యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-3

లగేజీ

         ఏ టూరుకి వెళ్ళినా లగేజీ ఒక పెద్ద సమస్యే. ‘అసలు అక్కడి వాతావరణానికి ఏం బట్టలు వేసుకోవాలి? ఎన్ని జతలు పట్టుకెళ్ళాలి?’ లాంటి ప్రశ్నలతో మొదలయ్యి చివరికి ‘ఎన్ని కేజీలు పట్టుకెళ్ళనిస్తారు’ తో ముగుస్తుంది. నిజానికి అసలు సమస్య ఇదే. 

         సాధారణంగా ప్యాకేజీటూర్లలో ఎకనామికల్ గా బుక్ చేసిన టిక్కెట్ల వల్ల డైరక్ట్ ఫ్లైట్లు కాకుండా కనెక్టింగ్ ఉంటాయన్నమాట. మా శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టు నించి ముందు మేం తిన్నగా లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కణ్ణించి సిడ్నీకి వెళ్తాం. మధ్యలో ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణాలు చేసి వచ్చేటపుడు మెల్ బోర్న్ నించి లాస్ ఏంజిల్స్ మీదుగా  శాన్ఫ్రాన్సిస్కో  చేరుకుంటాం. ఇందులో ఒక్కొక్క ఫ్లైటుకి ఒక్కో  విధమైన లగేజీ పాలసీ ఉంది. కాబట్టి మేం అన్ని ఎయిర్ లైన్స్ లకు సరిపడే విధంగా సర్దుకోవాలి. అయినా కొన్ని చోట్ల, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లో  చెకిన్ లగేజీ ఉచితం కాదు. 20 కేజీలకు 20 ఆస్ట్రేలియన్ డాలర్ల చొప్పున కడుతూ పోవాలి. ఇంటర్నేషనల్  ఎయిర్ లైన్స్ లో తలకు 23 కేజీలు చెకిన్ ఉచితం. ఇక కేరియాన్ అంటే హేండ్ లగేజీ పర్సులు, లాప్టాపులు, చివరికి సూట్ కేసు బరువుతో సహా  ఏ ఎయిర్ లైన్స్ లో నైనా 7 కేజీలకు మించకూడదు. 

         మొత్తానికి డబ్బులు కట్టో కట్టకో ఒక్కొక్కళ్ళు ఒకటే పెద్ద సూట్ కేసు, ఒక చిన్న సూట్ కేసో, బ్యాగో మాత్రమే పట్టుకెళ్ళే అవకాశం ఉంది. మేం ఒక పెద్ద సూట్ కేసు, మిగతావి చెకిన్ అయినా, కేరియాన్ అంటే అయినా బరువు తక్కువ ఉన్న చిన్న సూట్ కేసులో, బ్యాగులో పట్టుకెళ్ళాలి అని నిర్ణయించేం. అయినా ఒకట్రెండు సూట్కేసులకి డబ్బులు కట్టడానికి నిర్ణయించుకున్నాం. ఇక చూసుకోండి. పెద్ద సూట్ కేసు నాకు కావాలంటే నాకని ఫైటింగ్ పిల్లలు. చివరికి నెగ్గేది ఈ “అమ్మ” అని  తెలియక పాపం అలిగేరు కూడా. 

         అయినా మాకు రెండు పెద్ద  సూట్ కేసులు, రెండు పిల్ల సూట్ కేసులు, భుజాన తలా ఒక బ్యాగు తయారయ్యేయి. పిల్లల్తో సహా అందరం పుస్తకాల పురుగులమే కాబట్టి దార్లో చదువుకోవడానికి తలా ఒక పుస్తకం తెచ్చుకున్నాం. ఇక నేను మిత్రుల కోసం నా పుస్తకాలు ఒకట్రెండు మాత్రమే పట్టుకెళ్లగలిగాను. మా చిన్నమ్మాయి బొమ్మలు వేసుకోవడానికి ఒకటి, రాతకి ఒకటి అంటూ రెండు డైరీలు అదనంగా తెచ్చింది. ఇక రంగు పెన్సిళ్లు, పెన్నులు, అదనపు దుస్తులు, చెప్పులు అంటూ పోటీలకు వచ్చినా పాపం వాళ్ళ పప్పులు ఉడకలేదు. వస్తువుల చెకింగ్  ఇన్స్పెక్టర్ గా నేను, వెయిట్  చెకింగ్  ఇన్స్పెక్టర్ గా వాళ్ళ నాన్న బాధ్యత తీసుకున్నాం మరి! 

         ఇక అందరికీ తలా ఒక లాప్ టాపు, చిన్నమ్మాయికి ఐ- పాడ్ 

తప్పవుగా!

         ఇక చూసుకోండి. ప్రతి ఎయిర్పోర్టు దగ్గిరా చెకిన్  పాయింట్లలో ఎలక్ట్రానిక్ డివైజులు, ఫోన్లు అంటూ ప్రతి చోటా అన్ని బ్యాగులూ విప్పి కుప్ప పొయ్యాల్సిందే. చివరగా వచ్చే నేను అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చెయ్యాల్సిందే! 

         ఇంత కష్టపడి ఎంత ఎకనామికల్ గా సర్దుకున్నా, తీరా అయిదు రోజుల ప్రయాణం పూర్తి కాగానే స్విమ్మింగ్ బట్టలు, తువ్వాళ్లు, లోదుస్తులు వంటివి తడిసి ఆరక పోవడం వల్ల, రౌండుకి నాలుగు డాలర్ల చొప్పున హోటళ్లలో  రెండ్రోజుల పాటు లాండ్రీ వేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి చెప్పొచ్చేదేవిటంటే కొన్ని అనవసరమైనవి తగ్గించు కుంటే కానీ ఇలాంటి దూర ప్రయాణాలు చెయ్యలేం. 

