తం చేశారు. 
ఇక “చెల్లని నోటు” కవితలో దేశమంతా గందరగోళం సృష్టించి పేద వాళ్ళ బతుకులను చెల్లా చెదురు చేసిన నోట్ల రద్దు సమయంలో  ప్రజల పాట్లను చూసి చలించి రాసిన కవిత ఇది.” దొంగను పట్టడానికి/ సామాన్యులను ఎరవేసినట్లుంది/ చెల్లని నోటు చేస్తున్న హల్ చల్ చూస్తుంటే… నల్ల ధనాన్ని వెలికి తీసే ప్రయత్నంలో సామాన్యుల బతుకులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయో కళ్ళకు కట్టినట్లు చూపించే కవిత ఇది.
సమాజంలో జరుగుతున్న ఏ సంఘటనను వదిలి పెట్టలేదు కవయిత్రి. తలాక్ లోని లోపాలను ఎత్తి చూపుతూ వాళ్ళలోని మూఢాచారాలు ఆడవాళ్ళ పాలిట ఎలాంటి అన్యాయాన్ని మూటగట్టుకుంటున్నాయో  చెబుతూ కుబూల్,తలాక్ పద్ధతులు వద్దంటూ రాసిన కవిత మతాచారాల్లోని లోపాల్ని గురించి ఆలోచింపజేస్తుంది.
“నమ్మకాన్ని చివరి అంకం వరకూ నరుక్కుంటూ వచ్చావు/ ఇక మిగిలింది చిగురులు వేయలేని/ మోడని తెలియక కాదులే/ ఆ మోడును కూడా మట్టి కరిపించ గల/ మొగత్వం నీది/….
నిలువుటద్దాన్ని పగులగొట్టి నేను బాగున్నానా?/అంటే ఏం సమాధానమిస్తుంది/ఎప్పటికీ అతుక్కోలేని ఈ ముక్కలు.. “రాయబారాలు” కవితలోని ఈ పంక్తులలో కొత్త పదం మృగాళ్ల బదులుగా మొగత్వం అనే పదం వాడి తన నిరసనను కొత్తపదంతో వ్యక్తం చేశారు.నిలువుటద్దం లాంటి మనసును ముక్కలు చేసి  బాగున్నావా అంటే  ఎలాంటి సమాధానం వస్తుంది ముక్కలైన అద్దపు ముక్కలు ఏం చెబుతాయి.. పాఠకులకే ఆలోచించమనే కవిత..
(సం) ..వేదన కవితలో ఆడవారి జీవితం గురించి రాస్తూ “ఎన్ని కంటకపు కిరీటాలను ధరించిందో ఆమె/ గాజు నదిగ మారిపోయిందిప్పుడు/ ఆ కళ్ళలో ప్రవహించేవన్నీ యాసిడ్ దాడులు/ నెత్తిన మోస్తున్నవన్నీ ఎప్పటికీ కడతేరని బాధ్యతల కెరటాలు/ అంటూ జరుగుతున్న దుర్మార్గమైన దాడులకు  ఆమె మనసు ఎంత క్షోభకు గురవుతుందో… ఎన్ని అవమానాలను భరిస్తుందో .. “నిజానికి ఆరు కాలాలకనుగుణంగా/ స్పందించే ఏడో ఋతువు ఆమె అంటారు..
“మనసు ఎరుపెక్కుతోంది” కవితలో “అదిగదిగో ఎర్రటి రంగు వాసన/ మెదడులోని నరాలన్నింటినీ రగిలిస్తోంది/ ఉరితాడుకు వేలాడిన విప్లవకారుడి చివరి శ్వాస/ నా చుట్టూ తచ్చాడుతోంది/ నాలోని బానిసను చంపమని / నన్ను ఉసిగొలుపుతోంది. ‌.. అంటూ నిరాశ నిస్పృహలను వదిలి ఆశయం కోసం బతుకమని, గెలిచే వరకు చావొద్దంటూ/ పోరాటాన్ని విడవొద్దంటూ/.. విప్లవ వీరుల మరణం  చివరి శ్వాస స్ఫూర్తి సందేశం ఇస్తుందంటారు. ఎరుపెక్కే ఎండలకు సముద్రాలే తలవంచుతాయనీ, ఎరుపెక్కిన శ్రామికుడి గర్జనకు సామ్రాజ్యాలే కూలిపోతాయని  పోరాడితే పోయేది ఏమీ లేదు అన్న మహా కవి మాటలను గుర్తుకు వచ్చేలా
మొక్కవోని తన నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తారు.
