అతను (కథ)

-డా. లక్ష్మీ రాఘవ

          గేటు ముందు కారు ఆగిన చప్పుడైతే వంటింట్లో నుండీ హాలు కిటికీ వైపు తొంగి చూసింది వర్ధని.

          కారు దిగి లోపలకు వస్తున్న వ్యక్తిని చూసి చట్టుక్కున పక్కకు జరిగి ఒక్క క్షణం
నిలబడింది. వెంటనే త్వరగా వంటింట్లోకి వెళ్ళింది. మరు నిముషంలో కాలింగ్ బెల్
మ్రోగింది. తలుపు తీసిన వర్ధనిని చూస్తూ…

          “బాగున్నావా వర్ధినీ?” అనడిగాడు అతను.

          జవాబు చెప్పాలనిపించక తల ఊపింది…

          అతను సోఫాలో కూర్చుంటూ “బాబు ఏమి చేస్తున్నాడు?” అన్నాడు.

          ఈ ప్రశ్నతో చిర్రెత్తుకొచ్చి కోపంగా చూడబోయింది. ఇంతలో గేటు చప్పుడు … లోపలకు వస్తున్న కొడుకు సూర్య కనిపించాడు వర్ధినికి. సూర్య హాలులో అడుపెట్టగానే ఎదురుగా కూర్చున్న అతన్ని చూస్తూ…

          “చెప్పండి సార్, ఏదైనా పని మీద వచ్చారా?” అన్నాడు ప్రశ్నార్థకంగా.

          అతను ఆశ్చర్యంగా సూర్యను చూస్తూ “సూర్యా, నేను తెలుసా?” అతని ప్రశ్నకు
అమ్మ వైపు చూశాడు సూర్య.

          ఆమె ముఖంలో ఎలాటి వ్యక్తీకరణా లేదు.

          “సారీ సర్, తెలుస్తే ఎందుకడుగుతాను?” అన్నాడు కుర్చీలో కూర్చుంటూ…

          “సూర్యా, నేను మీ నాన్నను. మిమ్మల్ని కలవాలని వచ్చాను”

          “నాన్నా???!!!” మళ్ళీ అమ్మ వైపు చూశాడు. అవునన్నట్టు తల కొద్దిగా ఊపింది వర్ధిని.

          తల వంచుకుని మౌనoగా ఉండిపోయాడు అయిదు నిముషాలు.

          తరువాత మెల్లిగా

          “నాన్న అన్నమాట ఈ ఇంట్లో ఎప్పుడూ వినపడ లేదు. నేనెప్పుడు అడిగినా“లేడు”
అన్నదే సమాధానం. అందుకే నేనూ కొద్ది రోజులకి అడగటం మానుకున్నాను. చిన్నప్పుడు ‘ఇదిగో మీ నాన్న’అని అమ్మ చెబితే కదా తెలుస్తుంది.. ఇలా అంటున్నందు కు సారీ”

          “సారీ అని నేను చెప్పాలి సూర్యా. మిమ్మల్ని వదిలి నేనే వెళ్ళాను”

          “అవునా… అమ్మ ఎప్పుడూ అలా చెప్పలేదే?” అడుగుతూన్న సూర్య కేసి చూసింది వర్ధని.

          ఇంతలో ఆయన
“నేను ఇప్పుడు చెబుతున్నా కదా. అప్పట్లో నాదే తప్పు అయి వుండవచ్చు. ఎలాగైనా
ఎదగాలనే నా మనస్తత్వం, ఉన్నదాన్లోనే బతకాలనే మీ అమ్మ…ఎప్పుడూ గొడవ అయ్యేది. చివరకు మీ అమ్మను ఎదిరించడం చేతగాక పారిపోయాను అవకాశాలు
వెతుక్కుంటూ..అప్పుడు నీ వయసు ఎనిమిది నెలలు..”

          “ఓహో …ఇంట్లో భార్యా పిల్లల కంటే మీకు ఎదగడానికి అవకాశాలే కావాలి అను కున్నారన్న మాట. మరి ఎదిగే వుంటారు. అన్నీ అనుభవించే వుంటారు. మరిప్పుడు
ఇన్నేళ్ళకి మీ రాకకి కారణం ఏమిటో ..” సూర్య మాటల్లో వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తూంది.

