జీవితం అంచున -1 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

 

PROLOGUE

 Life is taking up challenges

 Life is achieving goals

Life is being inspiration to others

And age should not be a barrier for anything….

          అనగనగా అప్పట్లో పంథొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఓ అమ్మాయి తెల్లని కోటు, చల్లని నవ్వుతో రోగుల గాయాలు మాన్పాలని కంకణం కట్టుకుని EAMCETలో మంచి ర్యాంకు సాధించింది. కాని పరిస్థితుల కారణంగా వేవిళ్ల బాధతో కౌన్సిలింగ్ కి కూడా వెళ్లలేక పోయింది.

          ఇరవయ్యో శతాబ్దంలో కొచ్చేసరికి ఆ అమ్మాయి ఆఫీసు మార్గ మధ్యంలో జూబిలీ బస్ స్టేషన్లో రోజూ చూసే “స్వీకార్..ఉపకార్” లో మానసిక వికలాంగులను చూసి చలించి ఉద్యోగ విరమణానంతరం ఏదైనా స్వచ్ఛంధ సేవ చేయాలని తీర్మానించుకుంది. మళ్ళీ పరిస్థితుల కారణంగా విరమణకు పూర్వమే స్వచ్చంధ పదవీ విరమణ చేసి దేశాంతరం వలస వెళ్ళిపోయింది.

విధి వంచితురాలు…

అన్నీ అనుకోటాల దగ్గర ఆగిపోయాయే తప్ప ఏదీ కార్యాచరణలోకి రాలేదు.

          కానీ ఏదో చేయాలన్న తపన మాత్రం ఆమెలో చెక్కు చెదర లేదు. ఉవ్విళ్ళూరే మనసు, వయసుని లెక్కచేయక ఏదో చేయాలని భ్రమపడుతూనే వుంది.

          ఒక్క జీవితంలో పైగా మూడొంతులు ముగిసిన జీవితంలో అన్నీ సాధ్యం కావన్న గ్రహింపే లేదు పాపం ఆమెకు.

          డిటర్మినేషన్ వుంటే సాధ్యం కానిదేదీ వుండదన్న ఓ గట్టి నమ్మకం.

          అదిగో సరిగ్గా అప్పుడే వాళ్ళమ్మాయి ఇలా అంది…

          “మమ్మీ, ఈ దేశ పౌరసత్వం తీసుకున్న ప్రతీ వ్యక్తి చేసే తొలి కోర్సులో ఇక్కడి ప్రభుత్వం ఎనభై శాతం రాయితీ ఇస్తుంది. నువ్వు ఏదైయినా చేయాలనుకుంటే చేయి… నీకు ఇది వరకు అవకాశం లేక చేయనివి, అవకాశం వచ్చీ కూడా సాధించనివి, నువ్వు మెరుగు పరుచు కోవాలనుకున్న అభిరుచులు, ఏదయినా మున్ముందు కెరీర్ గా ఎంచు కోవాలనుకున్నా సరే…నీ ఇష్టం”

          అమ్మాయి మాటలు విన్నప్పటినుండీ ఆమెలో ఒకటే అలజడి…!

* * *

True… It is a beautiful thing when a career and passion come together.

ఏం చేయను..? ఈ వయసులో ఏం చేయగలను..?

Where there is a will, there is a way.

          నా ఏ ప్యాషన్ ను కెరీర్ గా మలుచుకోవచ్చు… థౌజండ్ డాలర్ క్వశ్చన్ !

          “అసలు ఏం చేయొచ్చు…?” ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్ననేను అమ్మాయిని ఆసక్తిగా అడిగాను.

          “ఫోటోగ్రఫీ, కంప్యూటర్ కోర్సు, ఇంటర్నెట్, అకౌంటింగ్, లైబ్రేరియన్ కోర్సు, టీచర్ ట్రైనింగ్, బ్యూటిషియన్ కోర్సు, చెఫ్, హెయిర్ డ్రెస్సింగ్, నెయిల్ డిజైనింగ్, బేకింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, వాటర్ కలరింగ్, జ్యువలరీ మేకింగ్, సూఇంగ్ & డ్రెస్ మేకింగ్, క్రియేటివ్ రైటింగ్, బేబీ కేర్, లర్నింగ్ న్యూ లాంగ్వేజ్ జపనీస్/చైనీస్, నర్సింగ్..” ఇంకా ఏవేవో చెబుతూనే వుంది.

