పౌరాణిక గాథలు -3

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

మాంధాతృడు కథ

         మన పురాణాల్లోను, ఇతిహాసాల్లోను గొప్ప కీర్తి పొందినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరూ మనకి తెలియదు
కదా!

         వాళ్లు ఏ కాలంలో జీవించినా ఆ కాలంలో వాళ్లే చాలా గొప్పవాళ్లు అనిపించు కున్నారు. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి, వేల సంవత్సరాలు జీవించి, ఎన్నో మంచి పనులు చేసి యుగాలు గడుస్తున్నా ఇప్పటికీ కీర్తి కాయంతో జీవించి ఉన్నారు. వాళ్లు ఇప్పుడు మనకి కనిపించకపోయినా వాళ్లు చేసిన గొప్ప పనుల వల్ల వాళ్ల పేర్లు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నాము. మీరు చిన్నపిల్లలు కనుక, మీకు పూర్తిగా అర్ధమవ్వాలంటే మన గాంధీతాతలాగ అన్నమాట! గాంధీతాత ఇప్పుడు లేరు, మనం చూడలేదు. అయినా ఆయన గురించి వింటూనే ఉన్నాం. చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన చెప్పినట్లు జీవిస్తున్నాం. అంటే గాంధీతాత మనలో జీవిస్తూనేఉన్నారు.
కీర్తితో ఇప్పటికీ జీవిస్తున్నకొంత మందిని ఇతిహాసాల్లో ఉన్నవాళ్లని గురించి నేను మీకు కథగా పరిచయం చేస్తాను. అది చదివాకా వాళ్ల గురించి మీరు పూర్తిగా తెలుసుకుని పెద్ద పుస్తకం తయారు చెయ్యండి. అది పెద్ద చారిత్రక గ్రంథం అవుతుంది.

***

         ఇప్పుడు మనం ‘మాంధాతృడు’ గురించి తెలుసుకుందాం…

         మాంధతృడు గురించి మహాభారతంలో రోమశుడు అనే ఒక మహర్షి యమునా నది ఒడ్డుమీద కూర్చుని అరణ్యవాసంలో ఉన్న పాండవులకి చెప్పాడన్నమాట!

         పాండవులారా! ఈ యమునానది కూడా గంగా నదిలా ఎంతో పవిత్రమైంది. పూర్వం ఈ నదీతీరంలో ఎంతో సంపదని ఖర్చుచేసి గొప్పవాడైన మాంధాతృడు, అనేక యజ్ఞాలు చేశాడు. ఆయన గురించి చెప్తాను వినండి” అని చెప్పడం మొదలు పెట్టాడు.

***

         మాంధాతృడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. గొప్ప బలం, కీర్తి, శౌర్యం కలవాడు. చాలా మంచివాడు. వేయి అశ్వమేధయాగాలు చేశాడు. మాంధాతృడు ఎలా పుట్టాడో తెలుసా?

         ‘యవనాశ్వుడు’ అనే పేరుగల మహారాజు ఉండేవాడు. అతడికి సంతానం లేదు. పాపం ఎప్పుడూ అదే ఆలోచనతో బాధపడుతూ ఉండేవాడు. మహారాజు బాధ పడుతుంటే మంత్రులకి, ప్రజలకి కూడా బాధగా ఉంటుంది కదా!

         ఒకరోజు మంత్రులందరూ కలిసి మహారాజుకి ఒక సలహా ఇచ్చారు. “మహారాజా! మనకి దగ్గరలో ఉన్న అరణ్యంలో భృగుమహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని వేడుకుంటే మీ బాధ తీరుస్తాడు. ఆయనకి సేవచేసి మీ బాధ చెప్పండి. మంచి జరుగు తుంది” అన్నారు.

         మంత్రులు చెప్పిన సలహా యవనాశ్వుడికి నచ్చింది. ఒక మంచి రోజు చూసుకుని రాజ్యపాలనకి సంబంధించిన పనులన్నీ మంత్రులకి అప్పగించి భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. చాలా కాలం మహర్షికి సేవ చేస్తూ అక్కడే ఉండిపోయాడు.

         కొంతకాలం గడిచాక భృగుమహర్షి యవనాశ్వుడిని “మహారాజా! రాజ్యాన్ని వదిలి పెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని అడిగాడు.

         యవనాశ్వుడు “మహర్షీ! నా పాలనలో ప్రజలందరు సంతోషంగా ఉన్నారు. నాకు సంతానం లేదు. మీరు నాకు సంతానం కలిగేలా ఆశీర్వదించి నా బాధ పోగొట్టండి!” అని అడిగాడు.

         భృగుమహర్షి మహారాజుకి సంతానం కలగడం కోసం పుత్రకామేష్టి అనే యజ్ఞం చేశాడు. యజ్ఞకుండంలోంచి కొడుకులు కలగడానికి ఉపయోగించే పవిత్రమైన మంత్ర జలంతో నిండిన ఒక కుండ బయటికి వచ్చింది. ఆ మంత్రజలాన్ని ఎవరూ తాగకుండా ఉండేలా జాగ్రత్తగా కాపాడమని భృగుమహర్షితో యజ్ఞం చేయించిన వాళ్లకి అప్పగించాడు.

