సిక్కిం

పుస్తకాలమ్’ – 21

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

సిక్కింను భారత పాలకవర్గాలు కబళించిన కథ

నా చేతి నుంచి మాయమై పోయి అనూహ్యంగా మళ్ళీ దొరికిన అద్భుతమైన పత్రిక ‘విద్యుల్లత’ గురించి గత వారం మీతో పంచుకున్నాను. నా చేతి నుంచే, చాల పదిలంగా నాకు అత్యంత ప్రియమైన చేతుల్లోకే వెళ్ళి, అక్కడి నుంచి అనుకోకుండానో, ఉద్దేశ్య పూర్వకంగానో మాయం చేయబడి, బహుశా నాకు ఇక ఎన్నటికీ దొరకకుండా పోయిన ఒక పుస్తకం కథ ఇవాళ చెప్పదలచాను.

          ఆ పుస్తకం పేరు ‘సిక్కిం: రిక్వియం ఫర్ ఎ హిమాలయన్ కింగ్ డమ్’. రచయిత ఆండ్రూ డఫ్.

          ఆ పుస్తకంలో ఏమున్నదో మాత్రమే కాదు, అది నా చేతికి వచ్చిన కథా, పోయిన కథా కూడ పంచుకోవలసినవే.

          సిక్కిం పేరు మొదటిసారి బహుశా 1975 ఏప్రిల్ లో భారత ప్రభుత్వం ఆ స్వతంత్ర రాజ్యాన్ని కబళించి, ఈ దేశంలో ఒక రాష్ట్రంగా మార్చినప్పుడు విన్నాను. అప్పుడే “సోవియట్ సోషల్ సామ్రాజ్యవాదపు దక్షిణాసియా బంటుగా భారత పాలకవర్గాలు అనుసరిస్తున్న విస్తరణ వాదానికి సిక్కిం ఆక్రమణ ఒక ఉదాహరణ” అని సృజనలో ఒక వ్యాసం వేశాం. ‘పిలుపు’లో కూడ అదే ధోరణిలో వ్యాసాలు వచ్చినట్టు గుర్తు. ఆ తర్వాత సామ్రాజ్యవాదం గురించీ, భారత పాలకవర్గాల విస్తరణవాదం గురించీ ఎక్కడ చర్చ వచ్చినా సిక్కిం ప్రస్తావన వస్తుండేది.

          తర్వాత పది సంవత్సరాలకు, బహుశా 1984లో ప్రితిష్ నందీ సంపాదకత్వంలో ప్రతి వారం ఆసక్తికరమైన కథనాలతో వెలువడుతుండిన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ముఖచిత్ర కథనంగా సిక్కిం కథ వివరంగా చదివాను. గాంగ్ టక్ లో లండన్ అబ్జర్వర్ కు విలేఖరి, పదవీచ్యుతుడైన సిక్కిం రాజు చోగ్యాల్ కు, ఎందరో భారత, సిక్కిం అధికారు లకు మిత్రుడు సునందా కె దత్తారే రాసిన ‘స్మాష్ అండ్ గ్రాబ్ – అనెక్సేషన్ ఆఫ్ సిక్కిం‘ పుస్తకం వెలువడుతున్న సందర్భంగా దానిలోంచి కొన్ని భాగాలను ఇలస్ట్రేటెడ్ వీక్లీ అచ్చు వేసింది. సిక్కిం చరిత్ర, చైనాకు రహదారి మార్గం ఉన్న సిక్కింను ఆక్రమించా లనుకున్న భారత ప్రభుత్వ విస్తరణ కాంక్ష, సిక్కిం రాజకీయ సంక్షోభ జలాల్లో చేపలు పట్టి, అక్కడ దళారీలను తయారు చేసిన భారత ప్రభుత్వ అధికారుల వ్యవహారాలు, భారత సైన్యం సిక్కింలోకి చొరబడి, చోగ్యాల్ మెడలు వంచి సిక్కింను ఒక రాష్ట్రంగా మార్చిన తీరు ఆ పుస్తకంలో దత్తా రే వివరంగా, ఎన్నో సాక్ష్యాధారాలతో రాశాడు.

