ఇట్లు మీ వసుధారాణి

     గవాక్షం

-వసుధారాణి 

గులాబీ నగరం అదేనండి మన జయపూర్ వెళ్ళినప్పుడు హవామహల్  ముందు నుంచుని కిందనుంచి అన్ని కిటికీలతో నిండిన ఆ కళాత్మకమైన గోడని చూసినప్పుడు,ఒక ఆనందం,ఒక విషాదం ఒకేసారి తోచాయి.ఆనందం మన కళాకారుల ప్రతిభకి, విషాదం ఆ రాణీవాసంలోని రాణులందరి పట్ల.విషాదం అని ఎందుకు అంటున్నాను అంటే కేవలం కిటికీ నుంచి కనపడేదే వారి బయటి ప్రపంచం.బయట వైపునుంచి వారి కిటికీలు ఎంత అందంగా ఉన్నా ,సన్నని కన్నాలే వారి స్వేఛ్ఛా గాలులు.
 
నాపేరు కూడా వసుధారాణి ఐతే నా మనసు కిటికీ తెరుచుకోవటానికి ఉపయోగపడింది ఎంతమాత్రం కళాత్మకంగా లేని మూడడుగుల పొడవు,రెండడుగుల వెడల్పు ఉన్న నాలుగు  ఇనప చువ్వల, రెండు చెక్క రెక్కల మామూలు కిటికీ, ఆ కిటికీ గుండా ఏళ్ళ తరబడి శరీరానికి అలవాటయిన  పైరగాలి స్పర్శ.అవును మా పెద్ద రెల్లుపాకకి ఉన్న సిమెంటు రాళ్ళ గోడలో బిగించిన ఆ బుల్లి కిటికీ నాలో భావుకత్వాన్ని కలిగించటంలో గొప్ప నిశ్శబ్ద పాత్ర పోషించింది.
 
ఉదయాన్నే నిద్రలేవగానే నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తు ఉన్న దృశ్యం పొరలు పొరలుగా మీ ముందు విప్పుతాను.మాయింట్లో ఉన్న పెద్ద వసారాలోకి నాలుగు తలుపులు,నాలుగు కిటికీలు,గోడకి -కప్పుకి ఉన్న ఖాళీ గుండానూ ధారాళంగా గాలీ వెలుతురు వచ్చేవి.నేను నాలుగవ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటికి కరెంటు వచ్చింది.దానితో పాటు మా సావిత్రి అక్కయ్య వాళ్ళింటి నుంచి మా బావగారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి ఆకుపచ్చ ఉషా టేబుల్ ఫ్యాన్ వచ్చింది.
 
ఇక చూడాలి ఈ రాణి గారి దర్జా సరిపడా గాలి ఉంది కనుక ఎవరికీ ఆ ఫ్యాన్ అవసరం లేదు.నేను మాత్రం ఓ నులకమంచం కిటికీ పక్కగా అందరినుంచి కొంచెం దూరంగా వేసుకుని.  దానిపైన మెత్తటి పక్క వేసుకుని,చిన్న స్టూల్ మీద ఆ ఆకుపచ్చ ఉషా టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని పడుకునే దాన్ని.కొంచెం పెద్దఅయ్యి పద్నాలుగు ఏళ్ళు వచ్చాక కూడా సేమ్ సెటప్పు. కొత్తగా వచ్చి చేరినవి రెండు ఏమిటంటే ,తలగడకి అటు ఇటు చలం అనువాదం చేసిన టాగోర్ “గీతాంజలి”,బుల్లి మర్ఫీ రేడియో.ఎండాకాలం అందరం ఆరుబయట పడుకునే వాళ్ళం అప్పుడు కూడా రేడియో తప్పనిసరి.
 
విజయవాడ వివిధ భారతి వారు వేసే పాటల్ని వింటూ చుక్కల ఆకాశం కిం పడుకోవటం గొప్ప అనుభూతి.”అద్దమంటి మనసువుంది అందమైన సొగసువుంది” ”హిమగిరి సొగసులు ఊరించును మనసులు” లాంటి పాటలు ఒక అనుభూతిని ఇస్తే.ఆ రాత్రి వేళ “ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తెలవారదేమి? ఈచీకటి విడిపోదేమీ ?” లాంటి పాటలు మరో అనుభూతి.తొందరగా తెల్లవారితే బాగుండు ఏదో ఒకటి చేసేయాలి అనిపించేది.
 
