
జ్ఞాపకాల ఊయలలో-8
-చాగంటి కృష్ణకుమారి
మాపల్లెటూరు లచ్చమ్మపేటకు వెళ్లిన కొన్నాళ్లకి మానాన్న నన్ను అక్కడకి ఓ మైలు దూరంలో నున్న కల్లేపల్లి హైస్కూలు లో నేరుగా ఫస్ట్ ఫారమ్ (6వ తరగతి) లో చేర్పించాడు. లచ్చమ్మపేట లోని మా చాగంటి కుటుంబాలకి చెందిన ఏఆడపిల్లని హైస్కూలుకి అంత దూరలోనున్న వేరే పల్లెకి పంపటంలేదు. అయితే కొంతమంది మగపిల్లలు మాత్రం లచ్చమ్మపేట నుండి కల్లేపల్లి హైస్కూలులో చదువుకొంటున్న వారున్నారు. పొలాలవెంట అడ్దం పడి వెళ్లాలి.లింగమ్మ చెరువు దాటాలి. తాటిపొదల ప్రక్కగట్ల మీదనుండీ నడుచుకొంటూ వెల్లాలి. ఎవరికాళ్లకీ జోళ్లులేవు. బంగారం నాన్న మేనల్లుడప్పుడు ఎస్. ఎస్. ఎల్. సి. బుద్దిగా చదువుకొంటున్న అబ్బాయి.అతనికి నన్ను అప్పచెప్పారు. అతనితో కలసి స్కూల్ కి వేళుతూ వుండేదాన్ని , లేదా ఒక్కోసారి ఎవరోఒకరిద్దరితో కలసి కూడా వేళుతూవుండేదాన్ని. స్కూలు నుండి వస్తూ వస్తూ వేరు శెనగ ( పల్లీలు) పొలాలలోకి వెళ్లి ఆ మొక్కలను పీకి వాటి వేర్లకున్న లేత వేరు శెనగ కాయలను తినేవారం. వాక పొదలలో వాక్కాయలను ఏరుకొనేవారం.చిట్టి ఈత చెట్లు పొదలుగా మాచేతులకి అందేలాగే కాయలు కాస్తాయి, వాటి కాయలను , పండ్లనూ కోసుకొనేవారము. చిన్నాడు, నాకు అన్నతమ్ముని వరస.వారిది మాప్రక్క వాస ఇళ్లే ! ఒకరోజు అతనూ నేను స్కూలునుండి సాయత్రం తిరిగి వస్తున్నాం. వాడు మిరపపొలంలోకి వెళ్లి ఓ పచ్చిమిరపకాయ తిన్నాడు. నాకోటిచ్చి “ అస్సలు కారమే లేదు తిని చూడు” అన్నాడు. కాస్త కొరికేనో లేదో నోరు మండిపోతొందని ఒకటే ఏడుపు. వాడికేం చేయాలో తోచలేదు. దగ్గరలో నేల బావి వుంది. నాకు ఒక చిన్న అల్యుమినియం కేరియర్ లో కిందగిన్నెలో పెరుగూ అన్నం, పై గిన్నెలో పప్పూ అన్నం కలిపి పెట్టి ఇచ్చి స్కూలుకి పంపేవారు. వాడు దాని పైగిన్నెను తీసికొని బావిలో నీరు అందుకోబోయాడు. వాడి చేతికి అందలేదు. గిన్నె అంచుని బొటకన, చూపుడు వేళ్లకొసలతో పట్టుకొని నీటిలో వంచబోయాడు.అది జారిపోయింది. అప్పుడు సూర్యాస్తమయం అయిపోవచ్చింది. చంద్రోదయం అయి బావినీటిలో చంద్రుడు ప్రతి ఫలిస్తున్నాడు.గిన్నె అటూ,ఇటూ ఊగుతూ కొద్దికొద్దిగా నీళ్లు నింపుకొంటూ నీటిలోకి పూర్తిగా జారిపోయింది . నీటిలో చంద్రుడు ముక్కలైపోయాడు.ఇంతలో ఎవరో ఒక అరైతు కల్లేపల్లి లో సామాను కొనుక్కొని ఆవైపుగా వచ్చాడు. సంగతి తెలుసుకొని నెత్తి మీద తట్టనుదింపి, తాను తెచ్చుకొన్న పురుకోసతో కట్టిన పంచదార పొట్లం విప్పి, నానోట్లో కొంత పంచదార వేశాడు. “ నేలబావి; నిండా నీటి తో వుంది. చాలా ప్రమాదం ; ఇంకెప్పుడూ ఇటువైపుకి రాకండి.” అని చెప్పాడు.
