“మూడువేల అల్లికలు”

సామాన్య ప్రజలు-  అసాధారణ జీవితాలు  

(ఇన్ఫోసిస్ సుధామూర్తి కథలపై సమీక్ష)

   -అనురాధ నాదెళ్ల 

సాఫ్ట్ వేర్ రంగంలో ‘’ఇన్ఫోసిస్’’ పేరు దేశ, విదేశాల్లోని వారికందరకూ తెల్సినదే. అలాగే దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు ఛైర్ పర్సన్ గా ఉన్న శ్రీమతి సుధామూర్తిని తెలియని వారుండరేమో! ఆమె ఒక రచయిత్రన్న విషయం కూడా మనందరకూ తెల్సినదే. 

ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం సుధామూర్తి రాసిన ‘’మూడువేల అల్లికలు’’. ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసినవారు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి.  అనువాదమన్న ఊహ కూడా రానివ్వని సరళమైన భాషలో చెప్పారు. 

                                 దేశవిదేశాల్లో సుధామూర్తి తనకు ఎదురైన రకరకాల సంఘటనలు, సన్నివేశాలను అందమైన కథలుగా ఆసక్తికరంగా ఈ పుస్తకంలో చెప్పారు. ఆమెలో ఉన్న రచయిత్రి చదువరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ కథలనిండా ఆర్ద్రత  నిండి ఉంది. పుస్తకం చదువుతున్నంతసేపూ ఒక విశాల ప్రపంచం, దానిలోని రకరకాల జీవితాలు మన చుట్టూ ఆవిష్కరించబడతాయి. సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తులను, జీవితాలను చూస్తాం. ఇవన్నీ వాస్తవ అనుభవాలైనప్పటికీ వీటిని నేను కథలనే అంటున్నాను, ఎందుకంటే ఇవి మంచి కథల్లాగా మనల్ని తనలోకి లాక్కుంటాయి. 

                               1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించిన కొత్తలో లాభాపేక్షలేని సంస్థల పనితీరు గురించి తనకు అంతగా తెలియదనీ, కానీ సామాన్యులలో మార్పు తెచ్చేందుకు ‘’బహుజన హితాయ, బహుజన సుఖాయ’’ అనే లక్ష్యంతో ఎలాటి వివక్షా లేకుండా అవసరమైనవారికందరికీ దయగా సాయపడాలని ఫౌండేషన్ ఆశయంగా పెట్టుకున్నట్టు రచయిత్రి చెబుతారు. 

భారతదేశంలో ఉన్న అనేక సమస్యల గురించి ఆలోచించినప్పుడు ముందుగా ఆమె దేవదాసీ వ్యవస్థ గురించి ఏదైనా చెయ్యాలనుకున్నారు. ఆ విషయమై ఉత్తర కర్నాటకలోని దేవదాసీల పేరుతో జోరుగా వ్యభిచారం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి స్త్రీలను కలుసుకునే ప్రయత్నం చేస్తారామె. మొదటి రెండుసార్లు వారితో మాట్లాడాలన్న ఆమె ప్రయత్నం సఫలం కాలేదు. మూడవసారి తండ్రి చెప్పినట్టుగా ఆమె తన వస్త్రధారణను అక్కడి స్త్రీలలో కలిసిపోయేవిధంగా ఉండేలా చూసుకుని ఆయనను తోడుగా తీసుకెళ్లి వారితో స్నేహపూర్వకంగా, నమ్మకం కలిగే విధంగా మాట్లాడి వారి నమ్మకాన్ని గెలుచుకుంటుంది. వారి పిల్లల చదువులకు స్కాలర్ షిప్పులను అందేలా చేసి, ఆ పిల్లల భవితను తీర్చిదిద్దే క్రమంలో వారికి ఆప్తురాలవుతుంది రచయిత్రి. 