          “సూర్యా, ఆయన ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిధి” అంటూ సూర్య దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసింది వర్ధని.

          “అతిధి మాత్రమే అంటావా వర్ధనీ?” అతని ప్రశ్నకు సమాధానం సూర్య నుండీ వచ్చింది.

          “అయితే ఈయనకు అతిధి మర్యాదలు చేయాలి కదా అమ్మా…”

          “కొడుకును మంచి మాటకారిని చేశావు..” వర్ధని వైపు చూస్తూ అన్నాడతను.

          “ఏ పని అయినా మొదట ఒక స్పష్టత ఉండాలన్నది అమ్మ అభిప్రాయం. అందుకే ప్రతిదీ నిశితంగా పరిశీలించి విశ్లేషించుకోవటం అలవాటు చేసింది నాకు…” సూర్య మాట పూర్తికాకనే

          “నా విషయం లో కూడానా?” కొంచెం అసహనం ప్రస్పుటమయింది అతని గొంతులో

          “మీరు ఇప్పుడే కదా సీనులోకి వచ్చారు. కొత్తగా ప్రవేశం అయిన వ్యక్తి గురించి మేము తెలుసుకోవాలి కదా.”

          “సూర్యా… చాలు. నన్ను మీ అమ్మతో మాట్లాడనిస్తావా?” కొంచెo గట్టిగా అన్నాడ తను

          “తప్పకుండా. కానీ అంతకు ముందు నేను చెప్పేవి మీరు వినాలి..” మొండిగా అన్నాడు సూర్య.

          “చెప్పు“ అన్నాడతను అసహనంగా

          “మీ గురించి ఆమ్మ నాకు ఎప్పుడూ చెప్పలేదు.. మొదటిసారిగా అమ్మ ఒంటరిగా ఎందుకు మిగిలిందని తెలిసింది అమ్మ అన్న రాఘవ మామయ్య ద్వారానే…నాన్న అనబడే మీరు వదిలేశాక అమ్మ తాను నిలదొక్కుకుని బి.యిడి చేసి టీచరుగా పని చేస్తూ నన్ను పెంచింది…అంతే కాదు మీరు వెళ్ళాక అమ్మ ఒంటరి అయ్యిందని ఒకసారి మామయ్య వచ్చి ‘ఇంకా నీ వయసు చిన్న, మరో పెళ్లి చేసుకో’ అని చెబితే అమ్మ చెప్పిన
సమాధానం ‘వాడికి నాన్న ఎలాగూ దూరం అయ్యాడు. పెళ్లి చేసుకుని నేను కూడా వాడిని ఈ ఇంట్లో పరాయిగా పెరిగేలా చేయను. ‘ఇది నా ఇల్లు, ఈమె మా అమ్మ’ అన్న భావన తోనే వాడు ఎదగాలి. వాడికంటే నా సుఖం ముఖ్యం కాదు “అని తిప్పి కొట్టడ౦ కూడా జరిగిందని మామయ్య ద్వారా విన్నాక నా మనసులో అమ్మ ఎంతగా నిలిచిపోయిందో మీకు అర్థం కాదు. అప్పుడు అమ్మ పెళ్ళి చేసుకుని వుంటే మీరే కాదు, అమ్మ కూడా లేక పోయేది నాకు. అమ్మ ఆలోచించింది ఒక్కటే తన సుఖం కంటే నాకు తోడు, ఎదుగుదల ముఖ్యం అని. ఈ ఒక్క పాయింటు చాలు నాకు ఆమె ఎంత ముఖ్యమో. ఎందుకంటే మీరు మీ గురించే ఆలోచించారు. అమ్మ నా కోసం నిలబడింది..అమ్మకు నేనున్నాను ఎప్పుడూ…” అని భుజం మీద ఉన్న అమ్మ చేయిని తాకి మళ్ళీ అతనితో “మీరు చాలా డబ్బున్న వ్యక్తిగా ఎదిగారని ఇంటి బయట ఆగి వున్న కారు చెబుతుంది. బహుశా అందుకే మీకు ఈ భార్యా , పిల్లాడూ గుర్తుకు వచ్చినట్టు లేదు.. నా కోసం ఎంతో కష్టపడింది  అమ్మ…”

