చిత్రలిపి
అగమ్య గమ్యం !
-మన్నెం శారద
ఆ అడవిదారిలో ఎందుకు అడుగులువేసానో నాకయితే తెలియదు కానీ ……ఇంత పత్రి తెచ్చాను వినాయక చవితని ! పాములూ తేళ్ళుంటాయి,,,వళ్లు తెలియదా అంటూనే తీసుకుని పూజ చేసింది అమ్మ ! మళ్ళీ అటెనడిచాను మరేదో కావాలని ….బయలంతా పసుపు పారబోసినట్లు విరబూసిన తంగేడు పూలని చూసి మనసు మురిసి వడినిండా కోసుకుని వచ్చి వరండా లో పోసాను పిచ్చిపూలన్నీ కోసుకొస్తావ్ ,పనిలేదు నీకంటూ పచ్చదనాన్నంతా ఊడ్చేసింది అక్క ! పెదనాన్నతో నర్సి పట్నం పోయి అడవిలోదూరి సెలయేటిలో చేపలు పడుతూనే ఇదేం పనని కోప్పడి ఎత్తుకు పోయాడు ఆర్దర్లీ ! సీలేరు .చింతపల్లి నన్ను మోహపెట్టి లోపలికంటా తీసుకుపోయాయి కానీ అందుకోవాల్సిందేదో అందనే లేదు . మళ్ళీ మళ్ళీ అటుకేసే నడుస్తున్న నన్ను చూసి కొందరు ముందేమీ దారిలేదంటూ మూతులు విరిచారు . వెనక్కుతిరుగంటూ సైగలు చేశారు చీకటి మూసుకొస్తున్నది !అడవి చిక్కబడుతున్నది అక్కడే కూలబడ్డాను కాసేపు !ఏదో ఉందని మనసు చెబుతోంది పదే పదే ….. అడుగులు ముందుకే సాగాయి వెలుగేదో గోచరించింది !వెలిసిందొక ఆలయం … గమ్యమేదో సాక్షాత్కరించింది వెనుకేదో అడుగులసవ్వడి ! నలుగురు నా వెనుక !బాట ఇప్పుడు విశాలమయ్యింది . ! !ముందు నేను …… దివ్వెను వెలిగించి దారి చూపిస్తూ ………
*****
Please follow and like us:
నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.