ఖాళీ

-డా.సి.భవానీదేవి

ఇప్పుడంతా ఖాళీయే
ఇల్లు..మనసు..కలల ఖజానా
 
ఎన్నో దశాబ్దాలుగా సేకరించి పెట్టుకున్న
అక్షర హాలికుల సేద్య ఫలాలు….
 
స్వర శిఖర సంభావిత సంపూజ్య
రాగమాంత్రికుల మధుర గళ మధురిమలు
 
సాహితీ ప్రకాండుల సభా సందర్భాలను
మనోనేత్రంలో  చిర చిత్రణ చేసిన జ్ఞాపికలు
 
బాల్యం తాగించిన అమ్మ నాన్నల 
అనంతామృత ధారల ప్రేమ ఉయ్యాలలు
 
చదువు..సంస్కారం ప్రసరించిన
గురువుల ప్రశంసల ఆశీస్సులు
 
బాల్యంలో హత్తుకున్న కలం ప్రకటించిన
అనేకానేక రచనల సమాహారాలు
 
చిన్నప్పటి నుండి నా ఆశల స్వప్నాల్నీ
నా కన్నీటి తడిని చదివిన వంటపాత్రలు
 
దూరమయిన రక్తబంధాల ఆనవాళ్ళు
దగ్గరయిన ఆత్మబంధువుల ఆప్యాయతలు
 
జీవితంలో ప్రతి క్షణం ..వెలుగు నీడలు
మనసుగదిలో దాగిన..మంటలమల్లెలు
 
అన్నీ  ఒక్కసారిగా అదృశ్యమై నప్పుడు
ఖాళీ ఇంట్లో  ప్రశ్నార్థకంలా.. నేను!
 
ప్రతి అడుగునీ..గతాన్నీ తవ్వుకుంటూ
నేనే ఒక ఖాళీ ఙ్ఞాపకంగా..ఖాళీగా..

****

Please follow and like us:

One thought on “ఖాళీ (కవిత)”

  1. ఈ వయసు వారు చాలామందికి ఇల్లు, మనసూ “ఖాళీ” అయినా భావనే.

Leave a Reply

Your email address will not be published.