                                   దేవదాసీ వృత్తిని మానిపించేందుకు పట్టుదలగా ప్రయత్నించి, వారి జీవితాల్లో వ్యభిచార వృత్తికి చోటులేకుండా చెయ్యగలిగిన కథ చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. రాత్రి బడులు నడపటం, ప్రభుత్వ సహకారంతో భృతిని కల్పించటం, స్వయంగా జీవనోపాధి కలిగించేందుకు చేయూతనివ్వటం జరిగింది. చదువు వారి ఆలోచనల్లో మార్పును, తమపై తమకి నమ్మకాన్ని కలిగించి స్వంతంగా ఒక బ్యాంకు పెట్టుకునే ప్రయత్నం, దాన్ని విజయవంతంగా నడుపుకోవటం అన్నీ క్రమంగా జరిగిపోతాయి. పదిహేడేళ్ల కాలం గిర్రున తిరిగి ఆ మహిళలు తమ బ్యాంకు ఆర్థికంగా నిలదొక్కుకుందన్న ఆనందంతో ఒక వేడుకను చేస్తూ సుధామూర్తిని అతిథిగా పిలుస్తారు. ఆమెకు సుఖవంతమైన ప్రయాణపు ఖర్చులు కూడా ఇస్తామంటారు. కానీ రచయిత్రి తన ప్రయాణం తన ఖర్చుతోనే చేసి ఆ వేడుకలో పాల్గొని డాక్టర్లుగా, లాయర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా ఎదిగిన ఆ మహిళల పిల్లలను చూసి సంతోషంతో మూగబోతుంది. ఆ వేదిక మీద ఆమె మనసులో చిన్ననాడు తాతగారు నేర్పిన ఒక సంస్కృత శ్లోకం మెదులుతుంది.

‘’భగవంతుడా, నాకు రాజ్యం వద్దు. ఏ కోరికాలేదు. 

…..దేవుడా! నువ్వు ఇవ్వాలనుకుంటే నాకు మెత్తని గుండె, గట్టి చేతులు ఇవ్వు. ఇతరుల కన్నీటిని తుడవగల భాగ్యం ఇవ్వు’’.

                                          ఒక ముసలి దేవదాసీ తామంతా కలిసి అల్లిన ఒక దుప్పటిని బహుమతిగా అందిస్తూ, ‘’దీనికి మేమంతా కలిసి మూడువేల కుట్లు కుట్టాము. శీతాకాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా నీపట్ల మా అభిమానంలా ఉంటుంది.’’ అంటుంది. అది తాను పొందిన అత్యుత్తమ కానుక అంటారు రచయిత్రి. ఇదే ‘’మూడువేల అల్లికలు’’ అన్న పేరుతో పుస్తకంలో ముందుగా చెప్పిన కథ. ఇదే పుస్తకానికి ఇచ్చిన శీర్షిక కూడా.

‘’మగపిల్లల్ని గెలవడం’’ ఈ శీర్షిక కింద సుధామూర్తి తన విద్యాభ్యాస సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు, అవి తనని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో నిలబడేందుకు ఏవిధంగా సహాయపడ్డాయో చెప్పారు. 

ఒకసారి విదేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లేడేందుకు వెళ్లినప్పుడు ఆమెను ఒకరు ప్రశ్నిస్తారు, ‘’మీరు విదేశాల్లో చదువుకున్నారా? మీలో ఇంత ఆత్మ విశ్వాసం ఎలా సాధ్యం?’’ అని. దానికి ఆమె తను చదువుకున్న బి.వి.బి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తనను ఆవిధంగా తీర్చిదిద్దిందని చెబుతారు. పి.యు.సి. పూర్తై, ఇంజనీరింగ్ చదవాలన్న ఆశను వ్యక్తం చేసినప్పుడు ఇంట్లో తల్లి, నానమ్మ, బంధువులు అందరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనా తండ్రి మాత్రం ఆమెను తనకు ఇష్టమైన చదువుని చదవమని ప్రోత్సహిస్తారు. 

