కొత్త లోకం

  –శిలాలోలిత

రంగును కోల్పోయి
కొల్లగొట్టబడ్డ నీటి మొహం
కెరటాలతో తలబాదుకుంటోంది

ఆకాశం ఏ రంగు చొక్కాను తొడిగితే
అదే తన రంగనుకునే మురిపెం

త్రివేణీ సంగమంలో కనిపించే రంగుల తేడా

అండమాన్ దీవుల్లో మెరిసే
ముదురు నీలం అంగీ
ఆకుపచ్చని నలుపుల

భ్రమల చెట్టు చుట్టూ తిరుగుతుంటుంది


ఆమె కూడా అంతే
కోల్పోయిన బతుకు రంగుల్ని

ఏరుకొనే ప్రయత్నమే బతుకంతా
ఆమెకైతే
ఉచితంగా గాయాల ఎర్ర రంగు
కమిలిన శరీరాల పెచ్చులూడిన తనం
కాలి గిట్టలతో అణిచి వేసే క్రూరత్వాలు

తనను తాను తక్కెడలో కాక
మనస్సుతో, మెదడుతో, హృదయంతో
హెచ్చవేయగలిగి నప్పుడే
మాసిన రంగుల తోటలో
ఆమె ఒక పరిమళించే పాట కాగలదు
అప్పుడే
జయం, అపజయాల మంచు తెర తొలగి పోతుంది

అందుకే
ఆకాశమూ ఆమే ఎప్పటికీ ఒకటే

******

Please follow and like us:

10 thoughts on “కొత్త లోకం (కవిత)”

  1. స్త్రీని ఆకాశంతో పోల్చి కొత్తలోకం కవితను ఆకాశానికెత్తేశారు.

  2. ఆకాశంతో స్త్రీ పోలికను శిలాలోలితగారు అద్భుతంగా చెప్పారు. స్త్రీ వివిధ స్థితిగతులను రంగులతో సమన్వయ పరచటం బావుంది. వారి కలానికి నా హృదయ పూర్వక అభినందనలు💐💐

  3. సముద్రంలా ఆకాశంలా సొంత రంగులను కోల్పోయిన బతుకు రంగుల నేరుకుంటూ జీవించక .. ఆమె.. మెదడు మనసు హృదయ తక్కెడలో తనను తాను పరిశీలించుకుంటే..
    ఆమె( స్త్రీ) జీవితం రంగుల తోటలో పరిమళించే పాట పాడుకుంటూ “కొత్త లోకాన్ని” చూడగలదనే సత్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపే శిలాలోలిత గారి చక్కని కవితకు అభినందనలు👌💐❤️

  4. శిలాలోలిత గారి “కొత్తలోకం”కవిత ఆమె …గురించి తెలిపిన శైలి అద్భుతం.తనకు తాను తక్కేడలో కాక మనస్సుతో ,మెదడుతో,హృదయంతో హెచ్చవేయ గలగాలి అని చెప్పటం చాలా బాగుంది.బాబీ కవిత్వం బాగా తెలుసు…గాజునది అనుభూతి ఇంకా మరువ లేదు…మంచి కవిత ప్రచురించిన డా. కె.గీత గారికి ధన్యవాదములు…

  5. రంగులతో జయాపజయాలను , జీవితంలోని ఎత్తుపల్లాలని పోల్చగలగడం ఒక్క రచయతకే సాధ్యం . ఒక్కో వర్ణంలో అన్ని పార్శ్వలను దర్శించగలగడం లక్ష్మి గారిలోని సునిశిత పరిశీలనకు తార్కాణం .

  6. ఆకాశానికి మన దేశ సగటు స్త్రీకి పోలికను సమన్వయం చేస్తూ శిలాలోలిత అమ్మ రాసిన కవిత చాలా బాగుంది. ఏ రంగు తోడుక్కుంటే అదే తన రంగని మురిసిపోయే భ్రమల గురించి తేటతెల్లం చేసిన కవిత.

  7. భావుకతతో పాటు భావోద్వేగం కలగలిసిన కవనం. అద్భుతంగా కదిలింది కలం. అభినందనలు మేడమ్

    1. ఆమెను అనంతమైన ఆకాశమంతో పోల్చడం చాలా బాగుంది. అలుపెరుగక ఎదురీదే ఆమె గురించి విపులీకరిస్తూ శిలాలోలిత అమ్మగారి కవిత్వం రమణీయం.

Leave a Reply

Your email address will not be published.