
దుఃఖమేఘం
(నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)
– చొక్కర తాతారావు
కురిసి కురిసి తడిసి ముద్దయ్యింది
ఎన్ని దుఃఖమేఘాలు కమ్ముకున్నాయో
ఒంటరితనం వదిలినట్టులేదు
కన్నీళ్ళు ఆగట్లేదు
హృదయం లేని కాలం
భారంగా కదులుతోంది
కష్టాలు కన్నీళ్ళు కలిసిపోయాయి
గుండె నిండా సముద్రం
పగలు రాత్రి ఒకటే వాన
చుట్టూ శూన్యం
బతుకంతా వేదన
ఏ దారీ లేదు అంతా ఎడారే!
ఆశలు ఆవిరై కలలు మిగిలాయి
పేగుబంధం ప్రేమబంధం ఒకప్పుడు
అమ్మతనం ఇప్పుడొక అస్పృశ్యవస్తువు
సనాతన అనాకారి రూపం!
బంధాలు చెదిరిపోయాయి
అనుబంధాలు దూరమయ్యాయి
ఎవరికి ఎవరీలోకంలో
ఎవరూ రారు నీ కోసం
వెతికినా మనుషులు దొరకట్లేదు
నిన్ను నువ్వే వెతుక్కోవాలి
నీలో నువ్వే దాక్కోవాలి
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే
వాటిమధ్యే మనుషులు కొట్టుకుంటున్నారు
నీకు నువ్వే తట్టుకోవాలి
నీలో నువ్వే కొట్టుకోవాలి
చివరి ఊపిరి పోయేవరకు!
బాధలైనా బంధాలైనా
నీతో నువ్వే పంచుకోవాలి
ఎన్ని బాధలున్నా నీలోనే దాచుకోవాలి
వాన కురుస్తూనే ఉంది
కన్నీళ్ళు రాలుతూనే ఉన్నాయి
గుండెనిండా వేదన మోస్తూ
ఆమె ఓ దుఃఖమేఘం!
*****

