ఒక ఐడియా… ! 

-వెంపటి హేమ

ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది – అంటే , కేవలం అది, ఒక బ్రాండ్

సెల్ఫోన్ల వాళ్ళ బిజినె స్ తాలూకు ఎడ్వర్టైజ్మెంట్ మాత్రమే అనుకబోకండి, అందులో ఎంతో నిజం కూడా ఉంది . దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.  సమయానికి స్ఫురించిన ఒక ఐడియా మా బ్రతుకల్నే మార్చేసింది.  అది ఎలా జరిగిందన్నదే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను…

***

నేను పుట్టి పెరిగింది అతిసామాన్య దిగువ మధ్యతరగతి మానవ  కుటుంబంలో. “ఉన్నకర్మకు ఉపాకర్మ తోడయ్యింది”  అన్నట్లుగా, అసలే రాబడికీ ఖర్చలకీ

పొంతన లేని మా ఆర్ధిక పరిస్థితిలో, మా నాన్న త్రాగుబోతు కావడం అన్నది

మమ్మ ల్ని పట్టిపీడించే అదనపు దురదృష్టం.

అభివృద్ధిని సాధించవలసిన వయసులో మా నాన్న దుష్ట సహవాసాలకు

మరిగి,  దురలవాట్లకు లోనయ్యాడు. అక్కడితో కుటుంబ పరిస్ధితి మరింత  దిగజారి

పోయింది. మా బ్రతుకులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

నేను పుట్టేసరికి మా నాన్న రకరకాల దురలవాట్లకు బానిస కావడంతో ఆయన

ప్రవర్తన చాలా ఘోరంగా తయారయివుందిట. అమ్మ,

నాన్నచేత ఎలాగైనా ఆ పాడు అలవాట్లను  మాన్పించాలని శతవిధాలా

ఎంతగానో ప్రయత్నించిందిట.  కానీ ఫలితం – నాన్న చేత అమ్మకు ఎడాపెడా

తన్నులు! తరవాత మా అమ్మ ఆ ప్రయత్నం విరమించుకుంది.  అయినా కూడా, దుర్వ్యసనాలవల్ల మంచిచెడ్డల వివక్ష మరిచిపోయిన మా నాన్న, అమ్మను రకరకాలుగా హింసించేవాడు.

క్రమంగా రోజురోజుకీ మా నాన్న మరీ దిగజారిపోడంతో ఇక పడలేక

మా అమ్మ, నెలల వయసులోవున్ నన్ను ఎత్తుకుని కట్టుబట్టలతో, నాన్నను

విడిచి, పుట్టింటికి వెళ్లిపోయిందిట. మే మక్కడ నాలుగేళ్ళు ఉన్నాముట .

***

తల్లితండ్రులు బాగున్నన్నిరోజులూ మా అమ్మకు పుట్టినింట్లో జరుగుబాటు బాగానే ఉండేదిట. కాని నాకు ఐదవ ఏడునడుస్తూండగా మా తాతా,

అమ్మమ్మ కొద్ది రోజుల వ్యవధిలో కాలధర్మం చెందరుట. ఆ తరవాత మా మామయ్య,

ఇక ఆలస్యం చెయ్యకుండా మా అమ్మనీ నన్నూ వెంటబెట్టుకు తీసుకువచ్చి- మా

అమ్మకీ, నాన్నకీలీగల్గా విడాకులు అవ్వలేదు కనకనూ, వాళ్ళు వేరు వేరుగా ఉన్నది

కూడా ఇంకా ఏడేళ్ళు  కాలేదు కనుకనూ – ఆ ఇంట్లో ఉండేటందుకు ఆమెకు

సర్వహక్కులూ ఉన్నాయని  చెప్పి, మా నాన్నవుంటున్న ఇంటి గుమ్మంలో మమ్మల్ని

దిగవిడిచి వెంటనే వెనక్కి వెళ్లిపోయాడుట మా లాయరు మామయ్య !

కొంచెం జ్ఞానం తెలిశాక ఈ విషయలన్నీ మా అమ్మ నన్ను కూర్చోబెట్టి నాకు

వివరంగా చెప్పిం ది. ఏ కళనున్నాడో ఏమోగాని, మా నాన్ మమ్మల్ని ఇంట్లోకి

రానిచ్చాడుట. కా ని – ఎప్పటిలాగే తాగివచ్చి, మా అమ్మ ను హింసించడం మాత్రం

మానలేదు – అని కూడా చెప్పింది.

