“నెచ్చెలి”మాట
బక్కెట్ లిస్టు
-డా|| కె.గీత
ఈ మధ్య మనందరం వింటున్న ఒకేఒక్క మాట-
“కరోనాతో సహజీవనం”
అంటే ఇదేదో “పండంటి కాపురం” అనుకునేరు!
పండంటిదీ, పుత్తడంటిదీ మాట దేవుడెరుగు
కనీసం పచ్చిదీ, ఇత్తడంటిదీ కూడా కాదు సరికదా!
ప్రాణాంతకమై కూచుంది!!
సరే చేసేదేముంది?
గాల్లో దీపంలా
ఏట్లో కెరటంలా
అని వేదాంతం చెప్పుకునే ముందు
“బక్కెట్ లిస్టు” లు నెరవేర్చుకునే పన్లో పడితే మంచిదేమో!
“బక్కెట్ లిస్టు” అంటే అదేనండీ-
బాల్చీ తన్నేలోగా తీరాలనుకున్న కోరికల పద్దన్నమాట!
అంటే
కాలేజీ బంకుకొట్టి సర్టిఫికేట్లు సంపాయించడం
పైరవీలు చేసి ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయడం
వంటివి కాకుండా
జన్మలో స్టేజీ ఎక్కకపోయినా
ఫేసుబుక్కులో ఇంచక్కా అద్దం ముందు కూచున్నట్టు లైవ్ షో లు దంచడం
పదిమందిలో తలెత్తే ధైర్యం లేకపోయినా
పదినిమిషాల్లో స్మార్ట్ గా షార్ట్ ఫిల్మ్ స్టార్ అయిపోవడం
వంటివన్నమాట!
ఇప్పుడు “బక్కెట్ లిస్టు” లు నెరవేర్చుకోవడానికీ కొన్ని నియమాలొచ్చి చచ్చాయి
అదేనండీ!
ఏం చెయ్యాలన్నా ఆన్ లైన్ లోనే గానీ మరో గత్యంతరం లేదు
కాబట్టి కోరికల్ని కొద్దిగా సవరించుకోవాలి కూడా!
తప్పదు-
కానీ కొన్ని ఇట్టే నెరవేరేవి ప్రయత్నించొచ్చు
అంటే
ఉద్యోగం సద్యోగం మానేసి ఇంట్లో కాళ్లు బారచాపుకు టీవీ చూడ్డం
పొద్దస్తమానపు పరుగుల్ని కట్టిపెట్టి ముసుగెట్టి పడుకోవడం
బద్ధకంగా రోజంతా ఎక్కడపడితే అక్కడే కూచోవడం
వంటివి కాకుండా
చెయ్యాల్సిన కోర్సుల్ని ఇంటి నుంచే చేసి సర్టిఫికేషన్లు సంపాదించడం
పాటలో, పద్యాలో వరుసలు కట్టి ఆల్బములు విడుదల చేయడం
అంత కాకపోయినా
ఏదో సరదాగా ఇంటిపనో, తోటపనో చెయ్యడం
ఎప్పట్నుంచో చదవాల్సిన పుస్తకాల్ని పూర్తిచెయ్యడం
వంటివో
ఇంకొంచెం ఆశపడితే
జీవితానికి అర్థాన్ని సమకూర్చి పెట్టే “పనికొచ్చే” పనేదైనా చెయ్యడం-
అన్నట్టు
మరణం అనివార్యమవుతున్నపుడు మర్చిపోతున్న
మానవత్వాన్నీ లిస్టులో చేర్చుకుందాం!
*****
నమస్తే గీత గారు,
మీ సంపాదకీయం అలవోకగా పెదవులను అరవిచ్చేలా చేయడమే కాదు,మనసు తలుపును తట్టి మేలుకునేలా చేసేంత బావుంది.
నమస్తే, చదివి చక్కని ప్రతిస్పందనని అందజేసినందుకు మీకు అనేక నెనర్లు! కామెంటులో మీ పేరు జత చేయనందున మీరెవరో తెలియదు. దయచేసి ఇకమీదట కామెంటు పెట్టే ముందు మీ పేరు తప్పనిసరిగా ఎంటర్ చెయ్యడం మర్చిపోకండి.
కరోనా కష్ట కాలం ను ఎలా సద్వినియోగం చేసికోవాలో బాగా చెప్పావు గీతా.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం ఆంటీ!
నమస్తే గీతా మేడం.ఈ నెల మన నెచ్చెలి తొలి దర్శనం ఎంతో సాహితీ సంపదనీ, సంతోషాన్నీ ఇచ్చింది.ఇన్ని వైవిధ్యమైన అంశాలను ఒకచోట చక్కటి మాలగా కూర్చి అందిస్తున్న మీ కృషి శ్లాఘనీయం. మహిళా శక్తికి నిదర్శనం.సంపాదకీయం హాస్యాన్ని చొప్పిస్తూనే మంచి సందేశం ఇచ్చారు.ఝాన్సీ గారి కవిత,ఊపిరి ఆడడంలేదు,రేపిస్ట్ చాలా విభిన్నం గా ఉన్నాయి.కథలు, కవిత్వ దర్శనం ఇతర వ్యాసాలూ ఎంతో నాణ్యంగా ఉన్నాయి.కూర్పు చాలా బావుంది.నా కవితకూ చోటిచ్చినందుకు ధన్యవాదాలు. చక్కటి చిత్రాలు గీసిన మన్నెం శారదా గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మీకు నెచ్చెలి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాగజ్యోతి గారూ! మీ మంచి మాటలకు అనేక నెనర్లు.
హాస్య పూరిత, సంపాదకీయం లో మానవీయ విలువలను కూర్చడం బాగుంది.
అభినందనలు గీత గారు
సంపాదకీయం శ్రద్ధగా చదివి కామెంట్ పెట్టినందుకు నెనర్లు దాసరాజు గారూ! మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది.