అమ్మకు అరవైయేళ్ళు

-రాజన్ పి.టి.ఎస్.కె

ఈ కథానాయకురాలికి ఈరోజుతో అరవై ఏళ్ళు నిండాయి. ఈవిడకు తన 22వ యేట నుంచీ ఈ వ్యాస రచయిత తెలుసు. అసలు ఈ వ్యాస రచయితకు తన అసలు పేరేంటో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. కారణం ఈ కథానాయకురాలే. ఎప్పుడూ కన్నయ్యా అనో, నా బంగారుకొండా అనో, పండుబాబూ అనో పిలుస్తుండేది. అందుకే అతని చిన్నతనంలో ఎవరైనా “నీ పేరేమిటబ్బాయ్?” అని అడిగితే… అసలు పేరు ఆ ముద్దు పేర్ల మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయి, ఒక పట్టాన గుర్తుకు వచ్చేది కాదు.

ఇక కథలోకి వస్తే… కథానాయకురాలి పూర్తి పేరు రాజరాజేశ్వరి. అరసవల్లి బ్రహ్మం గారు, లక్ష్మీనరసమ్మలకు ఆరో సంతానం. ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్న మహాసామ్రాజ్ఞి. పుట్టింది, పెరిగింది భీమవరంలో. చదివింది… కథలు, నవలలు అర్థమవడానికి అవసరమైనంత. ఇంటికి దగ్గరలో ఉన్న భీమేశ్వరస్వామి గుడిలో ఆడుకోవడంతోను, రాత్రుళ్ళు వదినగార్లు చెప్పే పురాణ కథలో, సినిమా కథలో, చందమామ కథలో వింటూ పడుకోవడంతోనూ బాల్యం గడచిపోయింది. పందొమ్మిదో ఏట పెట్ల వీరభద్రరావు గారిని పెండ్లాడి లక్ష్మీ రాజేశ్వరిగా మారి, ఇరవయ్యో ఏట ఈ రచయిత అక్కనీ, ఇరవై రెండో ఏట సాక్షాత్తూ ఈ వ్యాస రచయితనూ కని కేర్‌ర్ మనిపించింది. అలా మా అమ్మతో నాకు మొదటి పరిచయం ఏర్పడింది. 

వంట చేసుకుంటూ రేడియోలోనో, టేప్ రికార్డర్ లోనో సినిమా పాటలు, లలిత సంగీతం వినడం. పనంతా అయిపోయాక కూర్చోని యద్దనపూడిదో, యండమూరిదో, మాదిరెడ్డి సులోచనదో నవల పట్టుకోవడం ఆవిడకు నిత్యకృత్యాలు. నవలలో ఉత్సుకత మరీ ఎక్కువుంటే రాత్రి పూట పడుకునే వరకూ చదివేది. తులసీదళం లాంటి నవలను అర్ధరాత్రి వరకూ చదివేసి, దిండుకింద పెట్టుకొని పడుకునేంత ధైర్యం అమ్మది. 

రోజూవారీ పూజ, ఆదివారాలప్పుడు చేసుకునే త్రినాథస్వామి పూజ, పండగలు, వ్రతాలు ఇలాంటివన్నీ అమ్మకు షరా మామూలే. అన్నిటికంటే ముఖ్యమైనవి నాకూ, మా అక్కకూ చెప్పే బోలెడన్ని కథలు, సంగతులు. ఏ కథ చెబుతున్నప్పుడో మధ్యలో ఎదైనా కొత్త పాత్ర ప్రవేశిస్తే, ఆత్రుతగా “వాడెవడూ?” అని అడిగేవాడిని. “వాడు వాళ్ళ అమ్మకొడుకు” అనేసి కిలకిల మని నవ్వేసేది. దగ్గరకు తీసుకుని నా బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకునేది. అమ్మ చెప్పే కథలు వింటుంటే నాలోకూడా ఏదో ఒక కథ చెప్పెయ్యాలన్న కోరిక బలంగా ఉండేది. “అనగనగా ఆకాశం ఉంది. ఆకాశంలో కైలాసం ఉంది. కైలాసంలో శివుడున్నాడు. పక్కన పార్వతీదేవుంది”. అంతే! అదే కథ. అదే నా మొదటి కథ. ఇంటికి ఏ చుట్టం వచ్చినా అదే కథ.  అక్కడ నుండి మెల్లిగా స్కూల్లో స్నేహితులకు పచ్చిమిరపకాయ బుడంకాయ్ కథలు పలక మీద బొమ్మలేస్తూ చెప్పేసేవాడిని. అమ్మ సాయంతో చందమామ కథలు చదవడం మొదలు పెట్టాను. ప్రతీనెలా చందమామ బజారులోకి రావడటమే ఆలస్యం, అది నాన్నగారి చేతుల మీదుగా నా చేతుల్లో పడేది. చదువుతున్నప్పుడు కలిగే సందేహాలన్నిటినీ పటాపంచలు చేయడానికి ఎలానూ మా అమ్మ పక్కనే ఉండేది. 