ఇంట్లో “గిన్నేమయిందే?” అని నన్ను అడుగుతారు కాదా! గిన్నె ఎలాపోయిందో చెప్పాలి .విషయం తెలిస్తే ఇంట్లో తంతారని చిన్నాడికి భయం పట్టుకొంది. ఏదో కల్పించి చెప్పలంటాడు వాడు. నేను నిజమే చెప్పాను.ఇప్పుడూ నేను నిజమేచెపతాను . చెప్పడం ఇష్టం లేకపోతే మౌనంగా వుంటాను .
కొన్ని దృశ్యాలూ, వాసనలూ , రుచులూ చెరగని ముద్ర వేస్తాయి. లేత నీలిరంగులో నున్న నేల బావిలో నిశ్చలంగావున్న నీరు, నీటిలోని తెల్లని చంద్రుడు – ఆ నాటి ఆ చంద్రుడు నిండుగానే వున్నాడు; నీటిలోకి అలా అలా జారిపోతున్న తెల్లని అల్యూమినియం గెన్నె, ఒక్కసారిగా నీటిలో చంద్ర కాంతి చెల్లాచెదరైపోయిన దృశ్యం నన్ను బాగా ఆకట్టుకొన్నాయి, ఒక వైపు నోరు మండి పోతున్నా కూడా!
నాలాగే పల్లేటూర్లనుండి వచ్చేవారు కారియర్లు తెచ్చు కొనేవారు. మధ్యహ్నం ఒంటిగంటకు బెల్లు కొట్టాక చెట్లకింద కూర్చొని తినేవారము. అక్కడే ఆరు బయట ఒక కుండీ లో నీరుండేది .అక్కడ కేరియర్ గిన్నెలను కడిగే వారము. పొద్దున్న కలిపి పెట్టిన పెరుగు అన్నం పుల్లగా పులిసి ఒకానొక వాసనతో ఒకప్రతేకమైన రుచితో వుండేది. ఎప్పుడో ఒక్కోసారి పెరుగు అదే వాసనతో ఆదే పులుపుతో వుంటుంది .చాలా అరుదుగా! అప్పడు నేను తిన్న ఆ పెరుగూ అన్నం గుర్తొ స్తుంది.
కొంత మంది పిల్లలు కేరియర్ తెచ్చు కొనేవారు కాదు; వారు తరగతి గదులలో తాము కూర్చున్న బల్లల మేదనే కూర్చుని వుండి పోయేవారు. బయటకు వచ్చేవారు కాదు. ప్రతీ రోజూ కందాళ పఠాభి మాస్టారు గారు తరగతి గదులలో వుండి పోయిన పిల్లలను “ మాయింటికి పొండర్రా ! అమ్మ గారు అన్నంపెడతారు; ఇంట్లో అన్నం వుంటుంది; ఆవకాయ బద్ద వేసుకొని మజ్జిగాఅన్నం తిని రండి. కడుపుకాలుతూ వుంటే చదువేం వంటబడుతుంది?” అని అంటూ అందరినీ వారింటికి తరిమే వారు. వారే మాగురువులు. మాక్లాసుకు అన్ని పాఠాలూ వారే చెప్పేవారు.