          ‘నర్సింగ్’ అనే పదం నా మనసులోలకానికి తట్టుకోగానే చెవులు చెవిటివయి పోయాయి. ఆ పైన ఏమీ వినిపించ లేదు.

          మెదడు నెమరువేతతో కళ్ళ ముందు పాత సినిమా ప్లే అవుతోంది.

          అప్పట్లో అడుగంటి పోయిన ఆశ…

          తప్పనిసరి పరిస్థితులలో దేశాంతరం వెళ్ళిపోయినప్పుడు నీరుగారి పోయిన కోరిక…

పిల్లలు, ఆపై పిల్లల పిల్లలు… 

          జీవిత చరమాంకం వరకూ వదలని పాశాల బంధనంలో ఇంటి సేవ తరువాతే ప్రజా సేవ అని సరిపుచ్చుకుంటూ సాగిపోతూ తెలియని అసంతృప్తితో డస్సిపోయిన ఆకాంక్ష…

          ఆశ… కోరిక… ఆకాంక్ష… చిన్నగా రెపరెపలాడుతుండగా “నర్సింగ్ చేస్తే ఎలా వుంటుంది…” సందిగ్ధంగా నసిగాను.

          “ఏమిటి అమ్మా, ఇరవైలో చేయాల్సిన కోర్సు అరవైలో చేస్తానంటావు… దానికి ఫిజికల్ స్ట్రెంత్, స్టామినా కావాలమ్మా… అది ఈ వయసులో చేయాల్సింది కాదు”

          నా ఛాయిస్ ని కొట్టి పడేసింది అమ్మాయి.

          జీవితం అసలు మొదలయ్యేదే యాభైలో అంటారే ఇక్కడ..?

          “ఈ వయసులో ఇంటెడు పనీ చేస్తున్నా.. వంట చేస్తున్నా.. పాపను చూసు కుంటున్నా… నీకన్నా నేర్పుగా, ఓర్పుగా ఇల్లంతా చక్కదిద్దుతున్నా… అంతకన్నా ఎక్కువ శ్రమ వుంటుందా..”

          అమ్మాయి వద్దన్నదన్న ఉక్రోషంలో అనేసానే కాని అలా అనకుండా వుండాల్సిందని తర్వాత చాలా బాధ పడ్డాను.

          “రోగుల పక్కలు మార్చటం, స్నానం చేయించటం, బట్టలు వేయటమే కాకుండా కాలకృత్యాలన్నీ చేయించటం కూడా వుంటాయి. వాళ్ళ విరోచనాలు, వాంతులు అన్నీ భరించాలి. పైగా షిఫ్ట్ లు వుంటాయి…”

          మరోసారి ఆలోచించుకోమని సూచించింది అమ్మాయి.

          అమ్మ నడిపిన కోడి మాంసం కొట్టులో వేడి నీళ్ళలో ముంచిన కోడి ఈకల వాసన భరించలేక నేను చేసుకున్న వాంతి వాసన ఒక్కసారిగా గుప్పుమంది.

          స్కూలులో సైన్సు ఎగ్జిబిషన్ లో హ్యూమన్ అనాటమీలో భాగంగా నిలువునా చీల్చిన మనిషి లోపలి శరీర భాగాల డిస్ప్లే చూసాక ఆరు నెలల పాటు మాంసాహారం మానేసిన జ్ఞాపకం భయపెట్టింది.

          చిన్నతనంలో పెంపుడు కుక్క టామీని నిమిరిన చేతులతో అన్నం తినలేక స్పూనుతో భోంచేసిన వైనం కలవర పెట్టింది.

          పొరపాటున పప్పు పోపులో వేసిన వెల్లుల్లి నా కంచంలోకి రావటం జరిగితే, తినే  కంచంలోనే వాంతి చేసుకోవటం గుర్తొచ్చి దిగులేసింది.