మా ఇంటికి ఉత్తరం వైపు బోలెడు జాగా పెరటి వాకిలి వైపు .అమ్మ వేసిన పూల మొక్కల తో అందంగా ఉండేది.నేను పడుకునే చోటు పక్కన ఉండే కిటికీ దక్షిణం వైపున ఉండేది.మా రెల్లు పాకకి సగం వరకూ మా పెంకుటిల్లు ఉండేది దక్షిణాగ్నేయాన ,మిగిలిన సగం నుంచి ఉన్న ఖాళీ స్థలం మా వెనుక వైపు పెరడు ,మేము దక్షిణం వైపు బాటను ఎక్కువగా వాడేవాళ్ళము రాకపోకలకు అందుకని, ఆ దక్షిణం పెరటి స్థలం అంతా మరసమట్టి వేసి దానిమీద చిన్న కంకర వేసి గట్టిగా దిమ్మిస కొట్టి ఉండేది.
 
నా గవాక్ష వీక్షణం ఎన్నో ఏట మొదలైందో సరిగ్గా గుర్తులేదు కానీ 10 వ ఏటనుంచీ పక్కాగా నా పడక కిటికీ పక్కనే.నిద్ర మెలకువ రాగానే ఎటువైపు మళ్ళుకుని పడుకుని ఉన్నా సరే దక్షిణం కిటికీ వైపు తిరిగి కళ్ళు విప్పేదాన్ని.మొదటగా ఓ పావు కిలోమీటరు దూరంలో చిత్రాల్లో చిత్రించే లాంటి లావుపాటి మానుతో పెద్దగా ,అనేక శాఖలతో పెద్దగా గుండ్రంగా ఎదిగిన పెద్ద మేడిచెట్టు.ఆ చెట్టుకు వెనుకగా పొలాల పచ్చదనం మధ్య అక్కడక్కడా చిన్న చిన్న ఇళ్ళు.
 
 
 చెట్టుకు ముందర పాలపాడు వైపు  వెళ్ళే మట్టి డొంక .ఆ డొంక తర్వాత దాదాపు మా ఇంటికి ఓ అయిదు వందల అడుగుల దూరం వరకూ అచ్చంగా పచ్చని పొలాలు .మాఇంటి పునాదులు ఎత్తుగా కట్టి ఇల్లు మెరకగా కట్టడం వలన దృశ్యం ఇంకా బాగుండేది.మా ఇంటికీ,పొలాలకూ మధ్య ఉన్న అయిదు వందల అడుగులలో మా ఇంటిని ఆనుకుని రోడ్డు ,పక్కనే పైఎత్తున వుండే  పొలాలో ఎక్కువై వదిలిన పంటనీటి కాల్వ  పడమర నుంచి తూర్పుకు పారేది.ఆ కాలువలో తుంగ ,జమ్ము, రెల్లు దుబ్బులు, రబ్బరు మొక్కలు(నీటి వాలున పెరిగే ఒక రకం మొక్కలు వంగ పూవురంగు పూలు పూసేవి) ఇవన్నీ కలిసి పచ్చదనం,పూల అందం తెచ్చేవి.ఓ ముఫై నలభై అడుగుల వెడల్పు కాలువ తరువాత ఇళ్ళు కట్టబోయి వదిలేసిన బొంత రాళ్ళ పునాది ఒకటి ఉండేది .
 
ఆ ఖాళీ పునాదుల్లో రకరకాల గడ్డి మొక్కలు పడి మొలిచేవి వానకు .పగిలిన పునాది రాళ్ళ ఖాళీలో  పడకుండా పోటీలు పెట్టుకుని దూకటం గొప్ప లాంగ్ జంప్ అనుభవం.ఆ పునాదుల మీద ముట్టుకుంటే ముడుచుకు పోయే టచ్ మీ నాట్ మొక్కలు మొలిచేవి వాటిని తాకి ఆడుకోవడం సరదాగా ఉండేది.మేము తరచుగా అల్లరి చేయటానికి ,ఎవరినైనా ఏడిపించటానికి వాడే దురద గొండి ఆకు అక్కడే దొరికేది.తాటాకులకు గుచ్చుకుని పరిగెత్తితే తిరిగే ఫ్యాన్లకు కావాల్సిన పొడవాటి పచ్చి తుమ్మముళ్ళు కూడా ఆ పునాదులు ఎక్కి పక్కన ఉన్న నల్ల తుమ్మచెట్ల నుంచి తెంచుకునే వాళ్ళం.తుమ్మబంక నా దగ్గర ఓ సత్తు చెంబు నిండా స్టాక్ ఉండేది మరి అదికూడా అక్కడిదే.ఆ పాడుపడిన పునాదులు మా సంజీవిని పర్వతం అన్నమాట.
 