సినిమాలకు వెళ్ళినా, మావుళ్ళమ్మ గుడికి వెళ్ళినా రిక్షా ఎక్కేవాళ్ళం. అందులో కూడా నేను మా అమ్మ ఒళ్ళోనే కూర్చునేవాడిని. అక్క నాన్నకూచీ కాబట్టి ఆయన ఒళ్ళోనే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ అక్కలు చెల్లెళ్ళనేవారు ఏ ఇంట్లో అయినా నాన్నకూచీలే. బుద్ధిమంతులైన అమ్మకూచీ తమ్ముళ్ళు వాళ్ళకు ఎగస్పార్టీ కనుక, యుద్ధాలు అనివార్యం. మళ్ళీ వాటిని ఆపడానికి అమ్మే రంగంలో దిగాలి. తప్పని పరిస్థితులలో రెండు పార్టీలకూ దువ్వెన అనే మహా ఆయుధంతో చెరో రెండు దెబ్బలూ పడేవి. అలా ఆ యుద్ధాలకి ముగింపు పలికేది అమ్మ. నా పసితనం నుండి పదో తరగతి వరకూ అన్నం ఎప్పుడూ నా చేత్తో నేను తినలేదు. అమ్మ చేతి గోరుముద్దలు మెల్లిగా పరిమాణం పెంచుకుంటూ వెళ్ళాయంతే. అలా… అలా…నేను కాలేజీకి వెళ్ళే పిల్లాడినయ్యాను. ఎప్పుడైనా సరదాగా స్నేహితులతో సినిమాలకు వెళ్ళాలంటే నాన్నగారి అనుమతి తప్పనిసరి. అన్ని సందర్భాలలో ఆ అనుమతి దొరకడం చాలా కష్టమయిపోయేది. ఆ ఆపత్సమయాలలో ఆపద్భాందవి అమ్మను శరణువేడేవాడిని. అభయం లభించేది. పోపుల డబ్బాలోంచి రెండు మూడు పదుల కాగితాలు బయటకొచ్చి నా జేబులో దాక్కునేవి. ఈ విషయం నాన్నకూచీ కంట్లో పడకుండా జాగ్రత్త పడేవాడిని. 

ఇప్పటికీ రోజూ ఇంట్లో పాటలు వింటూ ఉంటాం. పాత పాటలు వింటున్నప్పుడు ఆ సినిమా పేరు, నటీనటులు, గాయకగాయనీమణుల పేర్లు ఠపీమని చెప్పేస్తుంటుంది. ఒక్కోసారి పాట మొదలవ్వగానే, అంటే మ్యూజిక్ మొదలై, ఇంకా లిరిక్ మొదలవని చోట ఒకసారి ఆపి, ఈ పాట ఏ సినిమాలోదో చెప్పుకోచూద్దాం అని అడుగుతుంటాను. అమ్మ ఏమాత్రం తొట్రుపాటు లేకుండా… ఇదీ ఒక ప్రశ్నేనా అన్నట్టు నావైపు చూసి నవ్వుతూ జవాబు చెప్పేస్తుంటుంది. అలా అమ్మతో మాటిమాటికీ ఓడిపోవడం నాకు అలవాటైపోయింది. రోజూ కాసేపు ఏ భాగవత దశమస్కంధమో, కంచి పరమాచార్య జగద్గురు బోధలో చదువుకుంటుంటుంది. ఇంకాసేపు రామకోటి వ్రాసుకుంటుంటుంది. నేను కంప్యూటరు ముందు కూర్చొని పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు తనే అన్నం కలుపుకు వచ్చి తినిపించేస్తుంటుంది. అమ్మ మీద చిన్నపాటి కోపాలు ఎప్పుడైనా వచ్చినా అమ్మ ప్రేమ అనే మహాసముద్రంలో అవి నామరూపాలు లేకుండా కొట్టుకుపోతుంటాయి. ఇలా అమ్మకోసం ఎంత చెప్పినా బావుంటుంది. కానీ అంతా చెప్పకుండా కొంత నా గుండెల్లోనే దాచేసుకుంటే ఇంకా బావుంటుంది. వీడేంటి నా పుట్టినరోజు కూడా ఇంత సీరియస్‌గా పనిచేసేసుకుంటున్నాడు అని అటు ఇటూ తిరుగుతూ నా వైపే చూస్తున్న  మా అమ్మకు, ఈ వ్యాసం చదివి వినిపించాలన్న ఆతృత నాలో కూడా పెరిగి పోతుంది కనుక అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్వస్తి!

ఇట్లు

“మా అమ్మకొడుకు” రాజన్ పి.టి.ఎస్.కె

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.