                                          అలా నూట యాభై మంది విద్యార్థుల్లో నూట నలభై తొమ్మిది మంది మగపిల్లలున్న కాలేజీలో తానొక్కతే ఆడపిల్లనని చెబుతారు. మగపిల్లల అవహేళనలకు ఎలాటి స్పందన చూబించకుండా వాటిని సహిస్తూ, చదువుపై మాత్రమే తన సర్వశక్తులు కేంద్రీకరించి, తనలో ఆత్మనిగ్రహం, ఆత్మ బలం కోసం చదువయ్యేవరకు కేవలం తెల్లచీర కట్టుకోవటం, మిఠాయిలు మానెయ్యటం, చాప మీద పడుకోవటం, చన్నీళ్ల స్నానం చెయ్యటం వంటివాటిని తనకు తానుగా కొన్ని నియమాలను పెట్టుకున్నారామె. యూనివర్సిటీలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటూ, క్రమంగా మగపిల్లల స్నేహాన్ని, గౌరవాన్ని గెలుచుకున్నానని అంటారు. ఇప్పటి కాలానికి ఆడపిల్లలు స్వేచ్ఛగా తమకు నచ్చిన చదువును చదివే వెసులుబాటు వచ్చిందని గర్వపడతారు.

‘’మూడు దోసిళ్ల నీరు’’ కథలో చిన్నారి సుధ తాను అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఉండి చదువుకునే రోజుల్లో జరిగిన ఒక జ్ఞాపకాన్ని చెబుతారు. ఒకరోజు అమ్మమ్మ తన స్నేహితురాలు ఇందిర కాశీయాత్ర చేసివచ్చిందని, ఆమెను చూసి, ఆయాత్రా విశేషాలు విని, వాళ్లు చేసే కాశీ సమారాధనలో విందు భోజనం చేసేందుకు సుధను కూడా తీసుకెళ్తుంది. అక్కడ కాశీదారం గురించి, గంగాజలంతో ఉన్న చెంబులను గురించి వివరాలు తెలుసుకుంటుంది సుధ. ఇందిర గంగానదిలో స్నానం చేసి సూర్యునికి ‘’మూడు దోసిళ్లతో తర్పణం’’ ఇచ్చిందని తనకు అలాటి అదృష్టం లేదని అమ్మమ్మ చెబుతుంది. పెద్ద వయసులో తనకు, తాతకు కాశీ ప్రయాణం సాధ్యం కాదని అమ్మమ్మ నిట్టూరుస్తుంది. ఇంటికొచ్చిన తరువాత కాశీయాత్ర ఎందువల్ల అంత పవిత్రమైనదో తాతయ్య చెబుతారు. 

                                            పైగా కాశీలో మనకు ఇష్టమైనదాన్ని విడిచి రావాలని కూడా చెబుతారు. ఆ మాటలు సుధ మనసులో ముద్రపడిపోతాయి. చాలా ఏళ్ల తరువాత తాను కాశీ వెళ్లినప్పుడు అక్కడ గాయ్ ఘాట్ లో స్నానం చేస్తూ సూర్యునికి తర్పణం విడవబోతూ అమ్మమ్మ, తాతయ్యలను తలుచుకుంటుందామె. మొదటి దోసిలి నీటిని తన అమ్మమ్మ, తాతయ్యల ఆత్మ తృప్తికి విడుస్తుంది. తరువాత దోసెడు నీరు ఈ నేల మీద పుట్టినందుకు గర్విస్తూ గంగకు కృతజ్ఞతలు చెబుతుంది. మూడో దోసిలి నీటిని తీసుకోగానే తనకు ఇష్టమైన దానిని అక్కడ విడిచిపెట్టాలన్న తాత మాటలు జ్ఞాపకం వస్తాయి. తను ఎక్కువగా ఇష్టపడే షాపింగ్ ను వదిలిపెట్టేందుకు ఆమె నిశ్చయం చేసుకుంటుంది. అతిముఖ్యమైన ఆహారం, మందులు, ప్రయాణాలు, పుస్తకాలు, సంగీతం తప్ప తక్కినవి విడిచిపెడుతుంది. 

ఆ మూడో దోసిలితో ఇచ్చిన తర్పణం తన జీవితాన్నే శాశ్వతంగా మార్చేసిందని, దేన్నో పొందాలన్న కోర్కె నశించిపోయిందని రచయిత్రి చెబుతారు. నిజానికి అది స్వేఛ్చకు దారులు తెరిచిందంటూ జీవితం పట్ల తాను నేర్చుకున్న తాత్త్వికతను చెబుతారు. ఇది అందరికీ అనుసరణీయం కదా. 

