నా జీవన యానంలో- రెండవభాగం- 15

-కె.వరలక్ష్మి

    ఆ అద్భుత మేమిటంటే నేను పంపిన మొదటి కథ రిక్షా‘  జ్యోతి  మంత్లీ లో 1985 జూన్ సంచిక లో వచ్చింది. అంతకు ముందంతా ఏవో చిన్న వ్యాసాలూ, కవితలూ, జోక్స్ లాంటివి వస్తూ ఉన్నా, చిన్నప్పటి స్కూల్ డేస్ తర్వాత వచ్చిన కథ. ఈ కథ నాకొక ధైర్యాన్ని ఇచ్చి రాసేందుకు ప్రోత్సహించింది. ఆ ఉత్సాహంతో రాసిన ప్రశాంతికలువబాల పత్రిక నవలికల పోటీ లో ప్రత్యేక బహుమతి కి ఎంపిక కావడంతో నేనూ రాయగలను అని, ఒక ధ్యేయంతో రాయాలనే మార్గాన్ని చూపించింది. స్కూల్లో ఏ కొంత తీరిక దొరికినా ఏదో ఒక మంచి రచన చదివే అలవాటుతో బాటూ, రాసే ఆకాంక్ష, అవసరం ఏర్పడ్డాయి. నా ఒంటికి, మనసుకీ తగులుతున్న గాయాల నుంచి ఒక ప్రశాంతమైన ధ్యానంలోకి వెళ్లినట్టు స్వాంతన కలిగేది.    

       పిల్లలు ఎదిగొస్తున్నారు.  మా అమ్మ వాళ్ళిల్లు ఇదివరకు ఉన్న ఇల్లంత పెద్దది కాదు. అంత ప్రైవసీ వున్నదీ కాదు. గదులు తక్కువ. మేం ఇంగ్లీష్ టీచ్ చేసే ఆంగ్లో ఇండియన్ టీచర్ కి ఇచ్చిన రూమ్ వీధిలోకి ఉండేది. రాత్రులు ఆఫీస్ రూంలో కుర్చీలన్నీ పక్కకు సర్ది పిల్లలూ, నేనూ పడుకునేవాళ్ళం. 

       మా ఆడపడుచు రాణీ వాళ్ళు సెలవు పెట్టుకుని ఇదివరకు కట్టించుకున్న పునాది పై ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఒక్కడి జీతంతో వాళ్లు ముందుకెళ్తున్నారు. మేం ఇద్దరం సంపాదిస్తున్నా ఒక్క పైసా మిగలడం లేదు. అలాగని ఇంట్లో లగ్జరీ ఖర్చు లేమీ లేవు. కనీసం అప్పటికి  ఫ్రిజ్  కూడా లేదు. వస్తువు బ్యాంకులో  తాకట్టు పెట్టి గ్యాస్ స్టవ్ కొనాల్సి వచ్చింది.  ఇంగ్లీష్ టీచర్ ని పంపించేస్తే మోహనేమైనా కొంత దారిలో పడతాడేమో అనిపించింది.

ఆ మాట చెప్పగానే మోహన్ చాలా గొడవ పెట్టేసాడు. నేను పట్టు విడవక పోయేసరికి ఒక వేన్ తెచ్చి ఆవిడ సామాన్లతో బాటు ఆవిడనూ తీసుకెళ్లి రాజమండ్రిలో  ఒక అద్దె ఇంట్లో పెట్టి వచ్చాడు.  ఎప్పట్లాగే వీకెండ్ కి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నంత సేపూ రుసరుసలాడుతూ, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, చేతి కందిందల్లా విసిరి కొడుతూ ఉండేవాడు. స్కూల్ వదిలెయ్యమని, తను ఇంకెవరినైనా తీసుకొచ్చి నడిపించుకుంటాననీ గొడవ పెట్టేవాడు. కష్టపడి నిలబెట్టిన ఆ స్కూల్ ని వదిలేస్తే పిల్లల చదువులు ఏమౌతాయోనని బెంగగా ఉండేది. అసలు స్థిమితం ఉండేది కాదు. ఎంత పట్టించుకోకూడదనుకున్నా కూడ సాధ్యమయ్యేది  కాదు. ఎవ్వరి ఎదుటా డీలా పడిపోకుండా ఒక రాయి లాగా బతకడం అలవాటు చేసుకున్నాను. 

     పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారు. వాళ్ల చదువులు ముగిసి జీవితాల్లో స్థిరపడితే నేనే స్వచ్ఛందంగా ఈ స్కూలును అతనికి అప్పగించేసి రిటైరయి పోతాను అనుకునేదాన్ని. గీత అప్పటికే తన హైస్కూల్ పాఠాలు  లేనప్పుడు మాస్కూల్లో క్లాసులు తీసుకుంటుంది. 

    రాణీ వాళ్ళు మన కన్నా వెనకగా స్థలం కొనుక్కుని అప్పుడే ఇల్లు కట్టేసుకుంటున్నారు. మీరు మీ  జీతంలో కొంత ఖర్చు  పెట్టుకుని మిగిలింది పొదుపు  చెయ్యగలిగితే మనమూ ఇల్లు కట్టుకుందాం.అన్నానొక రోజు మోహన్ తో. 

   “ఇల్లో ,ఇల్లో అని తినేస్తున్నావు. ఇల్లు నెత్తినెట్టుకుని పోతావా? సంపాదించేది హాయిగా ఖర్చుపెట్టుకుని జల్సాగా గా బతకడం నాకిష్టం.  ఒకవేళ నువ్వు కాదూ కూడదూ అని ఏ అప్పో సొప్పో చేసి ఇల్లు కట్టుకోవాలని చూస్తే నేనొక్కపైసా కూడా ఇవ్వను” అని తేల్చేసాడు. 

     స్కూలు నుంచొచ్చిన ఆర్ధిక స్వాతంత్రం వల్ల కొంత, నేను చదివిన, చదువుతూ ఉన్న సాహిత్యం వల్ల కొంత  ఇదివరకటిలా  అన్నిటికీ బేలగా ఏడవకుండా ధైర్యంగా  నిలబడడంతో  మోహన్ లోలోపల ఉడికిపోతూ ఉండేవాడు. లోపల రగులుతున్న అగ్ని పర్వతాల్ని అదిమిపట్టి స్కూల్లో నవ్వు చెదరనీయకుండా  ధీరంగా, గంభీరంగా ఉండడం అతనికి  అంతు పట్టేది కాదు. స్కూలు పిల్లల పేరెంట్స్ వచ్చి  నా ఆఫీస్ రూంలో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఏదో ఒక  అర్థం కాని గొడవ పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. 

     ఓ రోజు ఇల్లు కట్టుకుంటున్న మా ఆడపడుచు “పందుల్లాగ పిల్లల్ని కనడం కాదు, వాళ్ళని  పెంచడం తెలియాలి”  అంది. నేను నిలువునా నీరై పోయాను. ఏం జరిగింది అని తెలుసు కుంటే  చాక్లట్స్ గీతకి ఎక్కువిచ్చిందని మా చిన్నమ్మాయి తనకిచ్చినవి విసిరికొట్టి వచ్చేసిందట. ఆకోపంలో నేను ఎనిమిదో తరగతి చదువుతున్న లలితని వీపు మీద ఒక్కటి బాదేను. “నీ మూలాన్నే పిల్లలు ఇలా  అయిపోతున్నారు” అంటూ మోహన్ సాధించడం మొదలు పెట్టేడు.

 ఓ నోట్ బుక్ లో లలిత  ‘I hate my mom’ అని రాసుకున్న దాన్ని చూపించి విజయగర్వంతో నవ్వేడు. 

     నేను ఎవరికోసమైతే బతుకుతున్నాను అనుకుంటున్నానో  ఆ పిల్లలే ఇలా అనుకుంటే నేనేమైపోవాలి. అది చిన్నపిల్ల రాత అని తోసి పుచ్చలేక పోయాను. ఎందుకంటే వాళ్ళు హైస్కూలికొచ్చినప్పటి నుంచి వాళ్లతో స్నేహంగా మసలుతున్నాను అనుకుంటున్నాను, ఇవాళ ఈ పిల్ల ఇలా అంది, ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే రేపు మిగిలిన ఇద్దరు ఇలా మాట్లాడడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు.

