
పట్టించుకోనింక!!
-సుభాషిణి ప్రత్తిపాటి
గుచ్చే ఎగతాళి చూపుల ముళ్ళు,పడదోసే అడుసులాంటి మాటలుఅన్నీ దాటుకుంటూ…నన్నుచేరిన గెలుపు పిలుపు నాకేం కొత్తకాదు.ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అహం,తుఫాన్ లో ఊగే ఊడలమఱ్ఱి లామహోగ్రంగా మాటలతో విరుచుకుపడ్డా..నిబ్బరంగా ఎదిగే నాపై పిడుగై కురవాలనుకున్నా…కలతల కన్నీళ్ళను కవితల్లో నింపుతూ కదిలే నాకు నువ్వేంటనే ….కుఱచ సంబోధన కొత్తగా అనిపించదు.నా ఆలోచనాలోగిలి అనంతాకాశమై..రెక్కలు చాచిన కొద్దీ సరిహద్దులు లేని విశ్వం నన్ను తనలోకి ఆహ్వానిస్తుంటే….నన్నింకా సగమంటూ పెట్టే పెనుకేకలు పాతాళంనుంచి వినబడుతున్న భావన…నా చూపంతా విశ్వైక్యం పైనే…ఆ పిలుపుల పిపీలికాల్ని పట్టించుకోలేనింక!!!
*****
Please follow and like us:

ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు. పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు చేయడం ఇష్టమైన వ్యాపకాలు.
