సంస్కారపు చిరునామా

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– ఆదూరి హైమావతి

      ఆరోజు ఆదివారం. చలి వాయించి కొడుతోంది. నేనూ కాస్తంత నిదానంగానే లేచాను.  కోడలుమాత్రం ప్రతిరోజులాగానే లేచి వంట గదిలోనూ, హాల్లోనూ అన్నీ చక్కబెడుతున్నది. పాపం ఆమెకు సెలవనీ, పనిరోజనీ తేడా ఉన్నట్లు అనిపించదు. 

 ఇంతలో నా సుపుత్రుడు లేచినట్లున్నాడు కాళ్ళ జోళ్ళు ఠపఠపా భూమాత మీద కొడుతూ వచ్చి సోఫాలో చారగిలబడి పేపర్ అందుకున్నాడు. 

కోడలు కాఫీ కప్పుతెచ్చి వాడి పక్కనే ఉన్న స్టూలు మీద పెట్టి వంట గదిలోకెళ్ళింది.   

“ఏయ్ ! మంజరీ! ఎక్కడున్నావ్? నిన్నునిన్న పదివేలు డ్రా చెయ్యమన్నాను, చేశావా?” న్యూస్‌ పేపర్‌ ముఖానికి అడ్డుపెట్టు  కుని అరిచాడు అమోఘ్, వాడే నా కొడుకు. 

“లేదండీ! నిన్న తీరలేదు. అయినా ఆన్‌లైన్‌లో బిల్సన్నీ నిన్ననే కట్టేశాను. మరేమైనా  ఉంటే అలాగే కట్టెయ్యొచ్చుగా, మనీ డ్రా చెయ్యడ మెందుకూ? నిన్నంతా ఆఫీసులో తీరికేలేక పోయిం ది, బ్యాంకు వైపు వెళ్ళను.”వంట గదిలో  టిఫిన్‌ చేస్తూన్న  మంజరి వంట గదిలోంచే సమాధా నం చెప్పింది.

“డబ్బెందుకు డ్రా చేయమన్నానో   నీకన్నీ చెప్తేనే డ్రా చేస్తావన్న మాట  ! ఆన్లైన్‌లో కట్టొచ్చని నాకు తెలీదా?అంత తెలీని వెధవాయిలా కనిపిస్తున్నానా!” కోపంతో వాడు అరవడం నేను వింటూనే ఉన్నాను…వాడికి మొదటినుండీ వాళ్ళ నాన్న పోలిక. ఆడవాళ్ళంటే వాళ్ళ కు సేవ కులని చిన్న చూపు. వాళ్ళ నాన్నను చూసి ఇలాగే తయారయ్యాడు.పెద్దైనా,  పెళ్ళైనా కొంచెం కూడా మారలేదన్న మాట.

బయట పూల మొక్కలకు నీళ్ళు పడుతూ– ఇదంతా నా పెంపకం లో లోపమా లేక వాళ్ళ నాన్న నోట్లోంచీ ఊడిపడిన ఫలితమా అనుకున్నాను.  

“ఎందుకండీ అన్నింటికి కోప్పడతారు? అరుస్తారు?ఊరికే గుర్తుచేశానంతే, అదీ తప్పే!”చాలా శాంతంగానే చెప్పింది మంజరి .

”ఔన్లే! అన్నీ ఊరికే అంటావు. ఇప్పుడే వెళ్ళి డ్రా చేసుకుని రా పో, నాకు డబ్బు అవసరం.మా ఫ్రెండ్‌కి చేబదులిస్తానని మాటిచ్చాను. ఆ టిఫిన్లవీ అమ్మ చూస్తుందిలే  ”విసురుగా ,కసిగా అన్నాడు అమోఘ్.

“అత్తయ్య గారి చేత పని చేయించడానికేనా పిలిపిం చింది? ఎంత, ఒక్క అరగంటలో పనై పోతుంది, వెళ్ళి డ్రా చేసుకొస్తాను. ఐనా మీరేవెళ్ళి ఎంతకావాలో డ్రాచేసుకొచ్చుకోవచ్చుగా, ఖాళీ గానే ఉన్నారుకదా! ” 

” ఏంటీ నేవెళ్లాలా! అదివారం కూడా పొద్దుటే డ్రెస్ అప్ ఐ పోవాలా? ఏం నీవెళ్ళి చెప్పిన పని చేయలేవూ!నీకు నా మాటంటే గౌరవం పోతున్నది. మొగుడంటేనే నీకు బేఖాతర్‌. ఎందుకే అంత పొగరు?”