***

ఈ గందరగోళం మధ్యలో మా ఇంట నా ఇద్దరు చెల్లళ్ళు వెలిశారు.  అంతకుమించి

చెప్పుకోదగిన విషయం మరేదీ లేదు. మరో గత్యంతరం ఏదీ లేకపోవడంతో,  మా అమ్మ

ఎలాగో కష్టపడి పళ్ళబిగువున మా నాన్న  చేసే ఆగడాలన్నీ భరిస్తూ,  మమ్మల్ని

ప్రాణప్రదంగా చూసుకుంటూ పెంచసాగింది.

నాన్న ఎప్పుడూ ఇంటి ఖర్చులకు డబ్బు సరిపడా  ఇవ్వకపోడంతో, ఇక గత్యంతరం

లేక, ఇంటికి దగ్గరలో ఉన్న రెండు మూడిళ్ళలో జీతానికి పాచిపనీ, పైపనీ చెయ్యడానికి

ఒప్పుకుంది. నేనుకూడా మా ఊరి సిటీ బస్సస్టేషన్లో పూవు లమ్మీ ,  కాయలంమీ,  వేసవిలో సోడాలమ్మీ – ఇలా  కమీషన్కి ఏవేవో చిన్నచిన్న వ్యాపారాలు చేసి,

కొద్దిగా డబ్బు సంపాదించే వాడి ని ఆ డబ్బు తెచ్చి, అమ్మకిచ్చినప్పుడు ఆమె ముఖంలో కనిపించే ఆనందం

నాకు సంతోషాన్నిచ్చేది.  అలా నేను తొమ్మిదేళ్ల వయసునుండే మా అమ్మకి,

యధాశక్తిగా సాయపడీ వాడిని. ఒకరోజు అమ్మకాలు బాగుండేవి, ఒకోరోజు సరిగా

సాగేవి కావు. ఈ పరిస్థితిలో నాకు చదువుకోవాలని కోరిక ఉండి మాత్రం

ప్రయోజనమేముంది!

ప్రతిరోజూ ఆఫీసువేళ ఔతున్నకొద్దీ  బస్సుస్టాండులో రద్దీ అంతకంతకీ

ఎక్కువవుతూ ఉండేది. నీటుగా తయారయ్యి, పుస్తకాల సంచీ , లంచిబాక్సు చేత్తో పట్టుకుని రోజూ బస్సెక్కడానికి చాలామంది విద్యార్థులు వచ్చేవారు. లంచ్ బ్యాగ్గులు

చేతబట్టి స్టైల్గా కొందరు ఉద్యోగస్తులూ వచ్చేవారు.  వాళ్ళందరూ అప్పుడే పూసిన

పువ్వుల్లా ఫ్రెష్ గా ఉండేవారు. కానీ, సాయంకాల మయ్యేసరికి మళ్ళీ వాళ్ళే,  నలిగిన

బట్టలతో, జిడ్డు కారే మొహాలతో, వడలిపోయిన తోటకూర కాడల్లా వేలాడిపోతూ

నీరసంగా బస్సు దిగేవారు. వాళ్ళూ నాలాగే శ్రమజీవులే కదా – అనిపించేది నాకు. అయినా వాళ్ళవి ఎంతోకొంత స్థిరత్వమున్న జీవితాలు. నా బ్రతుకంత గాలి బతుకులు  మాత్రం కావు కదా వాళ్ల  వెవరివీ – అనుకునీ వాడిని వాళ్ళవంక చూస్తూ.

ఒక రోజు నాకో విచిత్రమైన కల వచ్చింది – చెపితే నవ్వరు కదూ …

ఆఫీసు టైమ్ కి బస్సెక్కి వెళ్ళీవాళ్ళ మధ్యన నేనూ ఉన్నట్లుగా వచ్చింది ఆ కల నాకు.

ఫన్నీగా లేదూ! మెలకువ రాగానే నవ్వొచ్చిది. అక్షరంముక్కైనా రాని నాకు మరీ

అంతంత పెద్ద పెద్ద ఆశలు ఉండడం మంచిది కాదు. “నక్కెక్కడ, నాకలోక మెక్కడ!”

నాలో అంత దురాశ ఉందని నాకే తెలియదు అప్పటి వరకూ.  “దురాశ దుఃఖానికి చేటు” – అన్న సూక్తి తలుచుకుని తెలివి తెచ్చుకున్నా.  నాలాంటి వాడికి అలాంటి ఆశలు ఒంటికి  మంచి చెయ్యవు –  అనే ఉద్దేశంతో  ఆ ఆలోచనల్ని మనసులోనుండి  తుడిచేశాను .

***

భాగ్యవంతుని కొడకు భాగ్యవంతుడే ఔతాడు, కూలివాని  కొడుకు మళ్ళీ కూలివాడే ఔతాడు – అంటారు కదా! అది సహజమైన వారసత్వపు హక్కు.  మరి తాగుబోతు కొడుకు … ? మరో తాగుబోతు ఔతాడా!

