బతుకు చిత్రం-22

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: పీరీల పండుగలో జరిగిన గొడవకు సైదులు ను రౌడీమూక బాగా కొట్టడం తో పది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకుంది. దేవత సలహా పై తన సంసారాన్ని బాగు చేసుకునే అవకాశంగా మలుచుకుంది. ఈర్లచ్చిమి కి కొడుకు కాపురం కుదుట పడడం తో కొంత ఊరట పొందినట్టయింది. తరువాత …

***

          జాజులమ్మ ఏడుస్తూనే జరిగిన సంగతంతా చెప్పింది .

          ఈర్లచ్చిమి కి కోపం వచ్చి, వాడు చేసిన పని సరైనదే అయినప్పటికి నువ్వెందుకు ఆల్లకు మన్నింపు అడిగినావ్? జులాయిలకే ఎందుకు వత్తాసు పలికినావ్? ఇంకోతాప నీ జోలికి రాకుండుండాలనే గదా! వాడు కొట్టింది. మీదికెల్లి తాగానోన్ని పట్టుకొని తాగిన మైకంల అట్ల చేసిండని ఎట్లంటివి? పోక పోక ఇన్నోద్ధులకు ఇద్దరు గూడి పోతాండ్రు, దేవుదాని ..సంబరపడితే ,బజార్ల వాని మానం పోయే పని జేత్తివి?’’కంచే చేను మేస్తే కావలి వాడు ఏమిజేసు ‘’అన్నట్టే నువ్వే అబద్ధం జెప్పి వాణ్ని ఆగం జేత్తివి.గిన్తన్న తెలివి లేకపాయే అని …నానా రకాలుగా కోప్పడింది.

          రాత్రి అవుతున్నా సైధులు ఇంటికి చెరక పోవడం తో ఇద్దరూ కంగారు పడుతూ ఎదురు చూడసాగారు.

***

          అక్కడ మందు దుకాణం లో ఇంతకు ముందు గొడవ చేసిన వాళ్ళు మళ్ళీ సైదులు దగ్గరకు వచ్చి ,

          అన్నా !నీకూ , మాకు లొల్లి ఎందుకు గని ,రోజు పోద్దుగూకినాకా  తాగి ముడుసుకొని పండేటోనివి నీకు ‘’మొరతోనికి మొగిలిపువ్వు తరిక ‘’జాజులమ్మ ఎందుకే ?నీకు దినమోగరం పొట్ట వలిగేటట్టు పోపిత్తం గని జాజులమ్మను మా తానకు పంపరాదే !అన్నాడు ఒగడు ఒడిసిన గ్లాసు లో మళ్ళీ మందు పోస్తూ.

          వాడి వెకిలి మాటలకు సైదులు ,వాడు పోసిన మందు వాని మొకాన్నే కొట్టి విసురుగా లేచి వస్తుండగా ..

          అరేయ్ !ఆడు ఇయ్యాల పానాలతోటి ఇంటికి పోవద్ద్రా !అని మిగతా వారితో అనగానే, అందరూ కలిసి సైదులును బయటికి తీసుకు వచ్చి బాగా కొట్టి పడేశారు. తాగిన మత్తులో వారిని సైదులు ఏమీ చేయలేక పోయాడు. మూలుగుతూ పడిఉన్న కొడుకును రాజయ్య చూసి వేరే వాల్ల సాయంతో ఇంటికి చేర్చాడు.

          జరిగిన సంగతి అక్కడ చూసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్న ఈర్లచ్చిమి వాళ్ళపై శాపనార్థాలు పెట్టింది.

          జాజులమ్మ ఏడుస్తూ భర్తను చేరింది .

          నీ వల్లనే వానికిన్ని కట్టాలు .ఇన్నోద్దులు పని చేసచ్చి ఆడు ,నేనూ కలిసి ఇంత సుక్కేసుకొని హాయిగా పందేతోల్లం.నడుమిట్ల నువ్వచ్చిన సందే వానికి మనశాంతి లేకున్తింది అనుకుంటూ ..రాజయ్య తిట్ల దండకం అందుకున్నాడు.

