ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు)

-సుశీల నాగరాజ

         నైలు అందాలను, నది పొడవునా ఉన్న లెక్కపెట్టలేనన్ని ప్రాచీన దేవాలయాలను, శిధిలాలను చూసుకొంటూ ప్రయాణం ! అస్వాన్ నుంచి లుక్సర్ దాకా ఉన్న 90 కిలో మీటర్ల దూరం మోటారు బోటులో ప్రయాణం. అదే నైలు క్రూజ్ ! ఇది నాలుగు రోజులు (మూడు రాత్రులు)

         ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ముఖ్యమైనవి రకరకాలైన దేవతలు, వారికి కట్టిన దేవాలయాలు, వాటిని ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో ఒకటైన ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ (Egyptian Hieroglyphs) లో రాశారు. ఈ ప్రయాణంలో నైల్ నదికి తూర్పు తీరాన, అస్వాన్ (Aswan), కొమొంబో (Kom Ombo), లుక్సర్ ((Luxor), కార్నాక్ దేవాలయం (Karnak Temple) ఉన్నాయి. పశ్చిమ తీరం వెంబడి ఎడ్పు (Edfu), ఎస్న (Esna), వాలీ ఆఫ్ కింగ్స్ (Valley of Kings), వాలీ అఫ్ క్వీన్స్ (Valley of Queens) ఉన్నాయి. 

         ఒకటి, రెండు దేవాలయాలు చూడగానే, వాటిలో ఉన్న వివరాలు, వాటి కథలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ! అంతే కాకుండా, మిగిలిన దేవాలయాలు ఇంతకు ముందు చూసిన దేవాలయాల్లాగే ఉన్నట్లు అనిపించటంలో అనుమానమేలేదు. ఏ దేవాలయం దేనికి ప్రసిద్ధో మరిచిపోతాం, కన్ ఫ్యూషనుకు లోనవుతాం!!!

ఎస్నా లాక్ ( Esna lock)

         రెండు వంతెనల నడుమ నైలు నది ప్రవహిస్తూంది. ఈ విద్యుత్తు వంతెనను 1990లో కట్టారు ముఖ్యంగా పర్యాటకులను అస్వాను నుండి లుక్సరుకు తీసుకు వెళ్ళడానికి,  నౌకలు ప్రయాణించటానికి ఉపయోగిస్తారు. నౌకలు రాగానే ఈ బ్రిడ్జులు తెరుచు కొంటాయి. తరువాత మూసుకొంటాయి. 

         లుక్సరు చేరుకొన్నాము.. సాయంత్రం పూర్తిగా నౌక పై భాగంలో  టీ, కాఫీ , Snacks తో ఎస్నా తెరుచుకోవటం వీక్షించి. కొద్దిగా విశ్రాంతి. రాత్రి ప్రసిద్ధమైన బెల్లీ డాన్స్ (Belly Dance) ఏర్పాటు చేసారు. బెల్లీ డాన్స్ ఈజిప్ట్ ప్రాంతాల్లో ప్రసిద్ధమైన ప్రాచీన నృత్యం. నిజానికి ఈ డాన్స్ ఎటువంటి అసభ్య ప్రదర్శన లేకుండా వారి కుశలతను చూపుతుంది.!

         మరుసటిరోజు లుక్సరులో కర్నాక్ , లుక్సరు దేవాలయాలు చూసి ఆ రోజు లుక్సరు లో హోటలులో ఉన్నాము. 

Valley of Queens

         పశ్చిమ తీరంలో ఉన్న ప్రాచీన రాజుల-రాణుల సమాధులు !  ఈ పిరమిడ్డుల లోపలి గోడల పై చిత్రించిన అనేక రకాలైన చిత్రాలు, అందమైన నగిషీలతో మలచబడ్డ బొమ్మలు, శవపేటికలు. అంతే కాకుండా, పిరమిడ్డుల నిర్మాణంలో చూపించిన నైపుణ్యం అమోఘం, ఆశ్చర్యం! ఈ  సమాధులు అన్నిటిలోనూ ఫోటోలు తీయటం నిషేధం! మా క్రూజ్ గైడు చెప్పిన దాని బట్టి, ఈజిప్ట్ ప్రభుత్వం ఇప్పటికీ కొత్త కొత్త సమాధులని తవ్వకాల ద్వారా కనుక్కుంటూనే ఉన్నారట!