ఆ ఆలోచన రాగానే నా గుండె ఝల్లుమంది.  తాగి వచ్చిన మా నాన్న ప్రవర్తన నా కళ్ళకు

కట్టింది. “వద్దు, వద్దు .  దేవుడా! అటువంటి నీచ, నికృష్ట, నిర్భాగ్యపు  దుర్దశ నాకు వద్దు, హే భగవాన్! నన్ను రక్షించు” అంటూ నా హృదయం ఆక్రోశించింది. అంతలో నా నసులోకి మళ్ళీ మరో  ఆలోచన వచ్చింది… త్రాగుబోతైన తండ్రి ప్రవర్తనని చూసిన  ఏ కొడుకూ తాగుడుని ఏవగించుకోకుండా ఉండలేడు నాలాగే –  అనుకుని మనసు  సరిపెట్టుకున్నా.  తాగుడువల్ల మానవత్వాన్ని మర్చిపోయి, పశువుకంటే హీనంగా

యుక్తాయుక్తాల మధ్య నున్న భేదాన్ని పట్టించుకోకుండా నీచాతి నీచంగా

ప్రవర్తించే బ్రతుకు – అదేమి బ్రతుకు!!!

***

రోజులు ఎంత భారంగా గడుస్తూన్నా, కాలం ఆగకుండా తన దారిని తాను మునుముందుకుసాగిపోతునే ఉంది. నా చెల్లళ్ళు చూస్తూండగా పెరిగి పెద్దవాళ్ళు  ఔతున్నారు.

ఒక రోజు సిటీ బస్సు స్టాండులో ఎవరో చెప్పుకుంటూన్న మాటలు విన్నా – గవర్నమెంటు బడులలో చదువుకుంటున్న పిల్లలకు ప్రభుత్వం చదువు నేర్పించడమే

కాకుండా,

వాళ్లకి  మధ్యాహ్నం  పూట భోజనాలు కూడా ఉచితంగా పెడతారని! ఆ సంగతి  ఇంటికి రాగానే మా అమ్మకు చెప్పా.

వెంటనే  మా అమ్మ చెల్లెళ్ళని దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపడం మొదలుపెట్టింది, రోజులో ఒక్క పూటైనా వాళ్ళు అక్కడ కమ్మని భోజనం తింటారన్న ఆశతో.

చీకటితోనే లేచి అమ్మ, చెల్లెళ్లని నిద్రలేపి, వాళ్ళ తలలు దువ్వి  జడలు వేసి,

బడికి తయారుచేసి, ఆ తరవాత తనూ తయారై పనికి వెళ్ళేది. ఆ తరవాత నేను

లేచి, వాళ్ళకు చద్ది తినిపించి, ఏడున్నరయ్యీసరికి బడికి తీసుకెళ్ళి దిగవిడిచి, అటునుండి ఆటే నా పనిమీద వెళ్లిపోయేవాడిని.

మా నాన్న ఏడున్నర దాటాకగాని నిద్రలేచీవాడు కాదు. తరవాత ఆదరా బాదరా

తయారయ్యి, ఫేక్టరీకి వెళ్ళీవాడు. ఒకోరోజు హేంగోవర్ ఎక్కువైతే, ఇంట్లోనేవుండి

డబ్బులిమ్మని అమ్మను వేధించి, వెచ్చాలకోసం దాచిన కాస్త డబ్బుని ఊడ్చుకుని పోయి తాగుడుకు ఖర్చు చేసీవాడు.

ఇదే మా బ్రతుకు, దీన్లో ఒక రోజకూ మరొక రోజుకూ మధ్య పెద్దతేడా ఏమీ ఉండదు –

అనుకునీవాణ్ణ. అలాంటిది,  ఆ రోజున,ఒక్క క్షణంలో జరిగిపోయిన ఆ సంఘటన

మా బ్రతుకుల్ని పూర్తిగా మార్చేసింది …  అన్నిరోజుల్లాగే ఆ రోజునా  తెల్లవారింది

గాని, అన్ని రోజుల్లాంటి రోజు కాదది. అప్పుడు నా వయసు పదిహేనేళ్ళు . తల్చుకుంటేచాలు, ఆ రోజు జరిగిందంతా ఈ నాటికీ నాకు కళ్ళ ఎదుట స్పష్టంగా

కనిపిస్తున్నట్లుగానే ఉంటుంది.