          చోద్యం చూస్తూ ఇరుగు పొరుగు అందరూ వచ్చి చేరారు. వాళ్ళలో దేవత కూడా ఉంది.ఆమె త్వరగా వెళ్ళి తన సామాగ్రి తో వచ్చి గాయాలను తుడిచి కట్టు కట్టి ఆయింట్ మేంట్ ఇచ్చింది.

          మీరు అనవసరంగా గొడవ చేసి జాజులును తిట్టడం పద్ధతి గాదు.తల్లి లేని ఆ పిల్లను మీరే తిడుతూ ఉంతె ,పాపం !ఎవరూ లేని ఆ పిల్ల ఏమైపోతుంది? కొడుకు మీది పావురంతో కండ్లు మూసుక పోయి నువ్వు కూడా తిట్టడం బాగా లేదు లచ్చిమి.సైదులుకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు.వారం,పది రోజుల పాటు మందు జోలికి పోకుండా,నొప్పులు తగ్గడానికి నేను ఇచ్చిన ఈ మందులు వాడండి.ఇదీ ఒకందుకు మంచికే జరిగింది అనుకోండి అంటూ అక్కడున్న వారందరినీ పంపించి వేసింది.

          సైదులును మంచం మీదకు చేర్చి తానూ మళ్ళీ రేపు వచ్చి చూస్తానని చెప్పి వెళ్లే ముందు జాజులమ్మను ,ఈర్లచ్చిమిని చాటుగా పిలుచుకొని సంసారం బాగు చేసుకునే మార్గం చెప్పింది.

          అంతా విన్న ఇద్దరూ కొద్ది ఆశ కలుగుతుండగా ఊరటపడ్డారు.

***

          మరుసటి రోజు నుండి జాజులమ్మ పూర్తిగా సైదులును కనిపెట్టు కుంటూ ఉండి పోయింది. దేవత వచ్చి బలమైన ఆహారం పెట్టమని చెప్పి వెళ్ళడం తో ఈర్లచ్చిమి బొమ్మ చేపలు తెచ్చి చారు చేసింది. దెబ్బల నొప్పులతో ఉన్న భర్తకు తానే తిని పించింది. చివరగా ముల్లులాంటిదేదో గొంతులో గుచ్చుకున్నట్టుగా అయి సైదులు మొత్తం వాంతి చేసుకోవడం తో అక్కడే కూర్చుని ఇదంతా చూస్తున్న రాజయ్య కొట్టి మందు వేట్టినట్టే ఉన్నదీ నీ పని అని ఎకసెక్కాలాడాడు.

          జాజులమ్మ ఇదంతా పట్టించుకోకుండానే మొత్తం శుబ్రం చేసింది. ఈర్లచ్చిమి చేపకు దిష్టి తగిలిందేమోనని ఉప్పు తో దిష్టి తీసింది. రాజయ్య మాత్రం ఇద్దరినీ కలిపి తిట్టసాగాడు. 

          ఈరల్చ్చిమికి పది రోజుల పాటు భర్తను తీసుకొని ఎటైనా వెళ్లాలని నిర్ణయించు కుంది. అందుకు తగినట్టుగానే సేంద్రీయ ఎరువులతో పంటలను పండించు విధానం పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు తెలుసుకొని తమ ఇద్దరి పేర్లూ నమోదు చేయించింది.
రాజయ్య’’ పని లేని మంగలాయన పిలిచి మరీ తలగోరిగినట్టు ‘’ వ్యవసాయం అంతంత మాత్రమె ఉన్న తమకు ఇది అవసరమాని గునుకుంటూనే ఈర్లఛ్చిమి తో బయలు దేరాడు.

          ఈర్లచ్చిమి ఆలోచన జాజులమ్మకు అర్థమై మౌనంగా ఉండి పోయింది. వేకువ జామునే లేవడం ఇల్లంతా శుభ్రం చేసి సైదులుకు అన్నీ సమయానికి సమకూర్చటం అలవాటు చేసుకుంది.

          అంతా బాగానే గడుస్తున్నా రాత్రయితే మాత్రం సైదులుకు మందు కోసం మనసు పీకుతూనే ఉంది. అది మరిపించడానికి ధైర్యం చేసి దేవత చెప్పినట్టుగానే తానే ఖరీదైన మందును తెప్పించింది. కానీ ఆమెకు మనసు ఒప్పుకోవడం లేదు. మానిపించడానికి బదులుగా అలవాటును పెంచుతున్నట్టుగా మదనపడ సాగింది.