 
పునాదులకు,పొలాలకు మధ్య మళ్ళీ ఓ పంటకాలువ ఖాళీ మెరక ప్రదేశం ఉండేది. మన్నెమ్మ అనే ఓ గొప్ప లేడీ ఉండేది(ఆవిడ గురించి ఇంకో కథ చెప్పుకుందాం) ఆవిడ పొలం ,ఆ పొలంలో వాళ్ళ ఆయన,కూతురి సమాధులు రెండు ఉండేవి.కొన్ని సుబాబుల్ (జపాన్ తుమ్మ) చెట్లు కూడా.
 
 
ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ పొలం,దూరంగా ఆ వెనుక చెట్టు రోజుకో రకంగా కనపడేవి. ముఖ్యంగా పొలం బంగారు పసుపుకు మారినప్పుడు పచ్చని చెట్టు చుట్టూ సువర్ణ కాంతి .తెలవారగానే కళ్ళు విప్పగానే గొప్ప సహజ చిత్రం నా కళ్ళ ఎదుట.పంటకోసి గూళ్ళు వేశాక , చేలంతా పిల్లిపిసర తీగల పచ్చదనంతో ,ఈ బంగారు కుప్పలు ,పచ్చని చెట్టు.వర్షంలో ఆ అందం వర్ణనాతీతం .మా గడపముందు ఇటుకరాతి మెట్టుమీద చూరుకింద కూర్చుని వర్షంలో వేడి కాఫీ తాగుతూ మా పద్దక్కా, నేను ఎన్ని వానాకాలాలు చూశామని.
 
మేడి చెట్టుమీద ఏర్పడిన ఎన్నో అందాల ఇంద్రధనుసులు కూడా ఈ అజ్ఞానిని చిత్రకారిణిని చెయ్యలేక పోయాయి కానీ ,మెదడులో ఆ చిత్తరువులు ముద్రించుకు పోయాయి.వెన్నెలకాలంలో దూరంగా మేడిచెట్టు ఒక్కటే నీడలా వీడని తోడులా కనిపించేది కిటికీ నుంచి చూసినప్పుడు.చీకటి రోజుల్లో కళ్ళు మూసుకుని చెట్టును తలుచుకుని పడుకునే దాన్ని.పొగమంచు రోజుల్లో తెరలు విడటం అంటే ఏమిటో తెలిసేది.కొద్ది కొద్దిగా కనీ కనపడని అందాలు రోజూ చూసే, తెలిసిన ప్రదేశమే కొత్తగా కనిపించేది.
 
కిటికీ నాకు దృశ్యాన్ని చూపింది.కిటికీ నుంచి కనపడిన ప్రతి దాన్నీ తాకి చూసే అనుభవం బాల్యం ఇచ్చింది.నా కల,వాస్తవం ,కనుల ఎదుట దృశ్యం ఒకటే అవ్వటం ఎంత అదృష్టం.కిటికీ నాలో ఓ నిశ్శబ్దాన్ని ,శబ్దాన్ని ,ఓ మౌనాన్ని, ఓ ప్రకృతి గానాన్ని నింపింది.మా బుల్లి కిటికీ విశ్వ వీక్షణానికి నాకు తోవ చూపింది.ఇప్పటికీ కళ్ళు మూసుకుని తలుచుకుంటే నా కళ్ల ముందు నా పచ్చని బాల్యం.కంటికొలుకుల్లో రెండు నీటి చుక్కలు ఆనందం,విషాదం రెండూ కాని  కృతజ్ఞతాబిందువులు.
 
మళ్ళీ మొదటికి వస్తాను నా పేరు వసుధారాణి.నాకూ ఓ గవాక్షం ఉంది.దాని ఆవల సుందర లోకం ఉంది.మరో కథతో మళ్ళీ వస్తాను.అప్పటి దాకా ఇట్లు మీ వసుధారాణి.
 

*****

Please follow and like us:

One thought on “ఇట్లు  మీ వసుధా రాణి- గవాక్షం”

  1. మీ గవాక్ష వీక్షణం అత్యద్భుతం. మా మనోనేత్రాల ముందు మేడిచెట్టు, పునాదులూ, పచ్చటిపైరుల అందమైన పదచిత్రమును ఆవిష్కరించారు.

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.