
ఖాళీ
-డా.సి.భవానీదేవి
ఇప్పుడంతా ఖాళీయేఇల్లు..మనసు..కలల ఖజానా ఎన్నో దశాబ్దాలుగా సేకరించి పెట్టుకున్నఅక్షర హాలికుల సేద్య ఫలాలు…. స్వర శిఖర సంభావిత సంపూజ్యరాగమాంత్రికుల మధుర గళ మధురిమలు సాహితీ ప్రకాండుల సభా సందర్భాలనుమనోనేత్రంలో చిర చిత్రణ చేసిన జ్ఞాపికలు బాల్యం తాగించిన అమ్మ నాన్నల అనంతామృత ధారల ప్రేమ ఉయ్యాలలు చదువు..సంస్కారం ప్రసరించినగురువుల ప్రశంసల ఆశీస్సులు బాల్యంలో హత్తుకున్న కలం ప్రకటించినఅనేకానేక రచనల సమాహారాలు చిన్నప్పటి నుండి నా ఆశల స్వప్నాల్నీనా కన్నీటి తడిని చదివిన వంటపాత్రలు దూరమయిన రక్తబంధాల ఆనవాళ్ళుదగ్గరయిన ఆత్మబంధువుల ఆప్యాయతలు జీవితంలో ప్రతి క్షణం ..వెలుగు నీడలుమనసుగదిలో దాగిన..మంటలమల్లెలు అన్నీ ఒక్కసారిగా అదృశ్యమై నప్పుడుఖాళీ ఇంట్లో ప్రశ్నార్థకంలా.. నేను! ప్రతి అడుగునీ..గతాన్నీ తవ్వుకుంటూనేనే ఒక ఖాళీ ఙ్ఞాపకంగా..ఖాళీగా..
****

డా||సి.భవానీదేవి నివాసం హైదరాబాదు. ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ, ఎల్.ఎల్.బి., పి.హెచ్.డి. పట్టాలు పొందారు. కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవితచరిత్ర, లలితగీతాలు మొదలైన అన్ని ప్రక్రియలలో రచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉప కార్యదర్శి. 12 కవితా సంపుటులు, వివిధ ప్రక్రియల్లో 46 గ్రంథాలు వెలువరించారు. వీరి పలు కవితలు, కథలు అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి.

ఈ వయసు వారు చాలామందికి ఇల్లు, మనసూ “ఖాళీ” అయినా భావనే.