ప్రవాసాంధ్ర కథ- కవిత్వం

(నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

-యామిని కొళ్లూరు

ఏ రచన అయితే మనల్ని మనం సంస్కరించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్రేరణనిస్తుందో ఏ రచనను అధ్యయనం చేయడం వల్ల  సామాజిక స్పృహ , చైతన్యం మనలో అంకురిస్తాయో ఏ రచన మనలను కర్తవ్యోన్ముఖలను చేస్తుందో ఆ రచన ద్వారా వెలుగు చూసిన సాహిత్యాన్ని మంచి సాహిత్యం లేదా ఉత్తమమైన సాహిత్యం అనవచ్చు.

ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలో అనేక ఏళ్ళు పాటుగాని , శాశ్వతంగా గాని నివసించే వాళ్ళు తాము పుట్టి పెరిగిన ప్రాంతం మారడం ద్వారా కలిగిన జీవితానుభావాల్ని ఏదో ఒక ప్రక్రియలో రాస్తే దాన్ని డయాస్ఫోరా అంటారు. ప్రాంతం అనేది గ్రామం , జిల్లా,  రాష్ట్రం , దేశం అనే విస్తృతమైన అవగాహనతో అవగాహన చేసుకోవాలి. కానీ ప్రస్తుతం కేవలం ఒక దేశం నుండి మరొక దేశానికి రకరకాల కారణాల వాళ్ళ వెళ్లి అక్కడ నివసిస్తూ , తమ అనుభవాలను సృజనీకరించే సాహిత్యాన్ని డయాస్ఫోరా సాహిత్యంగా పిలుస్తున్నారు. 

ప్రపంచంలో నలుమూలలా  ప్రవాసాంధ్రులు విస్తరించి ఉన్నారు. అమెరికాలోను , ఇతర దేశాల్లోను  తెలుగు సమూహాలు బలపడుతున్నాయి. ఇక్కడ భారతీయ సంస్కృతిని కాపాడుకొంటూ విదేశంలో నివసిస్తున్న మన భాష పట్ల , సాహిత్యం గురించి తరచుగా వినిపిస్తున్నా పదం డయాస్ఫోరా విదేశాల్లో స్థిరపడిన కుటుంబాల్లో పెద్దలకి మాతృ భాష వచ్చిన , పిల్లలు అక్కడ పుట్టి పెరగడం వలన అర్ధం కాకపోయినా , భాష వచ్చిన రాకపోయినా పిల్లలు సమాధానం మాత్రం ఆంగ్లం లోనే మాట్లాడుతారు. మారుతున్న కాలం విజ్ఞానంతో పాటు అమెరికాలోని తెలుగు వాళ్ళు సాహిత్య సంస్కృతిని పరిచయం చేయడమే డయాస్ఫోరాగా పేర్కొనవచ్చు.

నేడు ప్రపంచం నలుమూలలా తెలుగు వారు విస్తరించి దేశదేశాల్లో తెలుగు మాట వినిపిస్తుంది. దీని కోసం తెలుగు సమాజాలు సమైక్యంగా గట్టి కృషి చేస్తున్నాయి. ఈ సంఘాలు క్రమానికి ఒక  వేగాన్నిచ్చాయి. సాహిత్య కృషిని ఏ ఒక్క నగరంలోని పెద్ద తెలుగు  సమూహాలకో పరిమితం చెయ్యకుండా దానికి విశాలమైన వేదికని ఉన్నప్పటికీ , ఆంగ్లంలోని యన్.ఆర్.ఐ లను ప్రవాస భారతీయులు “ అని పిలుస్తున్నారు. ‘ప్రవాసము ‘ అనే పదానికి నిఘంటువులు  ‘పరదేశవాసము ‘ పరదేశ గమనము , నిర్వాసము వెలివేసిన వారు మొదలగు అనేక అర్ధాలున్నాయి. భారత దేశం నుండి ఇతర దేశం వెళ్లి తాత్కాలికంగా గాని శాశ్వతంగా గాని స్థిరపడిన వాళ్లని డయాస్ఫోరియన్లు  ప్రవాస భారతీయులు అని , ‘ప్రవాసాంధ్రులు ‘ అని పిలుస్తారు. వీరినే విదేశాంధ్రులు అని కూడా పిలుస్తారు. ప్రవాసాంధ్రులు అనే పారిభాషిక పదప్రయోగానికి సంబంధించిన సైద్ధాంతిక చర్చ ఉన్నప్పటికీ అత్యధికంగా ప్రవాసాంధ్రులుగానే  వ్యవహరిస్తున్నారు. 