                                             ‘’పశువుల మంద’’ కథలో సమాజంలో పైపై పటాటోపాలకున్న ప్రాధాన్యత గురించి చెబుతారు. ఇలాటి మనస్తత్వాలను ఎక్కడపడితే అక్కడ చూస్తునే ఉంటాం. ఒక విదేశీ పర్యటన ముగించుకు వస్తూ లండన్ హీత్రూ విమానాశ్రయంలో బిజినెస్ క్లాస్ వరుసలో నిలబడ్డప్పుడు ఖరీదైన బట్టలు, అలంకరణలో ఉన్నఇద్దరు స్త్రీలు తను నిలబడవలసిన వరుస అది కాదని, అది ఖరీదైన టికెట్టుకొనుక్కున్నవారికి అధిక సౌకర్యాలతో ఇచ్చే వరుస అని చెబుతారు. దానికి సుధామూర్తి సాధారణమైన దుస్తులతో ఉండటమే కారణం. కానీ తాను వరుస మారనని చెప్పటంతో ఆ స్త్రీలు ‘’పశువుల మంద’’ తరగతి వాళ్లతో వాదించలేమంటారు. వారితో పాటు తానూ బిజినెస్ క్లాసులో చెకిన్ అవుతూ ‘’డబ్బుతో విలాసాలు, సౌకర్యాలు కొనుక్కోవచ్చు కానీ స్థాయిని కొనుక్కోలేరంటూ’’ రచయిత్రి వారికి సమాధానం చెబుతారు.

మర్నాడు బెంగలూరులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు అతి పాత దుస్తుల్లో సాధారణంగా వచ్చిన ఇద్దరు స్త్రీలు తమ ఫ్యాక్టరీలో పనిచేసే వారి పిల్లలకోసం నడిపే బడికి ఎలాటి సౌకర్యాలు లేవని, ఫండ్స్ కావాలని అడుగుతారు సుధామూర్తిని. ఆ స్త్రీలు హీత్రూ ఎయిర్పోర్ట్ లో సుధామూర్తిని ‘’పశువుల మంద’’ తరగతి అని హేళన చేసినవారే.  తమ ఫౌండేషన్ ఎలాటి పెద్దల తోడ్పాటూ లేని దిక్కులేని వారికి మాత్రమే సాయం చేస్తుందని చెబుతారు సుధామూర్తి. వారిముందు తన సంస్థ ఉద్యోగికి ఒక కథ చెబుతారు రచయిత్రి. జార్జి బెర్నార్డ్ షా గౌరవార్థం బ్రిటీష్ క్లబ్ లో ఒక విందు ఏర్పాటైనప్పుడు సూటు, టై ధరించలేదని బెర్నార్డ్ షాను ఆ క్లబ్ లోకి అనుమతించరు. ఆయన వాటిని ధరించి తిరిగి వచ్చి తాను ప్రసంగించబోవటం లేదని, తన బదులుగా తన కోటూ, టై అతిథి స్థానాన్ని స్వీకరిస్తాయని చెప్పి వాటిని అక్కడ కుర్చీలో వదిలి వెళ్లిపోతారు. మిథ్యావిలువలకు పాకులాడే మనుషుల మనస్తత్వం అన్నిచోట్లా, అన్నికాలాల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది.

                                           ‘’చెప్పని జీవితం’’ కథ అద్భుతమైనది, అపురూపమైనది, అరుదైనది. రచయిత్రి నాన్నగారు 1943 సంవత్సరంలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దున ఉన్న మారుమూల గ్రామంలో డాక్టర్ గా పనిచేసేప్పుడు ఒక వర్షపు రాత్రి జరిగిన సంఘటన.

