
బాపట్ల నానీలు
– డా.సి.భవానీదేవి
నీవాళ్ళు దూరమయ్యారా ?
చింతించకు ..
మేలు చేసుంటావు
అందుకే !
అమ్మ.. నాన్న..
వెళ్లిపోయారు
మట్టి మరోరూపందాల్చినా
గుర్తించలేం కదా..
శతాధిక నాటకాల పేటి
కొర్రపాటి ….
నాటక రచనలో
ఘనాపాఠి !
సాహితీ రుద్రమ
కప్పిన తొలిశాలువా
నాకది
బాధ్యతా పులకరింత !
బతుకంతా నడకైనా
కాళ్ళనెప్పుల్లేవు
ఆరిపాదాలకు
మా ఊరిమట్టి !
కిలో బియ్యం
లీటర్ కిరోసిన్ కోసం
రోజంతా క్యూలో …
తుఫాన్ కు అంతా ఒకటే!
నాన్న వెనక
చేనుగట్లపై నడక
ఎగుడు దిగుళ్ళు
అర్ధమైందప్పుడే!
బాల్య స్నేహితుల పేర్లు
గుర్తురావటంలేదు
ఫోటోలన్నీ
మనసు ఆల్బంలో !
అతను
భార్యను కాల్చేశాడు
రెండో పెళ్ళితో
నిత్యం కాలిపోతూనేఉన్నాడు
సముద్రం ముందు
నిలబడటం ఇష్టం
లేశమైనా
గర్వం మిగల్చని గురుత్వం !
*****

డా||సి.భవానీదేవి నివాసం హైదరాబాదు. ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ, ఎల్.ఎల్.బి., పి.హెచ్.డి. పట్టాలు పొందారు. కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవితచరిత్ర, లలితగీతాలు మొదలైన అన్ని ప్రక్రియలలో రచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉప కార్యదర్శి. 12 కవితా సంపుటులు, వివిధ ప్రక్రియల్లో 46 గ్రంథాలు వెలువరించారు. వీరి పలు కవితలు, కథలు అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి.