కెనడాలో తెలుగు భాషావృద్ధికి, లిటరేచర్ కి  ప్రవాసాంధ్ర సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం డయాస్ఫోరా లిటిరేచర్  అనగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస సాహిత్యం అనే అంతగా వ్యాప్తిలోకి వచ్చింది. 

దేశం విడిచిపెట్టగానే మన దేశం మన భాష మన సంస్కృతి అనేది బాగా అర్ధం అవుతుంది. చాలా  మంది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పట్ట భద్రులు అయి దేశంలో ఉన్నప్పుడు చదువుతున్న చదువుతోపాటు మంచి ఉత్తీర్ణత సాధించారు. తెలుగు భాష మీద సాహిత్యం మీద కాస్త ఆసక్తి అటు ఇటుగా ఉండేది అనటంలో సందేహం లేదు. ఎవరికి వారే తెలుగు వాళ్లని , భారతీయులందరినీ ఒకే దగ్గరకు రప్పించింది.

తెలుగు దేశంలో ఉండగా ఎపుడూ తెలుగు రాయని వాళ్ళు గట్టిగా తెలుగు చదవని వాళ్ళు. తెలుగు పత్రికలు చూడని , చదవని వాళ్ళు వలస వచ్చాక ఇంగ్లీషు కన్నా తెలుగు బాగా వచ్చునని,రచయితలు , కవులయ్యారు అవగాహన అభిరుచి ఏర్పడలేదు.  పాశ్యాత్య మోజుతో భాష మీద అవగాహన అభిరుచి ఏర్పడలేక ఇప్పుడు పరిస్థితి వేరు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యాలతో సమానంగా సరితూచి అందులో భాగంగా ఆంగ్ల సాహిత్యం చూడాలి.

వేటూరి వెంకటేశ్వరరావు గారి అమెరికా వెళ్ళిన తెలుగు వాళ్ళలో తొలి తరం వారు అమెరికాలోని తెలుగు సాహిత్య కారుల్లో ముఖ్యులు. అమెరికాలో తెలుగు వారు రాసే రచనలకు ‘తెలుగు డయాస్ఫోరా “ సాహిత్యం అన్న పేరు తొలిసారిగా ప్రతిపాదించారు. అనేక కథలు , కవితలు , వ్యాసాలు రాశారు. ఒరియా మిశ్ర కవితలు తెలుగులో ‘అవ్యయ ,’ ద్వాసుపర్ణా ‘ కవితా సంపుటాలుగా వెలువరించారు. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక అమెరికా తెలుగు సాహితీ వేత్తల పరిచయ గ్రంధం 600  పేజీలలో వెలువడింది. దీని మీద వేటూరి గారి వ్యాసం రాశారు.

డయాస్ఫోరా గురించి తెలుగు సాహిత్యం గురించి మాట్లాడటమే కాకుండా ప్రచురణలు మొదలు పెట్టిన వ్యక్తి వంగూరి చిట్టెన్ రాజుగారు. బృహత్ సంకలనంలో ప్రచురించబడినవి, తానా, ఆటా వారి సావనీర్స్ లో ప్రవాసాంధ్రులు అక్కడి గురించి రాసిన కొన్ని మంచి కథలు ఉన్నాయి. అమెరికా ఇల్లాలు , అమెరికా తెలుగు కథానిక సంకలనాల్లో  ఎందరో  ప్రవాసాంధ్రులు రచనలు చేసారు. 

అమెరికన్ తెలుగు వారి మనస్తత్వాల గురించి , జీవితాల గురించి వారి కుటుంబాల్లో వస్తున్న మార్పులు గురించి నల్లూరి రుక్మిణి గారి విశ్లేషించారు. అమెరికాలో పోతున్న ఉద్యోగాలు గురించి కొడుకు వేణు తిరిగి రావటం  ‘మిడిసి పాటు ‘లో  మోహన్ రావ్ కథ , పిల్లలు పంపిన డాలర్లు మిడిసి పడితే పరిస్థితులు తలక్రిందులు అవుతాయని రచయిత్రి  హెచ్చరిక ఈ కథల్లో చూపటం జరిగింది. డబ్బే సర్వస్వమని కూతుళ్ళు , కొడుకులు , వాళ్ళ పనుల కోసం భర్తని వదిలి వెళ్ళిన పూర్ణమ్మకి , భర్తని పోగొట్టుకున్న చివరికి కన్న పిల్లల ఆస్కారంతో మాతృ దేశానికి చేరటం ‘పోగులు తెగిన అల్లిక “లో , గ్లోబలైజేషన్ అన్న మాయాభూతం గురించి  ‘మాయ జాలతారు ‘ కథలో రుక్మిణి వివరించారు.