          అయితే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలోనూ, మరి కొన్ని పత్రికల్లోను భాగాలు వెలువడ్డాయి గాని ఆ పుస్తకం మాత్రం బైటికి రాలేదు. ప్రజలకు అందలేదు. ఆ పుస్తకం బైటికి రాకుండా భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేసింది. నిషేధించడానికి ప్రయత్నించింది. అది కుదరక పోవడంతో, పుస్తకం మీద పరువు నష్టం దావా వేయించి, పుస్తకం విడుదల చేయడానికి వీల్లేదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేలా చూసింది. ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు దశాబ్దాలు గడిచినా ఆ కేసులో తుదితీర్పు ఇవ్వలేదు. ఈలోగా ఆ పుస్తకం అదృశ్యం అయిపోయింది. మూడు దశాబ్దాల తర్వాత ఇటీవలనే కొత్త కూర్పు వెలువడింది. 

          అలా ఆ పుస్తకం బైటికి రాకపోయినా, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన భాగాలే నా మనసులో నిలిచిపోయాయి. ఎప్పటికైనా సిక్కిం చూడాలనే ఆసక్తి పెరిగింది. 2019 మే లో మావాళ్ళు గాంగ్ టక్ వెళదామని ప్రతిపాదించడంతో సిక్కిం వెళ్ళే అవకాశం వచ్చింది. మే 10-11ల్లో గాంగ్ టక్ లో ఉన్నాను. ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ఒక్క పుస్తకాల దుకాణమైనా చూడడం, వీలైతే స్థానికతకు ప్రాతినిధ్యం వహించే పుస్తకం ఒకటి అక్కడి జ్ఞాపికగా కొనుక్కొచ్చుకోవడం అలవాటు. అలా మే 10 సాయంత్రం గాంగ్ టక్ ప్రధాన రహదారి మీద జైన్ కో అనే పుస్తకాల దుకాణంలోకి వెళ్తే అక్కడ సునంద కె దత్తారే పుస్తకం తాజా ముద్రణ హార్డ్ బౌండ్ కాపీ ఉంది. కాని దాని ధర చూసి భయపడి, ఆ పుస్తకాన్ని కాసేపు నిమిరి, అటూ ఇటూ చూసి, వాసన చూసి, కొన్ని పేజీలు తిరిగేసి భద్రంగా అక్కడే పెట్టేశాను. ఆ వరుసలోనే కనబడింది ఆండ్రూ డఫ్ రాసిన ‘సిక్కిం : రిక్వియం ఫర్ ఎ హిమాలయన్ కింగ్ డమ్’.

          ఆ నాలుగు వందల పేజీల పుస్తకం ప్రయాణంలోనే చదవడం మొదలుపెట్టాను గాని, హైదరాబాద్ తిరిగి వచ్చాక ఏవో పనుల్లో అది వేగంగా సాగలేదు. అప్పుడో పదీ ఇరవై ఇప్పుడో పదీ ఇరవై పేజీలు చదువుతూ జూన్ చివరి నాటికి చివరి యాబై పేజీల్లోకి వచ్చాను. జూలై 2న హఠాత్తుగా వరవరరావు గారి మీద కర్ణాటకలో పావగడ కోర్టులో పదిహేను సంవత్సరాల కిందటి కేసు తవ్వి తీసి పుణె జైలు నుంచి తీసుకుపోతున్నారని వార్తలు వచ్చాయి. రాత్రికి రాత్రి పావగడ ప్రయాణమయ్యాం. పది గంటల కారు ప్రయాణంలో ఈ పుస్తకం చదవడం అయిపోతుందని అది వెంట పెట్టుకున్నాను. అయి పోయింది కూడ. జూలై 3న వివిని కలవలేక పోయాం గాని జూలై 4న కోర్టులో చూశాం. నన్ను కలవనివ్వలేదు గాని అక్కయ్యనూ చిన్నినీ కలవనిచ్చారు. అప్పుడు ఏమన్నా పుస్తకాలు తెచ్చారా అని వివి అక్కయ్యను అడిగితే చేతిలో ఉన్న ఈ పుస్తకం ఇచ్చేశాను.

