మరో గుండమ్మ కథ

-అక్షర

                                           గుండమ్మగారంటే ఎవరో కాదండీ, మా అత్తగారికి అత్తగారైన ఆదిలక్ష్మి అమ్మగారే. వయస్సు ఎనభై ప్లస్సు. మొత్తం ఇంటికి బాసు. ఏమంటారా? ఆ పరమాత్మ ఆనతి లేనిదే ఆకైనా కదులుతుందేమోకానీ ఈ ఆదిలక్ష్మిగారి అనుమతి లేనిదే మా ఇంట్లో మంచినీళ్లయినా పుట్టవు. అదేమంటారా? అది ఆవిడ అదృష్టం. మన ప్రాప్తం. ఏదేమైనా ఆవిడకు ఆఇంట్లో ఉన్న పవర్ చూసి, ఆవిడ ఆకారానికి తగ్గట్టుగా గుండమ్మ అని, బిగ్ బాస్ అని పేర్లు పెట్టాము. ఆవిడకు తెలియకుండా ఆవిడ విషయం ప్రస్తావించాలంటే ఈ నిక్ నేమ్స్ వాడుతాము. ఇంతకీ నేను ఎవరినో అర్థం అయింది కదండీ. మొదట్లో చెప్పాను కదా, ఈ ఆదిలక్ష్మి అమ్మగారి కొడుకూ, కోడలికి కోడలిని, అనితను.

                                            కొడుకుల్నీ, కోడళ్లనీ, ముఖ్యంగా భర్తను ఎలా అదుపులో పెట్టుకుని ఆడించాలో ఈవిడ దగ్గర ట్రైనింగ్ పుచ్చుకోవచ్చు. భర్త పోయేనాటిదాకా కూడా ‘’ఏమే బంగారం’’ అని పిలిపించుకుని తనకి కావలసిన పనులన్నీ కావల్సినట్టుగా చేయించుకోగలిగిన అదృష్టవంతురాలు గుండమ్మగారు. భర్త ఉన్న రోజుల్లోనే ఆయన తరువాత అంత ముద్దుగానే చూసుకునే కొడుకులు ఉండాలికదా. అందుకుగాను ఇద్దరు కొడుకులకీ బాగానే తర్ఫీదు ఇచ్చారు. కానీ పెద్ద కొడుక్కి వాళ్లమ్మగారి తీరూ తెన్నూ నచ్చక పెళ్లైన వెంటనే వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోయాడు.

                                                కానీ చిన్న కొడుకు అనగా మా మామగారు మాత్రం అపర శ్రీరామచంద్రుడు. తల్లి అన్నా, ఆవిడ మాటన్నా ప్రాణం. ఆవిడ కోరిక ఇంకా ఆవిడ పెదవులు దాటకుండానే ఆ కోరిక తీర్చేయటం ఆయనకి పరిపాటి.

అంతవరకు నాకేం సమస్య లేదు. ఏదో ఆవిడ పూర్వ జన్మ సుకృతం అలాటి భర్త, కొడుకూ, కోడలూ దొరికినందుకు అనుకుని నిజం చెప్పద్దూ, అసూయ పడుతూ కాలం గడిపేద్దును. 

అయితే అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే మా ఇల్లు చాలా పాతకాలపు రెండుగదుల ఇల్లు. మా పెళ్లికి ముందు ఆ ఇంటిపైన మరో అంతస్తు కట్టి, అదేదో మాకోసం పెద్ద భవనం కట్టించినట్టుగా ఫీలయిపోతూ ఉంటారు మా అత్తగారు. 

                                              మా ఇంట్లో వంటగది అనండి, పడకగది అనండి, దేముడి గది అనండి, ఏతేడా లేకుండా అన్ని రకాల జీవరాశులూ అలా స్వేచ్ఛగా పాకుతూ, ఎగురుతూ వీరవిహారం చేస్తుంటాయి. బల్లులు అయితే సర్రేసరి వాటిదే సామ్రాజ్యం అన్నట్టు నిర్భయంగా తిరుగుతుంటాయి. 

                                        పోనీ ఇవన్నీ ఒక పక్కకి పెట్టి ఎలాగో అలా సర్దుకుపోదామన్నా మా బిగ్ బాస్ ఆధిపత్యం రానురానూ ఆవిడ వయస్సుతో పాటూ ఇంకా ఎక్కువై పోతోంది. ఆవిడకి అక్కర్లేని విషయం లేదు. పోనీ పెద్దావిడ ఏదైనా చెబుదామంటే ఊరంతా వినిపిస్తుంది కానీ ఆవిడకి వినిపించదు. ఆవిడ వినకూడని మాటలు మనం ఎంత మెల్లిగా మాట్లాడుకున్నా ఆవిడకి తెలిసిపోతుంది.

