సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు

-అనురాధ నాదెళ్ల

 సాహిల్ వస్తాడా? ఏమో… నమ్మకాన్ని కలిగించే పరిస్థితులేవీ?!

వర్తమానంలో బతకమంటూ ఇప్పుడు చాలామందే చెబుతున్నారు. ఇదివరకెప్పుడూ వర్తమానానికి ఇంత ప్రాధాన్యం లేదా అంటే ఉంది. వర్తమానాన్ని present అని పిలుచుకోవటంలో ఉన్న అర్థాన్ని ఇప్పుడు మరింత వివరంగా చెబుతున్నారు. వర్తమానం మనకు ఒక బహుమతిలాటిదట. 

జరిగిపోయినది ఎటూ జరిగేపోయింది కనుక ఆలోచించి చేసేదేం ఉండదని కాబోలు. రాబోయేకాలం గురించి కలలు గనేంత సమయం, భరోసా లేవన్నది నేటి నిజం. అందుకే వర్తమానం మనకు ప్రియమైనది. 

కానీ వర్తమానం కూడా అగమ్యగోచరంగా, అస్తవ్యస్తంగా ఉన్నదొక సమాజపు పార్శ్వానికి.

మనచుట్టూ రాజకీయంగా, సామాజికంగా వస్తున్న మార్పులు, అవి జీవితాలమీద చూబిస్తున్న ప్రభావం గమనిస్తున్నప్పుడు ఎందరివో మనసుల్ని నొప్పిస్తున్నవి, మరెందరివో బతుకుల్ని దుర్భరం చేస్తున్నవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం గురించి ఘనంగా చెప్పుకునే మనదేశంలో మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయని తోస్తోంది. లేని లక్షణాన్ని ఎక్కువగా చెప్పుకునే అతిశయం నవ్వులపాలవుతోంది.

ఇటీవల ‘‘సాహిల్ వస్తాడు’‘ కథా సంపుటిని చదువుతున్నప్పుడు కథలన్నింటి వెనుకా ఉన్నఒకేఒక అంశం ఒక వర్గానికి చెందిన అస్తిత్వానిది, అది ఎదుర్కొంటున్న సవాళ్లది. రచయిత సామాజిక, సాహిత్య శాస్త్ర విషయాల్ని అవగాహన చేసుకుని, వాటిని జీవికగా ఎంచుకున్నవాడే కాక ప్రపంచాన్ని పరిశీలనగా చూస్తూ, అనుభవాల్ని పోగేసుకుంటున్న విద్యావంతుడు. 

మతం అన్నది వ్యక్తిగత నమ్మకం కాకుండాపోతూ ఎలాటి చేదు అనుభవాల్ని కలిగిస్తోందన్నది ఇందులో చూస్తాం. ఇక్కడ చెప్పిన అనుభవాలు, కనిపించే సన్నివేశాలు కూడా కల్పితం కాదని చదివే అందరికీ తెలుసు. మతం మనుషుల జీవితాలకి శాంతిని, సంతోషాన్ని, భరోసాని కాకుండా కేవలం దుఃఖాన్ని, అస్థిమితాన్ని, వేదనని ఇస్తూ అభద్రతతో కూడిన రేపటిని ఇస్తోంది. ఈ మాటలు ఒకరు చెప్పటం కాదు. కనిపిస్తున్న నిజం. 

ఈ పుస్తకం ముందుమాట జోలికి వెళ్లకుండా నాదైన అభిప్రాయానికి రావాలని కథలు చదవటం మొదలెట్టాను. 

ఒక్కో కథ చదువుతుంటే క్రితం సంవత్సరం చదివిన ‘‘కథామినార్’‘ కథా సంపుటి గుర్తొచ్చింది. అందులోనూ ప్రభుత్వమూ, వర్గాలుగా విభజించబడిపోయిన సమాజమూ తీసుకుంటున్న నిర్ణయాలకి, చర్యలకి తమ అస్తిత్వానికి కలుగుతున్న గాయాల్ని గురించి రచయితలంతా ఆవేదనతో చెప్పుకొచ్చారు. ఎక్కడా ఆవేశం లేదు, ప్రతీకారపు ఆలోచనలు లేవు. 