ఒక రాత్రి జోరున వర్షం కురుస్తున్న సమయంలో నలుగురు మనుషులు వచ్చి ఎక్కడికి, ఏమిటి చెప్పకుండా ఆయనను ఒక ఎడ్ల బండిలో ఊరికి దూరంగా పొలాల మధ్య ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్ళి ప్రసవ వేదన పడుతున్న ఒక పదహారేళ్ల పిల్లకు కాన్పు చెయ్యమని అడుగుతారు. ఆయన తనకు ఆ విషయంలో సరైన అనుభవం, శిక్షణ లేదని చెప్పినా వినరు. ఎంత డబ్బైనా ఇస్తామని చెప్పినప్పుడు ఆ యువ డాక్టర్ తనకు డబ్బుపై ఆసక్తి లేదని నొక్కి చెప్పినా బలవంతంగా కాన్పు చేయించవలసిందేననీ, తల్లిని బతికించి తీరాలని హెచ్చరిస్తారు. ప్రసవ సమయంలో ఆ పదహారేళ్ల అమ్మాయి అక్కడి జమిందారు కూతురని తెలుస్తుంది. పుట్టిన పసికందు ఆడపిల్ల. తామిద్దరికీ తన పెద్దవాళ్ల చేతిలో శిక్ష తప్పదని, బిడ్డని, తనని చంపివెయ్యమని ఆమె డాక్టర్ కు చెప్పి, ఏడుస్తుంది. పసిబిడ్డతో సహా పూణే పారిపొమ్మని , అక్కడ నర్సింగ్ స్కూల్ లో ఆర్ .హెచ్. కులకర్ణి పంపగా వచ్చానని చెప్పి, పని నేర్చుకుని స్వతంత్రంగా బతకమని చెబుతారా డాక్టర్. పని ముగించి బయటకు రాగానే ఆయన చేతిలో వంద రూపాయలు పెడతారు అక్కడి వారు. 

                                       ఒక ఆలోచన తోచి, గదిలోపల తన పనిముట్టు మర్చిపోయానని చెప్పి మళ్లీ గదిలోకి వెళ్లి ఆ వంద రూపాయలు ఆ అమ్మాయి చేతిలో పెడతారు డాక్టర్. 

ఆ తర్వాత ఆయన పదవీ విరమణ తర్వాత ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్లినప్పుడు అక్కడ ఒక యువ డాక్టర్ ను కలవటం, ఆమె చేసే సేవ తెల్సుకుని అభినందించటం జరుగుతుంది. అంతలో అక్కడ వారెవరో ఆయనను ‘’ఆర్. హెచ్. భోజనానికి రండి’’ అంటూ పిలవటంతో ఆ యువతి ఆయన పేరును, ఆయన పూర్వం ఎక్కడ పనిచేసారన్న వివరాలు కనుక్కుని, తనతో ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. సమయం లేదన్నప్పటికీ కొద్దిసేపు మాత్రమే వచ్చివెళ్లమంటూ  డాక్టర్ ఆర్. హెచ్. కులకర్ణిని తనతో తీసుకెళ్తుంది. అక్కడ తన తల్లిని పరిచయం చేస్తుంది. 

                                        ఆమె ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం తనకు కాన్పు చేసి, తనను, బిడ్డను బతికించేందుకు పారిపొమ్మని చెప్పటం గురించి గుర్తుచేస్తుంది. తన కూతుర్ని డాక్టర్ ని చేసి, నర్సింగ్ హోం కి ఆర్. హెచ్. నర్సింగ్ హోం అని పేరు పెట్టాననీ, పూర్తి పేరు ఆరోజు వర్షం లో సరిగా వినపడలేదని చెబుతుందా తల్లి. ఆయనను కల్సుకోవాలన్న ఆశతో ఇన్ని దశాబ్దాలుగా  ఎదురుచూస్తున్నానని చెబుతుంది. ఇది చదువుతుంటే కళ్లు చెమర్చక మానవు. ఎంతటి ఉన్నతమైన వ్యక్తులు! ఎలాటి అరుదైన జీవితాలు!

‘’ఇల్లే స్వర్గం’’ కథ కూడా ప్రత్యేకమైనది. 

                                    ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోసం స్వంత కార్యాలయం ఒకటి నిర్మించుకోవాలని తొలిరోజులనుండి రచయిత్రి ప్రయత్నిస్తున్నా తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకోలేకపోతుంటారు. చివరికి 2002 సంవత్సరంలో కొంత సొమ్ము కూడబెట్టగలిగి పనులు మొదలు పెట్టాలనుకుంటారు. 