అమెరికా నుంచి రచనలు కొనసాగిస్తున్న రచయిత్రుల్లో మాచిరాజు సావిత్రి , పూడి పెద్ది శేషుశర్మ , చిమటాకమల , నోరి రాధిక , నిడదవోలు మాలతి , డా. కె.గీత, చెరుకూరి రమాదేవి , వడ్లమాని , కొమరవోలు సరోజ , సుధేష్ణ , కలశపూడి వసుంధర , చింతం రాణి సంయుక్త , పుచ్చా అన్నపూర్ణ , పద్మలత , ఉపాధ్యాయులు సూర్యకుమారి , దామరాజులక్ష్మి , శారదా పూర్ణ  , పావని సుధాకర్ , కల్పనా రెంటాల , రాధిక శాస్త్రి , లలిత జోన్నాల్ , కొవ్వలి కాటూరి జ్యోతి , శ్యామల దశిల , ముత్యాల సీత , సులోచన బండారు , అయ్యగారి రమామణి , మంగళా కందుర్ , సాయిలక్ష్మి , కనకదుర్గ తదితరులున్నారు.

వృత్తి రీత్యా అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర కవయిత్రి డాక్టర్ శశిధర్ . ఆమె కవిత్వంలో ప్రత్యేకత రమణీయమైన శైలితో పాటు ఆకర్షణీయమైన కవిత్వ కరుణ రీతి. కవితలన్నా ప్రకృతి సౌందర్యానికి, సున్నితమైన బంధాలకు సంబంధించిన అద్భుతమైన అంతఃచేతనంలో నుంచి వచ్చిన స్పందనలే . అందం , ఆనందం కవిత పరమావధి. ప్రాకృతిక సౌందర్యాన్ని కాని , సున్నితమైన మానవ సంబంధాలను గాని , జీవన గమనంలో జంటగా కలిసి మెలిసి సాగే సుఖ దుఖాలను గాని విధివంచితులై బాధామయ జీవితాలను వెళ్ళదీస్తున్న నిర్భాగ్యుల వేదాలని ఇతర జీవితాను భావాలని తన కవితాత్మతో దర్శించి ప్రతిభావంతంగా చదువరులను ఆకట్టుకొనే శైలిలో కవయిత్రి ప్రతి ఫలింపజేయగలరు వైదేహీ.  ‘నిద్రత నగరం ‘ నేరేడు చెట్టు  ‘నిశ్శబ్ద ‘ ‘నీకు నాకు మధ్య మంచులో తడిసిన ఉదయం , ‘ ఆంధ గీతం,  ‘నాయనమ్మ కచేరీ’, ‘అమ్మ’ మొ.న ప్రతి కవితలో సజీవ శిల్పంగా పరమ సాత్వికమైనవి. ప్రకృతి పరుల యెడ కారుణ్యమైన భావన ఈ లక్షణాలు అన్ని ఆమె కవితల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దేవరకొండ తిలక్ గారి కవిత్వం యొక్క పరమావధి అందం , ఆనందం కవితగా వీరి రచనల్లో చూడొచ్చు. 

