
అన్నిటా సగం
-చెరువు శివరామకృష్ణ శాస్త్రి
నీవో సగం, నేనో సగం
ఆకాశంలో, అవనిలో
అన్నిటా మనం చెరి సగమంటూ
తాయిలాల మాటలతో
అనాదిగా మీరంటున్న సగానికే కాదు
అసలు మా అస్తిత్వానికే సవాలుగా
మిగిలిపోయాము అబలలమై!
నిన్ను అన్నగా, నాన్నగా,
తాతగా, మామయ్యగా, బావగా
తలచి చెల్లినై, కూతురినై,
మనుమరాలిగా, కోడలిగా,
ముద్దుల మరదలిగా
బహురూపాలుగా విస్తరించి
ప్రేమను, కరుణను పంచగల
మహోత్తుంగ జలపాతాన్ని నేను!
సంపాదనలో నీ కన్నా మెరుగ్గా ఆర్జిస్తూ నీతో బాటు సంసార బరువుల్ని, బాధ్యతల్ని భరిస్తూ
నిలిచిన ధ్వజ స్తంభాన్ని నేను!
నీలో మాత్రం ఏరూపంలో ఉన్నా
వావి వరుసలు, పాపం, పుణ్యం
ఏమాత్రం పట్టని పశుత్వం
ఒళ్లంతా నిండిపోయి,
కళ్లకు గుడ్డి పొరలు కమ్మేసి
హింసలతో, వాంఛలతో
ఆరేళ్ల పసికందు మొదలు
అరవై ఏళ్ల బామ్మలను వదలకుండా
బలిగొంటూనే ఉన్నావు!
నిర్భయలు, దిశలు, సమతలు
పాత చెత్త చట్టాలై
ఎన్కౌంటర్లు , ఉరిలు ఊరిస్తున్నా
ఆగని కార్చిచ్చులా జగతిలో బేలగా
ఆడతనం కాలిపోతూనే ఉంది!
కోవిడ్ మహమ్మారిని మించిన
వికృతమూ, భయంకరమైన
ఈ అకృత్యాలకు అంతం
మగతనం మనిషితనంగా
మారనంతవరకు,
మగువ, మగవాడు ఒక్కటనే
ప్రకృతి సత్యాన్ని ప్రతి మనిషి లో
పాదుకునేంత వరకు తప్పదేమో!
*****

ఉమ్మడి రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశాక, 2007 నుండి ప్రధానాచార్యుడిగా, హిందీ అకాడెమీ సంచాలకునిగా పనిచేసి పదవీ విరమణ చేశాను. ఆంధ్ర మహిళా సభ విద్యాలయాల గౌరవ కార్యదర్శిగా పనిచేస్తూ నా కిష్టమైన సాహిత్య రంగంలో అభిరుచిని తిరిగి పొందుతూ, మంచి సాహిత్యాన్ని, ఇష్టమైన సభలను హాజరవుతూ, మంచి ఆరోగ్యకరమైన సమాజం కోసం తపించటం ప్రస్తుతం చేస్తున్న వ్యాపకం. హృదయాన్ని కదిలించే సంఘటనలపై స్పందించి కవితలను వ్రాయటం ఇష్టమైన పని. ‘ లయ – గతి’ కవితా పుస్తకాన్ని ప్రచురించటం జరిగింది. శ్రీ శ్రీ కవిత్వం నన్ను ఇప్పటికీ కదిలిస్తూనే ఉంటుంది. రావి శాస్త్రి, తిలక్, చలం, శివసాగర్ లు అభిమాన రచయితలు.