         పగలల్లా బోటులో ప్రయాణం, మరి ప్రయాణం లేకపోతే బోట్ ఆపి అక్కడక్కడ దేవాలయాలు, ఇతర ప్రదేశాలు చూడటం! ప్రతిరాత్రీ బోటులో ఏదో ఒక మనోరంజనా కార్యక్రమం ఉండేది. ఒక్కొక్కసారి అలసిపోయి పడుకొనేసే వాళ్ళము.

         ఇక్కడ ఉన్న భారీ కుడ్యాలనూ స్తంభాలను చూస్తే ఔరా అనిపించక మానదు. గోడల మీద అప్పట్లోనే ఆపరేషన్లకు అవసరమైన వస్తు సామగ్రినీ కాన్పు సమయంలో తల్లిని కూర్చోబెట్టిన దృశ్యాలనూ చూడవచ్చు..! చాలా దేవాలయాల్లో, అనేక రకాలైన జంతువులను కూడా “మమ్మీ”ల క్రింద మార్చి భద్రపరచారు.

         హాట్ ఏర్ బలూను ( Hot sir balloon)లో వెళ్ళిన అనుభవం అపూర్వం. తెలవారి 4 గంటలకు బస్సులో, చిన్న బోటులో ప్రయాణం చేసి, హాట్ ఏర్ బలూను ప్రదేశాన్ని చేరుకొన్నాము. ఆ చిన్నబోటులో అందరికి కేకు, వేడి కాఫి ఇచ్చారు. అందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. ఆ బుట్టలోకి ఎక్కటము ఒక సాహసమే. చాలా మందికి మోకాళ్ళ ఆపరేషను కారణంగా చాలానే కష్టపడ్డారు. కానీ రెండువేల మైళ్ళ ఎత్తులో క్రింద ఈజిప్టులోని ఎడారులు, గుట్టలు, ఇసుక దిబ్బలు, పచ్చని పొలాలు, పామ్ చెట్లు, ఆ సమయానికి సూర్యోదయం, అద్భుతమైన దృశ్యం!! ఆ అనుభవం అవర్ణనీయం! చాలానే ఆనందం కలిగించింది ఆ అనుభవం! ఎంత టీం వర్కో! ఏ ఒక్క గుంపు చేసే పని నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే! $75/-ఇచ్చామనుకొంటాను. ఎంత మంది కలిసికట్టుగా పని చేస్తారు! ఎంత మంది పంచుకోవాలి! ఎంతో తృప్తినిచ్చింది ఈ హాట్ ఏర్ బలూనులో వెళ్ళటం!

         షాపింగుకు పిల్చుకొని వెళ్ళారు.అక్కడే వారు తయారు చేసే విధానం‌, పనిముట్లు చూసుకొంటూ, చాలా రకాల కళాత్మకమైన వస్తువులు. చాలా మంది షాపింగు చేశారు. పెయింటింగ్స్ కు ప్రసిద్దిచెందిన షాపుకూ వెళ్ళి చూశాము.

         ఇంతా రాసి ఈజిప్టు కాటన్ గురించి రాయకపోతే ఎలా!!! ఏదైన కొనాలని అను కొన్నాను. మంచి షాపుకు తీసుకువెళ్ళారు. ఆ బట్ట చేతితో తాకితే నలిగిపోతుందేమో ! ఎంత మృదువుగా, ఎంత నాజూకుగా ఉంది అంటే !!! కానీ వెలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైన వేసుకొనే టాపు $50/-పైనే! చూసి సంతోషించి వచ్చేశాము. కొంత మంది కొన్నారు.

         మేమున్న “నైలు క్రూజ్ ” గురించి రాయాలి. ఇందులో  4 అంతస్తులు. క్రింద పెద్ద భోజనాల ప్రదేశం. తరువాత మూడు అంతస్తులు. పై అంతస్తులో ఈత కొలను, ఆసనాలు, కాఫి, టీ లు , అందరూ కూర్చొని మాట్లాడుతూ చుట్టుప్రక్కల అందాల్ని చూస్తూ ఆనందించవచ్చు. 