సీట్లు

         ప్రయాణానికి అవసరమైన వీసా రాగానే ప్యాకేజీ టూరు బుక్ చేసుకున్నాక, మేం యాడ్ చేసుకున్న లోకల్ టూరులు కన్ఫర్మ్ కావడానికి పది పదిహేను రోజులు సమయం పట్టింది. అందులో కన్ఫర్మ్ కానివి మళ్ళీ కొత్తగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఇక  ప్యాకేజీ టూరుకి కట్టవలసిన సొమ్ము మొత్తంగా ఒక్కసారి కాకుండా రెండు దఫాలుగా కట్టవచ్చు. దాదాపు అరవై శాతం ముందు బుక్ చేసుకునేటప్పుడు, నలభై  శాతం మరొక నెల్లాళ్ళలోను కట్టేం. ఇక ప్యాకేజీ టూరులో ప్రయాణపు రోజులకి ఖాళీ పెట్టుకున్నామని చెప్పేను కదా. వాటన్నిటినీ కూడా మా సొంతంగా చూడాల్సిన టూర్లతో నింపేసాం. ఒక చోట ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యినపుడు టూర్లని కూడా క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది కూడా. ఇక నేను మిత్రులని కలవడానికి ఒక్క పూటలో కొన్ని గంటలైనా మిగుల్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. 

         ఇక టూరు బుక్ చేసుకున్నప్పట్నించి యూట్యూబులో ఆస్ట్రేలియా టూరిజంకు సంబంధించినవి , చేయాల్సినవి, చేయకూడనివి అంటూ నిబంధనలు, తినాల్సినవి, అక్కడి ఆంగ్ల భాష విశేషాలు, స్థానిక ప్రత్యేకతలు …ఇలా కనబడ్డ  వీడియోనల్లా చూడడం, మిత్రులతో మాట్లాడడం…పాయింట్లు రాసుకోవడం.. ఇల్లంతా ఒక పండగలాగే ఉత్సాహం అలుముకుంది. 

         ఇక ప్రతి ఎయిర్ లైన్సులోను ప్యాకేజీ టూరు సైటులోనే బుకింగ్ సమయంలోనే  సీటింగ్ సెలెక్షను చేసుకున్నా మళ్ళీ ప్రతి ఎయిర్ లైన్సు సైటులోను కన్పర్మేషన్లు చూసుకోవడం, ప్రత్యేక భోజనానికి ఆప్షన్లు సెలక్టు చేసుకోవడం వంటివి ఒక వారం ముందు చేసాం. కొన్ని సీట్లు కన్ఫర్మ్ అయినా కొన్ని కన్ఫర్మ్ కాలేదు. మా నలుగురికీ సీట్లు ఒక చోట రావడమూ కష్టమే అయ్యింది. కనీసం ఇద్దరిద్దరం ఒక చోట కూర్చోవాల్సి వచ్చింది. అదింకా కాస్త నయమే చివరగా సిడ్నీ నించి లాస్ ఏంజిల్స్ పదహారు గంటల ఫ్లైట్ లో తలా ఒక చోట ఇచ్చినపుడు మాత్రం చిన్న ఫైటే చెయ్యవలసి వచ్చింది. సీటు రిజర్వేషన్లు ముందే చేసుకున్నా, విమానం బాలన్సు అంటూ మా సీట్లు తారుమారు తక్కిరమారు చెయ్యడం, కొన్నిసార్లు  ఎయిర్ లైన్స్ వాళ్ళు చేతులెత్తేసి ప్రయాణీకులతో మాట్లాడుకోమనడం, ప్రయాణీకులు సర్దుకోక పోవడం వంటివి భలే చికాకు కలిగించేయి. అదృష్టం కొద్దీ కొంతమందైనా మంచి వాళ్ళు ఈ ప్రపంచంలో మిగిలి ఉండడం వల్ల మా సమస్యలు కొంత వరకు పరిష్కారం అయ్యేయి. 

         మొత్తానికి మేం వెళ్లాల్సిన రోజుకి ముందు రోజున ఫ్లైట్ కి చెకిన్ చేసే రోజున  గుర్తొచ్చింది. అనుకున్నట్టు అన్నీ బుక్ చేసాం కానీ మా ఇంటి నించి ఎయిర్ పోర్టుకి టాక్సీ బుక్ చేసుకోలేదని. అప్పటికపుడు ఊబర్ దొరుకుతుందో లేదో, మా లగేజీ ఆ వచ్చిన వెహికిల్ లో పడుతుందో లేదో అనే సందేహాలతో, పైగా ఎక్కువ జనంతో ప్రయాణం చెయ్యకూడదను కున్నాం కాబట్టి మాకే ప్రత్యేకించిన వెహికిల్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మరేదీ ఖాళీ దొరక్క అది కాస్తా ఎగ్జిక్యూటివ్ వెహికిల్ అయి కూచుంది. దానికి అచ్చంగా 350 డాలర్లు సమర్పించ వలసి వచ్చింది. ఇక తప్పుతుందా డబ్బు నీళ్లలా మొదటి స్టెప్పులోనే  ఖర్చవ్వడం మొదలయ్యింది.

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.