కోసూరు జయభారతి కళాభిమాని. ఒక పక్క శాస్త్రీయ నృత్య గురువుగా ఉంటూ ఆమె రచించిన సరికొత్త కథా సంపుటి ‘వేకువ’. హ్యుస్టన్ నివాసి. హావభావాల నుంచి కథలలోని పాత్రని పలకరించడం పెద్ద సాహసం. పరకాయ ప్రవేశం చేసి కథలు నడిపించిన తీరు కత్తి మీద సాములాంటింది. ఈమె ప్రతి కథలో కరుణ , ప్రేమ , మాతృత్వం , కుటుంబం పట్ల అభిమానం , దేశం పట్ల భక్తి సమాజ సేవ పట్ల తృష్ణ , భక్తి పరవళ్ళు తొక్కుతూ మనల్ని ముందుకు నడిపిస్తాయి. అనుభవాల క్రమమే జీవితం అనుభవమే గురువుగా నిత్య జీవితం అనుభవాల్లో తాను చూడనవి కథలుగా పేర్కొన్నారు. ‘పుత్తడి వెలుగులు ‘ ‘ అనగనగా ఓ జాబిలమ్మ , ‘కూతురి కథ ‘ ‘కంచె చేను మేస్తే , ఏం మాయ చేశావో , బంగారం కథ , జీవ సందీప్తి యిలా ప్రతి కథలో మానవీయత , మమతానురాగాలు , సహజంగా చిత్రీకరించారు రచయిత్రి. ప్రతి కథలో రచయిత్రి సున్నిత హృదయం స్పష్టంగా కన్పిస్తుంది. ఈ కథలన్నీ భారతదేశం, అమెరికా , జర్మనీల మధ్య అంతర్జాతీయంగా సాగే తెలుగుదనంతో  ఉట్టిపడుతూ సౌజన్యం , స్నేహం , ప్రేమతో కట్టిపడేస్తాయి. స్వచ్చమైన భావావేశం కలిగిన రచయిత్రి మన ముందు కనిపిస్తారు.

ఇప్పటి కథ సాహిత్య వేదికల తెర వెనుకన కాకుండా, సమకాలీనతను దాని నుంచి వ్యక్తం , చేయగల సమర్ధతను సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది. కథకుల సొంత కథా సంకలనాలు, అనేక కథకుల సంకలనాలు, పాత కొత్త కథల సంకలనాలు పెద్ద సంఖ్యలో ప్రచురితమవుతున్నాయి.  తెలుగు కథా సాహిత్యంలో అంతర్జాతీయ లేదా ప్రవాసాంధ్ర కథ  వివాదాస్పదం అయింది.

అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుల తెలుగు కథను ప్రోత్సహించడం ఒక పోషకత్వంగా అభ్యంతకరమైనదేమి కాదు కాని, ఆ ప్రోత్సాహ పోటీలో సృష్టిస్తున్న అవాంచనీయ ప్రలోబాలు, అనేకానేక అనుబంధ అవలక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అమెరికా తెలుగు కథల్లోని ఇతివృత్తాలన్నీ  తెలుగు వారి సంసార సాగరంలో వచ్చిపోయే రకరకాల తరంగాలు. ఇక్కడి కథకులు సమాజంలో వారి వారి జీవితాలని శోధించి , ఆ అంశాలనే ఇతివృత్తంగా కథలను రాస్తున్నారు. ఈ భిన్న సంస్కృతుల వ్యవస్థలో ప్రతిభ , ప్రతి సంస్కృతి ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి తహతహలాడుతాయి. ఈ రచయితలు అందరికి రచన వృత్తి కాదు, అది వారి ప్రవృత్తి మాత్రమే. అమెరికా తెలుగు కథలన్నింటిలోను తాత్త్వికాంశానికి సంబంధించిన గాఢత ఉంది. అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృ భాషలో కథలు కవితలు వ్రాసే రచయితలు తెలుగు సంస్కృతికి , ఇతోధిక  సాయం చేస్తున్నారు.

పులగండ్ల మల్లిఖార్జున గారు రాసిన ‘వాహిని ‘ రచన పత్రిక ద్వారా వెలువడిన తొలి తెలుగు కథ , రమా దేవి ‘పుట్టిల్లు ‘ కమలాదేవి ‘పిరికి వాడు ‘ కస్తూరి రామకృష్ణ గారి ‘యవ్వన కుసుమాలు వాడిపోతే ‘ కథలు తెలుగు భాషా పత్రిక సంచికలో ప్రచురించబడ్డాయి.

అమెరికా వెళ్లిన వాళ్ళు తమ భాష వాళ్లు కనిపిస్తే కలిగే ఆనందాన్ని ప్రవాసాంధ్ర రచయితలు వర్ణించారు. 