రోజూలాగే ఆ రోజూ, దీపాలవేళ అవగానే అమ్మ , కొడి దులిపి, చమురుపోసి చిమ్నీ

బుడ్డి వెలిగించి, మా ముగ్గురికీ సత్తుకంచాలలో కొంచెం   అన్నం వడ్డించి, చారు

పోసి కలిపి ఇచ్చింది. మేమది ఓవారగా  కూర్చుని  తింటూండగా మా నాన్న

వచ్చాడు. ఏ రోజునా మేము నిద్రపోయాకగాని ఇంటికి రాని మా నాన్న, ఆ రోజు ఎందుకనో తొందరగా ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆయన పూటుగా తాగి ఉన్నాడు,

పైగా చేతిలో నిండా మందున్న సీసా ఒకటి ఉంది. లోపలకు  వచ్చాడు తూలుతూ.

ఇల్లంతా సారా వాసనతో నిండిపోయింది.

ఆయన వాలకం చూసి రోజూలా మా అమ్మ చూస్తూ ఊరుకోలేకపోయింది.  చిన్నగా లోగొంతుతో గొణిగింది …

“నీకు చూస్తే,  మనకు ఇద్దరు ఆడపిల్లలున్నారన్న ధ్యాసే లేచిన్నదానికి  ఏడూ,

పెద్దదానికి పది వచ్చాయి! ఎంతసేపుకావాలి, ఆడపిల్లలు”తోటకూరమొక్కల్లా” ఇట్టే

ఎదుగుతారు. పెళ్ళీ పేరంటం చెయ్యాలంటే బోలెడు డబ్బు కావలసి వస్తుంది. నువ్వేమో సంపాదించిందంతా నీ తాగుడికే ఖర్చు పెడతావు, ఇలాగైతే ఎలాగ చెప్పు” అంది. నిరాశ, కోపం, దుఃఖం – ఇలా అమ్మ కళ్ళలో  ఎన్నెన్నో భావాలు!

అమ్మ మాటలు నాన్నకి  నవ్వుతెప్పించాయి.  అమ్మ మొహంలోకి అదోలా పట్టి పట్టి

చూస్తూ, ఏ తండ్రీ అనకూడనిమాట ఒకటి అవలీలగా ఇట్టే అనేశాడు మా  నాన్న …

“పెళ్ళా, పాడా! వాళ్ల నల్లా గున్నల్లా ఎదగనియ్యి. ఈడొచ్చాకవాళ్ళని పంకజాక్షి

కంపెనీకి అమ్మితే డబ్బే – డబ్బు! నా సామిరంగా! ఎంత తాగినా తరగదు ” అన్నాడు

లొట్టలేసుకుంటూ .

నాన్న ఇంట్లోకి కాలుపెట్టగానే మాకు ఇంక తిండి సయించడం మానేసింది. కంచంలో

చెయ్యుంచుకుని, బిక్కు బిక్కు మని భయంతో చూస్తూ కూర్చుండిపోయాం మేము

ముగ్గురమూ .

నాన్న తనను ఎంత హింసించినా, ఎన్ని మాటలన్నా నోరు మూసుకుని భరించే మా అమ్మ, చెల్లెళ్ళ విషయంలో నాన్న అలా మాట తూలడం భరించలేకపోయింది.  నాన్న మాటలు అమ్మకి చాలా కోపం తెప్పించాయి.

ఆమె నాన్నని కోపంగా చూస్తూ, “ఛ్ఛీ! ఛ్ఛీ! నీచుడా!! చెడతాగి మంచి చెడ్డల మధ్య

తేడాని మర్చిపోయావు. మాదకద్రవ్యాల మత్తులోపడి, వావి వరసల్నీ వదిలేశావు, ఛ్చీ! నీ బ్రతుకు  చెడ! నువ్వు ఏమి తండ్రివి? కడుపున కన్న బిడ్డలన్నా కరుణకూడా లేకుండా ఇలా తప్పు మాటలు మాటాడడానికి నీకు నోరెలా వచ్చింది !నీకు  సిగ్గన్నది లేదా? ఊరికే అన్నావా లేక నిజంగానే

అంత పాపానికి ఒడిగట్టా లనుకుంటున్నావా” అని అడిగింది.

ఏనాడూ నాన్నని ఎదిరించి ఒక్క మాటైనా మాటాడని మా అమ్మ అలా అన్ని

మాటలు  మాట్లాడేసరికి మా నాన్న అహం దెబ్బతిండి. దురభిమానం

ప్రకోపించింది.  సీసా అడుగునున్న మద్యాన్ని మొత్తం, సీసా ఎత్తి నోట్లో

ఒంపుకుని, “ఏమిటే కూశావ్!  నోరు లేస్తోందేమిటే ఈ వేళ!  ఒళ్ళెలా  వుందేమిటి”  అంటూ అమ్మమీదికి ఆ ఖాళీ సీసా విసిరేశాడు.