                                          ఇదంతా ఇలాఉండగా పెద్దావిడని చూడటానికి వచ్చే మావారి అత్తయ్యలు, మా ఊరిలోనే ఉన్న బంధువులు వచ్చేందుకు ఒకవేళాపాళా లేదు. ఆదివారం అయితే ఇంక సరేసరి ఉదయం ఏడుగంటలు నుంచీ రాత్రి పది గంటలు వరకూ ఎవరైనా రావచ్చు, వెళ్లవచ్చు. అందులోనే ఎప్పుడో అప్పుడు వచ్చిన వారిని ఒకసారి పలకరించి, ఒక నిద్ర తీసేయటం మా గుండమ్మకి అలవాటే. కానీ వచ్చినవారికి కాఫీలు, టిఫెన్లు మిగతా  మర్యాదలూ చేయలేక నేనూ, మా అత్తగారూ సతమతమైపోతూంటాం.

                                           నాకూ రవికీ పెళ్లైన కొత్తలోవచ్చేపోయేవాళ్ల ధాటీ తట్టుకోలేక తెగ చిరాకు పడిపోయేదాన్ని. మా పుట్టింటి విషయం దీనికి చాలా విరుధ్ధంగా ఉండేది. ఏమంటే మానాన్న అంత కలివిడి మనిషి కాకపోవటంతో మా ఇంటికి వచ్చేపోయేవాళ్లు చాలా తక్కువ. ఇక్కడి వ్యవహారం చూశాక నా పరిస్థితి చాలా అయోమయంగా తయారైంది. అప్పటికీ మా అత్తగారు నా బాధ్ ఆర్థం చేసుకుని నన్నూ, రవిని పైభాగానికి ఏదో ఒక నెపంతో పంపేసేవారు. ఇదంతా ఒక దారి అయితే మన గుండమ్మ చివరిగదిలోంచి మొత్తం ఇంట్లో జరుగుతున్నవన్నీ కనిపించేలా కుర్చీ వేస్కుని, అన్నీ గమనిస్తూ, అజమాయిషీ చేస్తుంటారు. పెళ్లి కాక మునుపు నాకు రవితో కొంత పరిచయం ఉన్నా, ఇంట్లో వాళ్ల బామ్మ గారే బాస్ అన్న విషయం అస్స్సలు తెలియదు. రవి నాకు విషయాలు ఏంఈ చెప్పకుండా పెళ్ళి చేసుకుని నన్ను ఇక్కడ ఇరికించేశాడని నాకుకోపం వచ్చినప్పుడల్లా తనపై చిటపటలాడ్తూ ఉంటాను.

                                           ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాక ఇప్పుడు ఈ వాతావరణంలో నుంచి ఎలా బయటపడాలో తోచి చావటం లేదు. అసలు నా మాట వదిలేస్తే, చిన్నప్పటినుంచీ ఆ ఇంట్లో నే పెరిగిన రవి వాళ్ల అమ్మా, నాన్న దగ్గర ఎప్పుడైనా బయటపడితే వాళ్లేం బాధ పడతారో అని నా దగ్గరే విసుగు చూబిస్తుంటారు.

                                           మా అత్తగారి దగ్గర తగినంత డబ్బుంది. ఆ పాత ఇల్లు పడగొట్టి, ఆప్లాటులోనే చక్కగా ఓ నాలుగు ఫ్లాట్స్ వచ్చేలా కట్టుకుని అందరూ ఒక దగ్గరే ఉంటూ ఎవరి ప్రైవసీ వారు ఎంజాయ్ చెయ్యచ్చు. కానీ దానికి మన గుండమ్మ అనుమతిస్తే కదా. ఆవిడ వాళ్లాయనతో కలిసి కాపురం చేసిన ఇల్లుట. అందుకని దాన్ని పడగొడ్తే తన గుండెపైన గునపంతో కొట్టినట్టే అని గొడవ పెట్టేసారు. తాను జీవించి ఉండగా మళ్లీ ఆ మాట ఎత్తద్దన్నారు. అంతే మాతృభక్తుడైన మా మామగారు మళ్లీ ఆ ఊసు ఎత్తలేదు.

