షర్మిలాం “తరంగం”

నేనే ఇండియన్ !!

-షర్మిల 

          భారతీయత అంటే భిన్నత్వంలో ఏకత్వం అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువు కునేదాన్ని!

          నేను తెలుగు కుటుంబానికి చెందినా, పుట్టింది తమిళనాడులో తాంబరం ఎయిర్ ఫోర్స్ హాస్పటల్ లో.

          వత్తుగా ఉంగరాలు తిరిగిన జుట్టు వున్న నన్ను చూసి వైజాగ్ లో మళయాళీ కుటుంబం నన్ను మీరు మళయాళీలా అని అడిగారు.

          పక్క పోర్షన్ లో వున్న బెంగాలీ ఆంటీ షర్మిల అనే నా పేరు చూసి మా బెంగాలీ పేరు ఇది అని మురిసిపోయేది.

          మన దేశం డబ్బుకు పేదదే కానీ, ప్రేమకి పేద కాదు. దేశంలో ఏ మూలకి వెళ్ళినా ప్రేమ పుష్కలంగా దొరుకుతుంది. “ఎవరికి వారే యమునా తీరే ” అన్నట్టు వుండరు. మన సొంత విషయాలు ఆరా తీస్తారు… వారి గోడు వెళ్ళబోసుకుంటారు !

          ఈ మధ్య రెండు ప్రయాణాలు నన్ను నా దేశానికి మరింత దగ్గర చేశాయి. దక్షిణం నుంచి ఆసేతు హిమాచలం వరకూ చేసిన ఈ ప్రయాణాలు నాలో నింపిన ఆనందం అంతా ఇంతా కాదు.

          తిరుపతి శ్రీవారి సేవకు వెళ్ళినప్పుడు అక్కడకి వచ్చిన సేవకులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చారు. స్వచ్చమైన పల్లె యాసలో పలకరించి అంతకన్నా స్వచ్చమైన స్నేహాన్ని రుచి చూపించారు. వాళ్ళెవరో ముక్కు మొహం తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళు అక్కా అనో ఆంటీ అనో ఫోనుల్లో పలకరిస్తారు.

          అదే నా దేశం గొప్పదనం అనిపిస్తుంది.

          హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు ధర్మశాల ఎయిర్ పోర్ట్ నుంచి మా మజిలీకి చేర్చిన డ్రైవర్ ఇప్పుడు అనిల్ భయ్యాగా ఫోన్ కాంటాక్ట్స్ లోకి చేరాడు. అక్కడ అన్ని ప్రదేశాలూ తనే తిప్పి చూపించాడు. నేను పంజాబ్ చేరినాక కూడా జాగ్రత్తగా చేరానా లేదా అని అనిల్ భయ్యా వాకబు చేసి కనుక్కున్నాడు.

          ధర్మశాల నుంచి పఠాన్ కోట్ , పఠాన్ కోట్ నుంచి అమృత్సర్ వచ్చే తోవలో ఒకామె నువ్వు ఆంధ్రానా, పంజాబీలా వున్నావు అంది. ఇంకో విశేషం అసేతు హిమాచలం మన తెలుగు హీరోల సినిమాలు తెగ చూస్తున్నారు.

అనిల్ భయ్యాలాగే  అమృత్సర్ లో గుర్మీత్ సింగ్ !

ఏమైనా ఒకటే అనిపించింది, ఎక్కడా లేని దగ్గరితనం దొరికేది ఇక్కడేనని! నేను తమిళా, తెలుగా, మళయాళీనా లేక పంజాబీనా!

ఇంతకీ నేనెవరంటే ఇండియన్ !!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.