
కళ్ళలో ఒక నది
-గవిడి శ్రీనివాస్
కళ్ళలో ఒక నది ఒక చెట్టు
ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి .
లోపలి మనిషి ఒక్క సారీ
బహిర్గత మౌతుంటాడు.
అంతర్ధానమౌతున్న విలువల ముందు
జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా
కడగబడుతున్న క్షణాల్లో
ఇంకో పార్శ్వముగా
దివ్య రేఖలు అద్దుతుంటాయి .
చెదిరిపోని ఊహలు
గూళ్ళను నిర్మిస్తాయి .
అల్లుకున్న తపనలు
చిగురులు తొడుక్కుంటాయి .
ఒక దాహం నది తీర్చినట్లు
ఒక ఎండని చెట్టు ఆపినట్లు
కాలం దొంతరల్లో
ఒక ప్రయత్నం
ఎన్నో కాంతుల్ని విసురుతుంది .
శ్రమ ఉదయించడం లో
విజయాలు తడుతుంటాయి.
అక్షరాల కాంతి లో
ఇలా రేపటి స్వప్నాలని నిర్మించుకుంటూ ..
అడవి పూల సౌందర్యాన్ని
పారే నదీ ప్రవాహాల్ని
చెట్టున వాలే పక్షుల్ని
నాలో ఊహల్నీ
ప్రవహించే కాలం ముద్రిస్తుంది ….!
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
