“చిరునవ్వు”

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

-వురిమళ్ల సునంద

“చిరునవ్వు వెల ఎంత.. మరుమల్లె పూవంత మరుమల్లె వెల యెంత?  వెల లేని చిరునవ్వంత”.. ఎంత  చక్కని పాట ఇది. ఎంత బాగా రాశాడో కదా కవి…

అలాంటి వెలలేని చిరునవ్వు పంచడానికి ఎందుకో అంత ఇబ్బంది తనకు.. అంత అందమైన ముఖం మీద ఎప్పుడూ ముటముటలాడే భ్రుకుటి ముడులే. లేత గులాబీ లాంటి పెదాలకెప్పుడూ బిగింపుల తాళమే.. అదేమిటో తానెంత కసిరి విసిరినా పదే పదే మాట్లాడాలనిపిస్తుంది. ఎలాగైనా ఆ పెదాలపై చిరునవ్వుల పూలు పూయించాలి. నిండు చందమామ లాంటి ఆ మోములో చిరాకుల మచ్చను తుడిపేయాలి”.

ఇది రోజూ చిన్మయ్  మనసులో అనుకునే మాటే.. 

‘అందాల ఓ చిలకా! అందుకో ఈ లేఖ’ అని రాస్తే.. అమ్మో ఆ లేఖ తీసుకుని వెళ్లి  ఇస్తే ఇంకేమైనా ఉందా? అది డైరెక్ట్ గా బాస్ చేతిలో పడుతుంది.అసలే బాస్ నిప్పు తొక్కిన కోతి.. ఆయన కోపం నషాళానికి అంటుకుందా” ఇంతే సంగతులు ..”‘ఎలాగో అలాగా కాళ్ళావేళ్ళా పడి అక్కడి బాసును బతిమిలాడుకుని ఈ భాగ్యనగరానికి వచ్చాను. తేడా వచ్చిందా  మళ్ళీ ‘గోడకు కొట్టిన బంతిలా’  రివర్స్ గేర్ లో వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది” అనుకున్నాడు .

కానీ చిన్మయ్ మనసు ఓ పట్టాన వినడం లేదు. ‘ఎలాగైనా సరే.. ఆమె జారవిడుచుకుంటున్న మెరుపు తునకల్లాంటి ఆనందాలు అందేలా చేయాలి. తిరిగి ఆమె మోములో చిరునవ్వులు చిందేలా చూడాలి”  మనసులోనే దీక్షా కంకణం కట్టుకున్నాడు.

 ఆఫీస్ ఫైల్స్ తో కుస్తీ పట్లు పడుతున్న తనకు ఉడతా భక్తిగా సాయం చేయడం మొదలు పెట్టాడు. మొదట్లో  చాలా చిరాగ్గా చూసింది. మరికొంచెం ముడుచుకున్న అత్తిపత్తి మొక్క అయ్యింది.. కానీ తనకు తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా పని శ్రమ తగ్గడంతో కొంచెం  రిలాక్స్ అవ్వసాగింది.

 అందరిలో ఫైర్ బ్రాండ్ గా దగ్గరకు వస్తేనే ఎక్కడ మీద పడి కరిచేస్తుందో, రక్కుతుందో అన్నట్టు ఉన్న సుస్మితలో కొంత మార్పు గమనించాడు. పదే పదే ముడివేసే భ్రుకుటి విడివడుతోందని గమనించి సంతోషిస్తున్నాడు చిన్మయ్.

****

 సుస్మిత తనలో వస్తున్న మార్పును మనస్ఫూర్తిగా ఆహ్వానించలేక పోతోంది.ఇంతకు ముందులా అలాగే ఉండనూ కూడా లేకపోతోంది.’ అమ్మో.. నేను వెనుకటిలా సీరియస్ గానే ఉండాలి’ .. ‘లేక పోతే  హాయిగా ఆనందంగా నవ్వితే ఇంకేమైనా ఉందా! నో ! నేనిలాగే ఉండాలి ! నేనిలాగే ఉండాలి! ఛీ!’ ‘చిరునవ్వంటేనే నాకు అసహ్యం’.. తనలో తనే గొణుక్కుంటున్న సుస్మితను సహాయం చేద్దామని వచ్చిన చిన్మయ్ గమనించాడు. ‘పాపం ఈ అమ్మాయికి బలమైన గాయమే అయ్యింది’ అందుకే బలవంతంగా తన ఫీలింగ్స్ ను అదిమి పెట్టుకుంటోంది. అనుకుంటూ నెమ్మదిగా  ‘సుస్మిత గారూ! ‘పిలిచే సరికి