అదే సమయంలో మధ్య ప్రాచ్య దేశంలోని మహిళా మండలి వారు తమ సభలో ప్రసంగించమని సుధామూర్తిని ఆహ్వానిస్తారు. ఆయా ప్రసంగాలు  ముగించుకున్న రోజు ఆమెను ఇద్దరు స్త్రీలు కలుసుకుందుకు వస్తారు. వారు ఎంతో వినయంగా ‘’మా శరణాలయానికి రాగలరా” అని అడిగి సుధామూర్తిని తమ శరణాలయానికి తీసుకెళ్తారు. అదో చిన్న ఇల్లు, అందులో ఐదారుగురు స్త్రీలు దుఃఖంతో ఉబ్బిన కళ్లతో కనిపిస్తారు. వారితో సంభాషణ మొదలు పెట్టగానే ఆ స్త్రీలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ నుండి పనుల నిమిత్తం వచ్చినవాళ్లని అర్థమవుతుంది. కానీ అక్కడ ఇళ్ల యజమానులు వారిని అనేక కష్టాలకు గురిచేస్తూ బానిసలకంటే హీనంగా చూస్తుండటంతో తిరిగి మాతృభూమికి వెళ్లిపోవాలని కలలు కంటూంటారు. అలాటి అవకాశం కోసం ఎదురుచూస్తూ దయామయులైన వారి సహాయంతో ఈ శరణాలయం నడుపుతున్న ఇద్దరు స్త్రీల వద్దకు వస్తారు.  

                                         పాస్ పోర్ట్ ను తీసేసుకుని యజమానులు వీరిని గృహనిర్బంధంలో హేయమైన, కౄరమైన జీవితాల్లోకి నెట్టటంతో తమ దేశంలో వదిలి వచ్చిన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేక, బతుకు మీద ఆశ వదులుకుని జీవఛ్చవాల్లా బతుకుతున్న వారిని తిరిగి స్వంత దేశం పంపేందుకు శరణాలయం నడిపే స్త్రీలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆర్థిక వనరులు తగినంతగా లేక నిరాశతో ఉంటారు. 

‘’ఇలాటి స్త్రీలు ఎందరుంటారు’’ అని రచయిత్రి అడిగినపుడు నెలకు తమ శరణాలయానికి కనీసం ఐదుగురు చేరుతున్నారని చెబుతారు. రచయిత్రి మనసుకు ఫౌండేషన్ కు కట్టదలచుకున్న స్వంతభవనం కంటే తమ వనరులను ఈ స్త్రీల కోసం ఉపయోగించాలని తోస్తుంది. ఆ పనికి వెంటనే పూనుకుంటుంది. స్వంత గడ్డ మీద స్థితి ఇప్పుడు మారిందని, ఇలాటి పనులు చేసే ఆడవాళ్లకి గిరాకీ పెరిగిందని, చక్కని జీతభత్యాలతో పనులు దొరుకుతాయని అందువల్ల పనులకోసం విదేశాలకు వెళ్లనవసరం లేదని వారికి చెబుతారామె. 

ఆ తర్వాత మరో పదిహేనేళ్ల తరువాతనే తమ ఫౌండేషన్ కు స్వంత భవనం చేకూరిందంటారు రచయిత్రి.  

                                          ‘’గొప్ప రాయబారి’’ కథలో రచయిత్రి సినిమాలపై తనకున్న ఇష్టాన్ని చెబుతారు. తమ చిన్నతనంలో సినిమాలను టూరింగ్ టాకీసులు గుడారాలలో చూబించేవని, అప్పట్లో కరెంటు కూడా ఉండేదికాదని చెబుతారు. పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దల సమక్షంలో పౌరాణిక సినిమాలు మాత్రమే చూసేవారట. హుబ్లీలో చదువుకునే రోజుల్లో కాస్త ధైర్యం వచ్చి రొమాంటిక్ సినిమాలు చూడటం, ఇంట్లో వాళ్లు తెలిసి చదువు పాడైపోతోందని విమర్శించటం చేసేవారట. తనకు, తన బంధువుల పిల్లలకు తక్కువ మార్కులు వస్తే రాజేష్ ఖన్నా తిట్లు తినేవాడని చెబుతారు. ఆ తర్వాత బెంగుళూరు లో చదువుకుంటున్నప్పుడు కూడా ఎక్కువగా సినిమాలు చూసేదాన్నని చెబుతూ, పూనాలో వర్కింగ్ విమెన్స్ హాస్టల్ లో చేరాక సినిమాల ప్రేమకు అడ్డుకట్ట లేకుండా పోయిందంటారు.స్నేహితుల సవాలును అంగీకరించి రోజుకొక సినిమా చొప్పున ఏడాదికి 365 సినిమాలు చూసానని, దానితో సినిమాల గురించిన క్షుణ్ణమైన జ్ఞానం అబ్బిందని చెబుతారు. 