అప్పటికే  నిషా తలకెక్కి, నాన్నకి  చేతులు వణుకుతూండడంతో  సీసా గురితప్పి

వేగంగా వెళ్లి, గోడకి కొట్టుకుని, గాజుది కావడంతో  భళ్ళున పగిలిపోయింది..

నాన్న రెచ్చిపోయాడు, “నా పిల్లలు, నా ఇష్టం. నువ్వు నోరెత్తితే చంపేస్తాను” అంటూ లేచాడు అమ్మ మీదకి.

ఉక్రోషంతో నాన్న కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో ఊగిపోతూ వచ్చి అమ్మని గూబ

పగిలేలా చెంపమీద ఒక్క దెబ్బ లాగిపెట్టి  కొట్టాడు.  ఆ దెబ్బకి బక్కగా ఉండే  అమ్మ తూలిపోయింది. అమ్మ తూలి,  వెళ్ళి గోడకి కొట్టుకుని క్రింద  పడింది.

ఆమె నోటి వెంట రక్తం ధారగా కారింది. కాని అదేం పట్టిచుకోకుండా, తనదారిన

తాను అక్కడున్న స్థూల మీద కూర్చుని, వెంట తెచ్చుకున్న చిరుతిండి తీసి,

ఆబగా తినడం మొదలుపెట్టాడు మా నాన్న.

నాన్న రాగానే మేము ముగ్గురం కంచాలు, పక్కగా పెట్టేసి వెళ్లి, భయం భయంగా

నాన్ననే చూస్తూ, గోడవారకు నక్కి ఉండిపోయాము. చెల్లెళ్ళు శబ్దం పైకి రానీకుండా

లోలోన గుక్కిళ్ల మింగుతూ ఏడవసాగారు. నేను అమ్మ  గ్గరకు వెళ్ళాలని లేచాను.

అంతవరకూ నేలను కరిచి పట్టుకుని పడివున్న మా అమ్మ, ఒక్క ఉదుటున లేచి

నిలబడింది.  ఆమె కళ్ళు  అకస్మాత్తుగా గుడిలోని అమ్మవారి కళ్లలా మెరిశాయి! ఆమె నేలమీద పడివున్న పగిలిన సీసాపెంకును గమ్మున చేతిలోకి తీసుకుంది. మరుక్షణంలో శరవేగంతో వెళ్ళి, సూటిగా గుండెల్లోకి దిగీలా,మా నాన్నను

వెనకబాటున ,   శక్తినంతటినీ కూడదీసుకుని  బలంగా పొడిచేసింది.

మృత్యుదేవత కరాళ దంష్ట్రల్లా సూటిగా, సూదిగా మొనదేలి ఉన్న ఆ సీసా తాలూకు

గాజు పెంకులు, తిన్నగా వెళ్ళి నాన్న గుండెను తాకాయి! అంతే, ఆ దెబ్బకి

అప్పటి కప్పుడు క్రింద పడి విలవిల లాడుతూ  కొట్టుకుని,మేము చూస్తూండగానే

ప్రాణాలు వదిలేశాడు! అంతా ఒక్క  క్షణంలో జరిగిపోయింది. నేను వెళ్లి  అమ్మని

ఆపేలోగానే అంతా ముగిసిపోయింది.

ఆపై, ఖాలీగావున్న చేతుల్ని చూసుకుంటూ ” అయ్యో, దేవుడా! నే నెంత పాపపు

పని చేశాను” అని ఆక్రోశిస్తూ అమ్మ నిస్త్రాణపడిపోయింది.  స్పృహతప్పి  నిలువునా నేలమీద వాలిపోయింది.

“అమ్మా! అమ్మా!” అంటూ, చెల్లెళ్ళిద్దరూ పెద్ద పెట్టున ఏడుస్తూ అమ్మ పడివున్న

దగ్గరకు పరుగున  వచ్చి,  అమ్మ మీద వాలిపోయి గోడుగోడున ఏడవసాగారు.