తమ పరిస్థితిని తోటి సమాజం అర్థంచేసుకోవాలనీ, తమని అందరితోపాటూ కలుపుకోవాలన్న ఆకాంక్ష ఉంది. తమని తాముగా గుర్తించి, గౌరవించాలనే ఆశ ఉంది. తమ ప్రమేయాలతో సంబంధం లేకుండా నిత్యం జరుగుతున్న అనేకానేక విషయాలకి గొంతు విప్పాల్సిన అవసరం ఉండి కూడా, గొంతు విప్పలేని స్థితిని చెప్పుకుంటున్న పరిస్థితి. ‘‘సాహిల్ వస్తాడు’‘ పుస్తకంలో రచయిత గొంతులోనూ ఆవేదన, అసహాయత వ్యక్తమయ్యాయే కానీ ప్రతీకారధోరణి, ఆవేశం కనిపించవు. చదివే పాఠకుల్లో మాత్రం ఆలోచనని, ఆవేశాన్ని కలిగిస్తాయి.

చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేప్పుడు దేశవిభజన సమయంలో జరిగిన రక్తపాతం గురించి చదువుతున్నప్పుడు, అందరూ ఒకే రకమైన వస్త్రధారణ, జీవనవిధానం అవలంబించటం ద్వారా ఇలాటి భేదాల్ని వదిలిపెట్టచ్చు కదా అనుకునే దాన్ని. కానీ పెద్దవుతుంటే ఎవరైనా వారిదైన అస్తిత్వపు చిహ్నాల్ని ఎందుకు వదులుకోవాలన్నది తోచింది. తమవైన ఇష్టాలు కానీ, అభిరుచులు కానీ, నమ్మకాలు కానీ వ్యక్తిగతం అన్నది అవగాహనకొచ్చింది.

చుట్టూ చూస్తున్న జీవితంలో రచయిత చెప్పిన విషాదం స్పష్టంగా కనిపిస్తోందన్నది వాస్తవం. పది, పన్నెండేళ్ల క్రితం పూణె లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల చదువులు మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్న ఒక ఎన్జీవోతో పనిచేసేందుకు వెళ్లినప్పుడు ఒక చిన్న సంఘటన నన్ను విపరీతంగా ఆశ్చర్యపరిచింది. పిల్లలు తమతమ పేర్లను చెప్పి పరిచయం చేసుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి తన పేరును చెప్పేందుకు సంశయిస్తోంది. మిగిలిన వాళ్లంతా చూస్తున్నారు. 

ఆ అమ్మాయిని పక్కనున్న అమ్మాయి ముందుకు తోస్తూ ‘‘సాజిదా, నీపేరు చెప్పు’‘ అంటోంది. నాకు వినిపించి అడిగాను, 

‘‘నీ పేరు సాజిదా నా?’‘

‘‘కాదు టీచర్, సరిత. మా చెల్లి పేరు నీతా’‘ అంది బెరుకుగా. 

పక్కనున్న అమ్మాయి వెంటనే లేచి చెప్పింది, 

‘‘కాదు టీచర్, తను సాజిదా. చెల్లి పేరు నీదా. తమ్ముడి పేరు షీఫా ఖాన్’‘ అని చెప్పేసింది. నాకు ఆశ్చర్యంతో మాట రాలేదు. 

పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పటినుంచి తమ ఉనికిని తమ పేరుతో ఎంత బాగా ముడిపెట్టుకుంటారో, ఎంత గర్వంగా చెప్పుకుంటారో మనందరికీ తెలుసు. 

కానీ సాజిదా ఎందుకిలా చేస్తోంది. అదే అడిగాను. చాలా సేపు మౌనంగా ఉండి, ఉండి నా దగ్గరగా వచ్చి చిన్న గొంతుతో చెప్పింది,

‘‘టీచర్, గణపతి బప్పా పండగ మేము చెయ్యకూడదంట, మాపక్కింటి సుశీల చెప్పింది. మేము అల్లాని కొలుస్తామంట. గణపతి మా దేవుడు కాడంది. మావీధిలో గణపతి పూజకి అందరూ కలిసి రంగు కాగితాలు, పువ్వులు కడుతున్నారు. నేను అక్కడ ఏమీ చెయ్యకూడదని సుశీలా చెప్పింది. అమ్మీ కూడా ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దంది. అందుకే నాపేరు మార్చుకోవాలనుకుంటున్నా’‘ అంది ఆ పన్నెండేళ్ల అమ్మాయి.