ఉలిక్కిపడి, కోపంతో ఎర్రబడ్డ ముఖంతో ‘ఏంటి! ఎందుకొచ్చారు! నాకు ఎవరి సహాయం అక్కర లేదు.నా పని నేను చేసుకోగలను” విసురుగా అనేసి ఫైల్లో తలదూర్చింది. చేసేది ఏమీ లేక

 అక్కడ నుంచి వెళ్ళి తన సీట్లో కూర్చుని తాను తెచ్చుకున్న   పత్రిక ఒకటి తీసుకుని అందులో పజిల్ నింపసాగాడు. అప్పటికే రెండు సార్లు బాస్ నుంచి ఫోన్ _ఇంకా కాలేదా’ అని. అటెండర్ తో ఇవి పూర్తి చేసిన తర్వాతే ఇంటికి వెళ్తానని చెప్పు’ చెప్పి పంపింది

 ఆఫీస్ లో అందరూ వెళ్ళిపోతున్నారు. సుస్మితలో టెన్షన్ పెరిగింది. దాంతో మరిన్ని తప్పులు దొర్లుతున్నాయి..

 బ్యాగ్ సర్దుకుని బయటి దాకా వచ్చిన చిన్మయ్ కు సుస్మిత ను చూస్తుంటే బాధగా అనిపించింది. అటెండర్ తను మాత్రమే ఉన్నారు.

లోపలికి వచ్చి చొరవగా ‘మేడం! ఇంతెండి! నేను కొన్ని చూస్తాను ‘అంటూ ముందున్న రెండు ఫైల్స్ తీసుకుని గబగబా పూర్తి చేసి ఇచ్చాడు. తన పని ఐపోయేంతవరకు అక్కడే  ఉన్నాడు. టైం చూసుకుంది .’అమ్మో! ఏడు కావొస్తోంది.. ఇప్పుడెలా ?ఐదున్నర డైరెక్ట్ బస్ వెళ్లి పోయిందే’.. బాధ పడుతున్న సుస్మితను చూస్తూ “దయచేసి నా కారులో రండి! దింపి వెళ్తాను” అనడంతో తప్పలేదు సుస్మితకు.

 ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ‘నన్ను ఓ మంచి స్నేహితునిలా భావించండి!  మీకు ఇంతకు ముందు ఏదో బలమైన గాయమే అయ్యి వుంటుంది. అందుకే అలా ఉన్నారు.నేను అలాంటి వాడిని కాదు. నాకు ఓ చెల్లాయి,అమ్మ ఉన్నారు. వాళ్ళ కోసమే ఎంతో ప్రయత్నించి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను’. తెల్లని వన్నీ  పాలు కావు. నల్లని వన్నీ నీళ్లు కావు” నన్ను నమ్మండి ప్లీజ్! మీ అందమైన ముఖాన్ని కాంతి విహీనం చేసుకోకండి.పెదవులపై చిరునవ్వు విరియనీయండి. ” బై చెప్పి వెళ్ళాడు.

 ఈ మాటలు సుస్మిత చెవుల్లో అమృత సోనలై కురవసాగాయి.

అక్క గలగలా పారే సెలయేరులా ఉండేది. అందరితో అరమరికలు లేకుండా స్నేహం చేసేది. ఆత్మీయంగా మాట్లాడేది. అలాంటి అందమైన మనసూ, ఆకర్షణీయంగా కనిపించే అక్కకు పెళ్ళి అయ్యింది. అంతే ఆ మోములో  గలగలా పారే సెలయేర్లు మాయమై పోయాయి.ఒట్టిపోయిన ఎడారి అయ్యింది.