ఇరాన్ దేశ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ రొట్టెలు చేసే వ్యక్తి సుధామూర్తి నుదుటన బొట్టు, చీర గమనించి ఆమెను భారతీయురాలిగా గుర్తించి ‘’అమితాబ్ బచ్చన్?’’ అని అడిగి తనకు బాలీవుడ్, ఇండియా అంటే ఎంతో ఇష్టమని చెప్పి రొట్టెలకు డబ్బు తీసుకుందుకు నిరాకరిస్తాడు.

                                   అలాగే హవానా లో తన సోదరితో కలిసి పర్యటించినపుడు, అక్కడ ఒక బ్యాగుని కొనేందుకు తన సోదరి బేరం చేసిందని, ఆ షాపు యజమాని తనకు మాధురీ దీక్షిత్, అమీర్ఖాన్ ఇష్టమని తన భాషలో చెప్పి, ఆ దేశం నుంచి వచ్చినవాళ్లు కనుక తమకు బ్యాగ్ ను తక్కువ ధరకు ఇచ్చేసిందని చెబుతారు.

ఉజ్బెకిస్థాన్ లో బుఖారా అనే పెద్ద నగరంలో ఒక రెస్టారెంట్ లోంచి వినిపిస్తున్న హిందీ పాటను విని తాను లోపలికెళ్లే ప్రయత్నం చేస్తే అప్పటికే అది నిండిపోయిందని అనుమతి లభించలేదని, కానీ తను ఆ పాట పుట్టిన దేశానికి చెందినదాన్నని చెప్పినప్పుడు తనను లోపలికి అనుమతించారని రచయిత్రి వివరించారు. 

                                ఐస్ ల్యాండ్ యాత్రలో గైడ్ షారుఖ్, కాజోల్ నటించిన ‘’దిల్ వాలే’’ షూటింగ్ జరిగిన ప్రాంతాన్ని చూబిస్తూ, బాలీవుడ్ సినిమాల వల్ల స్పెయిన్ వంటి దేశాలకి అనేకమంది టూరిస్టులు వస్తున్నారని చెప్పారట. ఆయా దేశాల పర్యాటక ఆదాయం పెంచుతున్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ‘’మన దేశపు రాయబారి’’ అంటారు సుధామూర్తి. అక్షరాలా వాస్తవం.

మరొక ఆసక్తికరమైన కథ ‘’నేను చెయ్యలేను, మనం చెయ్యగలం.’’

                              ఒకరోజు ఆఫీసులో సుధామూర్తిని కల్సుకుందుకు ఒక అమ్మాయి వచ్చి తన భవిష్యత్తు గురించిన ముఖ్య నిర్ణయాన్ని గురించి సలహా అడుగుతుంది. ఆ అమ్మాయి బాగా చదువుకుంది. దానికి తగిన మంచి ఉద్యోగపు ఆఫర్ ఒకటి ఉంది. అలాగే పై చదువులకోసం విదేశాల్లో మంచి యూనివర్సిటీలో అవకాశమూ వచ్చింది. ఏది నిర్ణయించుకోవాలో తెలియని స్థితి ఆమెది. ఆమె తండ్రి విపరీతంగా తాగుడుకు అలవాటు పడి భార్యను హింస పెట్టటం ఆ అమ్మాయికి అంతులేని వేదనను కలిగించిందని చెబుతుంది. 

సుధామూర్తి ప్రశ్నకి ‘’ఆల్కహాలిక్స్ అనానిమస్’’ అనే సంస్థద్వారా తన తండ్రి ప్రవర్తనలో మార్పు వచ్చి తన తల్లిని బాగా చూసుకుంటున్నప్పటికి ఆయన పట్ల తనకు గౌరవం లేదని బాథ పడుతుంది. ఆ అమ్మాయికి తగిన సలహా ఇచ్చి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యమని చెప్పి పంపుతారు రచయిత్రి. 