                                             నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను- ‘’నా ఫ్రెండ్స్ ఇళ్లల్లో కూడా బామ్మలూ, అమ్మమ్మలూ ఉన్నవారున్నారు. కానీ వారెవరూ ఇలా బాధ పడుతున్నట్టు చెప్పలేదే. నా ఫ్రెండ్స్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తుంటే నాకేమిటీ ఖర్మ? మేమింక ఇలా కూపస్థమండూకంలా జీవితం గడపవలసిందేనా’’ అని.

ప్రస్తుతం మేముంటున్న ఇల్లు కాకుండా మా అత్తగారికి ఇంకో రెండు స్వంత ఫ్లాట్సు ఉన్నాయి. కానీ ఏం లాభం? అవి అద్దెకి ఇచ్చి ఈ ఇంట్లోనే అందరం ఉంటున్నాం. మన గుండమ్మ ఆనతి లేకుండా ఆ ఇంట్లోకి కూడా మారలేము.

                                           ఇంట్లో ఉదయం లేచిన దగ్గర్నుంచీ టిఫెను, వంటా అంతా ఆవిడని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆవిడ ఒప్పుకోరు.

ఎందుకో కొంతమంది పెద్దవయసు వచ్చేసరికి ఇలా మొండిగా తయారవుతారు? ఏమో, రేపు నేనూ ముసలివయసు లో ఇలాగే అయిపోతానా? పోనీ ఆవిడ ఏమైనా కష్టపడి ఉంటే తిరిగి తన కోడలు ఎందుకు సుఖపడాలి అన్న మనస్తత్వం సహజంగా చూస్తూ ఉంటాము. కానీ ఈ గుండమ్మగారు ఎప్పుడూ రాజాలా బ్రతికిన మనిషి. ఎనభై ఏళ్లువచ్చినా, ఇవాళో రేపో అయిపోయింది నా పని అని ఒకపక్క మెట్టవేదాంతం చెబుతూనే, ఇంట్లో అందరూ తన మొండి సెంటిమెంటుతో బాధ పడుతుంటే అలా చూసీ, చూడనట్టు ఎలా ఉండగలుగుతున్నారు?

                                           మా వారి ఆఫీస్ ఫ్రెండ్స్, నాఫ్రెండ్స్ వాళ్ల ఇళ్లకి పిలుస్తుంటారు. మేము వెళ్తుంటాము . తిరిగి ఒకసారైనా వాళ్లని మనింటికి ఆహ్వానిద్దామంటే ఆ ఇరుకు గదుల్లో నాలుగు కుర్చీలు కూడా సరిగ్గ్గా పట్టవు. ఈ ఘర్షణ భరించలేక ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపి ఇంటికి వీలయినంత ఆలస్యంగా రావటం మొదలుపెట్టారు రవి.

                                            ఇక నేను పెళ్లికని వదిలేసిన ఉద్యోగం మళ్లీ మొదలుపెడదామా అని ఆ ప్రయత్నంలో ఉండగా ఒక సాయంత్రం రవి ఆఫీస్ నుంచి చాలా హుషారుగా వచ్చి,

‘’నాకు ఆఫీస్ క్వార్టర్స్ దొరికాయి. నా ఆఫీస్ కి దగ్గర. అన్నివిధాలుగా మాకు సదుపాయంగా ఉంటుంది. పెద్ద ఇల్లు. మీరు కూడా అక్కడికి వచ్చేస్తే అక్కడే అందరం కల్సి ఉండచ్చు. మీరు కాదంటే మేమిద్దరం మాత్రం అందులోకి మారిపోతాము. మీరు ఏసంగతీ ఆలోచించుకుని చెప్పండి. ఆ క్వార్టర్స్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు అది వదులుకుందుకు సిద్దంగా లేను.’’ అన్నారు.

                                           మా అత్తా, మామా గుండెల్లో రాయి పడ్డట్టు చూస్తూండిపోయారు. వాళ్లకి రవి ఒక్కడే కొడుకు. ఎప్పుడూ తల్లీ, తండ్రి మాటకి ఎదురు చెప్పటం వాళ్లు ఎరుగరు. అలాంటిది ఒక్కసారిగా వేరే ఇల్లు చూసుకున్నామని అంత కచ్చితంగా చెప్తుంటే ఏం చెయ్యాలో తెలియక ఊరుకున్నారు. నిజం చెప్పద్దూ, మా అత్తామామలు మమ్మల్ని ఎప్పుడూ ఏరకంగానూ ఇబ్బంది పెట్తలేదు. కానీ మాకు కావలసినంత స్వేచ్ఛ మాత్రం దొరకని మాట కూడా వాస్తవమే. ఆఖరికి రవికి, నాకూ ఇష్టమైన ఒక టిఫిన్ కానీ, వంట కానీ చేసుకోవాలంటే కూడా ముందుగా గుండమ్మగారు, ఆ తరువాత మా మామగారి సమ్మతి కావలసిందే. 