          వివి అక్కడే కోర్టు హాలులో, ఆ తర్వాత కోర్టు ఆవరణలో ఒక గంట సేపు వ్యాన్ లో కూచోబెట్టినప్పుడు అక్కడక్కడ తిరిగేశారట. కాని ఒక వ్యాన్ నుంచి మరొక వ్యాన్ లోకి, దాని నుంచి మరొక వ్యాన్ లోకి మారుస్తున్నప్పుడో, మధ్యలో బెల్గాంలో ఒక రాత్రి ఉంచి మళ్ళీ తీసుకుపోతున్నప్పుడో ఆ పుస్తకం మాయమైపోయింది. ఆ పుస్తకం పోగొట్టుకున్నం దుకు చాల విచారిస్తూ, అయినా తుమకూరు పోలీసులు దాన్ని జాగ్రత్తగా దాచిపెడతా మన్నారనీ, మళ్లీ వాయిదాకు వెళ్లినప్పుడు తెచ్చుకోవడం వీలు కావచ్చుననీ, పుణె జైలు కు చేరగానే వివి ఉత్తరం రాశారు. ఆ తర్వాత ఏడాది కావస్తున్నది గాని ఆ పుస్తకం అటు వివికి చేరలేదు. ఆ పోలీసు అధికారులు జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని వెతికి కాపాడి ఉంటారని నమ్మకం లేదు.

          అలా ఆ పుస్తకం పోయింది. రిక్వియం ఫర్ ఎ హిమాలయన్ కింగ్ డమ్ ఇప్పుడిక రిక్వియం ఫర్ ది బుక్ అయిపోయింది.

          పుస్తకం మళ్ళీ దొరకవచ్చు. కాని ఎప్పుడైనా పుస్తకం పోగొట్టుకుంటే నేను రాసుకున్న మార్జినల్ నోట్స్, కామెంట్స్, నేను ముఖ్యమైనవనుకున్న వాక్యాల కింద గీతలు, మళ్ళీ అవసరం పడితే పుస్తకం మొత్తం చదవనక్కర లేకుండా సులభమైన రిఫరెన్స్ కు ఉపయోగపడే ఆకరాలు పోయాయనేదే ఎక్కువ విచారం.

          అయితే, పుస్తకం పోవడం ఏం లెక్క, జీవితాలూ, జీవితానందాలూ, స్నేహాలూ, స్వప్నాలూ అన్నీ చెయిజారి పోతున్నప్పుడు! సిక్కిం అనే ఒక స్వతంత్ర రాజ్యపు ప్రజాజీవనమే పెను మార్పులకు లోనైనప్పుడు….!

          ఈ పుస్తకం రాసిన ఆండ్రూ డఫ్ లండన్ లో,  స్కాట్లండ్ లో ఫ్రీలాన్స్ జర్నలిస్టు. ఇది ఆయన మొదటి పుస్తకం. ఆసియాలో, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో పర్యటిస్తూ యాత్రారచయితగా రచన ప్రారంభించాడు. ఆండ్రూ తాత బ్రిటిష్ ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగిగా 1921లో భారతదేశం వచ్చి, కలకత్తాలో పనిచేస్తూ, సహోద్యోగులతో కలిసి 1922లో కాలినడకనా, గుర్రాల మీదా సిక్కిం పర్యటించాడట. ఒకటి రెండు బౌద్ధ ఆరామా లను చూశాడట. ఆయన తన పర్యటనల గురించి రాసిపెట్టుకున్న కాగితాలు, అక్కడి ఫొటోలు అనుకోకుండా దొరికినప్పుడు, ఆ ప్రాంతాలు ఎనబై – తొంబై సంవత్సరాల తర్వాత ఎట్లా ఉన్నాయో చూడాలని ఆండ్రూ తన ప్రయాణం ప్రారంభించాడు. అలా యాత్రాకథనంగా ప్రారంభమైన ఈ పుస్తకం క్రమక్రమంగా చారిత్రక, రాజకీయ పరిణామా ల విశ్లేషణగా మారింది. పందొమ్మిదో శతాబ్ది మొదట్లో తన రాజ్యంలోంచి, కేవలం డార్జిలింగ్ తో సహా ఒక చిన్న ప్రాంతాన్ని మాత్రం అప్పగించి, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలవకుండా “రక్షిత” స్వతంత్ర రాజ్యంగా ఉండిపోయిన ఒక బౌద్ధ రాజ్యం, 1975లో ఎలా భారత దేశంలో భాగమైపోయిందో ఈ పుస్తకం వివరిస్తుంది. చరిత్ర క్రమంలో సంభవించిన నాటకీయ  పరిణామాలెన్నిటినో కల్పనను  మించిన వాస్తవంగా ఈ పుస్తకం వివరిస్తుంది.