          ఒక క్షణం ఆయనను సూటిగా చూసి మళ్ళీ 

          “ఇంకా చెప్పాలంటే మీ దారి మీరు వెతుక్కుని అదృశ్యమైనాక మళ్ళీ ఇప్పుడు
ప్రత్యక్షం అయితే “నాన్నా“ అనే వాటేసుకోవడానికి ఇది సినిమా కాదు. ఈ అమ్మకు
పుట్టిన అబ్బాయిగా నేనూ ఎంతో ఆత్మాభిమానంతో బతికాను. ఎవరినీ యాచించకుండా
మెరిట్ తోనే పైకి వచ్చాను. ఇప్పుడు ఒక మంచి ఉద్యోగానికి ప్రవేశం కూడా దొరికింది. అమ్మతో ఈ వూరి నుండీ వెళ్ళి పోయే ఉద్దేశ్యంతో వున్నాను. బహుశా అమ్మ మీకు ఇవన్నీ చెప్పడానికి ఇష్టపడక పోవచ్చు. అర్థం అయ్యిందనుకుంటాను “ అని ఆపి సూర్య ఆయన వైపు చూశాడు.

          ఆయన ఒక నిముషం తల దించుకుని నెమ్మదిగా లేచి వర్ధిని ని చూస్తూ

          “సారీ వర్ధినీ. చివరకు పిల్లల చేత చెప్పించుకునే రాత అయ్యింది నాది.. డబ్బు
సంపాదనే ముఖ్యం అనుకున్న నాకు ఉన్నదాన్లో బతుకుతూ ఎదగాలి అని వాదించే నీవు సహకరించ లేదు. నీకు ఎదిగి చూపించాలి అన్న కసితో వెళ్ళినా నా దారి అంతా సులభం కాదని తేలిపోయాక.. ఓడిపోయి నీ దగ్గరికి రావటం ఇష్టం లేక చివరకు ఒక కంపెనీ యజమాని అవిటి కూతురిని చేసుకుని వారి ఆస్తులకు వారసుడయ్యాను. పుట్టిన కొడుకూ చెడు అలవాట్లతో దుర్భరంగా వున్నాడు. జీవితంలో ఒక్క డబ్బుతో సుఖ సంతోషాలు రావు అని తెలిసింది… ఇప్పుడు సూర్య మాటలతో నేను బాధ పడటం లేదు. వాడు ఇలా సమర్థించుకో గల స్థాయికి పెంచిన నిన్ను అభినందిస్తున్నాను. అయినా వాడు నా అంకురం అని గర్వపడుతున్నాను”

          ఆ మాటకు సూర్య “విత్తనం భూమి మీద పడేస్తే సరిపోదు సార్. దానికి సరైన లోతులో వుంచి నీరు పోసి, చుట్టూ కంచె వేసి పెంచితే చెట్టుగా ఎదగ గలదు. ఇది చిన్నప్పుడు మీరూ చదివి వుంటారు..” అంటూ ఉంటే…

          మారు మాట్లాడక నెమ్మదిగా గుమ్మం వైపు కదులుతూ బయటకు నడిచాడు అతను.
అతని పేరు ఏమిటని సూర్య అడగలేదు.. వర్ధినికి చెప్పాలనిపించ లేదు….

*****

Please follow and like us:

11 thoughts on “అతను (కథ)”

  1. భార్యభర్తల మనస్పార్ధలు పిల్లలపై నెగటివ్ ఫిలింగ్స్ వున్నా బయటకు కనిపించవు తల్లి పిల్లలకు ప్రధానం ఆమెవైపు మొగ్గడ మే దీని సరామాసెం

  2. డా.లక్ష్మిరాఘవగారి ‘అతను’ కథ బావుంది. సూర్య , తండ్రితో అన్న మాటలు కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

  3. చాలా హృద్యంగా రాశారు అమ్మ .చాలా బాగుంది .