సామాజిక జీవన విధానంలో భాష కూడా ఒక అంశం.  భాష జీవనాన్ని ఎలా నిర్దేశిస్తుందో  సామాజిక జీవన విధానంలో భాష కూడా ఒక అంశం.  సాంస్కృతిక కోణాల్లో అధ్యయనం చేయవచ్చు.    ప్రవాసాంధ్ర సాహిత్యంలో శక్తివంతమైన విషయాల్ని అంటే శక్తివంతంగా వ్యక్తం చేయాలి అనే భావనతో కొంతమంది అన్యదేశ భాషా పదాలు విరివిగా వాడుతుంటారు.  అంతమాత్రం చేత వాళ్ళకి ఆ భావాన్ని తమ మాతృభాషలో వ్యక్తం చేయడం ఇష్టం లేకపోవటం కాదని భావించకూడదు.  ఒక్కోసారి అన్య భాషలోని ఆ భావం తమ మాతృభాషలో అంతః  శక్తి గా అందించలేకపోవడం అపనమ్మకం కూడా ఒక కారణం కావచ్చు. మరికొన్నిసార్లు ప్రవాసాంధ్రులు చాలాకాలంగా ఇతర ప్రాంతాల్లో,  అన్యభాషల అనివార్య జీవితంలోనూ జీవించడం వల్ల తమ మాతృభాషలోని వాడుతూ ఉంటారు.  భాష, ప్రాంత, మత విషయాలలో అమెరికాలో స్థిరపడిన భారతీయులు  ఎలా ఎదుర్కొంటారో “సంకట్ కాలమే బహర్ జానేకా మార్గ్ ‘ కథలో వంగూరి వారి ధోరణిలో  వర్ణించారు.

శ్రీమతి పూడిపెద్ది శేషు గారి రచన ప్రవాసాంధ్రుల ఆశాకిరణం . విదేశంలో సంవత్సరాలుగా స్థిరపడిన  సంస్కృతి , సభ్యతల నుంచి పెరిగిన ఒక తరం మనుషులు అంటే స్త్రీ పురుషులకు , ఒంటరితనం గురించి , పిల్లలతో ఒక తరహ సంఘర్షణ , పెద్దల ఆరోగ్య సంబంధమైన విషయాలు , పాత అలవాట్లు పొడలేక, కొత్త ఆచారాలు , అలవాట్లు మింగుడు పడక  పడే ఆందోళన , అశాంతి వీటన్నిటిని నిశింతంగా చదివి ఆలోచనతో రాసిన కథలు ఇందులో ఉన్నాయి. ఈమె అట్లాంటా నివాసి , కథలన్నీ దాదాపు స్త్రీ దృక్పధంతో రాశారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని నమ్మిన సహృదయ. 

మరో రచయిత్రి శ్యామలా దశిక గారు రాసిన ‘ఇల్లాలి ముచ్చట్లు ‘ సాంప్రదాయ బద్దంగా , ఆకు చాటు పిందేలా పెరిగి , పెళ్లి  పేరుతో తమ సంస్కృతి సంప్రదాయాలకు , ఆచార వ్యవహారాలకు ఎంతో భిన్నమైన వాతావరణంతో అడుగిడిన ఆడవారి మనోభావాల గురించి , వారి ఆలోచనా విధంగా , ఎన్నుకొన్న పాత్ర నైపుణ్యం ఎంతో సున్నితంగా, కోమలంగా, భార్యాభర్తల సంభాషణ, భర్త భావాలు గౌరవిస్తూ , నాజూగ్గా భర్తని మందలించడం.. ఇలా చక్కని ఇల్లాలి మనోభావాలని చూపించారు.

నార్త్ ఫసిఫిక్ లో మరో రచయిత్రి లలితారాయ్ రాసిన అవంతీ కల్యాణం . ఆధునిక యువతి ఆశయాలు, వివాహం కన్న ముఖ్యమైన కళలు చదువు , ఉద్యోగం , బాంధవ్యాలు ఆప్యాయతలు నిండిన ఆమె జీవిత మలుపులు మనకి ఈ రచనలో కనిపిస్తాయి.