నాకు, మా నాన్న పోయాడని ఏడుపు రాలేదు సరిగదా, దుష్ట శిక్షణ జరిగిందని

సంతోషం కలిగింది. కాని ఒకే ఒక్క విషయానికి మాత్రం నాకు చాలా భయం

వేసింది,

పోలీసులు వచ్చి, హత్యానేరంపై  అమ్మను అరెష్టుచేసి తీసుకెళ్ళిపోతే,  ఆపై నేనూ

చెల్లెళ్ళూ  ఏమైపోవాలి” అనుకునే సరికి నాలో అంతులేని భయం పుట్టింది ది. అమ్మ లేకుండా చెల్లెళ్ళను నేను సాకగలనా? వాళ్ళి ద్దరూ సవ్యంగా పెరగాలంటే

అమ్మతోడు తప్పకుండా  కావాలి వాళ్లకి. ఏదో ఒక విధంగా అమ్మను ఈ అరెష్టు

నుండి  తప్పించాలి.  మరీ చిన్నవాళ్ళైన నా చెల్లెళ్ళకు అమ్మ అవసరం చాలా

ఉంది – అనుకున్నా. అనువైన  దారి కోసం ఆలోచించా.  అప్పుడు వచ్చింది నాకీ

బ్రహ్మాండమైన ” ఐడియా!”

అప్పటికప్పుడు  గుండె రాయి చేసేసుకుని, లేని ధైర్యం తెచ్చిపెటటుకున్నా.

ఎక్కడలేని తెగింపూ పుట్టుకొచ్చింది నాలో…

వెంటనే లేచివెళ్ళి నాన్న వీపులో లోతుగా దిగివున్న గాజుపెంకును శక్తికొద్దీ

బలవంతంగా ఊడలాగా.  గాజుపెంకు అడ్డు తొలగగానే గాయం నుండి చివ్వున

చిమ్మిన  రక్తం నా ఒంటిమీద పడి నా బట్టలన్నీ రక్తసిక్తమయ్యాయి.  చెల్లెళ్ళు

భయంతో “కెవ్వు కెవ్వు “మని పెద్దగా కేకలుపెట్టి గట్టిగా ఏడ్చారు. ఆ కేకలు

వినిపించడంతో ఇరుగుపొరుగులవారు కంగారుపడుతూ పరుగు పరుగున

అక్క డకు వచ్చారు.  మా నట్టింట కనిపించిన దృశ్యాన్ని చూసి వాళ్ళు

నిర్ఘాంతపోయారు.

వెంటనే వారిలో కొందరు పోలీసులకు పిర్యాదు చెయ్యడానికి పరుగు తీశారు.

పోలీసు స్టేషన్ దగ్గరలోనే ఉండడంతో,  హత్య జరిగిందన్న వార్త అందుకోగానే,

బూట్లు టకటకలాడించకుంటూ పోలీసులు అక్కడకు వచ్చారు. పోలీసుల ప్రశ్నలకు మేము జవాబు లివ్వవలసి ఉంది. వాళ్ళు  ముందుగా ఎదురుగా కనిపించిన నన్నే అడిగారు, “ఇక్కడ ఏమి జరిగింది” అని.

నేను తడుముకోకుండా జవాబు చెప్పాను. “మా నాన్న ప్రతిరోజూ తాగి , ఇంటికి వచ్చి  పిల్లలమైన మమ్మల్నీ, మా అమ్మనీ చితక్కొడతాడు. ప్రతి రోజూ అదే వరస. ఇక ఆ బాధ పడలేక నేనే మా నాన్నని వెనకబాటుగా వచ్చి  పొడిచి

చంపేశాను” అని  చెప్పాను . రక్త సిక్త మై ఉన్న నా రూపాన్ని, నా చేతిలోని రక్తం

కారుతున్న సీసా పెంకునీ చూసి, నేను చెప్పింది నిజమేనని నమ్మారు అందరూ.

మా నాన్న పక్కా త్రాగుబోతనీ, రోజూ మమ్మల్ని కొట్టడం నిజమేననీ సాక్ష్యం

చెప్పారు   చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు. కాని మా నాన్నను ఎవరు చంపేరన్నది

మా త్రం తాము చూడలేదన్నారు. స్వయంగా తప్పును నేనే  ఒప్పుకోడం

వల్ల, మరి సందేహించకుండా పోలీసులు నన్ను అరెష్టు చేశారు. నా ఒంటిమీద

పడ్డ మా నాన్న రక్తంవల్ల కూడా ఆ విషయం ఋజువయ్యింది.  పోలీసులు

హత్యాయుధాన్ని నా చేతినుండి స్వాధీనం చేసుకుని భద్రపరిచారు.

ఈలోగా అక్కడకు వచ్చిన ఆడవాళ్లు మా అమ్మ ముఖంపై చల్లటి నీరు చల్లి,

ఆమెకు తెలివి తెప్పించారు.  దిగ్భ్రాంతి నుండి తేరుకున్న మా అమ్మ కళ్ళు

తెరిచి, పోలీసుల మధ్య  నిలబడి ఉన్న నా వైపు తెల్లబోయి చూసింది.

