విభజన రేఖలు గీసిన బతుకు రాతలు

-పారుపల్లి అజయ్ కుమార్

 
          తెలుగు పా‌ఠకులకు సుపరిచితుడైన కథా నవలా రచయిత సలీం. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన ప్రసిద్ధ నవలా రచయిత. సామాజిక దృక్పథం గల రచయిత. అట్టడుగు వర్గాల జీవితాల్ని, అణచివేతకు గురవుతున్న జీవితాల్ని పరిశోధించి ఆయన రాసిన కథలు, నవలలు ఎన్నో. మానవత్వాన్ని మించిన మతం లేదనీ, అదే తన అభిమతంగా, కథలు, నవలలు, కవితలు రాశారు సయ్యద్ సలీం..
 
          వారు రాసిన మరో ఆణిముత్యం లాంటి నవల ” రెండు ఆకాశాల మధ్య .”
 
          ఇండియా, పాకిస్తాన్ మధ్య వున్న సరిహద్దురేఖకు కేవలం 400 మీటర్లు దూరంలో ఉన్న జొరాఫామ్ గ్రామం ఇండియాలో వుంది. పాకిస్తాన్ బార్డరుకు దగ్గరగా వున్న గ్రామం హుందర్మో. ఆ గ్రామంలో అన్న ఫక్రుద్దీన్, ఈ గ్రామంలో చెల్లెలు హసీనా. చెల్లి పెళ్లి జరిగిన తరువాత జరిగిన దేశ విభజనతో ఇద్దరి మధ్య గీయబడిన సరిహద్దురేఖ ఇద్దరి జీవితాలలో ఎటు వంటి మార్పులు తీసుకొచ్చిందో విపులంగా కరుణ రసాత్మకంగా రాసారు రచయిత.

          దేశ విభజనకు ముందు శంకరలాల్ లాహోర్ లో ఉన్న తన పెదనాన్నను చూడ టానికి కూతురు షామ్లీని, కొడుకు దర్శన్ లాల్ ను, తండ్రిని తీసుకొని వెళతాడు. లాహోరులో ఉండగానే దేశవిభజన జరిగింది. అక్కడ కనపడిన హిందువులను ముస్లిం లు అరాచకంతో చంపుతున్నారు. శంకరలాల్ అన్న కుటుంబం మత విద్వేషాలకు బలి అవుతుంది. శంకర్ లాల్ తండ్రినీ చంపేస్తారు. శంకర్ లాల్ పిల్లలను తీసుకుని రైల్వే స్టేషనుకు పరుగెడుతుంటే మధ్య దారిలో షామ్లీను ఎవరో ఎత్తుకుపోతారు. ఎన్నో కష్టాలు పడి కొడుకుతో ఇంటికి చేరుకుంటాడు.
 
          ఈ సంఘటనలను చదువుతుంటే వొళ్ళు జలదరిస్తుంది. 

          పాకిస్తాన్ లో చిక్కడి పోయిన షామ్లీ ది ఒక హృదయ విదారక గాధ. ఎత్తుకు పోయిన ముస్లిం ఆమెను పనిమనిషిని చేసి, ఆమెను బలవంతాన లొంగదీసుకుని ముస్లింగా మార్చి నిఖా చేసుకుంటాడు. ఆత్మ హిందువు, శరీరం ముస్లింలా బతికి పిల్లలను కంటుం ది. చివరికి కన్నకొడుకు సాయంతో ఎందరో అధికారుల సిఫార్సులతో 70 సంవత్సరాల ముసలి తండ్రిని, తమ్ముడిని వాఘా బోర్డర్ లో 15 నిమిషాలపాటు కలుసుకొని మాట్లాడే సన్నివేశం హృదయాన్ని ద్రవింపచేస్తుంది.

          సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇరుదేశాల సైనికులు జరిపే కాల్పులకు, బాంబు దాడులకు గురవటం చూస్తుంటే హృదయం కన్నీటి పర్యంతం అవుతుంది. ఎప్పుడు నెత్తిమీద బాంబులు పడతాయో తెలీని పరిస్థితి. రాత్రి పడుకున్నవారు తెల్లవారే వరకు బతికుంటారో లేదో తెలియని భయానక వాతావరణం సరిహద్దు గ్రామాల్లో వున్నది.
“మనం రెండు దేశాలుగా విడగొట్టబడటానికి ముందు చాలా సంతోషంగా వున్నాం. మన మధ్య హిందూ ముస్లిం అన్న భేదభావమే లేదు. ఆంగ్లేయులు అఖండ భారతాన్ని వదిలి వెళ్లే ముందు హిందుస్తాన్ గా, పాకిస్తాన్ గా చీల్చినప్పుడే రెండు మతాల మధ్య నిప్పు రాజుకుంది “శంకరలాల్, ఫక్రుద్దీన్ తో అన్న మాటలు.
 