ఎప్పుడో స్వాతంత్ర్యోద్యమ సమయంలో తిలక్ ఇదే పూణె లో ప్రజలందరిని ఒకటిగా కలిపేందుకు ఏర్పాటు చేసిన ఈ సామూహిక గణపతి పూజ ఇప్పటికి ఇలా మార్పు చెందుతోందా అనుకున్నాను.

సాజిదాకి మాత్రం తను పేరు మార్చుకోనక్కరలేదని, గణపతి పూజ ఎవరైనా చెయ్యచ్చని చెప్పాను. టీచర్ చెప్పే మాటలపట్ల పిల్లల నమ్మకం మనకందరికీ తెలిసిందే. అమ్మ మాట కూడా చెల్లదు టీచర్ మాట ముందు.

ఆ తర్వాత మన తెలుగు నేల మీదే సామాజిక సేవ చేసే ఒక పెద్దాయన నేను చెప్పిన మీదట ఒక సేవాసదనానికి కొంత విరాళం ఇవ్వదలచుకున్నాడు. బాగా చదువుకున్నవాడు. ఆ సేవా సదనం చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ వీధి పిల్లల్ని, అనాథల్ని చేరదీసి చదివిస్తోంది. తీరా అది తన వర్గానికి చెందని మతస్థులు నడుపుతున్నదని తెలిసి తన మాట వెనక్కి తీసుకున్నాడు. ఆయన చెప్పిన కారణం ఏమంటే వీళ్లకి సాయం చెయ్యటమంటే తీవ్రవాదుల్ని తయారుచెయ్యటమే అన్నాడు. పైగా ఆయన అభిప్రాయంలో ప్రభుత్వాలు విలువైన హిందూ దేవాలయాల ఆస్తుల్ని మసీదులు నడిపేందుకు, ఉచిత హజ్ యాత్రల్నిచ్చి ఆ వర్గీయుల్ని ఎక్కువగా ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తోందట. ఇది జరిగి కూడా దశాబ్దం గడుస్తోంది. అంటే ఇలాటి ఆలోచనలు, అభిప్రాయాలు సమాజంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కానీ ఇప్పటంత నిర్భయంగా, ఇంత అమానవీయంగా, ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ లేవు.

ఇప్పుడు మరింత బహిరంగంగానే ఈ నమ్మకాలు, ప్రవర్తనలు, సంభాషణలు చూస్తున్నాం. మరి సాహిల్ వస్తాడని నమ్మచ్చా? ఇంత రూడ్ గా చెబుతున్నందుకు నాకు సిగ్గుగానే ఉంది మరి.

నావైన అనుభవాలు ఎందుకు చెప్పుకొచ్చానంటే అందరికీ కూడా చుట్టూ ఇవే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కానీ అవి మిగిలిన వారి ఉనికికి ఏమీ నష్టపరిచేవీ, భయపెట్టేవీ కావు. తమ రోజువారీ జీవితం నడిచిపోతుంది. తనవరకు ఆ వర్గం మీద రాయి వెయ్యకుండా గడిపెయ్యచ్చు. చాలదా? అంతవరకే వారి ఆలోచన. 

ఇక పుస్తకం ముందుమాట విషయానికొస్తే,

నిత్యం ఎదురయ్యే ఇలాటి బెదిరింపులు, అవమానాలు చూస్తూ, అనుభవిస్తూ ఖదీర్ బాబు గారు చెప్పినట్టు నోరు తెరిచి ప్రశ్నించేందుకు, తప్పుడు ఆరోపణలను ఎదుర్కొనేందుకు లేకుండా ఒక ఊపిరాడనివ్వని సమాజం చుట్టూ ఉంది. మాట్లాడకపోయినా భయపెడుతుంది, హింసిస్తుంది ఇప్పుడున్న అధికారం. 

