యుద్ధం ఒక గుండెకోత-4

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

రెక్కవిప్పని పక్షిలా తనలోకి తానే

ముడుచుకొని నిద్రిస్తున్న భూమి!

కలత నిద్రలోనో దొంగనిద్రలోనో

అరవిచ్చిన కనురెప్పల్లోంచి తొంగిచూస్తోన్న

నెలవంక కంటిపాపలో ఆకాశం మధ్య

రెప్ప వాలనీయని భయం కోరలకి వేలాడుతూ జనం!

సంవత్సరాల తరబడి

తపోదీక్షలో ఉండి

అర్ధనిమీలిత నేత్రాలగుండా

కరుణామృతాన్ని కురిపిస్తూ

అరవిరిసిన పెదాల అంచులనుంచి

జాలువారుతున్న చిరునవ్వుని

ఫిరంగులు తూట్లు పొడుస్తున్నా

చెక్కుచెదరని శాంతిమూర్తిని

మందుగుండ్లతో పేల్చి

గుండెని ఛిద్రం చేసినపుడే మొదలైంది

అది ఒకచోట మసీదు కావచ్చు

మరోచోట తథాగతుడు కావచ్చు

వేరోచోట మందిరం కావచ్చు

ఇంకోచోట

నిబ్బరంగా ఠీవిగా ఆకాశాన్ని అందుకొంటున్నానని

అహంకారం పూనిన ఆధిపత్య బహుళ అంతస్తుల భవనం కావచ్చు

అప్పుడే

విరిగిన సూదిములుకు

తెలియకుండానే మన రక్తంలోకి ప్రవేశించింది

కళ్ళల్లో ఆందోళన

లేతపొరలా అల్లుకోడం మొదలైంది

చరిత్రరాసిన కట్టడాలను కూల్చేసినప్పుడే

గుండెల్లో చురకత్తై దిగినట్టైంది

సూదిమొన లాంటి బాధ

గునపమై

జీవితం కొసవరకూ చెరిగిపోని గాయం చేసినట్లైంది

ప్రపంచ మానవగుండె కవాటాలను

కల్లోల తరంగిణులు ఉరుకులతో ఢీకొంటూ

రక్తప్రవాహాల ఉప్పెన్లను సృష్టించింది అప్పుడే

అలలు ఉవ్వెత్తున పైకిలేచి

నిశ్శబ్దహింసకి బలై

జనహృదయాలు 

మౌనాన్ని ఆశ్రయిస్తున్న మునులైందీ అప్పుడే

బాష్పీభవించిన ఆలోచనలు పైకెగసి

అంతరంగాల్ని శూన్యమందిరాల్ని చేసిందికూడా అప్పుడే

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

2 thoughts on “యుద్ధం ఒక గుండె కోత-4 (దీర్ఘ కవిత)”

Leave a Reply to శీలా సుభద్రా దేవి Cancel reply

Your email address will not be published.