                                                  పాపం, అత్తగారికి చిన్నప్పుడే వివాహం అయిపోయింది, కాబట్టి ఆవిడకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ ఇంట్లో వాతావరణానికి అలవాటు పడిపోయారు. ఆవిడలా నేను కూడా అలవాటు పడిపోవాలన్నది ఆవిడ కోరిక. ఆ ఇల్లు కొంచెం వీలుగా ఉంటే నేను కూడా వాళ్ల ఒక్కగానొక్క కొడుకుని వారినుంచి వేరు చెయ్యాలని అనుకోకపోదును.

మనదేశం ఎంత పురోగమించిందని అనుకున్నా, మన సంఘంలో తమ కొడుకుని ఎంతవాడైనా తన కొంగుకు కట్టుకుని తిరగాలని ఆశమాత్రం ఇకా చాలా కుటుంబాలలో కనిపిస్తూందనటానికి మా ఇల్లే ఒక నిదర్శనం.

ఇలా ఎదిగిన కొడుకుని తన చెప్పుచేతుల్లో ఉంచుకుందామని తల్లీ తండ్రీ తాపత్రయ పడినకొద్దీ ఆ కొడుక్కి బంధ విముక్తి చెంది ఆకాశంలోకి ఎగరాలన్న కోరిక ఇంకా బలపడిపోతుంది. ఇది ఎందుకు గ్రహించరో పెద్దవారు?!

                                              మొత్తంమీద రవి క్వార్టర్స్ లోకి మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నన్ను అత్తగారితో వెళ్లి ఇంట్లోకి కావలసిన సామాంలు కొనుక్కోమన్నారు. ఇద్దరం వెళ్లి కొన్నాము. మంచిరోజు చూసుకుని పాలు పొంగించుకుని వచ్చాము. ఇక రెండు రోజుల్లో ఆ ఇంట్లోకి మారతామనగా అసలు నాటకం మొదలైంది. 

రవికి, మా అత్తకి మధ్య ఏం మాటలు జరిగాయో తెలియదు కానీ, ఆవిడ కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘’పెళ్లయ్యాక నువ్వు మారిపోయావురా’’ అంటూ నావైపు కూడా ఒక మాట విసురుతున్నారు. మామగారైతే పలకరించినా మాట్లాడటం మానివేసారు. ‘’ఇక తల్లి, తండ్రిని ఇలా దుఃఖపెట్టి మేం ఇంకో ఇంటికి మారి మాత్రం ఏం సుఖపడతాం?’’ అనుకుని ఇల్లు మారే ప్రయత్నం మానేసేము.

                                  రవికి కనీసం ట్రాన్స్ ఫరబుల్ జాబ్ అయినా కాదు. పోనీ ఆ మిషపెట్టి మరో ఊరు మారుదామంటే. ‘’అసలు పెద్దవారు అలా ఎందుకు అయిపోతారు?రేపు నాకు వయస్సు పైబడితే నేను కూడా ఇలా నా పిల్లల పట్ల ఇలాగే పొసెసివ్ గా తయారవుతానా?’’ అన్న ఆలోచన నన్ను వేధిస్తోంది. మా గుండమ్మగారు ఒకసారి సరే అంటే ఈ ఇంటినే మార్పులు చేయించుకుని ఎవరినీ కష్టపెట్టకుండా ఒక్కచోటే ఉండవచ్చు. ఇలా తన మొండితనంతో ఇంట్లో అందరినీ అల్లరి పెట్టకపోతే కొడుకులు కట్టిన మూడు అంతస్తుల మేడలో సరదాగా అందరితో కలిసి ఉండవచ్చును కదా. అంతలోనే ఆవిడ పెత్తనం పోతుందని బెంగా? ఇది ప్రతి ఇంటి సమస్యేనా? కాదేమో?!’’ నేను నా ఫ్రెండ్స్ అమ్మమ్మల్ని, నానమ్మల్ని చూస్తున్నాను కదా వాళ్లు ఇలా కాదే. మన గుండమ్మగారు తన పట్టు సడలించరు. మరి మా సమస్యకి పరిష్కారం ఏమిటి?