“ఎందుకండీ ఊరికే ఏదేదో అనేస్తున్నారు. ఇప్పుడు నేనే మన్నాననీ! ఖాళీగానే ఉన్నారు కదా!పోనీ వెళ్ళి తెచ్చుకో వచ్చుకదా అన్నాను అంతేకదా! ”                                                   ”ఔను, నాకేం పని లేక, తోచక ఊరికే నీతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నా నంటావ్‌?అంతేగా!ఈ వెధవకు మరేం పనిలేదనుకుంటున్నావుటే! నేను కూర్చుంటే చూళ్ళేవు.ఖాళీగా ఉన్నానని ఏడుస్తావ్ “

”అబ్బబ్బా! మీకీ మధ్యని విసుగూ కోపం ఎక్కువయ్యా యి. అర్థం చేసుకోకుండా ఏదేదో అనే స్తున్నారు. నేను చెప్పిన ఒక్క మాటకు పదిమాటలంటున్నారు.సరే ఏవీ ఆ ఏటియం కార్డ్సు ఇలా ఇవ్వండి వెళ్ళి వస్తాను.”

” నన్నడుగుతావేం? నీవేగా ఎక్కడో పెట్టుకున్నావ్‌?”

“ఔను, ఆ టేబుల్‌ మీద బిల్సన్నీ ఉన్న పేపర్లతో కలిపి కవర్లో పెట్టాను.” 

” ఏంటీ! ఆ టేబుల్‌ మీది పేపర్స్‌తోనా? ఆ కవర్లో నా! అవన్నీ ఉదయాన్నే చెత్తలో వేసేశాగా?” 

” వాట్‌ ! చెత్తలో వేసేశారా? ఆకవర్లో  ఏముందో చూశాక కదా చెత్తలో వెయ్యాల్సింది?”

”ఓహో ఎలాంటివి చెత్తలో వెయ్యాలోకూడా  నాకు తెలీదన్న మాట. టేబుల్‌ మీది వన్నీ పాత మెడికల్‌ బిల్స్‌, ఇంకా ఇతర బిల్సేగా ఉంది? అయినా నీ కెన్ని మార్లు చెప్పాను ? అలా కవర్లో క్రెడిట్‌ కార్డు, ఏటియం కార్డు పెట్టొద్దని? బుధ్ధుందా అసలు నీకు?ఇంత నిర్లక్ష్యమా!”ఉగ్ర నర సింహునిలా అరుస్తున్నాడు మావాడు అమోఘ్‌.పేరేకాదు అన్నిట్లోనూ అమోఘమైన వాడే వాడు.

”ఉదయాన్నే నాబ్యాగ్‌ క్లీన్‌ చేసుకుంటూ పెట్టాను. ఐనా ఎప్పుడూ లేంది మీరెందుకు ఆ స్లిప్పులన్నీ డస్ట్‌బిన్‌లో వేశారు? ఎప్పుడూ నేనేకదా వేస్తాను.”

”ఓహో పనిచేయడం కూడా నేరమే ? చేస్తే వద్దంటావు, ఊరికే ఉంటే కాస్తంత సాయం చేయ వచ్చుగా అంటావు? అన్నీ నీ మాటలప్రకారం చేయాలి, నీ అడుగు జాడల్లో నడావాలి అంతేగా!”

”ఊరికే అరవకండి! అత్తయ్యగారి ముందు ఇలా గొడవ పడటం బావుండదు. మెల్లిగా మాట్లా డండి. ఆమె ఏమైనా అనుకుంటారు.”

”ఔను నేనే గొడవపడే వెధనీ ,నీవు సుకుమారివీ, సుగుణాలరాసి వీనీ, మా అమ్మముందు గారాలు పోయి, బుధ్ధిమంతురాలివనే క్రెడిట్‌ కొట్టేద్దా మనా! ముందా ఏటియం కార్డ్సు గురించి చూడు చెత్త వాడు పట్టుక పోయుంటాడు. వాటి పిన్‌ కోడ్‌ రాసిన స్లిప్పులు‌ కూడా అక్కడే పెట్టి అఘోరిం చావు కదా!” 