          నేనసలు నర్సు వృత్తికి పనికి వస్తానా…?

          అయినా అదంతా గతించిపోయిన గతం.

          మరుగున పడని ఆ గతంలోనే కదూ తమ్ముడికి, ఆయనకు నర్సుని మించి సేవలు చేసింది…?

          తమ్ముడు ఆసుపత్రిలో సిస్టర్ కన్నా తన సిస్టర్ బాగా బెడ్ బాత్ ఇస్తుందనే వాడు.

          టంగ్ బయాప్సీ పేరుతో ఛిద్రం అయిన శ్రీవారి నోటిలో చితికిన పళ్ళకు, చిదిమి పోయిన నాలుకకు, అల్సర్లతో ఒరుసుకు పోయిన పంటి చిగుర్లకు ఎంత సున్నితంగా బ్రష్ చేసేదానినో ఎవరికి తెలుసు. అలాంటి నేను నర్సుగా చేయలేక పోవటమేమిటి..?

          అసలు మున్ముందు తొంభయ్యో పడిలోకెళుతున్న అమ్మకు ఏ అవసరం వచ్చినా ఒక ప్రొఫెషనల్ నర్సుగా నేను మారటం చాలా అవసరం కదా…!

          ఆ రాత్రి డోలాయమాన స్థితిలో పడుకున్నానే కాని అస్సలు నిద్ర పట్టలేదు.

*****

(సశేషం)

Please follow and like us:

8 thoughts on “జీవితం అంచున -1 (యదార్థ గాథ)”

  1. జీవితం అంచున చాలా బావుంది. రచనా వ్యాసంగంలో తనది విలక్షణ శైలి. అంపశయ్య గారి నవలా పురస్కారం కూడా అందుకున్న రచయిత్రి. ఆమెది చదివించడంలో అందె వేసిన చెయ్యి

  2. జీవితం అంచున చాలా బావుంది. రచనా వ్యాసంగంలో తనది విలక్షణ శైలి. అంపశయ్య గారి నవలా పురస్కారం కూడా అందుకున్న రచయిత్రి. ఆమెది చదివించడంలో అందె వేసిన చెయ్యి

  3. జీవితపు అంచు యదార్థ గాథ అంచు దాకా చదవవలసినదే

  4. యదార్ధ గాధైనా, కల్పిత గాధైనా ఝాన్సీ గారి చేతిలో అద్భుతమైన రూపు దాల్చి చదువరుల హృదయాలను ఆర్ద్రతతో నింపేస్తుంది.ఆలోచన రేకెత్తిస్తుంది. వావ్…బ్రేవ్..అనిపిస్తుంది.

  5. మనసును కదిలించింది. ఇష్టాల తీగను మీటింది.ఆశల కు ఊపిరి పోసింది..ఆశయాల పతాకంపై ఎగురుతున్న భావనలు ..ఏవో ఏవేవో పలకరిస్తూ..జీవితాల్లో మలుపులే కాదు,మలుపు తిప్పుకొనే ఒక అవకాశం మనసు ముంగిలిలో ఉన్నట్లు బాగుంది..

  6. Soooo beautiful story start chesaru Jhansi garu. Hearty congratulations to you. మీరు వ్రాసే అక్షరం అక్షరం మధురాతి మధురం👏👌💐👏👌💐👏👌💐👏👌💐

  7. హృదయాన్ని కదిలించే కథ కానీ జీవితం.waiting for next episode mam👌👍

  8. ఝాన్సీ కొప్పిశెట్టి గారి
    జీవితం అంచున…శీర్షిక న , తన జీవిత చరిత్ర ను
    మంచి టెక్నిక్ తో మొదలు పెట్టిన విధానం బాగుంది.
    నవల,కథ,వ్యాసం,కవిత,రాయడంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ రచయిత్రి అంతరంగ వీక్షణం పాటకులను ఆకట్టుకునే విధంగా వుంది.రచయిత్రికి అభినందనలు.

Leave a Reply to డా.కె.ఎల్ వి ప్రసాద్ Cancel reply

Your email address will not be published.