కాలిఫోర్నియాకు చెందిన  ప్రవాసాంధ్ర కవయిత్రి, రచయిత్రి, ‘నెచ్చెలి’ సంపాదకురాలు డా.కె.గీత గారు.   కవితలు, కథలు , వ్యాసాలు , కాలమ్స్ , సీరియల్స్  రాసిన సున్నిత భావుకత కల రచయిత్రి. వీరు తెలుగు అధ్యాపకురాలు,  భాషా నిపుణురాలు, గాయని.   ‘తానా’ పాఠశాలకు   కరికులం డైరెక్టర్,  వీక్షణం రచయితల వేదిక అధ్యక్షులు, గాటా సంస్థ నిర్వాహకురాలు,  తెలుగు రచయిత వెబ్ సైట్ సంస్థాపక నిర్వాహకురాలు. వీరు కవిత్వంలో  దేవులపల్లి , అజంతా అవార్డు , సమతా రచయితల సంఘం , రజనా కుందుర్తి  అవార్డులను పొందారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.   ద్రవభాష, శీతసుమాలు, శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ కవితా సంపుటుల కవయిత్రి,  ‘వెనుతిరగని వెన్నెల’ నవల, ‘సిలికాన్ లోయ సాక్షిగా’ కథల రచయిత్రి డాక్టర్ కె .గీత గారు.

ఈమె కలం నుంచి జాలువారిన సిలికాన్ లోయ సాక్షిగా కథలు అమెరికాలోని అట్టడుగు వర్గ సమాజ అంతర్గత సంఘర్షణ , అంతరంగ ఆవేదనల్ని ఆవిష్కరించిన  అమెరికా తెలుగు కథా మాలికలు. ఈ సంపుటి లోని కథలు వృత్తిపరంగా, విద్యాపరంగా , పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్ళిన యువతీ , యువకుల జీవితాలతో బాటూ,  అమెరికాలోని అట్టడుగు వర్గ స్థానిక  జీవితాలు ఎలా ఉన్నాయి  అనే అంశాల్ని  తెలియజేస్తాయి.  రచయిత్రి గీతగారు విభిన్న జాతుల వారి సమస్యలను, అనుభవాలను సిలికాన్ లోయ సాక్షిగా కథల్లో చాలా ప్రతిభావంతంగా, చక్కగా ఆవిష్కరించారు. ఈ సంకలనంలో 18 కథలు ఉన్నాయి.  ఒక్కో కథ లోనూ మానవ సంబంధాల్లోని సున్నిత  అంశాల్ని,  సన్నివేశాల్ని కళ్ళకి కట్టినట్లు చూపడం ప్రత్యేకత. రచయిత్రి ప్రతి వాక్యాన్ని హృదయానికి హత్తుకొనే విధంగా రాయడమే కాకుండా, స్థానిక అనుభవాలతో  మెళకువగా అక్కడి సంస్కృతి , సంప్రదాయాల్ని  ప్రతి కథలో ప్రతిభావంతంగా చూపారు. అమెరికాలోని అనేక స్థానిక  సమస్యల్ని  గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి  ఈ సంకలనంలోని కథలన్నింటిని రచయిత్రి ఒక మార్గదర్శిగా చూపారు. 

ముగింపు :

విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులలో కవులు, కవయిత్రులు, రచయిత్రులు, రచయితలు తెలుగు భాష, సాహిత్యాల పట్ల ఆసక్తితో డయాస్ఫోరా నేపథ్యంలో ఎన్నో రచనలకి శ్రీకారం చుట్టారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న కాలంతోపాటు, ప్రవాసాంధ్ర సమకాలీన జీవన విధానం,  వాస్తవ సంఘటనల ఆధారంగా కృషి  చేస్తూ డయాస్ఫోరా రచయితల రచనలు ఇంకా ఎన్నో వెలువడాలి. అవి భావితరాల వారికి స్ఫూర్తిదాయకం కావడంతో పాటు, తెలుగు వారు ఎక్కడ వున్నా తేనెలూరు భాషని కాపాడుకోవడానికి బాధ్యత వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఆధార గ్రంధాలు :

1.తెలుగు భాషాభివృద్ధిలో డయాస్ఫోరా  – దార్ల గారు

2.నా భావనలో తెలుగు – వేలూరి వెంకటేశ్వర రావు గారు 

3.తెలుగు డయాస్ఫోరా ఒక మూస ఘోష ?

4.తెలుగు సాహిత్యంలో నూతన ధోరణలు – దార్ల గారు 

5.ప్రవాసాంధ్రుల రచయిత్రుల సొంత  గొంతుక 

6.సిలికాన్ లోయ సాక్షిగా కథలు – కె .గీత గారు

*****

 

Please follow and like us:

One thought on “ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)”

  1. దేశ విదేశాల్లో స్థిరపడ్డా మాతృభాషపై మమకారం వీడని డయాస్పోరా తెలుగు రచయితలకు ,కవులకు నా హృదయపూర్వక అభినందనలు.

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.