          అనేక చారిత్రక ఆధారాలతో, ప్రత్యక్ష సాక్షులతో సహా ఎంతో మందితో జరిపిన సంభాషణల సహాయంతో, సమకాలీన, తదనంతర వివరణల, విశ్లేషణల సహాయంతో ఈ పుస్తకం చరిత్రగా, కల్పనగా, రోమాంచక కాల్పనికేతర వచన రచనగా నడుస్తుంది. ఆ సంక్షుభిత కాలంలో గాంగ్ టక్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ఇద్దరు బ్రిటిష్ మహిళలు తమ ఇంటికి రాసుకున్న ఉత్తరాలను కూడ ఆండ్రూ వాడుకున్నాడు. సాధారణంగా ప్రభుత్వ రహస్య పత్రాలన్నిటినీ 30 సంత్సరాల తర్వాత బహిరంగంగా విడుదల చేసే సంప్రదాయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పాటిస్తుంది. అలా సిక్కిం దురాక్రమ ణ నాటి బ్రిటిష్ ప్రభుత్వ రహస్య పత్రాలన్నీ 2005 నుంచి ప్రజలందరికీ అందుబాటు లోకి వచ్చాయి. ఆండ్రూ వాటిలో సిక్కిం ప్రసస్తావన ఉన్న పత్రాలన్నిటినీ వాడుకున్నా డు. ఆ నాడు వివిధ దేశాల ప్రభుత్వాలు బైటికి ప్రకటించిన వైఖరిని, దాచిపెట్టిన వైఖరి ని, స్వప్రయోజనాలను ఆ పత్రాలు బైట పెడతాయి. అలాగే ఈ పుస్తక రచన క్రమంలో వికీలీక్స్ విడుదల చేసిన అమెరికా ప్రభుత్వ రహస్య పత్రాలలో కనీసం 500 పత్రాలు సిక్కిం దురాక్రమణ ప్రస్తావనలతో ఉన్నాయి. వాటిని కూడ ఆండ్రూ వాడుకున్నాడు, అవసరమైన చోట ఉటంకించాడు.

          సిక్కిం చిట్టచివరి రాజు తొండుప్ నాంగ్యాల్, ఆయన అమెరికన్ భార్య హోప్ కుక్ జీవితాల చుట్టూ అల్లిన కథ అక్కడి నుంచి సిక్కిం ప్రజా జీవితాన్నీ, రాజాంతఃపుర జీవితాన్నీ వివరిస్తుంది. బాధ్యతాయుత పాలనను, ప్రజాస్వామ్యాన్ని కోరుతూ మొదలైన సిక్కిం ప్రజా ఉద్యమాలను భారత పాలకులు ఉపయోగించుకున్న తీరును వివరిస్తుంది. కొండ చరియల మధ్య చైనాకు నాథులా పాస్ అనే ఏకైక రహదారి ఉన్న సిక్కిం, భారత చైనా పాలకుల ఘర్షణలో ఎలా నలిగిపోయిందో ఈ పుస్తకం వివరిస్తుంది.