          ఆ రాత్రి అతనికి మద్యం లో లేని మాధుర్యం సాంగత్యం లో ఉందని చూపించాలని అనుకుంది. ఆప్యాయంగా దగ్గరికి చేర్చుకుంది. ప్రేమగా అతడిని వశపరుచుకుంది.
ఇద్దరిలోనూ ఎంతో సంతృప్తి మిగిలింది. ఆ క్షణం తరువాత అతడు హాయిగా నిద్ర పోవడం గమనించింది.

          ఇలా అతడు మద్యం కోసం వెంపర్లాడడం మాని వేసేలా పదిరోజులు కష్టించింది.
ఆమె ప్రయత్నం వృధా కాలేదు. పదిరోజులలోనే పూర్తిగా కోలుకున్నాడు. శారీరకంగా కూడా కాస్త బలపడ్డాడు.

          దేవత మధ్య మధ్యలో వచ్చి చూసి వెళుతూ మంచి మందులు ఇచ్చింది.
ఈర్లచ్చిమి శిక్షణ పూర్తి చేసుకొని వచ్చేసింది. ఈ పది రోజులలో కొడుకు ,కోడలు లో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషించింది. దేవుడు తన మోర ఆలకించి ఇద్దరినీ ఒకటి చేశాడని సంబరపడింది. దేవత చెప్పినట్టుగానే ఇదీ ఒకందుకు మంచికే జరిగిందని అనుకుంది.

          బుద్ధిగా పనికి వెళ్ళి రావడం,సాయంత్రాలు కొడుకు ఇల్లు కదలక పోవడం రాజయ్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తనకు ఏ మందో మాకో పెట్టి ఉంటుందని భ్రమ పడసాగాడు.

          కొడుకును అంతలా కొట్టిన వారిని ఊరికే వదలకూడదని నిర్ణయించుకొని పంచాయితీ పెద్దలను కలిసి విషయం వివరించాడు. నాకు న్యాయం చేయకపోతే పోలీస్ కంప్లయింట్ ఇస్తానని చెప్పి వచ్చాడు. మరునాడు పెద్దలను, అందరినీ పిలిపించి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టారు.

          ఈర్లచ్చిమి ,జాజులమ్మ కూడా వెళ్ళారు. చేరిన వారు ఆ రోజు జాజులమ్మ క్షమాపణ చెప్పిన తరువాత మళ్ళీ ఈ పంచాయితి ఏమిటన్నట్టుగా గుస గుసలు పెట్టసాగారు.
పెద్ధమనుషుల్లో ఒకరు రాజయ్య వైపు ఏమిటి చెప్పమన్నట్టుగా చూశారు.

          రాజయ్య …

          అయ్యా !నా కొడుకు ,కోడలు జాతరకని వెళుతుంటే ఈ రౌడీ మూక మా వాళ్ళను అల్లరి పెట్టడమే కాక , క్షమాపణ చెప్పించుకొని కూడా మళ్ళీ తాగి ఉన్నాడని కూడా చూడకుండా బాగా కొట్టి పది రోజుల వరకు లేవకుంట చేశారు. ఇదేమి న్యాయం? పానాలు పోతే దిక్కెవ్వరు ? అని ప్రశ్నించాడు.

          మీ సమాధానం ఏమిటన్నట్టుగా రౌడీ మూక వైపు తిరుగగా ..

          అయ్యా …!జరిగిన దానికి ఆ రోజే క్షమాపణ లు చెప్పడం అంతా అయిపోయింది . అన్నారు జారుకుంటూ.

          సైదులు కల్పించుకొని ,నేను ఆ రోజు కొట్టిన దానికి నా భార్య తప్పిందని అడిగిన తరువాత కూడా వీళ్ళు మల్లి నన్ను కొట్టడం ఏమిటని ? పైగా నా భార్యను తప్పుగా కూడా మాట్లాడారు, అది గనుక ఇప్పుడు ఒప్పుకోకుంటే నేను ఊరుకునేదే లేదు అన్నాడు మల్లి ఆవేశంగా.