మా అత్తని చూస్తే నాకే పాపం అనిపిస్తోంది. చక్కటి సంపాదన ఉంది. ఇద్దరికీ సంఘంలో మంచిపేరుంది. మిగతా వారిలా చక్కటి ఇంట్లో అందంగా అలంకరించి, ఉండాలన్న సరదా ఆవిడకి ఉండదా?

*** 

                                             అన్ని రకాలుగా ఆలోచించిన మీదట మాకు ఒక పరిష్కారం కనిపించింది. మా అత్తని, రవి పెదనాన్నగారిని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఒక ప్లాను వేసాము.

మంచి సమయం చూసుకుని రవి గుండమ్మగారి దగ్గర చేరి, కాసేపు ఆమాటా ఈమాటా మాటాడి ‘’బామ్మా, లండన్ లో ఉన్న అత్తవాళ్లని చూసి కొన్ని ఏళ్లు ఐపోయింది కదూ. ఒకసారి వెళ్లొద్దామా’’ అంటూ అసలు విషయం కదిలించాడు. 

‘’అమ్మో, అంత దూరమా? ఈ వయసులో నేను ఏ లండన్ రాలేనురా. నా వల్లకాదు. దాన్నే ఇక్కడికి రమ్మను’’ వెంఠనే ఆవిడ జవాబు. అనుకున్నదే. 

‘’నీకేమయిందే బామ్మా, గుండులా ఉన్నావు’’ అని మనసులో అనుకుని ‘’పిల్లల చదువులూ, ఉద్యోగాలూ పెట్టుకుని తను మాత్రం ఇప్పుడు ఎలావస్తుంది బామ్మా?’’

‘’మనమే వెళ్దాం. మనం కూడా విదేశం చూడొద్దా? మనమంతా కలిసి చాలా ఏళ్లయింది. నిన్ను కాలు కింద పెట్తకుండా విమానంలో తీసుకు వెళ్తాను’’

‘’విమానంలోనే? భయం వెయ్యదుట్రా? అయినా ఒకసారి విమానయాత్ర చెయ్యాలన్న కోరిక ఉందిరా రవీ. అయితే నువ్వూ, రామం నా పక్కనే ఉండీ తీసుకుని వెళ్లాలి సుమా.’’

‘’ఓస్ అంతేనా. నువ్వు ఊ అనాలే కానీ అదేమంతం విషయం’’ అంటూ తను విజయం సాధించినందుకు రవి, మేమూ కూడా చాలా సరదా పడిపోయాము. 

                                              గుండమ్మగారు మళ్లీ మనస్సు ఎక్కడ మార్చుకుంటుందో అని శంక పీకుతున్నా, లండన్ ప్రయాణ ప్రయత్నాలు మొదలు పెట్టారు రవి.

రవి తన అత్తయ్యతో ముందే మన ప్లాన్ చెప్పి ఉంచాడు. బామ్మని అక్కడ కనీసం ఒక నాలుగు నెలలైనా ఉంచుకుంటే ఈ లోపున ఇక్కడ ఇల్లు మార్పులు చేయించి తీసుకువద్దామని. అత్తయ్యా, మామయ్యా ఒప్పుకున్నారు. ఈ పనంతా గుండమ్మ గారికి తెలియకుండా జరగాలి.

                                          ఎలాగైతేనేం, భానుమతి అత్తగారి కథల్లో లాగా అన్ని రకాల పొడులూ, పచ్చళ్లూ పెట్టుకుని లండన్ కి ప్రయాణమయ్యారు. రవి, నేను, మా మామగారు, గుండమ్మ గారు అక్కడికి చేరటం ఒక అధ్యాయం, అయితే ఆవిడని అక్కడ నాలుగు నెలల పాటు ఎలా ఉంచాలన్నది మరో సమస్య.

                                       రవీ, మామామగారు ఇద్దరూ ‘’మా ఆఫీస్ కి అన్ని రోజులు సెలవలివ్వరు. నువ్వు ఆఫీసుకెళ్లే అవసరం లేదు కనుక కొంతకాలం చక్కగా కూతురి దగ్గర ఉండు’’ అని నచ్చచెప్పారు. 