”అయినా అలా రాసి పెట్టవద్దని నేను చెప్తూనే ఉన్నాగా! మీరేగా రాసి స్లిప్పులన్నీ‌ కూడా అక్కడే ఆ కార్డుతోనే ఉంచారు? అది ప్రమాదమని ఎన్నో మార్లు చెప్పాను.”

”ఔను, రాయకపోతే నీకు అవి గుర్తుండవని రాశాను! మళ్ళా నాకు ఫోన్‌ చేసి అడుగుతావేమోనని! అందుకే రాసి ఉంచాను. అయినా అంతా నా తప్పేనా? అసలవి అక్కడ ఎందుకు పెట్టావు? పొగరు కాకపోతే?”

”నేను బ్యాగ్‌ సర్దుకుంటూ పెట్టానన్నాను కదా! ఇంత లోనే మీరు అవన్నీ పట్టుకెళ్ళి, చెక్‌ చేయ కుండానే, గుమ్మంలో చెత్త వాడు పట్టుకెళ్ళే చెత్త కవర్లో వేస్తారని నేనేం కలగన్నానా? ముందు వాటిని విప్పి చూడటమో, నన్నడగటమో చేయచ్చుగా? చేసింది మీరు అనేది నన్నూనా!”

”ఆహా! అన్నీ ఈ మహారాణి నడిగి చేయాలంటావు? మీరిపోకు నీవంటే, నీ వంటావా? జాగ్రత్త! త్రాష్‌ ! రబ్బిష్‌! బ్రెయిన్‌లెస్‌ ఫూల్‌, ”                                                                                     ”అరవకండి, పోయింది పోగా , వింటే అత్తయ్య గారు బాధపడ తారు.”

”అన్నింటికి అత్తయ్య అత్తయ్యని అమ్మను అడ్డం పెట్టకు. అసలు నీకు డబ్బంటేనే లెక్క లేకుండా ఉంది? నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని గర్వమా? ముందు వెళ్ళు, వెళ్ళి ఆ చెత్త వాడెక్కడున్నాడో చూడు కదులూ…”

”కాస్త ఆగండి, బ్యాంకు వాళ్ళకు ఫోన్‌ చేస్తాను.”

”అఘోరించావ్‌! అందాకా ఆ చెత్త వాడు కనీసం కొన్ని లక్షలైనా డ్రా చేసేయడూ!వెళ్ళి వాడెక్క డున్నాడో చూడు ముందు, ఆ  చెత్త వ్యానెక్కి వెతుకు, యూ పూల్‌, వేస్ట్‌ క్యాండిడేట్‌వి. బుధ్ధి తక్కువ దానివి.రబ్బిష్ ”

”నన్ను  కంగారు పెట్టకండి ప్లీజ్‌! కాస్త ఆలోచించుకో నివ్వండి. ఊరికే కేక లేయకండి, చేసింది మీరు తిట్లు నాకూనా?” 

 ”ఏంటే ! మీరిపోతున్నావ్‌? బుల్‌షిట్‌ ” అంటూ నోరు పారేసు కుంటూ అసహ్యంగా తిడుతున్న నా కొడుకు అమోఘ్‌ అసలు రూపం, భార్య పట్ల ప్రవర్తించే తీరూ చూస్తున్న నాకు , ఛీ ఇలాంటి వాడా నాకొడుకు అని నామీదే నాకు అసహ్యమేసింది. 

 తండ్రికి ఏమాత్రం తీసిపోని వాడనీ, మహిళలంటే పనివారనీ ఈ మగజాతి బుధ్ధి ఋజువు చేస్తు న్నాడు.  ‘ఆడవాళ్ళంటే అసలీ మగ జాతికి ఇంత చులకనెందుకూ? ఆడది లేక పోతే బ్రతక లేరు, తిండికీ, శరీర సుఖానికీ, ఇల్లు చక్కదిద్దనూ అన్నింటికి ఆడదాని అండదండలు కావాలి కానీ ఆడదానికి కాసింత గౌరవం మాత్రం కరువు వీరిచెంత, వీరి మనస్సులు ఎడారులా?