    నా ధైర్యం నీరైపోయింది. ఆ రాత్రి కరిగి కన్నీరై  నిద్రకు దూరమయ్యాను. ఒక నిరాశక్తత నన్ను రాయిలా మార్చేసింది. ఆ ఉదయం నేనిచ్చిన కాఫీని నా మొహానికేసి కొట్టాడతను.  నేను మౌనంగా తుడుచుకున్నాను. నా మనస్థితి  నన్నా ఇంట్లో ఉండనీయడం లేదు. అందుకు తగినట్టు ఆ రోజు పేపర్లో తిరుపతిలో స్త్రీల కోసం మొదలుపెట్టిన ఆశ్రమం  గురించి వార్త వచ్చింది.  నేను ఆశ్రమానికెళ్లి పోవాలని ఒక  నిర్ణయానికొచ్చాను.    అందరూ తయారై స్కూలు కెళ్ళిపోయాక నేను గబగబా ఒక బేగ్ లో కాసిని బట్టలు, సర్టిఫికెట్లు పెట్టుకుని రోడ్డు చివరికొచ్చి  సామర్లకోట వెళ్లే బస్సెక్కేను. బస్సు ఊరు దాటు తున్నప్పుడు హఠాత్తుగా మా అబ్బాయి రవి వచ్చి  నా పక్క సీట్లో కూర్చున్నాడు. నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. సరే, సామర్లకోటలో ట్రైనెక్కించి వెనక్కి వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. కానీ నా కన్నా ముందే కౌంటర్ దగ్గరకి వెళ్లి హైదరాబాద్ కి రెండు టిక్కెట్లు కొనేసాడు. ఆ టైంకి హైదరాబాద్ కి ఏ ట్రైన్ ఉందో, లేక విజయవాడ లో బండి మారేమో నాకిప్పుడేమీ గుర్తురావడం లేదు. వాడిని కూడా పలకరించ బుద్ధి కాక అలా మౌనంగా ఉండిపోయాను. ఆ బండిలో జరిగిన ఒకే ఒక సంఘటన మాత్రం ఇప్పటికీ ఇంకా స్పష్టంగా గుర్తుంది. వరంగల్ లో ప్రొఫెసర్ ఒకావిడ  నా ఎదుటి సీట్లోంచి నవ్వుతూ పలకరించారు. ఆవిడ ఒడిలో రెండేళ్ల బాబు వున్నాడు. నా పక్కన ఉన్న  మా అబ్బాయిని చూసి అదృష్టవంతులు ఈ వయసుకే  మీకు ఇంత ఎదిగిన కొడుకు వున్నాడు, వీడు చూడండి, నేను రిటైరయ్యే టైముకి వీడు హైస్కూలు చదువులో ఉంటాడు అన్నారు. నన్ను మా పెద్ద తమ్ముడింట్లో వదిలి మర్నాడు తిరిగెళ్లి పోయాడు రవి. మా అమ్మ కేమి చెప్పాడో, నన్ను ఒక్క నిమిషమైనా వదలకుండా ఉండేది. మొదట్లో వారం రోజులు చాలా దుఃఖపడిపోయేది. పగలంతా బింకంగా తిరిగినా రాత్రైతే కన్నీటి సముద్రమైపోయేది. 

    నా పరిస్థితీ అలాగే ఉండేది. తమ్ముడూ, మరదలూ ఎంత బాగా చూస్తున్నా, నాది కాని ఇంట్లో ఉన్నాను అనే ఫీల్ తో సతమతమైపోయేదాన్ని. రాత్రయితే దుఃఖం ఆపుకోలేకపోయేదాన్ని. పిల్లల్ని వదిలేసి వచ్చాను, వాళ్ళేం తింటున్నారో, ఎలా ఉంటున్నారో అని తపనతో సరిగ్గా తిండి సహించేది కాదు. ముఖ్యంగా గీత ఏ విషయానికి నేను బాధ పడినా నా  కన్నా ముందే కన్నీరుమున్నీరయ్యేది. నేను దగ్గరుండి వడ్డిస్తేనే గానీ సరిగ్గా తినని పిల్ల. ఏం తింటుందో, ఇంటినీ స్కూల్ ని చూసుకుంటూ తన చదువు ఎలా చదువుకుంటుందో, అని తల్చుకుంటే మరింత దుఃఖం ముంచుకొచ్చేది. 