మా అమ్మ ఎక్కడ నా పన్నాగమంతా పాడుచేస్తుందేమోనని నేను చాలా

భయపడ్డా. అంతలో నా ఇద్దరు చెల్లెళ్ళు అమ్మను కౌగిలించుకుని “మ్మా! అమ్మా”

అంటూ అమ్మకి మాట తోచనీకుండా ఇల్లెగిరిపోయీలా భోరున ఏడవ సాగేరు.

నేను వెంటనే అమ్మని ఉద్దేసించి, “అమా! నువ్వు నీ ఆరో గ్యాన్ని సరిగా ఉండేలా

చూసుకుంటూ, చెల్లెళ్ళను కనిపెట్టి ఉండాలమ్మా. పాపం! చిన్నపిల్లలు, వాళ్ళకు

నీ అవసరం చాలా ఉంది.  ధైర్యంగా ఉండి, నాకు సెలవిచ్చి పంపించు, త్వరలోనే

శిక్ష ముగించుకుని వ చ్చేస్తా” అన్నా గుంభనంగా.

అమ్మ సరిగానే అర్ధం చేసుకుంది. అమ్మ చెల్లెళ్ళనుతన రెండుచేతులా దగ్గరగా

తీసుకుని, తలెత్తి తడికళ్ళతో దీనంగా నావైపు చూస్తూ నెమ్మదిగా తలూపి, తన

అంగీకారాన్ని తెలియజేసింది.

అమ్మ కళ్లనిండా కన్నీరు ఊరి చెంపల మీదుగా ధారలై  కారసాగింది, కాని ఆమె నోరువిప్పి ఒక్క మాట కూడా మాటాడలేదు.  నన్నే చూస్తూ , ఏడుస్తూ ఉన్నచోటునే ఉండిపోయారు వాళ్ళు ముగ్గురూ.

మా కుటుంబాన్ని గురించి అంతా  తెలిసి ఉన్న ఇరుగు పొరుగులలోని  పెద్దాయన

ఒకరు నన్ను చూసి జాలిపడ్డారు, ” బాబూ! నువ్వు  అనవసరంగా నీ చేతులు పాడు చేసుకున్నావుగాని,  ఎలాగా మీ నాన్న ఇంకొక్క నెలకన్నా ఎక్కువ బ్రతికేవాడు కాదు.  తాగుడువల్ల అతని లివర్ పూర్తిగా చెడిపోయిందిట” అన్నాడు.అంతలో

అంబులెన్సు వచ్చింది పెద్దగా సైరన్ మోగించుకుంటూ …

పోలీసులు నన్ను రిమాండ్ కీ, నాన్న శవాన్ని పోష్టుమార్టమ్ కీ  తీసుకెళ్ళిపోగా;

అమ్మా, చెల్లెళ్ళూ వెనక ఉండిపోయారు.

***

 కొద్ది రోజుల తరవాత కోర్టులో విచారణ జరిగింది. హత్యా నేరాన్ని నేను స్వయంగా

ఒప్పుకోడంతో నాకు శిక్ష పడింద. నా వయసు మరీ పదిహేనేళ్ళు కావడంవల్ల

నన్ను విజయవాడలో ఉన్న బాలనేరస్థుల బడి – “బోర్స్టల్” కి పంపారు.

“బోర్స్టల్”లో చదువేకాక, నేర ప్రవృత్తినుండి బాలనేరస్తుల్ని సన్మార్గం వైపుగా

మళ్ళించడం కోసం కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. కౌన్సిలింగ్  క్లాసుకి

వెళ్ళినప్పడల్లా నాలో నేను నవ్వుకునీవాడిని. అక్కడున్న వాళ్ళందరిలో నాకు

సద్వర్తనకు అవార్డుకూడా వచ్చింది. నేను మంచిగా ఉంటూ, శ్రద్దగా చదివి ప్రతి

పరీక్షలోనూ మంచిమార్కులు తెచ్చుకుంటూంటే నన్ను డిగ్రీ వచ్చే వరకూ

చదివిస్తామన్నారు అక్కడి ఆఫీసర్లు.