కాస్తంత జాలి ‘జలం’ వీరి హృదయాలలో ఉండదా!’ నా మన స్సంతా బాధతో నిండిపోయింది. ఇలాంటి వెధవతో ఈ బంగారు తల్లి ఎలావేగుతున్నదో అనుకున్నాను.‘అంతా తండ్రి బుద్ధి, ఆయనా ఇంతే ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటూనే ఉండేవారు, అదేమంటే బ్యాంకు ఉద్యోగ మని గర్వం, అహకారం ‘అనేవారు.ఆయన కంటే ఎక్కువ జీతమనీ అసహనమే! వీడూ అంతే ఆ తండ్రి రక్తమేగా? కోడలు వాడికంటే యాభై వే లు ఎక్కువ సంపాదిస్తుంది, వీడికంటే కాస్త పెద్ద కేడర్లో, గ్రూప్ లీడరుగా  ఉంది.అసలు బాధ అదీ వీడికి, అందుకే ఐన దానికీ కాని దానికి గొడవ పడి కోడల్ని అవమానిస్తూనే ఉంటాడని నాకీ వారం రోజులకే అర్ధమైంది.

 తల్లీ తండ్రీ లేని పిల్ల, మేనమామ పెళ్ళి జరిపించాడు. బాగా చదువు కుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో ఉందనీ బాగా సంపాదిస్తుం దనీ చేసుకున్నాడు. మేల్‌ ఈగో ఏమైనా అనిపిస్తుంది. పుట్టింటి అండ లేదు కనుక వీడి మాటలన్నింటికీ అణిగి ఉంటున్నదని నాకు అర్ధమవుతున్నది. పాపం మంచి అణకువగల పిల్ల. భార్యా భర్తల మధ్య తగాదాల్లో తల దూర్చకూడదని నేను పూల మొక్కలకు నీళ్ళు పట్టేనెపంతో బయటే చాటుగా ఉండిపోయా ను ,అవేవీ విననట్లే.

అసలు కోడల్ని ఆలోచించుకునే వ్యవధానమే ఇవ్వకుండా ఏదేదో అంటూనే ఉన్నాడు.

” కదులు ముందు , ఈ పాటికి వాడు దగ్గరగా ఉన్న ఏ ఏటిఎం లోనో దూరి ఉంటాడు. వెళ్ళి చూడు.”

”మీరూ రాకూడదూ తోడుగా?” అర్ధింపుగా అడిగింది కోడలు పాపం ఒక్కర్తే వీధులవెంట ఆచెత్త  వ్యాన్ వెతుక్కుంటూ వెళ్ళాల్సిరావటాన..                                                                                           ”చేసిన నిర్వాకానికి తగుదునమ్మాని నేనూ రావాలా? ఆ చెత్త వ్యానెక్కి ఆ కంపులో వెతకాలా! ఎవరైనా చూస్తే నా పరువేం కాను? ఎంత అవమానం? వెళ్ళు వెళ్ళీ నీ తిప్పలేవో పడి కార్డ్స్‌ అన్నీ ఆ చెత్త కుప్పల్లో వెతుక్కు రాపో.” అంటూ ఊదర పెట్ట సాగాడు.

ఇహ ఏమీ అనలేక కోడలు జోళ్ళేసుకుని అలాగే నైట్‌ డ్రెస్‌లో బయటికి వచ్చింది.గుమ్మం దిగి గేటు తీయబోతుండగా, ఒక  కుర్రాడు వచ్చి ”మేడం గారు! మేము రోజూ  చెత్తంతా మా వ్యాన్‌లో వేశాక, దాన్ని రీ సైకిల్‌ చేసేవీ, మిగిలినవీ వేరు చేస్తాం, మేము ఎంత వేరు వేరుగా వేయమన్నా, అందరూ అలావేయరు మేడం.అందుకే ఏరి వేరుచేస్తాం.అలా ఏరుతున్నపుడు ఈ కవర్‌ కనిపిం చింది మేడం! దాని మీద మీ పేరుంది, ఏటిఎం కార్డ్స్‌, ఒక పేపర్లో ,వాటి కోడ్‌ కూడా రాసి వుంది మేడం!  ఇవి మీవే కదా? చెక్‌ చేసుకుని అన్నీ ఉన్నాయో లేదో చెప్పండి, దూరంగా వ్యాన్‌ ఆపి వచ్చాను. మీ సొమ్ము నేనేమీ డ్రా చేయలేదు మేడం. మీరు చెక్‌ చేసుకుని ఓకే చేస్తే నేను వెళ తాను.” అంటూ, కార్డ్స్‌ అన్నీ ఉన్న కవర్‌ తెచ్చి కోడలి చేతికిచ్చాడు. 