*****

చాగంటి కృష్ణకుమారి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో పరిశొధన చేసి డాక్టరేట్ ను పొందారు. విజయనగరానికి చెందిన ఈమె ప్రముఖ రచయత చాగంటి సోమయాజులు గారి ( చాసో) కుమార్తె. 36 సంవత్సరాల ఉపన్యాసక వృత్తిలో ఆరు సంవత్సరాలు విజయనగరం మహారాజా మహిళాకళాశాలలో, మిగిలిన సంవత్సరాలు సింగరేణి మహిళా కళాశాలలోనూ పనిచేసారు.1993లో ఆసోసియేట్ ప్రొఫసర్ గా పదోన్నతి పొందారు. తెలుగు అకాడమి లో డెప్యుటేషన్ పై రసాయన శాస్త్ర పుస్తక, పదకోశాల ప్రచురణవిభాగంలో పనిచేసారు. వీరు రాయల్ సొసైటి ఆఫ్ కె మిస్ట్రి (RSC)లండన్. సభ్యురాలు.
ఇండియన్ కెమికల్ సొసైటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిష్ట్రి, ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్,ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వారి కన్వె న్షన్ ల లోనూ వర్క్ షాపుల్లోనూ పత్రాలను సమర్పించి రెండుసార్లు సర్వోత్తమ పత్ర సమర్పణా అవార్డులను పొందారు.ఆకాశవాణి కేంద్రాలనుండి, ఇందిరాగాంధి సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి GYAN VANI కార్య క్రమాలలో వైజ్ఞానిక అంశాలపై సుమారు 80 ప్రసంగాలను ఇచ్చారు. RSC IDLS వారు, స్థానిక విద్యా సంస్థల వారు నిర్వహించిన సెమినార్లు, వర్క్ షాప్ లలో పాల్గొని సుమారు 50 జనరంజన వైజ్ఞానిక ఉపన్యాసాలను ఇచ్చారు.
ఈవిడ మంచి ఉపన్యాసకురాలు, పరిశోధకురాలు, అనువాదకురాలు. క్లిష్ట మైన వైజ్ఞానిక విషయాలను చక్కని తెలుగులో ఆసక్తి దాయకంగానూ, సుబోధకంగానూ, సరళంగానూ ఆద్యంతం ఆకట్టుకొనే శైలి లో చెప్పగల రచయిత్రి. ఎం.ఎస్ సి; పి.హెచ్.డి డిగ్రీలను ఆంద్రా యునివర్సిటి నుండి పొందారు. డిగ్రీ స్థాయిలో ప్రతిస్ఠాత్మక బార్క్ (BARC) స్కాలర్ షిప్, ఎం.ఎస్.సి.లో మెరిట్ స్కాలర్షిప్, పిహెచ్ డి ప్రోగ్రామ్లో యు.జి.సి.ఫెలోషిప్ ని పొందారు.
2000 లో లోహ జగత్తు. 2001 లో వైజ్ఞానిక జగత్తు. 2010 లో మేధో మహిళ , భూమ్యాకర్షణకి దూరంగా.. దూర దూరంగా… సుదూరంగా…. 2012 లో రసాయన జగత్తు. 2016 లో వైజ్ఞానిక రూపకాలు. 2017 లో జీవనయానంలో రసాయనాలు 2018 లో వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి ? 2019 లో కంటి వైద్యంలో ప్రాచీన భారత దేశ జ్ఞాన సంపద ( నిజానిజాలపై అమెరికా వైద్యనిపుణుల విశ్లేషణ) వంటి వైజ్ఞానిక శాస్త్ర గ్రంధాలను ప్రచురించారు. వీరు రచించిన పుస్తకాలను నేషనల్ బుక్ ట్ర ష్ట్ ,న్యూ ఢిల్లి; తెలంగాణ అకాడమి ఆఫ్ సై న్స స్ ,హైదరా బాద్; వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంటి ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థలు ప్రచురించాయి.
ఈమె రాసిన భారతీయ సాహిత్య నిర్మాతలు:చాగంటి సోమయాజులు(చాసో)మోనో గ్రాఫ్ ని సాహిత్య అకాడమి 2014 ప్రచురించింది