  4. ఆలోచింపచేసే కథ.. బాగుంది లక్ష్మీరాఘవగారూ.. అభినందనలు..

  5. లక్ష్మీరాఘవ గారి ‘అతను’ కథ చదివాను. శైలి బాగుంది. సూర్యకు తన తండ్రి మీద కోపం ఉండడం సహజమే. అందుకని తండ్రి పేరు కూడా అడగలేదు. బాగానే వుంది. కాని కథలో అదే ప్రథానాంశంగా చూపడం నచ్చలేదు. ‘అతను’ మరొక అవిటిభార్యను, దురలవాట్లకు లోనైన కుమారుడిని కలిగి ఉన్నాడు. మరి, ఇన్ని సంవత్సరాల తరువాత మొదటి భార్యను కలవడానికి ఎందుకు, ఏమి ఆశించి వచ్చాడట? దానికి సరైన కారణం చూపించలేదు. ‘అతను’ ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు. అసహనం, కొద్దిలోనే చిరాకు పడే తత్వం ఉన్నాయి. మరి ఏమి మార్పు వచ్చిందని మొదటి భార్య వద్దకు వచ్చాడు? ‘అతను’ మీద సూర్యకు కోపం ఉంది, సరే. కాని వర్థని వ్యక్తిత్వం ఎటువంటిది? ఆమెను ఒక మూగబొమ్మగా చూపారు. ఆవిడ భావాలు, ఇన్ని సంవత్సరాల తరువాత వచ్చిన భర్త ఎడల ఆమె ప్రవర్తన ఏమీ చిత్రించబడలేదు. పగ, ద్వేషమే సరైన ముగింపా? అతను ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? రచయిత్రి మరికొంచెం శ్రధ్ధ తీసుకుని పాత్రలను చిత్రించి ఉంటే, సహేతుకంగా ముగింపుని సమర్థించుకుని ఉంటే మంచి కథ అయ్యేది.

    1. ధధన్యవాదాలు . కథలో ముఖ్యా౦శం ఇలా చాలా ఏళ్ళకి వచ్చి పలకరిస్తే కొడుకు రియాక్షన్ ఎలా ఉంటు౦ది అన్నది మాత్రమే. మీరు చెప్పిన విషయాలతో రాయాలనే సంకల్పించాను కానీ అబ్బాయి మనసు భావనలు చెబితే ఒక ఆలోచన కలిగిస్తుంది అనిపించి ముగించాను. మ౦చి విశ్లేషణ మరో కథలో ఉపయొగించుకునేలా చేశారు. ధన్యవాదాలు సర్

    2. Thank you sir.
      ఈ కథలో నేను తీసుకున్న అంశం కేవలం కొడుకు రియాక్షన్ మాత్రమే. మీరు చెప్పినవి కూడా చాలా ముఖ్యమైనవి.వీటి గురించి రాస్తే పెద్దకథ అవుతుంది, ఇలా రాయచ్చు అన్న ఆలోచన కలిగించారు . ధన్యవాదాలు సర్

  6. పెళ్లి అయిన కొత్తలో ఆవేశం ఉంటుంది. తర్వాత తాను చేసిన తప్పు వలన దేవుడు శిక్ష వేశాడు అని ఆలస్యంగా గ్రహిస్తాడు మనిషి.
    తల్లి ప్రేమతో తల్లి దగ్గర పెరిగిన కొడుకు హటా త్తు గా తండ్రి వస్ట్, కొడుకు ప్రేమించలేడు.
    ముగింపు సమంజసంగా ఉంది.

    1. కథలో నా ఆలోచనకు మంచి స్పందన ఇచ్చారు. ధన్యవాదాలు సర్

    2. ధన్యవాదాలు . ఇలా అనిపించాలని రాసిన కథ. కొడుకు ఆలోచనలు ఇలాఉంటాయి ఆ వయసులో ….🙏🙏

Leave a Reply to లక్ష్మీ రాఘవ Cancel reply

Your email address will not be published.