‘’అయినా ఇన్నివేలు ఖర్చుపెట్టి అంత దూరం వెళ్లి కొన్ని నెలలైనా ఉండకపోతే ఎలా? చక్కగా అత్తయ్య నీకు దగ్గరుండి కొత్త ప్రదేశాలు చూబిస్తుంది. హాయిగా చూసిరా.’’ అంటూ మభ్యపెట్టి ఇద్దరూ వారంరోజుల తరువాత లండన్ విమానాశ్రయం చేరుకున్నారు. రవి మనసు కుదుటపడింది. కానీ వాళ్ల నాన్నగారు మాత్రం ఏదో తప్పు చేసిన వాడిలా బాధ పడిపోతుంటే       ఆయనకి సర్ది చెప్తూ ఇండియాకి ప్రయాణమయ్యాం. రవీ, నేనూ హుషారుగా, మామగారు బరువెక్కిన మనసుతో విమానం ఎక్కాము. దారి అంతా కూడా రవి వాళ్ల నాన్నకి,

‘’పర్వాలేదు నాన్నా. మనమేమి బామ్మని వృధ్ధాశ్రమంలో వదిలి రావటం లేదు కదా. చక్కగా కూతురి దగ్గర మనవళ్లతో ఆడుకుంటూ కాలం గడుపుతుంది’’ అని రకరకాలుగా సర్ది చెబుతూనే ఉన్నాడు.

ఏం చెయ్యం? కొంచెం మన మాట, మనసు అర్థం చేసుకుంటే మనకి కూడా ఈ ప్రయాణం, ఖర్చు అన్నీ తప్పేవి కదా. ఇల్లు తయారయ్యాక బామ్మగార్ని తీసుకువచ్చి, ఈ మార్పులు ఎలా చూపించాలి? ఎలా చెప్పాలి అన్నది తరవాత విషయం.

                                                నెలరోజుల పాటు గుండమ్మగారు కూతురింట్లో శాంతంగానే ఉన్నారు. తరవాత మెల్లమెల్లగాకొడుకు దగ్గరకు పంపమని గొడవ మొదలెట్టారు. మాకు తెలుసు ఇలా జరుగుతుందని. ఏం చేయటం? మన సమస్యకి మరోదారి కానరాలేదు. ఇండియాలోనే ఇంకోఊరిలో ఉంచి వస్తే ఆవిడ ఎవరో ఒకర్ని మంచి చేస్కుని తిరిగి వచ్చెయ్యగలదు. కానీ విదేశం నుంచి తోడు లేఉండా అంత ధైర్యం చెయ్యలేదు. పాపం, అక్కడ రవి అత్తయ్య ఈ నాలుగు నెలలూ ఆవిడ గొడవ ఎలా భరించారో?! 

                                         ఎలా అయితేనేం, మూడు అంతస్తులలో కింద అంతస్తు అనుకున్న ప్రకారం పూర్తి అవంగానే మా మామగారు ఇంక ఉండబట్టలేక గృహప్రవేశానికి వారం రోజుల ముందు వాళ్లమ్మగార్ని తీసుకురావటానికి బయల్దేరారు. అంతవరకూ బానే ఉంది. కానీ ఆవిడ అస్సలు ఊహించలేని ఈ పెద్ద మార్పు చూసి ఎంత గొడవ పెడతారోనని అందరం మహా టెన్షన్ పడిపోతున్నాము.

ఇంటి పని జరిగినంతసేపూ మేము రవి పెదనాన్న గారింటికి వెళ్లి ఉన్నాము. కాబట్టి గుండమ్మగార్ని కూడా అక్కడికే తీసుకువచ్చారు మామగారు.

‘’అదేంట్రా? మనింటికి తీసుకువెళ్లకుండా ఇక్కడికి తీసుకువచ్చావేమిటి?’’ అని ఆవిడ అడుగుతూనే ఉన్నారు. ఆవిడకు ఏదో అనుమానం మొదలైంది.

‘’ఏం లేదమ్మా, కొన్నాళ్లు వాళ్లదగ్గర వచ్చి ఉండమంటే వచ్చి ఉన్నాము. ఇదిగో నువ్వు వచ్చావు కదా, ఎల్లుండి మంచి రోజు మనింటికి వెళ్లిపోదాములే.’’ అంటూ ఆవిడని ఊరుకోబెట్టారు.