అవును, ఖదీర్ బాబు గారు చెప్పినట్టు ‘‘పెద్ద సుఖం లేదు’‘- ఆయన మాటల్లో…

‘‘రచయిత కథలలో పలాయనవాదులను చూసి కలత పడతాడు’‘, 

నిజానికి సంకెళ్ల మధ్య జీవిస్తూ అంతకు మించి చేసేందుకు ఏముంది?

‘‘రెండు దూలాలు ఉన్న ఈ దేశపు ఇంటిలో ఒక దూలానికి ఏమైనా ఫర్వాలేదు అనుకుంటున్నారు. మంచిది. అంటుకున్న చెద కలపను మింగి గోడల వరకు రాకుండా ఉంటుందా? పునాదులకు చేరకుండా ఉంటుందా?’‘

కె.శ్రీనివాస్ గారి ముందుమాటలో …

‘‘ఇరుకింట్లోకి ముడుచుకుపోవటం, ఖిల్లాలోపలికి ఒదిగిపోవాలనుకోవటం, మన ఉనికి మనతోనే వస్తూ ఆచ్ఛాదన కరువు కావటం- ఇది జీవిత వాస్తవం అయినా వాళ్ల కథలు చదివితే కాందిశీకత్వం భౌతికం కాదని, భయం మానసికం కాదని అర్థం అవుతుంది.’‘

‘‘…కాళ్లకింద నేల లేని స్థితి అనుభవంలోకి రావటం’‘

‘‘ఏ రాజ్యమూ లేని శరణార్థులు, ఏ ప్రభుత్వమైనా బంధించ గలిగిన నేరస్థులు…’‘

‘‘తెలిసిన విభజనల మధ్య అలవాటుపడి, అధిగమించేందుకు తెలిసిన ఉపశమనాలతో ఎలాగో బతుకులను  ఈడుస్తున్న సమాజానికి ఒక్కసారిగా అనేక విభజనలు స్పృహలోకొచ్చి అనేకత్వపు భీతిని అనుభవించవలసివచ్చినప్పుడు, ఒక్కసారిగా లోకం అపరిచితమైనపోవటం…’‘

నిజమే, నిత్యం అపరిచితులమధ్య బతకటం ఎంత కష్టం. అదీ అనుమానపు చూపులతో, చేతలతో బాధించే వారిమధ్య!

‘‘తక్కిన అస్తిత్వాలకి, ముస్లిం మైనారిటీ అస్తిత్వానికి ఉన్న మరో తేడా- వేదన పలికినంతగా సంఘటితత్వం పలకకపోవటం.’‘ 

సంఘటితత్వం లేకపోవటానికి కారణం మతాన్ని నిష్టగా ఆచరించేవారు, సెక్యులర్ మత భావాలతో బతికే వారుగా మళ్లీ వారిలో వారే చీలిపోవటం కారణమైనా అవచ్చు. లేదా తమ చేతుల్లో ఏమీ లేదన్న నిస్పృహ, జీవితాలకెదురయ్యే అభద్రత కూడా కారణమై ఉండొచ్చు. ఇక్కడ దోపిడీని అందరూ ఎదుర్కొంటున్నా, సమస్యలు, దుఃఖం వ్యక్తిగతమైపోతున్నాయి మళ్లీ.

గోరీమా కథలో పీర్ల పండుగ హడావుడి, శ్రీరామనవమి పందిళ్లలో కోలాటాల సందడి తలుచుకుంటూ దుఃఖపడే కథానాయకుడు ఒకప్పటి వర్గ విద్వేషాలు లేని సమాజాన్ని తలుచుకోవటం చూస్తాం. నిజంగా లేవా? అని సందేహం రాకమానదు ఇప్పటి వాస్తవాల్ని ఎదుటచూస్తూ.

ఈ భావం ‘‘గోరీమా పరేషాన్ లో పడిపోయిందని’‘ కథానాయకుడి తల్లి అన్నప్పుడు,

‘‘ఏం చేస్తుంది ఆడది? మనవాళ్లూ ఒకళ్లకొకళ్లు తోడురారు’‘ అంటాడు తండ్రి. 