ఒక రోజు నా సర్టిఫికెట్స్ తీసి పైన పెట్టుకుని మా తమ్ముడితో నా కేదైనా జాబ్ చూసి పెట్టారాఅని అన్నాను. ‘చూద్దాంలే, ఇంటి పని బిజీ లో వున్నాను కదా! అయ్యాక చూద్దాంఅన్నాడు. అయినా నువ్వు ఇందిరాగాంధీ వీరాభిమానివి కదా, ఆమె లాగా ధైర్యంగా ఉండాలి కానీ పిరికిదానిలా ఇలా పారిపోయి వచ్చా వేమిటి?’ అన్నాడు. ఆ మాటకు కొంత నొప్పి కలిగినా కొంత నిజమే అనిపించింది. అప్పటికి మా పెద్ద తమ్ముడు ప్రకాష్ నగర్ (బేగంపేట్ )లో ఇల్లు కట్టుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వాడికి ఒక కొడుకూ, ఇద్దరు కూతుళ్లు. మా చిన్న తమ్ముడు ఖైరతా బాద్ లో ఉంటున్నాడు. తనకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అందరూ చిన్న చిన్న పిల్లలు. మూడు వారాల పాటు అక్కడ నాలుగు రోజులు, ఇక్కడ నాలుగు రోజులూ ఉండేదాన్ని. పగలంతా పిల్లలతో గడిచి పోయేది, రాత్రయితే దిగులు ముంచుకొచ్చేది. 

      మా పెద్ద తమ్ముడు మా జిల్లా కెళ్ళి బంధువులందర్నీ  గృహప్రవేశానికి ఆహ్వానించి వచ్చాడు. ముందుగా మా చెల్లెళ్ళిద్దరూ కుటుంబాలతో వచ్చేరు. ఓ రోజు ఇల్లు గలవాళ్ళు మమ్మల్నందర్నీ భోజనాలకి పిలిచి భోజనాల దగ్గర మంచినీళ్లకు బదులు బ్రాందీ గ్లాసులు పెట్టారు. వాళ్ళూ యాదవులే. తెలంగాణాలో ఆడా, మగా తాగుతారట. మా దగ్గర ఆ పద్ధతి లేదని మర్యాదగా చెప్పి గ్లాసులు తీయించేసాం, కానీ ఆ వాసనకు కడుపులో తిప్పి భోజనాలు సరిగ్గా చెయ్యలేక పోయాం. 

      ఇంకో రోజు వరధాన్యాల నోము నోచుకుని వాయనాలిచ్చారు. ఒక్కొక్కళ్ళనీ కొంగు పట్టమని ఐదు సోలలు ధాన్యం  పోశారు. నా వంతు వచ్చేసరికి నా కొంగులో నల్ల నువ్వులు పోశారు. అది గమనించి మా అమ్మ గాభరా పడిపోయి భోరుమని ఏడ్చేసింది. నల్ల నువ్వులు కాదు కదా, తెల్ల నువ్వులైనా  చెయ్యి పట్టి ఎవరినించీ తీసుకోరు గోదావరి జిల్లాల్లో.  మా అమ్మ ఏడుపు చూసి నేనూ కంగారు పడిపోయాను. ఎవరో చెప్తే గబగబా మెట్లు దిగి క్రిందకు వెళ్లి  ఆవు ముందు పోసి వచ్చాను.   

      గృహ ప్రవేశానికి పిల్లల్ని తీసుకుని మోహన్ వచ్చాడు. హడావుడి ముగిసి అందరూ వెళ్ళాక ఇంకెప్పుడూ నన్ను బాధించననీ, ఇంటి బాధ్యత సగం భరిస్తాననిమా అమ్మ, తమ్ముళ్ల ముందు ప్రామిస్ చేసాడు. కుటుంబం కోసం కరిగి నీరయ్యే ఆడవాళ్ళం కదా మనం, నెల రోజుల్లో అన్నీ మర్చిపోయి వెనక్కి ప్రయాణమై వచ్చేసాను. వచ్చిన మర్నాడే అర్థమైంది మోహన్ ఏమీ మారలేదని. అతనిక మారడు అని కూడా తెలిసొచ్చింది. ఎప్పటిలాగే కుటుంబ బాధ్యతను నేనే వహించాలిఅని దృఢనిశ్చయాన్ని చేసుకున్నాను. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.