         భోజనాల గది గురించి చెప్పాలి. ఎంత అందంగా, ఎంత చక్కగా అన్నీ సిద్దం చేస్తారంటే !  టీం వర్కు!!చూడాలి అంతే! మద్యలో భోజన పదార్థాలను ఏర్పాటు చేస్తారు. అనేక విభాగాలలో అలంకరిస్తారు. ఒకటి బ్రెడ్డు విభాగం. వివిధ రకాలవి, దానికి కావల్సినవి అన్ని ఉంటాయి. రెండవది సూపు, రైస్ బాత్, కూరలు, చపాతి, ఇలా (ఇక్కడ చెప్పాల్సింది మాంసాహార పదార్థాలు పెట్టిఉంటారు. అన్నిటి ముందూ పేర్లు రాసి ఉంటారు. చూసి తీసుకోవాలి. మనపక్కనే మాంసాహారం తినేవాళ్ళు కూర్చోవచ్చు. వీటన్నిటికీ పొందుకుంటేనే  పర్యటన బాగుంటుంది. లేదంటే మనమే కడుపు మాడ్చుకోవాలి). (Adjustment  చాలా ముఖ్యం), పచ్చి కూరగాయలు, అనేక రకాల పండ్లు, (ఈజిప్టులోని కమలాలు తినాలి. (oranges) ఎంత తియ్యగా ఉంటాయంటే!) ఒక్కరోజు వేడి వేడి వడలు వేస్తూ ఇచ్చారు. అందరమూ ఖుషి. చివర్న Desserts వివిధ రకాల కేకులు, తీపి పదార్థాలు. చూసి సంతోషించాలి. ఏదీ తినలేము. ఎండకు పాడవ కూడదని ఐస్ కింద పండ్లు పచ్చి కాయగూరలు పెట్టేవారు. అవి తిని చివరి రోజున జలుబు, దగ్గు‌, జ్వరం. మాత్రలు వేసుకొని తిరిగాను.

         మాకు కైరోలో Mr.Haney Andel Razek. Nile Cruise నుండి Meena అని ఇద్దరు మార్గదర్శకులు (Guide). చాలా మంచి వివరణ ఇచ్చారు. Egyptology చేశారు. వివరంగా విషయాలను తెలియజేశారు.

         ఈ పర్యటన చాలా hectic గా ఉంటుంది. విశ్రాంతి ఉండదు.అంతకన్నా ముఖ్యంగా నిద్ర 4 గంటలకన్నా ఎక్కువ ఉండదు. పడుకోవటం లేటు. త్వరగా లేవటం, తయారు కావటం 4 లేక 5 గంటలకంతా సిద్ధంగా ఉండటం. ఇలాంటి పర్యటనలలో అందరూ బాగా కలిసిపోతారు. ఒకరికొకరు సహాయం చేస్తారు.

         చివరి రోజు లుక్సరు నుంచి  విమానంలో కైరోకు. తరువాత కువైటు, బెంగళూరు చేరుకొంటాము.

*** 

         “ఈజిప్టు పర్యటన మరుపురానిది. ఈ అవశేషాలు, శిధిలాలు  ఇంత భవ్యంగ, వైభవంగా ఉంటే ఆ నాటి ఆ కాలాన్ని ఎలా ఊహించుకోవాలి! ఏమని ఊహించుకోవాలి! ఎంతని ఊహించుకోవాలి! ఊహకే అందనిది!!”

         నేను ఈజిప్టు వెళ్తున్నానని తెలిసి భారతిలక్ష్మి ఇంకా కొంత మంది అడిగారు వచ్చిన తరువాత రాయండి అని. చూద్దామని చెప్పాను. నాకు ఈ పర్యటన గురించి రాసే ఉద్దేశమే లేదు. వీరలక్ష్మిగారు ఒకరోజు ఫోన్ చేసి” మీ ఈజిప్టు పర్యటన గురించి రాయమని అడిగారు”. నేను రాయలేనండి , నాకా విశ్వాసం లేదు, అని చెప్పాను. కానీ ఆమె ఒప్పుకో లేదు. మీరు రాయగలరు! ప్రారంభంలో అందరికీ అలాగే అనిపిస్తుంది. రాయండి !అంతే!  ఆ బలవంతమే,  ఆ ప్రోత్సాహమే ఈ రాతకు కారణం! మీరందరూ చదివి ఆనందించి ఉంటే ఆ  క్రెడిటు  వీరలక్ష్మిగారికే చెందుతుంది !!!

*****

  (సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.