గోరీమా ఒంటరిస్త్రీగా తన హక్కుకోసం ఆఖరివరకూ పోరాటంచేసినా, తానున్న వ్యవస్థ గురించిన వాస్తవాన్ని ఆకళింపు చేసుకున్న ఆమె కొడుకు హక్కుల్ని వదులుకుని బతికే స్వేచ్ఛకోసం నిర్లిప్తంగా, అసహాయంగా, దూరంగా వెళ్లిపోవటం చూస్తాం.

‘‘ముస్తఫా మరణం’‘ లో కుటుంబపెద్ద సంసారభారం మొయ్యలేక పలాయనవాదిగా మారి, మతాన్ని అడ్డుపెట్టుకుంటాడు. కుటుంబమంతా ఏకమై నిరసించినా చివరికంటా ఆ దారిని వదలడు.

‘‘సాహిల్ వస్తాడు’‘ కథ గురించి …

నిజంగా ఏ అపరాధం చెయ్యని సాహిల్ తిరిగి కుటుంబంలోకి, స్నేహితులమధ్యకి వస్తాడని, రావాలని కోరుకున్నాకూడా వాస్తవ పరిస్థితులు ఆ నమ్మకాన్ని ఒట్టి బుకాయింపే అని గట్టిగా చెబుతున్నాయి. ఈ  కథ ఇప్పటి అరాచకాన్ని స్పష్టంగానే చెబుతోంది. 

నేను ఈ వ్యాసం రాస్తున్న సమయంలో మార్చి పదహారో తేదీ ఇండియా టుడే ముఖచిత్రం, లోపల పేజీల్లోని కవర్ పేజీ కథనం, చిత్రాలు చదువుతుంటే ఎవరిమీదో కసి, కోపం వస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా అనేక దోపిడీలమధ్య, పోరాటాల మధ్య బతుకుతున్న అమాయక జీవితాలని మరింత ఛిద్రం చేసే హక్కు, అధికారం ఎవరు ఎవరికిస్తున్నారు? ఏ ప్రయోజనాల కోసం ఇదంతా జరుగుతోంది? ఎక్కడో ఒకచోట, ఎప్పుడంటే అప్పుడు ఇలాటి దృశ్యాలు, మరుపున పడకుండా మళ్లీ మళ్లీ…

‘‘తెలంగీ పత్తా’‘ కథలో ‘‘అబ్బూ, ఏ హమారా గావ్ నై’‘ మున్నా గొంతులో దిగులు ఈ వర్గం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. అవును, ఏ చోటూ కూడా తమది కాదిక్కడ. అమాయకత్వం వీడని పసివాళ్ళ ప్రపంచంలోకి ఇంకుతున్న ద్వేషపు చెద. భౌతికంగానూ, మానసికంగానూ కూడా ఎక్కడా చారెడు చోటు లేని పేదరికం వీళ్లది. ఈ పదమూ, దీని అర్థమూ కూడా ఇక్కడే పరిచయమైంది నాకు.

‘‘ధేడీ’‘ కథలో కథానాయకుడి స్నేహితులంతా దళితులని నిరసించే అతని భార్య రజియా, ఆ మిత్రుల జీవితాలకున్న ఆర్థిక భద్రత తమకు లేదని, తమ జీవితాలు అట్టడుగు వర్గాల్లో మరింత అట్టడుగు వర్గానికి చెందినవని గమనంలోకి తెచ్చుకున్న కథానాయకుడు కనిపిస్తారు.

‘‘ఛోటీ దునియా’‘ కథలో రచయిత చెప్పిన అనుభవాలు మనమున్న ప్రపంచం ఎంత చిన్నదో చెబుతాయి. మనదైన అస్తిత్వం వెంటపడి నీడలా వస్తుంటే ప్రపంచమంతా ఈ ఒక్క విషయంలో ఏకత్వాన్ని అంగీకరిం చేందుకు, అమలుపరచేందుకు సిద్ధంగా ఉందన్నది అర్థమవుతోంది. ఈ ఏకత్వం సంతోషించవలసిన అంశమా? విచారించవలసిన అంశమా? 

