
చిత్రం-49
-గణేశ్వరరావు
ఒక దానిలో రెండు ఫోటోలు, ఒకటే భావం. దీన్ని ఒకసారి కాదు, ఎన్నోసార్లు చూడాలి. పరిశీలిస్తే అంతరార్థం అవగాహనవుతుంది. అమెరికాకు చెందిన డేనియల్ ఎగ్యూయా బృందం ఆర్ట్ స్కూల్ ఇలాటి ఫోటోలు తరచూ పోస్ట్ చేస్తుంటుంది.. దీనికి పెట్టిన పేరు ‘మాతృమూర్తి’. వాళ్ళ దృష్టిలో ఇది తల్లి ప్రేమే! ఒక తల్లి పాలివ్వడం కోసం పై దుస్తులను తొలగిస్తుండగా ఒక ఫోటో తీసారు, ఇక రెండో ఫోటో సముద్రాన్ని ఆనుకున్న ఒక పెద్ద కొండ మీద ప్రమాదభరితమైన రహదారి మలుపుల్లో ప్రయాణం చేస్తున్న బస్సు. ఫోటోషాప్ లో తల్లి పాలు ఇస్తున్నట్టు, ఈ అమ్మ ఆ కొండ మీద పోతున్న బస్సును అరచేతిలో పెట్టుకొని రక్షణ కల్పిస్తున్నట్టు చూపించారు. ఫోటోలో ఆశ్లీలత లేదు. ఫోటోలోని ఆలోచన నచ్చితే మెచ్చుకోండి, ‘అయ్య బాబోయ్, ఏం తలకాయలు, మ్యూజియంలో పెట్టాల్సినవి!’ నచ్చకపోతే ‘వీళ్ళ వెర్రి తగలెట్టా, బస్సుకి తల్లి పాలియ్యడం ఏమిటిరా, బుద్ధీ శుద్ధీ ఏమన్నా ఉందా?’ అని తిట్టండి.*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
