
అనుసృజన
మీరా పదావళి (తరువాయి గీతాలు)
అనువాదం: ఆర్.శాంతసుందరి
19. బరసే బుందియా సావన్ కీ
సావన్ కీ మన్ భావన్ కీ
(వాన చినుకులు కురుస్తున్నాయి
వర్షాకాలం మనసుకి ఎంత ఆహ్లాదకరం !)
సావన్ మే ఉమగ్యో మేరో మన్
భనక్ సునీ హరి ఆవన్ కీ
ఉమడ్ ఘుమడ్ చహు దిసా సే ఆయో
దామిని దమకే ఝరలావన్ కీ
( వర్షాకాలంలో నా మనసు ఉప్పొంగుతుంది
హరి వచ్చే సవ్వడి విన్నాను మరి
కారుమేఘాలు నలుదిశల నుంచీ కమ్ముకొస్తున్నాయి
ఉరుములు మెరుపులతో జడివాన కురిసే సూచనలే ఇవి)
నన్హీ నన్హీ బూందన్ మేహా బరసే
శీతల్ పవన్ సుహావన్ కీ
మీరా కే ప్రభు గిరిధర్ నాగర్
ఆనంద్ మంగల్ గావన్ కీ
( మేఘాలు చిరుజల్లులు కురిపిస్తున్నాయి
చల్లని గాలి హాయి గొలుపుతోంది
మీరా ప్రభు గిరిధర్ నాగర్
ఆనందంగా పాడుకోవలసిన రుతువు కదా ఇది!)
***
20. చలా వాహి దేస్ చలా వాహి దేస్
(పద ఆ ప్రదేశానికి వెళ్దాం)
కహో కుసుంభీ సారీ రంగావా కహో తో భగవా భేస్
(చెప్పు, ఎర్రపూల చీరె కట్టుకోనా, కాషాయ వస్త్రం ధరించనా?)
కహో తో మోతియన్ మాంగ్ భరావా కహో తో ఛిటకావా కేస్
( పాపిట్లో ముత్యాలు అలంకరించుకోమంటావా, కురులను ముడుచుకోకుండా విరబోసుకోనా?)
మీరా కే ప్రభు గిరిధర్ నాగర్ ,సుణజ్యో బిరద్ నరేస్
( మీరా ప్రభు ఓ గిరిధరుడా , వ్రజస్థలి మహారాజా, నా మాట కాస్త వినిపించుకోవా?)
***
1974 లో విడుదలైన ఈ మీరా భజనల గురించి లతా మంగేష్కర్ ఏమందో చూడండి:
‘నా సోదరుడు బాణీలు కట్టిన ఈ క్యాసెట్లోని ఒక్కొక్క పాటా నాకు అత్యంత ప్రియమైనది. అసలు మీరా భజనలంటే నాకు అమితమైన ఇష్టం. చలా వాహి దేస్ రికార్డ్ చేసినప్పుడు నా ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. నిలబడటమే కష్టంగా ఉన్న పరిస్థితిలో దీన్ని రికార్డ్ చేశాము. ఈ పాటలని రికార్డ్ చేసే సమయంలో స్టూడియోలో పవిత్రమైన వాతావరణం ఉండేట్టు శ్రద్ధ తీసుకున్నాం.ఈ క్యాసెట్ పూర్తయ్యే వరకూ నేను కాని, నా సోదరుడు కాని సినిమా పాటలేవీ రికార్డ్ చెయ్యలేదు.’
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