కొన్ని అమెరికా ప్రయాణాల అనుభవంతో భిన్న అస్తిత్వాల మధ్య పట్టింపులు అక్కడా బాగానే ఉన్నాయని అర్థమైంది. ఇవి ఒక పల్లెకో, ప్రాంతానికో, పట్టణానికో, దేశానికో మాత్రమే పరిమితమైనవి కావన్నది, మనుషుల ఆలోచనల్లో ఉన్నసంకుచిత్వమే కారణమన్నది వాస్తవం. ఈ నొప్పి కలిగించే, చేదు వాస్తవాలు మనం చూసి, అనుభవిస్తున్నాం. వీటిని మార్చేందుకు ఏమి చెయ్యగలం? ఏమి చెయ్యాలి?! అన్నది మనముందున్న ప్రశ్న.

రచయిత తన ఆవేదనను పాఠకుల ముందు పరిచాడు. ఒక వర్గం నిస్సహాయంగా, మౌనంగా, లోలోపల పడుతున్న దుఃఖాన్ని ఎంతో నిజాయితీగా దృశ్యమానం చేసాడు తన కథలతో. చదువరులందరిలో సహానుభూతిని, దాన్ని మించి ఆలోచనను రగిలిస్తున్నాడు. భవిష్యత్తు ఈ దుఃఖాన్ని దూరం చేస్తుందా? దానికంటే ముందు వర్తమానమనే దాన్నొకదాన్నిస్తుందా? 

సాహిల్ రాడేమో అని మీకు చెబుతున్నా, నాలోలోపల వస్తాడనే ఆశ రహస్యంగా ఉండనే ఉంది. అది భవిష్యత్తు పట్ల బోలెడు బలాన్ని, నమ్మకాన్ని కూడా ఇస్తోంది. 

ఎప్పుడో రాసుకున్న నా కవితలోని పంక్తులు కింద ఇస్తున్నాను…

‘‘…చార్మినార్ చౌరస్తా గుర్తొస్తోందేమిటిప్పుడు
ఒక పురాతన జ్ఞాపకంలా
అక్కడి ముత్యాల దుకాణాలు, ముసుగుల్లో చకచకా కదిలే సౌందర్యాలు , రంగురంగుల రాళ్ల గాజుల దుకాణాలు
అక్కడ వీధుల్లో కాళ్ళ క్రింద నలిగే దుమ్ము కింద నిశ్శబ్దంగా పరుచుకున్నట్టుండే ఏదో కనిపించని అశాంతి
ఒక్క చిన్న అలజడికైనా పెను ప్రకంపనలు పుట్టిస్తూ
అక్కడి మనుషుల జీవితాల్ని తిరగ రాసే ఒక భయానక వాతావరణం
మత్తుగా, ఒక స్వల్ప విరామ నిద్ర ముసుగులో ఉన్నట్లు
లేదు,లేదు వట్టిగా అలా కనిపిస్తుంది , అంతే
ఎప్పుడో చరిత్రలో జరిగిన విషాదమో ఒక భయాన్ని జ్ఞాపకంగా మిగిల్చిందా
అయినా అశాంతులైనా, అసహనాలైనా వ్యక్తి జీవితంలో సంక్లిష్టతనే కదూ చూబిస్తూంట
వాటిని నా ప్రేమతో ఇట్టే మాయం చేసెయ్యనూ
నిత్యం అతి సహజంగా హిందూ, ముసల్మానుల జీవితాల్ని ఒక సమిష్టి కుటుంబపు సాంప్రదాయ సౌందర్యంగా చూబిస్తూనే ఉంటాయి పరిసరాలు!
సన్నివేశానికి రాజకీయ నజరో తగలకూడదని నేను ఎప్పుడూ ప్రార్ధిస్తూ ఉంటాను…’‘

(‘‘నిర్మోహం’‘ కవిత, ‘‘వాకిలి’‘ వెబ్ పత్రిక, ఏప్రిల్, 2016)

*****

Please follow and like us:

2 thoughts on “సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు”

Leave a Reply

Your email address will not be published.