
ఈ వేళ రెక్కల మధ్య సూర్యోదయం
-గవిడి శ్రీనివాస్
ఒక పక్షి
నా ముందు రంగుల కల తొడిగింది .
ఆకాశపు హరివిల్లు
మురిసింది .
చుక్కలు వేలాడాయి
కాసింత వెలుగు పండింది .
సీతాకోక చిలుకలు వాలాయి
ఊహలు అలంకరించుకున్నాయి .
ఈ రోజు ఆశ తొడుక్కుంది
క్షణాలు చిగురిస్తున్నాయి .
అడుగు ముందుకు వేసాను
లక్ష్యం భుజం తడుతోంది .
ఈ వేళ రెక్కల మధ్య
సూర్యోదయం
తీరాల్ని దాటిస్తూ
నా లోపల ఉషస్సుల్ని నింపింది .
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