నవ్వు బాగుందని ఇష్టపడి చేసుకున్న బావకు ఆ నవ్వంటేనే పడలేదు అందరితో మాట్లాడటం అసలు ఇష్టం లేదు.. ఎవరితో మాట్లాడినా అనుమానంతో రగిలిపోయి జీవితాన్ని నరకం చేశాడు. వెంట వెంట ఇద్దరు పిల్లలు. ఉన్న ఉద్యోగం మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టి మాటలతో చేతలతో చిత్రహింసలు పెడుతుంటే.. పిల్లలతో పుట్టింటికి వచ్చేయమని తాను ఎన్ని సార్లు చెప్పినా భర్త నొదిలేసిన అక్క ఇంట్లో ఉంటే చెల్లికి ఎలా పెళ్లి అవుతుందని అలాగే భరిస్తూ వస్తుంది. అక్క పుట్టింటికి వచ్చేలా చేయడానికైనా తనకు పెళ్ళి చేసుకోవాలని ఉంది. కానీ ‘వచ్చే వాడు బావను మించిన త్రాష్టుడు ఐతే’.అందుకే అక్క కోసం తనూ నవ్వడం మానేసింది. అందరితో కలుపుగోలుగా ఉండటం మానేసింది. తన చుట్టూ ఓ గిరి గీసుకుంది..

 ఇవన్నీ తెలిసిన తర్వాత చిన్మయ్ కు సుస్మిత అంటే ఇంకా అభిమానం అనురాగం పెరిగాయి. ఓ రోజు తన ఇంటికి రమ్మని బతిమిలాడి

తీసుకుని వెళ్ళాడు. అక్కడ చిన్మయ్ అమ్మా, చెల్లి ఘనంగా స్వాగతించారు. ఆత్మీయంగా పలకరించారు. ‘నీ విషయం మా చిన్మయ్ చెప్పాడమ్మా! “అంటూ ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకొన్నది. చిన్మయ్ అమ్మ గారి అనురాగంతో కళ్ళలో ఆనందబాష్పాలు. మనసులోని ఆనందంతో పెదవులపై అంకురించిన చిరు మొలకలాంటి దరహాసం.

అది చూసిన చిన్మయ్ గుండెల్లో మోగిన కళ్యాణ గంటలు…

ఎంతో కాలంగా ఎదలో గూడు కట్టుకున్న బాధ వాళ్ళ ఆత్మీయతా వెచ్చదనానికి కరిగి పోయి మనసు తేలికైంది సుస్మితకు. 

 ఇంట్లో దింపడానికి వచ్చిన చిన్మయ్ ను, ఇంతకాలానికి కూతురు ముఖంలో పల్లవిస్తున్న చిరునవ్వుల కాంతిని చూసి సంతోష పడిపోయారు అమ్మా నాన్న.

****

 ఇప్పుడు ఆఫీసులో ఇంట్లో మందస్మిత అయిన సుస్మిత చిరునవ్వుల ముత్యాలను ఏరుకుని మది మంజూషాలో నింపుకుంటున్నాడు

చిన్మయ్ .చిన్మయ్ సుస్మితల అన్యోన్య దాంపత్యాన్ని  చూసి సుస్మిత అక్క భర్తలో చిరు కదలిక. అది చిరునవ్వులు పూయించే తోటమాలి అవుతుందో .. కాలమే చెప్పాలి.

*****

Please follow and like us:

2 thoughts on “చిరునవ్వు (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)”

 1. నమస్తే అండి కధాపరంగా చెప్పాల్సిన అంశాన్ని
  ఓ చిరునవ్వు తో చెప్పారు. మీరు చెప్పిన పోలిక చాల బాగుంది పరిచయం ఓ చిరునవ్వు హలోతో మొదలవుతుంది. అక్క జీవితం అలా అయింది నేను అక్కలా వుండాలి అనిచిరుదరహసాన్ని బంధించిన ఆ చిరునవ్వే తన జీవితంలో తిరిగి ముత్యాలు కురిపించటం, వీరిని చూసి అయిన అక్క సంసారంలో మార్పు రావాలి అని కోరుకోవడం ఆనందించాలి.అలతి పరిచయంలో సుస్మితని మార్చిన చిన్మయ్.ఒక వ్యక్తి అవతలి వ్యక్తిని అర్థం చేసుకుంటే వారి జీవితం సంతోషంగా వుంటుంది.

 2. సునంద గారూ
  మీ కథ చదివాను.బాగుంది.
  కాని,ఆ అమ్మాయి లో అంత త్వరగా మార్పు రావడం
  అసహజం అనిపించింది నాకు మటుకు. ఇద్దరి మధ్య ఇన్కా కొన్ని సన్నివేశాలు వుండాలేమో అనిపించింది.
  ఒక మామూలు పాఠకుడి గా ఇది రాస్తున్నాను. అన్యధాభావిన్చకండి. కధ చెప్పే విధానం చాలా బాగుంది. అభినందనలు/శుభాకాంక్షలు మీకు.

Leave a Reply

Your email address will not be published.