అమ్మ చేతుల గాజుల అలికిడి తో తడిసిన /ఆప్యాయతల నక్షత్రాల వాన../ ఇప్పటికీ కురుస్తూనే ఉంది..నా మనసు తోటంతా.. అంటూ అమ్మ ప్రేమ ఆనాటి బాల్యం ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చినుకు పువ్వులు కవితలో..
ఇంకా ఇందులో బడి కెళ్ళే పిల్లవాడిని ర్యాంకులు మెదడును ఎలా మొద్దు బారుస్తున్నాయో, సారే జహాసే అచ్చా ,బడంటే ఇదేనా కవితల్లో  వాపోయారు.భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం ఎలా ఉండాలో చెప్పే సున్నితమైన కవిత ‘రంగు రంగుల పువ్వులు తెచ్చి ఒడిలో కుమ్మరించాడతడు/….తలలో తురుము కుంటాను సరే/ఆప్యాయంగా నా తల నెప్పుడైనా నిమిరావా/నా కళ్ళలో భావాలను చదవగలిగావా/కంటి చివరి తడిని స్పృశించావా…ఈ మాటలు చాలు..ఆమె హృదయం ఎంత వేదన మోస్తుందో..
రైతు గురించి.. మట్టి వీరుడు కవితలో ” నీటి చుక్కకై చూపును ఆకాశానికి కట్టేస్తాడు…ఆకలంతా పోగేసి ఆకుమళ్ళు పోసి/ మడిమడిని తన చెమట చుక్కతో తడిపి..గింజ పుట్టేదాకా/ గుండెను పంట పొలానికి కట్టేసుకుంటాడు…ఇంత చేసినా రైతుకు చిత్రంగా ఆకలే బహుమతిగా మిగులుతుందని/అప్పు ఒక్కటే శేషమై వెక్కిరిస్తోంది అంటూ ఆవేదనతో రాసిన ఈ కవిత నేటి రైతు దుస్థితిని తెలియజేస్తుంది.న్యాయం కోసం  రోడ్డెక్కిన రైతుల గురించి లాల్ సలామ్” కవితలో ఇప్పుడు నీ పాదం, రక్తం చిందిన ఆ పాదం/ విల్లు ఎక్కు పెట్టిన ఏకలవ్యుడి బాణం/… ఆశయాన్ని నాటిన వాడికి/ నెత్తుటి పోరాటాలొక లెక్కా/ సముద్రమంత పొలికేక ను/ సమాజంపై విసిరిన నీవు,విత్తునే కాదు/ విప్లవాన్ని మొలకెత్తించగలవు..అంటూ రాసిన కవిత అజాత శత్రువే అలిగితే ఆవేశపడితే ఏమవుతుందో చెబుతారు.
ఇలా ఒకటేమిటి సమాజంలో జరుగుతున్న అనేకానేక సంఘటనలు మనసును కదిలించిన వెంటనే కవిత్వమై స్పందించారు, ఆవేదన చెందారు, ఓదార్చారు, పిడికిలి బిగించి కర్తవ్యం బోధించారు.చప్పుడు చేయని మరణం/ చెప్పి రాదు/రాకుండా వుందన్నది నిజం/ఏడ్ఛేవాళ్ళు ఎందరుంటేనేం/బతికిన క్షణాల్లో పలకరించని నిజాలు”.‌.. అంటూ తాత్విక కోణంలో మానవ సంబంధాల గురించి రాశారు.ఈ కవితా సంపుటిలో వైయక్తిక వేదనలు,పేద కుటుంబాల సంవేదనలు, శాపగ్రస్త జీవితాలు, శ్రమైక జీవన సౌందర్యం గురించి మానవీయ కోణంలో స్పందిస్తూ స్నేహం ప్రేమ అనుబంధాలు ఆత్మీయతల గురించి రాసిన ప్రతి కవితా హృదయాన్ని కదిలించేదే… 
ఇంత మంచి కవితా సంపుటి అందించిన శ్రీమతి వైష్ణవి శ్రీ గారికి హృదయపూర్వక అభినందనలు.మరెన్నో కవితలు వారి కలం నుంచి జాలువారి మరో కవితా సంపుటిని వెలువరించాలని కోరుకుంటున్నాను.
 

 *****

Please follow and like us:

One thought on “స(ప్త)మస్త ఋతువుల సంవేదన (ఏడో ఋతువు కవితా సంపుటి)”

  1. మీ కవిత్వం చదివి వంట బట్టించుకున్నవాళ్ళు కొద్దో గొప్పో కవిత్వం రాయగలుగుతారు ఎందుకంటే మీ కవిత్వం భావాల భాండాగారం…మష్తష్కంలోని ఆలోచనలను జాగృతంచేసే ఉషోదయం .

Leave a Reply

Your email address will not be published.