
చిత్రం-35
-గణేశ్వరరావు
కలలు నిజమౌతాయా? కల ఆధారంగా పరిశోధన జరిపి ఓ హత్య కేసుని ఛేదించ వచ్చా? దర్శకుడు తాను కన్న కల ‘118’ తో కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేశాడు. . సినిమావాళ్ళకి కలలు అవసరమేమో కానీ జనం పనులు మానేసి పగటి కలలు కంటూ కూర్చుంటారా? మహా అయితే దీపూ పాడిన ‘కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిలో తేలుతూ ఉంటున్నానే’ పాట వినమంటే వింటారు. కలలు మనస్తత్వంతో ముడిపెట్టడం సహజమే. ‘కలలు’ మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఫ్రాయిడియన్ సిద్ధాంతాలు ఉన్నాయి. చివరకి ‘కలలు’ ఫోటోగ్రఫీ రంగం లోకి కూడా చొరబడ్డాయి. ఈ అద్భుతమైన ఫోటో తీసినామె జోన్, స్పెయిన్ దేశానికి చెందింది. తన రంగంలో ప్రతిభావంతురాలుగా గుర్తింపు. ఆమె తీసిన ఈ ఫోటో Dreamlike Portrait Photography కి సరైన ఉదాహరణ. ఫోటోలో వున్న అమ్మాయిది కలలు మురిసి పులకరించే వయసు. కమ్మని ఊహలు కలలకు అందం అని ఆమెకు తెలుసులా వుంది. . కాని అందరి అమ్మాయిల్లా ఆమె అబ్బాయిల గురించి కలలు కనటం లేదు. అర్థం కాని విషయం ఇదే. నిద్ర పోతున్న ఆ అమ్మాయి కలలో తనని తాను చూస్తోందా? మీరు ఎప్పుడైనా మీ కలలో మిమ్మల్ని ఇలా చూసుకున్నారా? బహుశా ఫోటోగ్రాఫర్ జోన్ ఊహకు అది రూపకల్పన కావచ్చు. అయినా ఫోటో లోని వినూత్నతను మెచ్చుకునే సమయంలో ఇలాటి విషయాలతో తలలు పగలకోట్టుకోనక్కర లేదనుకుంటాను. కలలు కల్లలంటారు కనుక ఆమె కొచ్చిన కలలో ‘వాస్తవం’ పాలు ఎంత అని ప్రశ్నించనక్కర లేదు. దాని అందాన్ని చూసి మనం ఆశ్చర్యపోవాలి. వీలయితే ఆ ఫోటోను ఎలా తీసారో శోధించి తెలుసుకోవాలి.****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