 వెరిఫై చేసి అన్నీ ఉన్నాయని చూసుకున్నాక, తాను పట్టు కెళు తున్న పర్స్ లోంచీ  ఐదు వందల నోటుతీసి వాడి చేతిలో పెట్టబోయింది.

”వద్దుమేడం, మీ కష్టార్జితం మీదే ! నేను చెత్త తీసుకెళ్ళినం దుకు మీరు ప్రతి నెలా అందరి కంటే అదనంగా వంద ఇస్తు న్నారు. చాలు.మీరే నాకు ఆగిపోయిన చదువు కొనసాగించమని ప్రోత్సహించారు. మీకు తెలిసిన వారి వద్ద  రాత్రి బడిలో చేర్చి, బుక్స్ కొనిచ్చి  సహాయం చేస్తు న్నారు.’ఊరికే తీసుకున్న సొమ్ము అచ్చిరాదని, అపరిగ్రహమనీ ’, మా అమ్మ చెప్తుండేది మేడం ! ఎవ్వరి వద్దా ఉచితంగా  ఏమీ తీసుకోవద్దని చెప్పేది మేడం.ఇప్పుడు మా అమ్మ లేకున్నాఅమ్మ మాట మాత్రం నేను మరువను, ప్రతి నెలా  మీరిచ్చే డబ్బు చాలు.” అంటూ వెళుతున్న ఆ చెత్త తీసుకెళ్ళే కుర్రాడు నా కళ్ళకు ఒక గౌతమ బుధ్ధునిలా, ఒక మహాయోగి వేమనలా, వివేకానందు నిలా, ఒక రామకృష్ణ పరమహంసలా, ఒక మౌనిలా, ఒక చదువులేని సంస్కారమున్న  మహా మనీషిలా  మహోన్నతంగా కనిపించాడు.  చదువుకూ, సంస్కారానికీ, చేసేపనికీ సంబంధం లేదని వాడి మాటలు, ప్రవర్తన చెప్పకనే చెప్పాయి. పసితనంలో చదువుకోని తల్లి చెప్పిన మాట లకు అంత ప్రాముఖ్య మిచ్చి నిత్య జీవితం లో ఆచరించే ఆ చెత్త తీసుకెళ్ళే పిల్లవానికీ, గొప్ప కళాశాలలో ఎంటెక్‌ చేసిన,చదువుకున్న తల్లి చెప్పిన ఒక్క మాటనైనా పాటించని  నా కుమారు నికీ ఎంత వ్యత్యాసం!  బహుశా వానితల్లి ఒక మాహాత్మురాలై ఉంటుంది.                                                             

****

Please follow and like us:

3 thoughts on “సంస్కారపు చిరునామా (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. రోజు వారీ సంభాషణలు ఇలాగే జరుగుతూ ఉంటాయి.మగవాళ్ళు ఇది చదివినప్పుడు ఎంత బోలుగా,కుసంస్కారంగా ఉన్నాయో గ్రహిస్తే కొంత ఆత్మ శోధన మొదలౌతుంది.కథ వ్రాసిన లక్ష్యం నెరవేరుతుంది .మంచి కథ.

  2. మగవాళ్ళులో మార్పు ఎప్పుడు వస్తుందో.సమాజంలో దురాచారాలని మాన్పించగలిగినా ఇంటిలోపల జరుగుతున్న దురాగతాలను (ఇంటి గుట్టు కదా)ఎలా ఆపాలో మరి . నిత్య జీవితం కధ.అభినందనలండీ.

Leave a Reply to K.Sailaja Cancel reply

Your email address will not be published.