          అందరూ సైదులు వంక ఇన్నాళ్ళూ ఎవరి గురించి పట్టించుకోని వాడు, ఎవరి మీదా అరవని వాడు ఈ రోజు భార్యను అవమానించడం గురించి పంచాయితీలో మాట్లాడడం ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయారు.

          పెద్దలు రౌడీ మూక వైపున తిరిగి దీనికి మీ సంజాయిషీ ఏమిటని అడుగగా ..

          బోనులో చిక్కిన ఎలుకల్లా తప్పు ఒప్పుకొని మా పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని నిజానికి మేము కూడా తాగే ఉన్నామని తలవంచి చెప్పుకు పోయారు.

          రాజయ్య కల్పించుకొని దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మీ తరిక. నా కొడుక్కు, కోడలు కు కూడా మన్నించమని అడగండి. అంతేకాక మరే ఆడ కూతురు జోలికి పోమని ప్రమాణం చేయండి అని గట్టిగా అడిగాడు.

          ఈర్లచ్చిమి దండుగ కూడా కట్టవలసిన్దేనని అడగడంతో అక్కడున్న వారందరూ రాజయ్యకు ,ఈర్లచ్చిమికె వత్తాసు పలకడం తో పెద్దమనుషులు అందరినీ సముదాయించారు. అందరి అభిప్రాయం చూశారు కదా! మీరు తప్పు ఒప్పుకొని 5౦౦౦/దండుగ కట్టమని తీర్పు చెప్పారు.

          రౌడీ మూక గత్యంతరం లేక ఒప్పుకొని వారం రోజుల గడువు కోరి బయట పడ్డారు.

***

          జాజులమ్మ కు ఆ రోజు పండుగలా అనిపించింది .సైదులు తన గురించి పది మందిలో మాట్లాడడం తనకు కూడా తనపై అనురాగం ఉందని మురిసిపోయింది.
ఈర్లచ్చిమి ఆనందానికి కూడా అవధులు లేవు. తన కొడుకులో వచ్చిన బాధ్యతా యుతమైన మార్పుకు సంతోషించింది.

          ఆ మరునాటి నుండి జాజులమ్మ కూడా సైదులు తో పనికి పోవడం మొదలు పెట్టింది. ఇద్దరూ కలిసి వెళ్ళడం, రావడం ఇంతకూ ముందు కంటే చాలా మెరుగ్గా అనిపించింది.

          ఇలా కొద్ది రోజుల తరువాత దేవత ఒక మంచి వార్త ను చెప్పింది.
జాజులమ్మ తల్లి కాబోతున్నదని. వార్త వినగానే ఈర్లచ్సిమి కి ఏనుగు ఎక్కినంత సంతోషం కలిగింది.

          జాజులమ్మను ఆనాటి నుండి పని మానిపించి చాలా జాగ్రత్తగా చూసుకోసాగింది.
సైదులుకు ,రాజయ్యకు కూడా వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడనే ఆనందం నిలకడ గా ఉండనీయడం లేదు.

ముఖ్యంగా తను పని చేసే చోట తనను మనిషిగా ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఆదరించడంతో పొంగి పోసగాడు. పీరయ్య కూతురును చూడడానికి వచ్చి ఈర్లచ్చిమి ఉండమనడం తో ఇక్కడే ఉండి పోయాడు.

          దేవత తానూ దగ్గరుండి ప్రభుత్వాసుపత్రిలోనే చూపిస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా చూసుకోసాగింది. నెలలు గడిచి అయిదవ నెల రాగా ఈర్లచ్చిమి బంధువులను, తెలిసిన వారందరినీ పిలిచి శ్రీమంతం వేడుకలా చేసింది.

రామసక్కని సీత లాంటి మా జాజికొమ్మ ….
పిందేసేనోయంమా ……………
పిందే కాయయ్యేదాకా ..
కాయపండే దాకా కాపు కాయరోయంమా …..
అని పాటలు పాడి హారతి పట్టి దీవేనలిచ్చారు. జాజులమ్మ ఆనందభాష్పాలు రాల్చింది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.