మచ్చలు

-డా.కాళ్ళకూరి శైలజ

ఎండ సోకిన చోట నలుపు,బట్ట దాపున తెలుపు,  ఒంటి మీద కష్టసుఖాల జాడలుమచ్చలై ముచ్చట్లు చెపుతాయి. సొమ్ములు సాగి సాగి వేలాడే కండలౌతాయి .శతమానాల ముద్దర ఎద మీద ఒత్తుకుంటుంటే , నాలి తాడు ఆనవాలు మెడ చుట్టూ చేరి తాకట్టుకెళ్ళి తిరిగి రాని ఊసులు చెపుతుంది.పాలు చీకిన ముచ్చికలు,పసి అంగుడి కోసిన పగుళ్ళతోఉసూరు మంటాయి.      రోకళ్ళు,చీపుర్లు కదుము కట్టిన చేతులుఎగుడు దిగుడు గుట్టలు.గుండిగలు తోమి మకిలి ఇంకిన వేళ్ళు  పంట కొడవలి గంట్లకి రెల్లు గడ్డిలా పదును దేరాయి. మోసిన నీళ్ళ బిందెల లెక్క నడుమున మరో మచ్చై,ఆకురాయిలా తగులుతుంది.కాన్పు కాన్పుకు ఉబ్బిన దారపు కండె,ప్రతి పురిటికీ పెటిలి డొల్లై మిగిలింది.ఆఖరి బిడ్డ అడ్డు తిరిగినపుడు పెట్టిన నిలువు కోత,ఈ మద్దినే తెగ దురద తేరుతోంది!కట్టెలూదిన పొయ్యి ముంజేతుల అగ్గి రవ్వలు జల్లిందిగంజి చిందిన సెగ పాదాల పై ముగ్గులు దిద్దింది. ఇక అగపడని మచ్చలో?చెంప తాకిన వేళ్ళు ,చర్నాకోల కొసలు చిమ్మిన కల్లు తుంపర్లు, పదిమంది లో అపనిందల తూట్లు,కళ్ళల్లో జాలి జీరలు , గుండె లో వెక్కిళ్లుఎన్నని చెప్పాలి? మేం ఒదులుకున్న సోయగాల మెరుపు,ఒళ్ళంతా పచ్చి ఒరుపు .గుప్పిలి ఇప్పి పొత్తిళ్ళ గూడు చేరి ,ఈ మచ్చల దారిలోనే శిశువు మడిసయేది.బతుకు చిత్రాల కతలు ఇడమరిచి చెపితేమచ్చలే అగపడతాయి.

****

Please follow and like us:

3 thoughts on “మచ్చలు (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ”

  1. గుండెలోని మచ్చలచిల్లుల గుట్టువిప్పితే … సమాజంగుండెగల్లంతవుతుందనేమో…జాలిగుండెతో ..ఆ జోలికెళ్ళలేదు .. సర్జరీ కళ్ళకు కానరాని దేముంది ..
    ఏ కలమూ చూడని గాయాల్ని ..నీరునిండిన కళ్ళతో చూపించిన మీకు … ధన్యవాదాలు !

  2. ఒకప్పుడు పరువంతో మిసమిసలాడిన ఆమె శరీరం
    నేడు ఆమె తనువంతా జీవితం పెట్టిన మచ్చలు ఆమె చరిత్రను లిఖించి ఉంచాయి.
    అద్భుతమైన ఊహావాస్తవం… చక్కగా చిత్రించిన కవిత….
    అభినందనలు శైలజాజీ !

    1. అనేక ధన్యవాదాలు మేమ్…మీ ఆశీస్సులు నాకు బలం.

Leave a Reply to Kallakuri Sailaja Cancel reply

Your email address will not be published.