జ్ఞాపకాల సందడి-41

-డి.కామేశ్వరి 

 కావమ్మ కబుర్లు -15

          కరెంట్ అంటే ఆ రోజుల్లో మాకు తెలిసిన అర్థం దీపాలు దాంతో వెలుగుతాయని. మరి ఈ నీళ్లలో కరంట్ ఏమిటో అంతుబట్టక పోయినా, కారు ఉన్న పడవ ఒక పక్కకి లాగేయడం, అందరు భయపడి కరెంట్ లాగేస్తుంది అని అరవడం… ఇదంతా ఏమిటో తెలియక భయపడిపోయాం పిల్లలందరం. పదేళ్ల పిల్లకి ఏం తెలుస్తాయి ఈ విషయాలు?  ఇప్పటిలా ఏం ఎక్సపోజర్ ఉండేది ఆ రోజుల్లో?  నీళ్ళల్లో  కూడా కరెంట్ పవర్ ఉంటుందని ఎలా తెలుస్తుంది?  ఇప్పటి పిల్లలకి టీవి, ఫోన్లు వచ్చాక ప్రతీ విషయం అరచేతిలోనే.  రెండేళ్ళ పిల్లాడు టకాటకా నొక్కేసి చూసి ఆనందపడిపోతాడు.  మా నాన్న ధర్మమాని ఎన్నో గుళ్ళు దర్శనాలు అయ్యేవి. ఆయన డివిజినల్ ఇంజినీర్ గా ఉండగా కేరళ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ అడుగడుగునా గుడులే.  అప్పుడు  సౌత్ అంతా  ఒకటే మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది. అంటే నాలుగు రాష్ట్రాలూ  ఒకే పాలనలో ఉండేవి. ఇండియా మొత్తం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్  నాలుగు జోన్లు అక్కడవుండే ఊర్లన్నీ ఈ పరిధిలో ఉండేవి. అలా  కేరళ వేలం నాన్న భారత్ పూష బ్రిట్జ్ పని చూస్తున్నపుడు ఆ ఊరి పేర్లు నాకేం గుర్తు లేవు. అసలు గుర్తున్నా నోరు తిరగదు. అపుడు నేనేమీ చిన్న పిల్లని కాదు. 1950 అంటే పదిహేనేళ్ళు. స్కూలు ఫైనల్ పరీక్షలు అయిపోయి, పెళ్లి ఇంకా కాక ఉన్న రోజులు . కేరళ అపుడు ఎటు చూసినా పచ్చదనమే. ఇప్పుడు ఆ మధ్య ఆడపడుచు మనవరాలి పెళ్ళికి కొచ్చిన్ వెడితే అంత పచ్చదనం లేదు. మిగతా ఊర్ల కంటే చాల పచ్చదనమున్నా డెభ్భై  ఏళ్ళ క్రితం ఉన్నట్టు ఎలా ఉంటుంది? లుంగీలతో ఆడవారు గమ్మత్తుగా కనిపించారు.  ఒక శంకరాచార్యులవారు జన్మించారు. ఆ ఊరు  ఒక్కటే చెప్పగలను. మిగతా ఏవీ నేను చెప్పలేను.  లంకంత బంగళా, చుట్టూ చెట్లు. నేను, తమ్ముడు మాత్రం వెళ్ళాం. అక్క పెళ్లి  అయింది. అన్నయ్య మద్రాస్ గిండీలో ఇంజనీరింగ్ చదివేవాడు. చెల్లెళ్ళిద్దరినీ రామచంద్రాపురంలో చదువులకి అత్తయ్యతో వదిలేసి వెళ్ళాం. అదే మొదటిసారి మద్రాస్ చూడడం.  రామచంద్రపురంలో పెరిగిన అమ్మాయికి మద్రాస్ పట్టణం అద్భుతం. పనివారు అరవవారుండేవారు. అమ్మకి అరవం బాగావచ్చు కనక ఇబ్బంది తెలియలేదు. నాన్న ఉద్యోగ ఆరంభం మద్రాస్ పెరంబూరు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తో ఆరంభమయి రెండేళ్లు గడిచాక హైవేస్ కి మారారుట. అందుకు అమ్మకి తమిళ్ బాగా వచ్చు. మా నాన్న భోజన రుచిలో తమిళ్ వంటలు బాగా కనిపిస్తాయి. అలా చిన్నప్పుడు చాలా ఊళ్ళు, గుళ్ళు కవర్ చేశాను.

          మేము చిన్నప్పుడు చాలా బాగా పెరిగాం . అంటే మా ఇంట్లో సోఫాలు, కుర్చీలు, ఫ్రిడ్జిలు రేడియోలు, డైనింగ్ టేబుల్ అవున్నాయి అని కాదు.  ఆ రోజుల్లో అవి గొప్పవాళ్లు, దొరలూ,  జమీందారులు ఇళ్లల్లో ఉండేవి. మాకు సయిజ్ వారి నవారు మంచాలుండేవి. సాయంత్రమయ్యేసరికి మంచాల మీద  పరుపులు వేసి, పక్కలు వేసేవారు బంట్రోతులు. దీపాలు శుభ్రంగా తుడిచి ప్రతీ గదిలో చూరు నుంచి (పెంకుటిళ్ళు కదా) వేలాడే ఊచలకి తగిలించేవారు. మా ఇంట్లో భోజనాల గదిలో పీటలుండేవి. భోజనమవగానే ఓ మూల ఎత్తి పెడితే ఆ హాలంతా ఖాళీ. ఎవరైనా ఆడవాళ్లు వస్తే చాపల మీద కూర్చునేవారు. పట్టుమని మా ఇంట్లో నాలుగు కుర్చీలు ఉండేవో లేవో… అందులో రెండు నాన్న గదిలోనే ఉండేవి. వాటినిండా ఫైల్స్, కాగితాలో, పుస్తకాలో దొర్లేవి. అంచేత కింద కూర్చునేందుకు మొహమాటం లేదు.  అందరూ అలాగే ఉండేవారు కాబట్టి. ఇల్లంతా ఉదయం పక్కలెత్తేస్తే హాలు ఖాళీ.  భోజనాలవగానే, భోజనాల గది  ఖాళీ. ఎంత మంది వచ్చినా ఇల్లు ఇరుకు లేదు ఎపుడూ. పెట్టెలు, పరుపులకి ఓ గది.   పిల్లల పుస్తకాలకి ఒక్కొక్కళ్ళకి ఓ అర,  బట్టలకి ఓ అలమర ఉండేవి. ఇంట్లో మనుషులు ఉండేవారు కానీ సామనుండేది కాదు. అంచేతే ఎంతమందొచ్చినా ఇల్లు ఇరుకు కాదు.

          ఇప్పడు ఇంటినిండా సామాను , మనుషులకంటే  ఫర్నిచర్ మీద మక్కువ ఎక్కవై పోవడంతో సర్దుబాటు తక్కువయి పోయింది.

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.