***

ఒక్కొక్కప్పుడు మనం  మంచి వనుకున్న పనులు కొన్ని చెడు ఫలితాలను ఇస్తే,

మరొకప్పుడు, చెడ్డవనుకున్న వాటికి మంచి ఫలితాలు వస్తాయి. అంతా విధి చేసే పనులు వింతగా ఉంటాయి.  ఇప్పుడు నన్నే చూడండి …  “తన్నితే తిన్నగా వెళ్లి

బూరెల గంపలో పడ్డాడు” అన్నట్లు అయ్యింది నా పరిస్థితి. వచ్చిన అవకాశాన్ని

నేను చక్కగా వినియోగించుకుని శ్రద్ధగా చదివి పరీక్షలు పాసై పనిలోపనిగా

మంచివాడనే పేరు కూడా తెచ్చుకున్నా. దానివల్ల శిక్షా కాలం కూడా తగ్గింది. నా చిరకాల వాంఛితమైన చదువుకోవాలన్న కోరిక కూడా తీరింది.  B. A తోపాటు

  1. Ed  కూడా పూర్తిచేశా . శిక్షాకాలం పూర్తవ్వగానే నేను కోరుకన్న ఈ టీచర్

ఉద్యోగం వచ్చింది నాకు. కౌమార ప్రాయంలో ఉన్న పిల్లలకు పాఠాలు చెప్పడమే వృత్తి నాకు.

మా నాన్న నా గురించి ప్రత్యక్షంగా ఏ బాధ్యతలూ  తీసుకోకపోయినా, నిజానికి

ఆయనవల్లే నాకీ ఉద్యోగం వచ్చింది. నేను కన్న కల నిజమయింది. మా అమ్మనీ

చెల్లెళ్ళనీ నేను ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకువచ్చాను. ఇన్నాళ్ళూ మా అమ్మ

కష్టాలే తప్ప, సుఖమన్నది ఏమీ  ఎరుగదు. ఇక ఆమెకు కష్టాలూ

కన్నీళ్ళూ లేకుండా చూసీ పూచీ నాదనుకున్నాను. నేనుండగా చెల్లెళ్ళకూ, అమ్మకి

ఏ కష్టం రాకూడదు. మా అమ్మ, చెల్లెళ్లూ నేను – అంతా ఇన్నాళ్ళకి ఇప్పుడు

సుఖంగా ఉన్నాము. కాని నాకు ఒక్క కోరిక మాత్రం ఇంకా మిగిలి ఉంది …

అది ఏమిటంటే –

మా నాన్నతో మా అమ్మ పడిన కష్టాలు , ఇంక ఏ అమ్మా పడకూడ దన్నదే నా

ఆశయం. అది సాధించడానికి నేను, నాకు చేతనైన రీతిలో  నా జీవితకాలం కృషి

చేస్తూనేవుంటాను. తాగుడు పిశాచికి శాశ్వత సమాధి కట్టాలన్నది నా కోరిక.

ఇదివరకు ఎందరో గొప్పగొప్పా వాళ్లు పూనుకున్నారు కాని, పూర్తి విజయాన్ని

సాధించ లేకపోయారు. ఒక ఉపాధ్యాయుడిగా నేను నా వృత్తిని వినియోగించుకుని,

చక్కగా విజయాన్ని సాధించగలనని నా నమ్మకం.

నా చిన్నతనంలో, మా నాన్న త్రాగుబోత్తనంవల్ల నేనూ, మా అమ్మా,  తరవాత మా చెల్లెళ్ళూ పడిన పాట్లు, మా శత్రువులు కూడా పడకూడ దన్నది నా ఆకాంక్ష!

కౌమారప్రాయంలో మనిషి మనసు పాదరసంలా చెలిస్తూ ఉంటుంది. మంచి కైనా చెడుకైనా ఆ వయసులోనే జీవితానికి చాలిన ముద్ర పడిపోతుంది. అందుకే ఆ వయసు పిల్లలను సరైన మార్గంలో నడిపించే నేత ఉండాలి.  ఆ పని నేను చేస్తా.  ఆ   వయసులోనే పిల్లలకి తాగుడు వల్ల మనిషి ఎంతగా దిగజారిపోతుడో,

మరెంతగా అనారోగ్యానికి గురవుతున్నాడో అర్ధమయ్యేలా ఉదాహరణలు జోడించి

మనసుకు హత్తేలా చెపుతాను.  మనిషి నిషాతలకెక్కడంతో ఒళ్ళుమరచ ఎంత

నీచంగా, నికృష్టంగా ప్రవర్తిస్తున్నాడో అందరికీ తెలిసిననాడు ఏది ఉచితమో, ఏది అనుచితమో ఎవరికీ వారే తెలుసుకుంటారు.

అందమైన తన జీవితాన్ని మనిషి తాగి ఎలా జుగుప్సాకరంగా

మార్చుకుంటున్నాడో మనసుకి హత్తేలా చెపితే, భవిష్యత్తులో వాళ్ళంతట వాళ్లే

మాదకద్రవ్యాలవైపు కన్నెత్తి కూడా చూడరని నా నమ్మకం. ఒక ఉపాధ్యాయునిగా

నా వంతు కృషి నేను చెయ్యాలని నిశ్చయించుకున్నాను దృఢంగా.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.