*** 

                                               తెల్లవారితే నాలుగింటికి గృహప్రవేశం. సాయంత్రం చూసేసరికి ఇంట్లో గుండమ్మగారు కనిపించటం లేదు. అంత పెద్ద వయస్సు. ఎవరికి తెలియకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారో తెలియదు. మా అందరి ఆందోళన మీరు ఊహించగలరు. మా మామగారు కళ్లనీళ్లు పెట్టేసుకున్నారు. పాపం, మాకు ఏం చెయ్యాలో ఆవిడని ఎక్కడ వెతకాలో అర్థం కాని పరిస్థితి. మన ఊరిలోనే ఉన్న బంధువులు, స్నేహితులూ అందరికి ఫోన్ చేసి అడిగాము. ఆవిడ ఆచూకీ మాత్రం దొరకలేదు

ఏదో గొడవ పెట్టిపెట్టి కొంత కాలానికి కొత్త ఇల్లు అలవాటై ఊరుకుంటారని అనుకున్నాము. కానీ ఇలా ఎవరికీ చెప్పకుండా వయసులో ఆవిడ ఇల్లు వదిలి వెళ్లిపోతారని కలలో కూడా అనుకోలేదు.

అయినా, అందరూ అనుకున్నట్టు ప్రవర్తిస్తే ఆవిడ గుండమ్మ ఎందుకు అవుతారు

ఇక మా అమ్మ రాకపోతే నేను పీటలమీద కూర్చోనని మామగారు మొదలు పెట్టారు. వీటన్నింటికి నేనే కారణం కాదు కదా అన్న ఘర్షణ మా అందరి మనసులో మొదలైంది.

                                     అన్ని ప్రయత్నాలు చేసాక కూడా ఆవిడ జాడ దొరక్క ఆపై దేవుడిపై భారం వేసి ఆయనని ప్రార్థిస్తూ, అన్యమనస్కంగానే అందరం ఫంక్షన్ కి కావలసిన పనులు చేసుకుంటూ పోతున్నాము. ఏమంటే, పై ఊరినుంచి రావలసిన బంధువులు వచ్చేసారు. ఇక కార్యక్రమం వాయిదా వేసే ప్రసక్తే లేదు.

మావల్లనే కదా ఇదంతా జరిగిందన్న భావనతో రవీ, నేనూ మామగార్ని తప్పించుకుని తిరుగుతున్నాం. ఇక తెల్లవారటానికి ఎంతో సమయం లేదు. ఒక్కక్క పనీ తెముల్చుకుని అందరం కాసేపు నడుము వాలుద్దామనేసరికి పది కావస్తోంది. ఎవరికీ నిద్ర రావటం లేదు. అలసటవలన అందరికీ కాస్త చిన్న కునుకు పట్టబోతుంటే కాలింగ్ బెల్ మోగింది. ‘’అబ్బా, ఇప్పుడే పురోహితులు వచ్చేసారా’’ అనుకుంటూ అత్తగారు వీధి తలుపు తెరవటానికి వెళ్లారు. ఆవిడ తలుపు తెరిచిన మరుక్షణం,

‘’ఏమండీ, అత్తయ్య వచ్చేసారు. ఒరేయ్ రవీ, బామ్మ వచ్చేసిందిరా’’ అంటూ సంభ్రమంగా కేకలు వేసేసరికి మామగారు తల్లి చేతుల్ని అల్లుకుపోయి ‘’ ఏంటమ్మా, అలా వెళ్లిపోయావు? మాకెవరికీ చెప్పాపెట్టకుండా’’ అని సంతోషంగా కన్నీరు పెట్టుకున్నారు

‘’మరి మీరు అన్నీ నాకు చెప్పే చేసేరా? నేను మాత్రం ఏం చేసినా మీకు చెప్పి చెయ్యాలా?’’ నాకొడుకు, కోడలు పీటల మీద కూర్చుంటే నేను చెయ్యవలసిన పనులు నాకుండవా?” అంటూ ఆవిడ తన చేతి సంచీలోంచి పట్టుపంచెలు, పట్టుచీరా, రెండు ఉంగరాలు తీసి చూపించారు

ఇంత చీకట్లో అంత ఖరీదైన సామాను పట్టుకుని ఈవిడ ఒక్కరూ ఎలా వచ్చారా అని చూస్తే గుండమ్మ గారి వెనక మా ఇంట్లో పనులు చేసే మనిషి కోండమ్మ, ఆమె భర్త కిట్టప్పా చిన్నగా నవ్వుతూ నిలబడ్డారు. మేమందరం వాళ్లిద్దరి వైపు ప్రశ్నార్థకంగా చూసేసరికి వాళ్లు ఖంగారు పడిపోయారు.

