జ్ఞాపకాల సందడి-34

-డి.కామేశ్వరి 

 కావమ్మ  కబుర్లు -3 

 మా చిన్నతనంలో చదువులు చెపితే మీరు ఆశర్య పోతారు. ఇప్పటిలా ఎల్కేజీ పిల్లకి సయితం రెండుకేజీల బరువుండే బ్యాగుల  పుస్తకాలుండేవి కావు. ఇలా మూడేళ్ళ పిల్లని స్కూల్లో పడేయడం ఉండేదికాదు. అసలు ఐదో క్లాస్ వరకు ఇంట్లోనే చదువుకుని ఐదో క్లాసులో చేరేవారం. అప్పటి వరకు అక్షరాలు నేర్చుకోవడం, ‘అల, వల’ అంటూ తెలుగు వాచకం మొదలెట్టడం, అంకెలు నేర్చుకోవడం, కూడికలు,  తీసివేతలు అన్నీ ఇంట్లోనే. ఇంట్లో పిల్లల గోల భరించలేక, వీధిబడికి పంపేవారు కొందరు.

అసలు ఐదో ఏట గాని అక్షరాభ్యాసం జరిగేది కాదు. ఎనిమిది తొమ్మిదేళ్లు వస్తే ఐదో క్లాసు లో చేర్చడం. చాల స్కూల్స్ లో ఐదో తరగతి నించే స్కూల్  ప్రారంభం.  అంటే అప్పటికి క్షుణ్ణంగా తెలుగు వ్రాయడం, అంకెలు, ఎక్కాలు,  చిన్నలెక్కలు వచ్చి ఉండాలి. ఆరోజుల్లో పునాది ఉండేది.ఇప్పటిలా  వికసించని చిన్న చిన్న మెదళ్ళకి బండెడు పుస్తకాలు ఇచ్చి చదువంటూ  బెదరగొట్టకుండా. కాస్త కాస్త నేర్పుతూ వాళ్ళకి కాస్త జ్ఞానం వచ్చాక బడికి పంపేవారు.

వీధి బడులు  అంటే పాకబడి. ఒకరే టీచర్ అంతమంది పిల్లలకి చదువు చెప్పడం అంటే ఇప్పుడు ప్రైవేట్లు చెప్పినట్టు ఒక క్లాస్  పిల్లలని ఒకచోట కూర్చోపెట్టి,  అలా రెండుమూడు క్లాస్ పిల్లలని కూర్చోపెట్టి మాస్టారు  ఇటూ  అటూ తిరుగుతూ అన్ని క్లాస్ లకి పాఠాలు  చెప్పేవారు. గోల గోలగా ఉండేది . బెత్తం పుచ్చుకు మధ్య మధ్య ఒకటేస్తూ అల,వల, రేట్ , కాట్ అంటూ స్పెల్లింగులు చెపుతూ.  పిల్లలు వెనకే అరిచి చెప్పడం. అవి పాకబడి చదువులు. నిజం చెప్పాలంటే క్షణ్ణంగా లెక్కలు, నీతి శతకాలు  వల్లె వేయడం బాగా వచ్చేవి. మాకు రోజూ హోంవర్క్ ఏమిటో తెలుసా? అసలు మా దగ్గర పలక, బలపం, తెలుగువాచకం.. ఇవే ఉండేవి. పలకమీద ఒకవైపు చిన్నక్లాస్  అయితే నూరువరకు అంకెలు, రెండో వైపుగుణింతాలు.  ఆ తరువాత క్లాసుకి పదాలు.అలా క్లాస్ కి తగినట్టు హోంవర్క్ ఉండేది. పాఠాలు వల్లె వేస్తూ చూసి రాత  పద్యాలు  వారానికి ఒకటి నేర్చుకుని అప్పచెప్పాలి. ఎక్కాలు  ఎంత బాగా వచ్చేవంటే నిద్రలో లేపినా గడగడా చెప్పేసేట్టు. చూసి రాత  ఎంత మంచి అలవాటో  తెలుసా!

ఒక పాఠం చదువుతూ రాయడం అంటే ఆ పాఠం  కంఠతా వచ్చేసినట్టే .ఇప్పటి పిల్లలకి చూచి రాత  రాసే టైం, ఎక్కాలు  వల్లె వేసే టైం ఎక్కడుంది? ఆరోజుల్లో ఏది నేర్చుకున్నా మూలాలనించి తోమేవారు. వారానికి ఒక పద్యం కంఠతా రావాలి. ఇంక పరీక్షలు అంటే పవర్ పెన్ను అక్కరలేదు. పలక బలపం ఉంటే చాలు. మేష్టారు బోర్డు మీద  లెక్క వేయడం పలక మీద  ఎక్కించుకోవడం, చేయడం. తప్పయితే సున్నా, ఇంకోలెక్క . బోర్డు మీద ప్రశ్న రాయడం, పలకమీద జవాబు. ఏ రోజు పరీక్ష మార్కులు ఆరోజే తెలిసిపోతాయి. ఎంత హాయి! మన సత్తా ఏమిటో ఆరోజే తెలిసిపోయి ఇంట్లో దెబ్బలు తినేస్తే అయిపోయేది. చిన్నచిన్న క్లాసులు  ఇంతే. అలాంటి చదువులు చదివే జడ్జీలు, డాక్టర్లు, ఇంజినీర్లు అయి రాణించారు మనవాళ్ళు .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.