          1947 తర్వాత భారత ప్రభుత్వం సిక్కింతో గతంలో బ్రిటన్ నెరిపిన సంబంధాలనే నెరపుతానని, రక్షిత రాజ్యంగా ఉంచుకుంటానని 1950 ఒడంబడికలో అన్నది. అన్ని ఆంతరంగిక వ్యవహారాల్లో స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవిస్తూ, విదేశీ వ్యవహారాల్లో, సమాచార సంబంధాలలో మాత్రమే రక్షకురాలిగా ఉంటానన్నది. ఆ పని కోసం ఒక రాజకీయ అధికారినీ, ఒక దివాన్ నూ నియమించింది. కాని క్రమక్రమంగా ఆ వైఖరిని వదులుకొని, తాను నియమించిన అధికారులకు చోగ్యాల్ కు మించిన సర్వాధికారాలు ఇచ్చి, అసలు రాజ్యాన్నే కబళించాలనుకునే దగ్గరికి చేరుకున్నది. టిబెట్ మీద చైనా చేయదలిచిన దాడికీ, టిబెట్ లోకి తిరుగుబాటు సైన్యాలను పంపించాలనుకున్న సిఐఎ కుట్రలకూ, అమెరికా – సోవియట్ యూనియన్ – చైనాల మధ్య బేరసారాలకు సిక్కింను వేదికగా చూసిన భారత ప్రభుత్వానికీ మధ్య సిక్కిం ఎలా నలిగిపోయిందో. తన సొంత జీవితాన్నీ, ప్రశాంత ప్రకృతి మధ్య ఆనందమయ జీవితాన్నీ వదిలి ఎలా ప్రచ్ఛన్న యుద్ధపు పావుగా మారిపోయిందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజు ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమెరికన్ యువతి బహుశా సి ఐ ఎ ఏజెంట్ కావచ్చునా అని భారత ప్రభుత్వం అనుమాన బీజాలు నాటిందంటే ఈ యుద్ధం ఎన్ని స్థాయిల్లో జరిగిందో అర్థమవుతుంది. ఈ పరిణామాలన్నీ కలిసి చివరికి దేశంలో ఎమర్జెన్సీ విధించబోతున్న సందర్భంలో భారత ప్రభుత్వం సిక్కిం స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని ఒక రాష్ట్రంగా మార్చేసింది.

          భారత పాలకవర్గాలకు ఎప్పుడూ ఇతర దేశాల మీద దాడి చేసి ఆక్రమించిన చరిత్ర లేదని, శాంతి ప్రియులని ఒక అబద్ధం ప్రచారంలో ఉంది. కాని భారత రాజ్యాంగమే మొదటి అధికరణంలోనే దేశమంటే ఏమిటని నిర్వచిస్తూ 1(3)(సి)లో “ఆక్రమించబోయే ప్రాంతాలు” అని కూడ చేర్చింది. ఈ రాజ్యాంగ అధికరణం ప్రకారమే 1961లో గోవా ఆక్రమణ, 1975లో సిక్కిం ఆక్రమణ రాజ్యాంగబద్ధం అయ్యాయి.