‘’మాకేం తెలవదయ్యగోరూ. మీపై ఒట్టు వేయించి అడిగితే పొద్దే అంతా చెప్పేసాము. ఇల్లు కూడా చూపించమని పట్టుబట్టారు బాబూ. తమ గది అలాగే ఉంచి మిగతాదంతా మార్చారని చెప్పామయ్యా.’’

ఇక తరువాత సీను గురించి ఏం చెప్పను? సంతోషం, సంభ్రమాశ్చర్యాలు మా ముఖాలని ఎంతగా వెలిగించాయో చెప్పకుండానే మీరూహించగలరు.

****

Please follow and like us:

9 thoughts on “మరో గుండమ్మ కథ”

  1. చాలా బాగా రాసేరమ్మా…
    గుండమ్మ కథ తెలుగులో చాలా పాపులర్ కదా.. మీ కథలో హీరో గుండమ్మ గారు కూడా కథకి మంచి ఔచిత్యాన్ని కల్పించేరు.. ముగింపు ఊహించలేనిదే.. మంచి కథని చదివిన తృప్తి కలిగింది.. ధన్యవాదములు.. (మా కోడలు జెంషెడపూర్ అమ్మాయి.. మీ నాన్నగారి పేరు మాకు పరిచయమే.

    1. Thank you suryagaru. మంచి comments పంపినందుకు. అంతకంటే సంతోషం మా నాన్నగారు మీకు పరిచయస్తుల అయిందకు.

  2. మంచి రచనా శైలి తో ఉత్కంఠ భరితంగా చదివింప చేసిన చక్కటి కధ!!

    1. Thank you జయాగారు. కొన్ని సంవత్సరాల తరువాత తెలుగు కథా జగత్ లో అడుగు పెట్టిన నా మొదటి కథ కు ఇంత మన్నన ఇచ్చినందుకు

  3. ఏదోఒక సైడు తీసుకుని కథ ముగిస్తారేమో అనుకున్నాను కానీ చాలా చక్కటి ముగింపు ఇచ్చారు. పెద్ద వాళ్ళకి వాళ్ళ సెంటిమెంట్లు ఉంటాయి. వాళ్ళు మారటం కష్టం. అందుకని మనమే సద్దుకుపోవాలి. కానీ అదే పెద్దవాళ్ళు మారినపుడు ఎంత గొప్పగా మారతారో నాకు కూడా అనుభవంలో తెలిసింది కనుక ఈ కథ ముగింపు ఆశ్చర్యంగా లేదు

    1. ఎన్నో ధన్యవాదాలు రాజ మోహన్ గారు.చక్కటి విలువ అయిన మి అభిప్రాయం తెలిపినందుకు. మే సంచిక లో నా మరో రచన ” నవ్వే బంగారమాయెనా'” వెలువడింది. దాని పై కూడా మి అభిప్రాయం తెలుపుతారు అని ఆశిస్తూ ,మరోసారి కృతగ్యటలు తెలుపుతూ,

  4. అపార్ధాలు, అలకలు, కోపతాపాలు ఇవ్వన్నీ ఒక ఎత్తు అయితే బంధాలు, అనుబంధాలు ఓదార్పులు, ఆప్యాయతలు, కొసరి తినిపించే చేతులు ఇవి మరొక ఎత్తు..జాయింట్ ఫామిలీస్ లో..నిజానికి ఇలలో స్వర్గం అంటే ఇంట్లో పెద్దవారు ఉండి మంచి చెడు చెప్తూ మనం వారితో షేర్ చేసుకుంటూ ఉండే ఇల్లే.
    నాకూ మా అత్తగారిల్లు ఒక స్వర్గం..
    చాలా చక్కటి కథనం…
    రచయిత్రికి అభివందనాలు..

    1. Thank you so much అరుణ గారు. ఎవరి పనులు వారు చేసుకోవటానికి టైము సరిపోవటం లేదని సతమతమవుతున్న నేటి సమయము లో ఎవరో రాసిన కథ ఆఖరు దాకా చదివి ,దాని పై మి విలువైన కాలము పెట్టి , చక్కటి అభిప్రము తెలిపి నందుకు ఎన్నో ధన్యవాదాలు.

Leave a Reply to అరుణ ఆర్ కుమార్ Cancel reply

Your email address will not be published.