          మనుషులందరూ మంచివారే. కానీ, మతప్రాతిపదికన ఎప్పుడైతే దేశాన్ని రెండు ముక్కలు చేశారో అప్పుడే ఇరుదేశాల్లో ఉన్న మతోన్మాదులు చెలరేగి దారుణ మారణ కాండకు తెరలేపారు. మతోన్మాదుల ఆగడాలకు బలయింది అభం శుభం తెలియని అమాయక జనులే.

          బంగ్లాదేశ్ విమోచనం కోసం భారత్, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోతుంది. భారత దేశం పాకిస్తాన్ లోని కొన్ని గ్రామాలను వశపరుచుకుంటుంది. ఒక్క పూటలోనే గ్రామ ప్రజలకు చెప్పకుండా అప్పటికప్పుడు సైన్యం సరిహద్దు రేఖలను ఏర్పరుస్తుంది.

          కూతురి పెళ్లి కోసం ప్రక్కవూరికి బట్టలు కొనడానికి వెళ్లిన తండ్రి షరీఫ్ తిరిగి రాబోతే సైనికులు రానీయరు. అతను పాకిస్తాన్ లో, భార్య హసీనా, కూతురు ఆస్మా ఇండియా లో… ఇది విధిరాత కాదు. ఒక్క పూటలోనే వీరిమధ్య గీయబడిన సరిహద్దురేఖ రాసిన రాత.
 
          ఉదయం దాకా పాకిస్థానీయులుగా వున్నవారు ఒక్కపూటలోనే మీరు భారతీయులు అంటే అసలు మింగుడు పడుతుందా ఎవరికైనా?
 
          మనుషుల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా దేశాలు జరిపే రాజకీయ చదరంగంలో
బలవుతున్నది సామాన్య ప్రజలే. హృదయాలకు గాయాలు అవుతున్నాయి. తమ ఆత్మీయులు తమ నుండి దూరమవుతున్నారు. సరిహద్దు గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల దూరమే ఉన్నా, మూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలన్న విషయం గ్రామ జనులకు ఎలా తెలియాలి ?
 
          ప్రక్కవూరి కెళ్లిన తమవారు పరాయి దేశస్తులై పోవడం ఎంత బాధాకరం. ఎన్నో కష్టాల కెదురీది 20 సంవత్సరాల తరువాత షరీఫ్ పాకిస్తాన్ నుండి ఇండియా వచ్చేసరికి భార్య విగతజీవిగా కనిపిస్తుంది.

          దేశ విభజన సమయంలో సరిహద్దులోని ఇరు దేశాలకు చెందిన రెండు గ్రామాలను కథాంశంగా తీసుకుని, మతం కంటే మానవత్వం గొప్పదన్న భావంతో నవలా రచన సాగింది. మనుషుల మధ్య ప్రేమ, ఐక్యతకు ‘రెండు ఆకాశాల మద్య’ నవల అద్దం పడుతుంది.
 
          రాత్రికి రాత్రి రెండు ఊళ్ళ మధ్య మొలిచిన సరిహద్దు రేఖ చేసిన గాయాలు గుండె ను ముక్కలు చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బతుకీడుస్తున్న గ్రామ ప్రజల వ్యధాభరిత జీవితాలకు ప్రతిబింబం ఈ నవల.
 
          దేశ విభజన సమయంలో జరిగిన దారుణ నరమేధాన్ని అతి భయంకరంగా ఈ నవలలో చిత్రించటం జరిగింది. సరిహద్దు గ్రామాల ప్రజల దీనావస్థలను కల్లోల జీవితాలను, కష్టాలను, కన్నీళ్లను అక్షరబద్దం చేసిన నవల ఇది.
 
          మనకు సరిగా తెలియని సరిక్రొత్త ప్రపంచంలోనికి మనలను తీసుకువెళతాడు రచయిత. నవల చదువుతుంటే మనం ఆ సరిహద్దు గ్రామాల్లోకి వెళ్ళిపోతాం. వారి కన్నీరు మన కన్నీరౌతోంది. కొన్ని సంఘటనలు మనలను కదిల్చివేస్తాయ్. కొన్ని విభ్రాంతిని కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు చదవలేక గుండె బరువెక్కుతుంది.  సరి హద్దులు నేలను విడగొడతాయేమో కానీ హృదయాలను కాదు అన్న మాటలతో నవల ముగుస్తుంది.

” సర్ హద్ జమీన్ బాన్ట్ సక్తీ హై పర్ దిల్  నహీ .”
 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.