          1975 ఏప్రిల్ 9న సరిహద్దుల్లో భారత సైన్యాలు నిలిచి ఉన్నాయి. ఎన్నికైన శాసన సభ్యులలో అత్యధికులు చోగ్యాల్ కు, స్వతంత్ర సిక్కిం సంస్కృతి పరిరక్షణకు అనుకూలంగా ఉన్నారు. కాని శాసనసభ స్పీకర్ భారత అనుకూలంగా ప్రవర్తించి శాసన సభ్యుల అభిమతాన్ని శాసించే, తారుమారు చేసే నిర్ణయం తీసుకున్నాడు. సర్వోన్నత న్యాయస్థానపు భారత అనుకూల న్యాయమూర్తి ఆ నిర్ణయం చట్టబద్ధమేనని తీర్పు ఇచ్చాడు. ఈ తప్పుడు చర్యలు జరుగుతున్నప్పుడు ఆ వార్తలు ప్రభావశీలమైన బ్రిటిష్ పత్రికకు పంపించవలసిన సునంద కె దత్తారేను కలకత్తా నుంచి గాంగ్ టక్ మార్గంలో కొన్ని గంటల పాటు అడ్డుకున్నారు. శాసనసభ నిర్ణయం జరిగిందనే పేరుతో రాజభవనం మీద దాడి చేసి రాజు అంగరక్షకులను నిరాయుధం చేశారు. రాజభవనం బైట ఈ గందర గోళం జరుగుతున్నప్పుడు అప్పటికే హాం రేడియో నెట్ వర్క్ లో సభ్యుడుగా ఉన్న చోగ్యాల్ తన రాజ్యం మీద దురాక్రమణ జరుగుతున్నదని సందేశం బైటికి పంపడంతో ఆ వార్త బైటి ప్రపంచానికి తెలిసింది. ఈ వ్యవహారం మీద ఐక్యరాజ్యసమితిలో, అంతర్జాతీ య సమాజంలో చర్చ ప్రారంభమైనప్పటికీ అప్పటి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో ఒకటి రెండు దేశాల కన్న ఎక్కువ సిక్కిం ప్రభుత్వాన్ని సమర్థించలేకపోయాయి. సరిగ్గా నెల తర్వాత మే 16న భారత పార్లమెంట్ సిక్కిం ప్రజల కోరిక మేరకు, శాసనసభ తీర్మానం మేరకు, సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా మారిందని ప్రకటించింది. మరొక నెల తిరిగేసరికి దేశంలో ఎమర్జెన్సీ వచ్చి అసలు పత్రికల్లో భిన్నాభిప్రాయమే వెలువడని స్థితి మొదలయింది.

          ఈ పరిణామాన్ని దురాక్రమణగా అభివర్ణించిన టిబెట్ లో చిట్టచివరి బ్రిటిష్ రెసిడెంట్ హ్యూ రిచర్డ్ సన్ “ఇది హైదరాబాద్, గోవా భూతాల ఆవాహన” అన్నాడు.

          ‘స్మాష్ అండ్ గ్రాబ్’ లో దత్తారే రాసినట్టు, “ఒక నిరంకుశుడైన రాజుకు వ్యతిరేకంగా పీడిత ప్రజానీకం జరిపిన తిరుగుబాటు అనే భారత అధికారిక కథనాన్ని ప్రశ్నించడం అవసరం అని కూడ భారతదేశంలో ఏ ఒక్కరూ అనుకోలేదు. అలా రాజును అన్యాయంగా పదవీచ్యుతుణ్ని చేసిన తర్వాత, అసలు రాజ్యమే లేకుండా చేసిన తర్వాత, ఈ విషాద గాథ అంతా ముగిసిన తర్వాత సిక్కిమీస్ ప్రజలు భారత గవర్నర్ కింద స్వేచ్ఛ పొందారా అని అడగాలని కూడ ఎవరూ అనుకోలేదు. ఆ గవర్నర్ చోగ్యాల్ కన్న ఎక్కువ శక్తి మంతుడైపోయాడు. చోగ్యాల్ దుర్మార్గుడైన పీడకుడు కావచ్చు. ఆ సింహాసనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఆ పాలితులకు అన్ని కారణాలూ ఉండవచ్చు. వాదన కోసం మనం ఆ ప్రాతిపదికలు అంగీకరించినప్పటికీ, ఒక దేశపు అస్థిత్వాన్ని చెరిపి వెయ్యడానికి, బైటి దేశం దురాక్రమణ జరపడానికి అవి సమర్థనలు కాజాలవు.”

          ఈ పుస్తకం ఒక రాజకీయ చరిత్ర కథనం మాత్రమే కూడ కాదు. ఇది ఒక ప్రేమ కథ కూడ. ఒక బౌద్ధ రాకుమారుడికీ అమెరికన్ మధ్య తరగతి యువతికీ మధ్య ప్రేమ కథ. రాజప్రాసాదంలోని ఉత్సవాల, ఉత్సాహాల, భయాల, సాహసాల, కుట్రల, కుటిల సమా లోచనల కథ. సిక్కిం సామాన్య ప్రజానీకపు ఆకాంక్షల వైఫల్యాల కథ. భారత పాలకుల దుర్మార్గాల, చాణక్యాల కథ. భారత పాలకవర్గాల స్వభావాన్ని  తెలుసుకోదలచిన వారందరూ చదవవలసిన కథ.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.