‘’ఆల్కహాలిక్స్ అనానిమస్’’ గురించి మొదటిసారిగా వినటంతో ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారామె. 

చటుక్కున ఒక స్నేహితురాలు ఎన్నో ఏళ్లక్రితం తన అల్లుడి మద్యం అలవాటు గురించి చెప్పి, బాథ పడిన విషయం జ్ఞాపకమొచ్చి, ఆమెకు ఫోన్ చేసి, ఆమె అల్లుడి గురించి ప్రశ్నిస్తారు. అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని విని, అతనితో మాట్లాడతారు రచయిత్రి. అతను తనకు ఆ అలవాటు సరదాగా చదువుకునే రోజుల్లో ఎలా అలవాటైందో, అది తన జీవితాన్ని ఎంతగా దిగజార్చిందో చెబుతూ, తనలో పూర్తి మార్పును తెచ్చిన ‘’ఆల్కహాలిక్ అనానిమస్’’ గురించి చెప్పి, క్రమం తప్పకుండా ఆ సమావేశాలకు వెళ్తానని, ఆ సంస్థకు తాను అధ్యక్షుడి స్థానంలో ఉండి మార్గదర్శకుడిగా పనిచేస్తున్నానని చెబుతాడు. 

                                  రచయిత్రి అతని ఆహ్వానం పైన ఆ సంస్థ సమావేశానికి వెళ్తారు. అక్కడ రకరకాల వయస్సులలో ఉన్న స్త్రీ, పురుషులను చూసి, వారి వారి కథలను వింటారు. ఆ వ్యసనాన్ని వదులుకుందుకు తోటివారి తోడ్పాటుకోసం వెతుకులాడే వారి ఆరాటాన్ని అక్కడ చూస్తారు. ఆరోగ్యాన్ని, జీవితాన్ని, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పోగొట్టుకుని, ఈ సంస్థ చేస్తున్న నిస్వార్థసేవను తెల్సుకుని ఇక్కడ సభ్యులుగా చేరి, తమ బలహీనతలపై పోరాడి, గెలిచి ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఎందరినో ఆమె అక్కడ చూస్తారు. వారి విజయగాథలను విని ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల పనిచేస్తోందని, ఒక్క బెంగలూరులోనే ఎనభై శాఖలు ఉన్నట్టు తెలుసుకుంటారు. ఒక్కరివల్ల కానిది చుట్టూ ఉన్నవారి సహకారంతో చెయ్యగలమన్న నమ్మకాన్ని వారిలో చూస్తారు.

ఈ కథలన్నీ ముందే చెప్పుకున్నట్టు కల్పనలు కావు. వాస్తవంగా ఎదురైన అనుభవాలు. ఇలాటి ఎన్నో జీవితాలు మనందరి చుట్టు ఉన్నాయి. వీటినన్నింటినీ పోగుచేసుకుని మనకు పంచుతున్న సుధామూర్తి మానవ స్వభావాలో వైచిత్రిని, వైరుధ్యాన్ని తెలియజెప్తున్నారు. ఏవ్యక్తికైనా జీవితం మరింత విలువైనదిగానూ, విస్తృతంగానూ తయారవాలంటే అనుభవాలే కదా పునాది. 

మంచి పుస్తకం. మంచి అనువాదం. హాయిగా చదివించి మనచుట్టూ జీవితాల్నిపరిచయం చేస్తుంది. పుస్తకం చదువుతుంటే రచయిత్రి మన పక్కన కూర్చుని కబుర్లు చెబుతున్న అనుభూతిని పొందుతాం.

ఈ పుస్తకం అలకనంద ప్రచురణ.

*****
Please follow and like us:

2 thoughts on ““మూడువేల అల్లికలు” సమీక్ష”

  1. “మూడువేల అల్లికలు” పుస్తక సమీక్ష చాలా బావుంది. సుధమూర్తి గారి జీవిత అనుభవాలు చాలా ఆసక్తికరం. ఆ అనుభవాలని మరింత అందంగా ఈ సమీక్ష లో బంధించారు అనురాధ!!

Leave a Reply

Your email address will not be published.