         వాళ్లు ఆ నీళ్లు ఎవరూ తాగకుండా ఆ కుండ దగ్గరే ఉండి కాపలా కాస్తున్నారు.
ఋత్విజులు రాత్రి మేలుకుని ఉండలేక ఆ కుండ పక్కనే నిద్రపోయారు. మహారాజు యవనాశ్వుడికి అర్ధరాత్రి బాగా దాహం వేసింది. ఎవర్నేనా పిలుద్దామంటే అందరూ నిద్ర పోయారు. అక్కడ కుండలో కనిపించిన మంత్ర జలాన్ని మొత్తాన్ని తాగేసి వెళ్లి తను కూడా నిద్రపోయాడు.

         ఆ విషయం భృగుమహర్షికి తెలిసింది. ఆయన యవనాశ్వుడి దగ్గరికి వచ్చాడు.

         “మహారాజా! నీకు కొడుకు పుట్టాలని చేసిన తపస్సు వల్ల వచ్చింది ఈ మంత్రజలం. దీన్ని నీ భార్యకి ఇవ్వాలని ఉంచాను. దాహం తట్టుకోలేక ఆ మంత్రజలాన్నినువ్వు తాగేశావు. దేవేంద్రుడితో సమానుడైన కొడుకు నీ గర్భం నుంచే పుడతాడు” అని చెప్పి వెళ్లిపోయాడు.

         మహర్షి చెప్పింది విన్నాక యవనాశ్వుడికి ఏం చెయ్యాలో తెలియలేదు. తను కూడా రాజధానికి వెళ్లిపోయాడు.

         కొంతకాలానికి యవనాశ్వుడు గర్భం ధరించాడు. నూరు సంవత్సరాలు గడిచి పోయాయి. యవనాశ్వుడికి ఎడమ ప్రక్కని చీల్చుకుని గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ కొడుకు పుట్టాడు.

         దేవేంద్రుడు ఆ బాలుణ్ని చూడాలని వచ్చాడు. అతడి నోట్లో తన చూపుడు వేలు ఉంచి అమృతాన్ని తాగించి, ‘మాంధాతృడు’ అని పేరు పెట్టాడు. మాంధాతృణ్ని దేవేంద్రుడే పెంచాడు.

         ఏకాగ్రతతో మనస్సులో తలుచుకోగానే మాంధాతృడికి నాలుగు వేదాలు, వివిధ శాస్త్రాలు, విలువిద్య, మంత్రాలతో అమ్ముల్ని ప్రయోగించడం అన్నివిద్యలు వచ్చేశాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే ఇదేనన్నమాట!

         మాంధాతృడు పెద్దవాడయ్యాక మూడులోకాల్లో వాళ్లు గౌరవించారు. దేవేంద్రుడు మాంధాతృణ్ని భూ మండలం మొత్తానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఒక దేశము, ఒక రాష్ట్రము కాదు మొత్తం భూమినే పాలించాడు. ప్రజలందరూ అతడి పాలనలో ఎంతో సుఖంగా జీవించారు.

         ‘ఆజగవం’ అనే విల్లుని పట్టుకుని దేవేంద్రుడి సింహాసనం మీద దేవేంద్రుడితో పాటు కూర్చున్నాడు. అనేక మంత్రబాణాల్ని, భేదించడానికి శక్యంకాని కవచాన్ని ధరించాడు. అన్ని లోకాల్ని జయించిన జగదేకవీరుడిగా ఎన్నో యజ్ఞాలు చేసాడు. దక్షిణలు ఎక్కువగా ఇచ్చి, కోటానుకోట్ల ఆవుల్ని దానం చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు పొందాడు. 

         ఒకసారి భూమి మీద వానలు కురవక రాజ్యంలో పంటలు పండలేదు.మాంధాతృడికి దేవేంద్రుడి మీద చాలా కోపం వచ్చి దేవేంద్రుడితోనే యుద్ధం చేశాడు. తనే మేఘాల మీద మంత్రబాణాల్ని ప్రయోగించి వానలు కురిపించాడు. పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉన్నారు. పాండవులారా! ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం మాంధాతృడు యజ్ఞం చేసిన చోటు!” అని కథని పూర్తి చేశాడు రోమశమహర్షి.

         రోమశమహర్షి చెప్పిన కథ విని పాండవులు లేచి మాంధాతృణ్ని తలుచుకుని ఆ ప్రదేశానికి నమస్కరించారు.

         చూశారా! మాంధాతృణ్ని పాండవులు కూడా చూడలేదు. మనం ఆ మహారాజు గురించి ఇప్పటికీ చదువుతున్నాం. అంటే ఆయన ఏ కాలంలోవాడయినా కీర్తి ప్రతిష్టలతో ఇప్పటికీ ఉన్నాడు. శరీరంతో జీవించకపోయినా కీర్తితో జీవించడం. ‘కీర్తికాయం’ అంటే ఇదే!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.